మానస వీణ - 9 - అచ్చంగా తెలుగు
మానస వీణ – 9
              కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్

బోయవాళ్ళ వేటుకు గాయపడ్డ కోయిల జంటను ఆదుకోగలిగేది GTR అంకుల్ ఒక్కరే..! ఆ అలోచన మదిలో  మెరవగానే వడివడిగా  GTR ఇంటి వైపు పరుగులాంటి నడకతో అడుగులేసింది మానస.
 అదే పేపర్లో " నడిరోడ్డున తల్లిదండ్రులు " వార్త ప్రక్కనే, దివంగత మంత్రి హత్యకేసు విచారణకు ప్రత్యేకాధికారి గా ఎసిపి దినేష్ నియామకం అనే చిన్న వార్త ఆమెను ఆకర్షించలేకపోయింది.
ప్రభుత్వ వైద్యశాల ముందు కాంటెస్సా కారు ఆగింది. అక్కడ భగభగ మండే ఎండలో దుప్పటి నీడలో అలివేణి బక్కచిక్కి పోయి కాటికి కాళ్ళు చాచినట్లు పడివుంది.  వడివడిగా ఆర్ద్రత, ఆవేశం, అసహనం, ఆక్రోశం పెల్లుబుకుతుండగా కార్లోంచి దిగింది మానస..
 వెనుక డోర్ నుంచి క్రిందకు దిగారు GTR.
  బంగారు తల్లి మానస మనసు తెలిసిన GTR రోడ్డున పడ్డ దంపతులను ఆదుకునేందుకు సిద్ధపడ్డారు. మానస ద్వారా విషయం తీవ్రత తెలుసుకుని, క్షణం ఆలస్యం చేయకుండా  డ్రైవర్ ని కారు తీయమని పురమాయించి మానస , అనిరుధ్ తో సహా బయలు దేరారు. పేపర్లో ఫొటో చూసిన దగ్గర నుంచి కొండలరావుని ఎక్కడో చూసినట్లు GTR మైండ్ సెర్చ్ చేస్తూనే వుంది. బయలుదేరిన దగ్గర నుండీ .. "అతణ్ణి ఎక్కడో చూశానమ్మా మానసా .. లాంగ్ బ్యాక్ అందుకే గుర్తురావటం లేదు.."అన్నారు GTR.
అంకుల్ ఒకటి చెప్పనా.. కొన్నిసార్లు అసలు పరిచయం కూడా లేని వాళ్ళను ఎక్కడో చూసినట్లుంటుంది.. అది ప్రతి ఒక్కరికీ అనుభవైకమే.. ఎందుకో తెలుసా... మనం రైల్లోనో , బస్సులో నో ప్రయాణం చేసేటప్పుడు.. మార్కెట్.. ,దేవాలయాలవద్ద, జాతరల్లో మనకు దగ్గరగా కాకతాళీయంగా చూసిన వాళ్లని మైండ్ స్టోర్ చేసుకుంటుందట...అంకుల్. వారే మరలా మనకు కనపడగానే ఎక్కడో చూసినట్లుంటుందిట. మొన్నీమధ్య పేపర్లో చదివా "అంటూ ఎక్కువగా అలోచిస్తున్న జిటీఅర్ కి సర్ధి చెప్పేందుకు ప్రయత్నించింది మానస.
 ఎప్పుడూ వాళ్ల నాన్న కి ఎదురుగా చూసి మాట్లాడే ధైర్యం కూడా లేని అనిరుధ్.. మానస కలపుగోలు తనానికి, ధైర్యానికి ముచ్చటపడి తదేకంగా మానసను చూస్తున్నాడు..జిటీఅర్ గమనించకుండా..!
" కానీ మానసా ఖచ్చితంగా అతగాడు నాకు పరిచయమున్నట్లే వుంది తల్లీ.. సరే వెళ్తున్నాం గా.. వెళ్ళి అతణ్నే అడుగుదాం" అని పరిపరి విధాల చక్కర్లు కొడుతున్న మదికి కాస్త బ్రేక్ ఇచ్చి... మానసకు సమాధానమిచ్చాడు.. గంట ప్రయాణం తర్వాత వృద్ధ దంపతులున్న ప్రభుత్వ వైద్యశాల ముందరికి చేరుకున్నారు.
