'మాయా ప్రభావమే..మారుతి రూపం'
-సుజాత. పి.వి.ఎల్.
నారదుడు త్రికాలవేది. ఆయన లక్ష్మీదేవికి భర్త ఎవరో, ఎవడు సర్వవ్యాపకుడో, ఎవరు నిరంతరం లోకం చేత పూజించబడుతూ ఉంటాడో, ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీమహావిష్ణువుకు ఈమె ఇల్లాలు అవుతుంది’ అని అన్నాడు. అక్కడివరకు బాగానే చెప్పాడు కానీ ఆమెను చూడగానే ఈమె తన ఇల్లాలు అయితే ఎంత బాగుండు అని లోపల అనుకున్నాడు. ఈ అమ్మాయికి పెళ్లి ఎలా చేద్దామని అనుకుంటున్నావు అని రాజును అడిగాడు. స్వయంవరం పెట్టాము. స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది. అని చెప్పాడు. అనగా విష్ణువు సాకారుడై ఈ సభలోకి వస్తాడు అని నారదుడు గ్రహించాడు. వెంటనే వైకుంఠమునకు వెళ్ళి విష్ణుమూర్తిని సమీపించి ‘అయ్యా, నామనస్సు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని ఉవ్విళ్ళూరి పోతున్నది. ఆమె నాకు దక్కకపోతే మన్మథబాణముల చేత చచ్చిపోతాను’ అన్నాడు. అంతకు మునుపు మన్మథబాణములను జయించానని చెప్పిన నారదుడు ఇప్పుడు ఈ మాటలు చెప్పటం కూడా మాయే.! నేను బతకాలంటే నాకు నీరూపం కావాలి. అప్పుడు ఆమె నా మెడలో మాల వేస్తుంది. అందుకని దయచేసి నీ రూపమును నాకీయవలసినది’ అని అడిగాడు. శ్రీమహావిష్ణువు మహానుభావుడు. ఆయన హరి శరీరమునూ ఇచ్చాడు, శిరస్సునూ ఇచ్చాడు. హరి అనే పదమునకు రెండు అర్థములు – పాపములను హరించే శ్రీమహావిష్ణువు, సర్వాంతర్యామి.. హరి శరీరమును కిందవరకు ఇచ్చాడు, కోతి తలను పైన యిచ్చాడు.
వెంటనే నారదుడు ఆలస్యం చేయకుండా స్వయంవర మండపమునకు వెళ్ళి అక్కడ గల ఒక ఆసనం మీద కూర్చున్నాడు. అతనికి అటూ ఇటూ రుద్రపార్షదులు కూర్చుని ఉన్నారు. ఈతని అలంకరణ చూస్తే మహావిష్ణువులా అలంకరించుకున్నాడు, పైన మాత్రం కోతి ముఖం ఇతని మెడలో ఎలా మాల వేస్తుంది అని అనుకున్నారు సభలో ఉన్నవారంతా. పక్కవాళ్ళు అసూయతో అలా అనుకుంటున్నారేమో అనుకుంటున్నాడు నారదుడు. శ్రీలక్ష్మీదేవి వరమాల పట్టుకుని దగ్గరకు వచ్చింది. ఆమె నారదుని వంక ఒకసారి చూసి భ్రుకుటి ముకుళించి ఈ కోతి శిరస్సు ఏమిటి? ఈ రూపమేమిటి? అనుకుని వెళ్ళిపోయింది. ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు. వరమాల తీసుకువెళ్ళి ఆయన మేడలో వేసింది. ఈవిడను తీసుకుని ఆయన వైకుంఠమునకు వెళ్ళిపోయాడు.
అపుడు నారదునికి ఎక్కడలేని బాధా కలిగింది. పక్కన ఉన్న రుద్రపార్షదులు "కోతిముఖం వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారని వచ్చాడో స్వయంవరానికి" అన్నారు. నారదుడు వారిద్దరినీ "మీరు రాక్షస యోనులయందు జన్మించెదరు గాక !" అని శపించాడు. మాయా ప్రభావం కామక్రోధముల యందు ఎలా తిప్పుతుందో చూడండి. రుద్రపార్షదులు నారదుని తిరిగి శపించకుండా శివేచ్ఛగా భావించారు. వాళ్ళు మహాజ్ఞానులు. నారదుడు గబగబా వైకుంఠమునకు వెళ్లి “శ్రీమన్నారాయణా! ఎంత పని చేశావు. హరిరూపము యివ్వమని అడిగితే కోతి శిరస్సు పెట్టావు. ఆమెను నాకు కాకుండా చేశావు. నీవు ఒకానొకనాడు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరం అయితే అరణ్యంలో పడి ఏడిస్తే, ఈ కోతిముఖం వున్న వాళ్ళే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు. అలా నిన్ను శపిస్తున్నాను’ అన్నాడు. శ్రీమన్నారాయణుడు మహానుభావుడు కనుక ఆ శాపమును కూడా లోకమునకు ధర్మమార్గము నేర్పడానికి రామావతారమునందు సీతావియోగంగా తీసుకున్నారు. ఇప్పుడు నారదుని స్వస్థత కలిగింది.కోపం చల్లారింది. తాను చేసిన పనేంటని? అని ఆలోచించాడు. ఆత్మపరిశీలన చేసుకున్నాడు. మాయ తొలగింది. శ్రీమన్నారాయణుని చూసి యుక్తాయుక్త విచక్షణ మరచి నేను మాట్లాడిన మాటలకి నా నాలుకను ముక్కలు ముక్కలుగా కత్తిరించెయ్యాలి. గరుత్మంతుడిని నీ ధ్వజమునకు చిహ్నంగా కలవాడా! ఇంకా ఎంత మాత్రము జాగు చెయ్యకుండా నీ చక్రధారల చేత నా నాలుకను కత్తిరించెయ్యి. అప్పుడు కాని నేను చేసిన పాపం పోదు అని కన్నీటి ధారలతో ఆయన పాదములను అభిషేకించి కాళ్ళమీద పడ్డాడు. నారదుడు కాబట్టి మరల అంత తొందరగా స్వస్తితిని పొందగలిగాడు. మనం అయితే మాయలో పడి కొన్ని కోట్ల జన్మలు తిరుగుతూ ఉంటాము. పరిశీలించినట్లయితే రామాయణంలో ఒక రజకుడి మాట సీతా వియోగమునకు కారణం అయింది. అదే రజకుడు మరల ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చినపుడు, కృష్ణ భగవానుడు నాలుగు పంచెలు యివ్వమని అడిగాడు. అపుడు ఆ రజకుడు నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా అని గేలిచేసి మాట్లాడాడు. యుగం మారినా వాని బుద్ధి మారలేదు. అపుడు కృష్ణుడు వాని శిరస్సు మీద ఒక గుద్దు గుద్ది వేయిముక్కలు చేశాడు. నారదుడు కాబట్టి అతి స్వల్పకాలంలో దిద్దుకున్నాడు. మనం ఎంతటి వాళ్ళము.?! ఇది మహేశ్వర శక్తి. ఆ మాయే అమ్మవారి స్వరూపము. మీరు గట్టిగా అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే అమ్మే మిమ్ములను దగ్గరికి తీసి, మీకు ఈశ్వర భక్తిని ఇచ్చి మన చేత ఈశ్వర సేవ చేయించి, ఈశ్వరుడిలో కలుపుతుంది. ఇన్నాళ్ళు మనల్ని తిప్పిన కామపాషములు అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే భక్తిపాశములుగా మారిపోతాయి.
****
No comments:
Post a Comment