ఏది నిజం ???
పావని యనమండ్ర
ఓ మిత్రమా !!
ఏది కులం
ఏది మతం
నిన్ను ఆపిందా ఈ ప్రశ్న ??
పుట్టగానే పెట్టె పేరులో ఉన్నదా నీ కులం ?
నీ తల్లి పంచే ఆ రక్తంలో ఉన్నదా ఈ మతం ?
ఒడిలో తల్లి చెప్పలేదే
సమాజం ఇదేనని
బడిలో గురువు చూపించలేదే
ఇది కూడా ఒక మలుపు అని
నీకు తెలుసా ఆ వయసులో నీ ఆశయం ఏమిటో?
నీముందు ఉన్నది నీ ప్రపంచమా
లేక నీకోసం సృష్టించిన ఒక చిత్రమా?
బాల్యం ముగిసింది నీకు తెలియకుండానే
యవ్వనం నీ గురించి ఏమి దాచింది?
ఉడుకు వయసులో చెప్పిన ఆ మాట నిజామా
ఎదిగాకానే నీకు చూపించింది ప్రతి బాట, గమనించావా?
లేక ముందుకు సాగిపోయావా?
సమాజం తలుపులు తీసిందా నీకు ఇప్పుడు
లేక ఇక సంకెళ్లు తెంచుకొని వచ్చావా ముందుకు?
అధికారం చేతులో ఉన్నవాడిదే రాజ్యమా
లేక ఆ పట్టం నువ్వు ఇచ్చావా?
రూపాయి విలువ పడిపోయిందా లేక నువ్వే దానిని కిందకి తోసేసావా?
నిరుద్యోగం నీకు నీ దేశం ఇచ్చిందా?
లేక నీకు నువ్వే పెట్టుకున్న ఒక పేరా ?
ఆకలి అనకముందే అమ్మ అన్నం పెట్టింది
మరి అదే అమ్మ నువ్వు కృషి చెయ్యకుండా ముద్ద నోటికి వస్తుందని చెప్పిందా?
చెమట చిందించకుండా లేదు మన పయనం మిత్రమా!
లేచి ముందుకు సాగిపో!
నిరుద్యోగం మనకి శాపం అని,
అనుకున్న వాడిని తరిమి తరిమి కొట్టు!
ఎవరో వచ్చి ఏదో సాయం చేస్తారు అన్నది లేదు
నీకు నువ్వే ఒక సైన్యం అని గుర్తుపెట్టుకో
గొంతెత్తికి ప్రశ్నించు తప్పుచేసిన వాడిని
చేతిలో చెయ్యి కలుపు మానవత్వంతో
ముందుకు మునుముందుకు సాగిపో
నువ్వు శ్రామికుడిలా కృషి చెయ్యి
సమాజం నీకు హారతులు పట్టదు
నీ పేరు కూడా దానికి తెలియదు
అలాగే అని సర్దుకుపోతావా
లేక నువ్వు ఎవరో గుర్తుంచుకునేలా మారుతావా?
గెలుపు నీ ఒక్కడిది ఐతే నువ్వు ఎప్పుడో ఓడిపోయావు
మిత్రమా!
స్వార్థం నీ కళ్ళు కప్పేయక ముందే మేలుకో
సమాజాన్ని నిగ్గ తీసి అడుగు భయం వీడు
ముందుకు సాగిపో ఎదురులేని ఒక మనిషిలా నిలిచిపో!!!
గొంతెత్తి నిలబడు సమాజాన్ని ప్రశ్నించు అది చాలు
నిన్ను ఎంతో ఉన్నత స్థానాలకి తీసుకువెళ్తుంది!!!
***
No comments:
Post a Comment