  ప్రభుత్వ వైద్యశాల పేవుమెంట్ పైన పడుకున్న వృద్ధురాలైన అలివేణమ్మ వద్దకు ఆదుర్ధాగా పరుగు పరుగున చేరుకుంది మానస. మానస ను GTR, అనిరుధ్, డ్రైవర్ అనుసరించారు.
  ఆదుకునే వారెవరో వచ్చారని అనుకుందో ఏమో ... అతికష్టం మీద లేచి కూర్చొని, నమస్కారం చేసింది అలివేణి.
" ఏమ్మా ఏమైంది. ఎందుకిలా.. మీ పిల్లలు ఎవరు? ఎక్కడుంటారు. ప్రశ్నల వర్షం కురిపించింది. అలివేణి పరిస్థితి చూస్తుంటే మానస జాలిగుండె కరిగి ఆవిరైపోతోంది. అలసిన అమ్మలకు ఎంత కష్టం .. ఎంత కష్టం అని మదన పడింది.అంతలో వెలిసిపోయిన పాంట్ షర్ట్, పైన ఒక చిన్న కండువ ధరించి పరుగు పరుగున అక్కడకు చేరుకుని .. తన భార్య దగ్గర కొచ్చిన కొత్తవాళ్ళెవరా.. అని ఆలోచిస్తూ నమస్కారం చేశాడు. "అయ్యా నేను ఆవిడ భర్తని..నన్ను కొండలరావంటారు" అని పరిచయం చేసుకున్నాడు."అయ్య నా పేరు GTR, ఇండస్ట్రియలిస్ట్ ని, ఏవో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తుంటా...అని తనని పరిచయం చేసుకున్న జిటీఅర్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందండీ... అని కొండలరావు నుద్దేసించి అంటూనే... తర్వాత మాట్లాడదాం పదండి ముందు కడుపు నిండా తిని ఎన్నాళ్ళైందో.. ఆశ్రమానికి వెళ్ళి మాట్లాడుకుందాం..అక్కడ నుంచి కాన్సర్ హాస్పటిల్ లో అపాయింటుమెంట్ తీసుకుంటా.. కదలండి త్వరగా.. "అంటూ హాడావుడి చేశారు జిటీఅర్.
కారులో అంతా సర్ధుకుని కూర్చున్నారు.. మానస అలివేణి తలను, తనభుజానికి ఆనించి కూర్చుంది. ప్రక్కనే అనిరుధ్, ఆ ప్రక్కన కొండలరావులు సర్ధుకుని కూర్చోగా..GTR,  డ్రైవర్ లు ముందు కూర్చున్నారు.. కారు దూసుకుపోతుండగా .. "అసలేం జరిగిందండీ ఇలా ఎందుకు రోడ్డున పడ్డారు... "జిటీఆర్ అడిగిన ప్రశ్నలకు వారం రోజుల క్రితం జరిగిన సంఘటన కళ్ళముందు మరోసారి మెదిలింది కొండలరావుకు.
 *****
 "అమ్మకు క్యాన్సర్ అని చెప్పారటకదరా పెద్దోడా..! "అని కొడుకుని అడిగాడు కొండలరావు. కొండలరావుకి ఇద్దరు కొడుకులు, ఒకరు ఇంజనీర్.. మరొకరు ఏ1 కాంట్రాక్టర్.
"అవును" ముక్తసరిగా స్సమాధానమిచ్చాడు కొండలరావు పెద్దకొడుకు.
"ఇప్పుడెలా వుందన్నార్రా.. తగ్గిపోతుందా.. పెద్ద డాక్టర్  దగ్గరకేమైనా తీసుకెళ్లమన్నారా..! .. ఏం మాట్లాడవేం నిన్నే..అడుగుతుళ్ళా..!"
"చూపించినా తగ్గదుట. ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాలంటే నాదగ్గర డబ్బుల్లేవ్.. "
"అదేందర్రా.. మరి చిన్నోడేమన్నాడు"
" వాడిదగ్గరకూడా లేవట."
