'ఘర్మ జల వారసులు..వలస కార్మికులు'
ఆకలి దిక్సూచి చూపిన మార్గంలో..
పెళ్ళాం, పిల్లలతో
మైళ్ళ కొద్దీ దూరాన్ని
పాదాలతో కొలుచుకుంటూ
నగరానికొచ్చిన ఘర్మజల వారసులు...వలస కార్మికులు..!
ఆకాశ హార్మ్యాల రూపుదిద్దిన 'మయులు.'.
తలరాతను మార్చుకోలేని 'బ్రహ్మలు.'.
ఇల తలను పరుచుకున్న ఎండు గడ్డి జీవితాలు..
కరోనా కలకలానికి మూసుకొని మనసులు..
పట్టెడన్నం పెట్టలేని రిక్త హస్త పోకడలు..
ప్రశ్నార్థకంగా నిలిచిన తమ జీవితాలకు,
ఊరే దారని..వచ్చిన దారెంట
వెళుతుంటే..
ఎక్కడి వారక్కడే అని తెచ్చి కుదేశారు..
కాలం మారితే వలస పక్షులు స్వస్థలాలకు ఎగిరిపోతాయి..అదేంటో కానీ,
ఏ కాలమైనా వలస కార్మికులకు స్వేచ్ఛ ఉండదు..
ఓ ప్రభుత్వ పెద్దలారా..!
మనసున్న మారాజులారా..!!
వారిని కూడా మనుషులుగా చూడండి..
ఆకలి రోగానికింత అన్నం మందు వేసి, బతికించండి..
రేపటి భవిష్యత్తు తీర్చిదిద్దడానికి వాళ్ళే వారసులని కాస్త గుర్తించండి..!!
******
No comments:
Post a Comment