"అదేందిరా సంపాదించుకున్న నాలుగు రాళ్ళు... మీకు పంచిందాకా వేధించారు..వచ్చిన పిఎఫ్ అంతా మీ వ్యాపారాల పేరుతో లాక్కున్నారు.. ఈ రోజు అమ్మకి బాగోలేదంటే డబ్బు లేదంటే ఎలారా..? అసలు మీరేం మనుషులురా..?"
 " ఏమో మామగారు మేం మనుషులమో కాదో గానీ, మా దగ్గర అత్తయ్య గారి వైద్యానికి కాణీ కుడాలేదు" తేల్చి చెప్పేసింది పెద్దకోడలు కనకమహాలక్ష్మి.
  "ఛస్ పోండ్రా..మీ చేతగాకుంటే నా పెళ్ళాన్ని నేనే  కాపాడుకుంటా..  అది తిన్నా తినకున్నా.. 40 ఏళ్ళు నన్ను, మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుందిరా..! ఏమ్మా కోడలు పిల్లా ఎప్పుడైనా తను మిమ్మల్ని కోడళ్ళుగా చూసిందా..! అంతేలే.. మెత్తగ వుంటే ఎవ్వరికైనా మొట్ట బుద్దౌతుంది..  అసలు మీరు మనుషులేనా.. నేనే తీసుకెళ్ళి నా పెళ్లానికి వైద్యం చేయించుకుంటా.. "అంటూ పడక్కుర్చీలోంచి చివాలున లేచి.. చొక్కా తగిలించుకుని బయటకెళ్ళాడు.. ఆటో తీసుకురావటానికి...కొండలరావు.
అటో డ్రైవర్ సహాయంతో భార్య అలివేణిని అతి కష్టం మీద ఆటోలో ఎక్కించాడు.. కోడలు కొండలరావుకి వినబడేలా ఛటాలున తలుపు వేసింది..
ఎవరికెవరు ఈ లోకంలో ...ఏదారెటు పోతుందో ఎవరినీ అడుగకఅంటూ ఎక్కడనుంచో పాట లీలగా కొండలరావు చెవిని తాకింది. కన్నీటి ధార కురుస్తుండగా తాను ఎంతో ఆశపడి కట్టుకున్న ఇంటి నుంచి కట్టుబట్టలతో భార్యతో సహా రోడ్డున పడ్డ కొండలరావు.. కంటికి కనిపించే వరకు వెనుదిరిగి ఇంటిని చూస్తూనే వున్నాడు..
 ***
  GTR  కారు నేరుగా హేమలతా ప్రేమ కుటీరంలోకి వెళ్ళి  ఆగింది.
 " అయ్యో ఎందుకండీ ఆ కన్నీరు..  మీకెవ్వరూ లేరని బాధపడకండి.. మేమంతా లేమూ.. ఆశ్రమం వచ్చింది దిగండి అన్న, GTR, మానసల ఊరడీంచే మాటలతో ఈలోకంలోకి వచ్చాడు కొండలరావు.. కన్నీరు తుడుచుకుని భార్య తో సహా GTR ని అనుసరించారు.
"కాసేపు రెస్ట్ తీసుకోండి.. సాయంత్రం హాస్పటిల్ కి వెళ్దాం... ఈ లోపు మా వాళ్ళు అపాయింట్ మెంట్ తీసుకుంటారు... అని చెబుతూనే కొండలరావు గారూ ఒక్క మాట... మీరూ..." అంటూ మళ్లీ వెంటనే " ఏం లేదులేండి.. ఏంలేదు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి.." అంటూ  ఆశ్రమ ఆఫీస్ లోకి వెళ్ళాడు. మానస, అనిరుధ్ లు ఆశ్రమ అటెండర్ల సహాయంతో కొండలరావు, అలివేణిలను వారికి కేటాయించిన గదికి తీసుకెళ్ళారు.
 ****
అదే సమయానికి ...
ఏసిపి కార్యాలయం...
"ఇంత హాట్ హాట్ గా క్రైం మీటింగ్ జరుగుతోంది.. రెండు గంటలైనా బయటకు రారేరా.. అందరికీ కొత్తాయన తలంటోస్తున్నాడా ఏంది.." అని ఒక హోం గార్డు, లోపల టీలు ఇచ్చి బయటకొచ్చిన మరో హోంగార్డుని అడిగాడు..."
అలాంటిదే అని అతడు సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు.. మరలా మజ్జిగ తయారు చేయడానికి.
డ్యూటీ లో జాయిన్ అవుతూనే ఏసిపి దినేష్ ఆ నియోజక వర్గంలోని అందరు ఇన్స్పెక్టర్లతో క్రైం సబ్జెక్ట్ పై మీటింగ్ ఏర్పాటుచేశాడు. రెండు గంటలకు పైగా వారి ప్రాంతాల్లోని అన్నిరకాల నేరాలను అడిగి అనుమానం ఉన్న విషయాలపై శ్రద్ధతో మరింత లోతుగా వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు.
టౌన్ ఇన్స్పెక్టర్ జాషువా ని " మంత్రి ఓబులేష్ హత్య జరిగిన రోజున డ్యూటీ లో వున్నదెవరో రికార్డులు తీసి చూడండి? ఆదేశించాడు ఏసిపి దినేష్.
సర్ వెంకటరత్నం గారని, నెల్లూరు లో డిఎస్పి గా చేస్తూ ఐదువేలకు లంచం తీసుకుంటూ  ఏసిబికి పట్టుబడ్డాడు సర్.. ఓబులేష్ గారి హత్య జరిగినప్పుడు ఆ సారే  ఆ టైంలో ఇక్కడ పనిచేశారు.
"సరే డిఎస్పి వెంకటరత్నం గారిని సోమవారం రమ్మని కబురంపండి.. మీరంతా మీ ప్రాంతాలలో ని హంతకుల వివరాలను.. మాజీ ఎమ్మెల్యే భూషణం శత్రువుల జాబితా.. వారిప్పుడెక్కడెక్కడున్నారో పూర్తి వివరాలు సేకరించి వారం రోజుల్లో నాకు నేరుగా వచ్చి చెప్పండి. "మంత్రి ఓబులేషు గారి హత్య జరిగి ఇన్నేళ్లవుతుంటే ఫైల్ బూజెందుకు పట్టింది..?... ఎందుకు కదలలేదు..? వీటి వెనుక ఎవరున్నారో మీకెవరికైనా తెలుసా.?." అని అడిగిన దినేష్ ప్రశ్నకు ఎవ్వరి నుంచి సమాధానం లేదు.ఎందుకంటే హత్య జరిగి దాదాపు ఆరేళ్ళు దాటుతోంది.  కొత్తవారి తో నిండి వున్నాయ్ రక్షకభట నిలయాలన్నీ..!
మీటింగ్ పూర్తయిన దగ్గర నుంచి ఆలోచిస్తూ ఉండి పోయాడు ఏసిపి దినేష్. హత్య జరిగిన ప్రాంతానికి జాషువని వెంటబెట్టుకెళ్ళి స్పాట్ చూసి వచ్చాడు.
అప్పటి ఫైల్ ఫొటోలు జాగ్రత్తగా గమనించాడు... అత్యంత పాశవికంగా హత్యచేశారు ఓబులేసుని.. కోల్డ్ బ్లడెడ్ మర్డర్... ఎవరా శత్రువులు.. పరిపరి విధాల ఆలోచిస్తున్న దినేష్ కి హోంమంత్రి కృషీవలరావు ని కలిసినప్పుడు ఆయన చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. 
"దినేష్ మీరంటే మాకు చాలా అభిమానం.. మీరు చాలా ఆనెస్ట్ అని నాకే కాదు రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఇప్పుడు మీకు అప్పగించబోయేది అత్యంత ప్రతిష్టాత్మకమైన కేసు. పైగా పర్సనల్ కూడా.. మా తండ్రై గారైన ఓబులేషు ను ఆరేళ్ళ క్రితం కొందరు హత్య చేశారు.. రాజకీయ కారణాలే కావచ్చు మరేదైనా కావచ్చు.. మా తండ్రిగారు ఎమ్మెల్యే కాక మునుపు, మాజీ ఎమ్మెల్యే భూషణం గారి వద్ద పనిచేశారు.. వారి తదుపరి వారి మనిషిగా, ఎమ్మెల్యేగా కూడా అయ్యారు. రెండవసారి గెలిచి మంత్రిగా కూడా ప్రమాణం చేశారు.. ఖర్మ వెంటాడి దారుణ హత్యకు గురయ్యరు. అయితే ప్రత్యర్ధుల చేతిలో హత్య గావించబడ్డారని అప్పట్లో ప్రచారం జరగడంతో ఫ్యాక్షన్ వేళ్ళూనకుడదన్న ఒకే ఒక్క కారణంతో నేను ఫిర్యాదు చేయలేదు.. అయితే మానాన్న మా గుడిసెలో దాచిన సమాచారం ఇదిగో చూడండి.. " దినేష్ చదువు తుండగానే కృషీవలరావు చెబుతూ పోతున్నాడు... "మానాన్న గారి ని బెదిరించి ఆయనచే భూషణం గారి  మనుమరాలిని కిడ్నాప్ చేయించి, అనంతరం హత్య చేయమని పురి కొల్పాడు. పసికందుని హత్య చేయడానికి మనసొప్పని మానాన్న గారు ఆ చిన్నారిని హేమలత ఆశ్రమం వద్ద వదిలేశారట... తన ప్రాణానికి హాని వుందని మానాన్న గారు వ్రాసిన లెటర్ దొరకడంతో భూషణం గారి మీద తొలిసారి అనుమానం కలిగింది.. మా నాన్న గారి హత్య సంగతి పక్కన బెట్టినా .. భూషణం గారి కోడల్ని, ఆ చిన్నారిని కలపాలంటే భూషణం ససేమీరా.. అంటాడు.. కాబట్టి  మొత్తం కూలంకషంగా దర్యాప్తు చేసి నా మనోభారాన్ని దించుతారని జల్లెడపట్టి మిమ్మల్ని ఎంచుకుని ఈ బాధ్యత మీకప్పగిస్తున్నా.." అంటూ చుట్టూ తిరిగి దినేష్ వెనకకు జేరి, అతని భుజం తట్టి ఆల్ ది బెస్ట్ " చెప్పిన హోంమంత్రి కృషీవలరావుకి అటెన్షన్ లో నిలబడి వెనుక పాదాలు కాస్త ఎత్తి విష్ చేసి "తప్పకుండా సర్" అని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి దినేష్ కు...
ఆ రోజు  అనుకోకుండా రెండు   సంఘటనలు జరిగాయి.
GTR, కొండలరావుని పిలిచి "రేపు ఉదయం సిటీలో పెద్దదైన కాన్సర్ ఇన్స్ స్టిట్యూట్ ప్రియదర్శిని కాన్సర్ హాస్పిటల్ కు వెళ్తున్నాం అలివేణిగారిని రెడీ చేసి మీరూ పొద్దుటే రెడీ అవ్వండి" అని  చెప్పి, సరే అని  వెళ్తున్న కొండలరావు ని మరల వెనకకు పిలిచి  "మీరు తహశీల్దార్ గా కొద్దిరోజులు పనిచేశారు కదూ" అనే సరికి కొండలరావుకి ఒక్కసారి ఒళ్ళుగగుర్పాటుకు గురైంది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి.
మరొక చోట..
భూషణం లాండ్ ఫోన్ మ్రోగుతోంది... భూషణం పోన్ ఎత్తాడు..
"హలో ఎవరు..." అన్నాడు భూషణం
"భూషణం గారేనా..? " ఫోన్ లోని వ్యక్తి.
"అవును" అన్నాడు భూషణం
"జాగ్రత్తగా వినండి... మీరు చేయించిన హత్యని పోలీసులు తిరగదోడుతున్నారు  .. బీకేర్ ఫుల్.. నేను బుక్కయితే నిన్ను బుక్ చేసిపారేస్తా.." అని అవతలగొంతు కరుకుగా చెప్పి ఫోన్ క్రెడిల్ చేయడంతో గుండెలదిరిపోయాయి భూషణం కి.. నుదుటికి పట్టిన చెమటలు ధారగా ముఖమంతా పరచుకున్నాయి.. కళ్ళు ఎర్రజీరలవుతున్నాయి. భూషణం ఒంట్లో మాత్రం తొలిసారి  భయం అనే  ఒణుకు మొదలైంది.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages