నాకు నచ్చిన కథ - పరిమళం‌ లేని మనిషి - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన కథ - పరిమళం‌ లేని మనిషి

Share This
నాకు నచ్చిన కథ - పరిమళం‌ లేని మనిషి
కొత్తపల్లి ఉదయబాబు 


"ఈయన మా మావయ్య సర్.పేరు సదాశివం. " వెంకటరమణ పరిచయం చేసిన ఆయన నాకు నమస్కరించాడు.

నేను ప్రతినమస్కారం చేసి " కూర్చోండి." అన్నాను. వారిద్దరూ నా ఎదురుగా సోఫా లో కూర్చున్నారు కొంచం ఇబ్బందిగానే.

" కాఫీ, టీ లాంటివి ఏమైనా? "అడగబోయి ... నా శ్రీమతి ఇంకా లేవలేదన్న విషయం గుర్తొచ్చి మాట మార్చాను.

"మీ ప్రతిభ ఎలా ఉంది? మా దత్తపుత్రుడు సాగర్ ఎలా ఉన్నాడు? ఈమధ్య రావడమే మానేసాడు.బాగా చదువుతున్నాడా?" అడిగాను రమణను.

"ఎస్ సర్.హి ఈజ్ ఫైన్. ప్రతిభ బాగుంది.బాగా చదువుతోంది తనుకూడా. అసలు విషయం.. మావయ్య ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. మేము ఉన్న చోట ఉంటే ఒకరికొకరం తోడుగా ఉంటామన్న ఉద్దేశం. ముఖ్యంగా మాకు పెద్ద దిక్కు. నేను, మా అన్నయ్య అతను పని చేసిన పాఠశాలలో పదవతరగతి వరకు చదువుకున్నాము. ఆనాడు మా పరిస్థితులు బాగోకపోతే మామయ్యే దగ్గర పెట్టుకుని చదివించాడు. అందుకని మా ఫ్లాట్ ఎదురుగా ఉన్న మీ ఫ్లాట్ ని అద్దెకు ఇవ్వమని అడుగుదామని వచ్చాను."

అంతలో నా సెల్ రింగయింది. సైమన్ పాల్. మాట్లాడాను. "రమణ నా దగ్గరకు వచ్చి నీ ఫ్లాట్ రెంట్ కిప్పించ మని అడిగాడు.చాలా ప్రాధేయ పడ్డాడు. నేను ఉంటానుగా...చూస్తూనే ఉంటాను. వాళ్ళ మావయ్యకూడా హుందాగానే ఉన్నాడు.

పర్వాలేదు ఇయ్యి. " నా సమాధానం కోసం చూడకుండా కట్ చేసాడు.

"సరే రమణ...మీరు, పాల్ అడుగుతున్నారని ఇస్తున్నా..ఆ ఫ్లాట్ అంటే నాకు ప్రాణం.నా వ్యాపారం బాగా అభివృద్ధిలోకి వచ్చి , ఈ డ్యూప్లెక్స్ , రెండు స్థలాలు కొనుక్కోవడం అంతా అందులో ఉండగానే జరిగింది. మూడేళ్ళుగా దానిని ఎవరికీ అద్దెకు ఇవ్వలేదు. ఇంటికేమైనా జరిగితే నేను భరించలేను.ఓకే నా మరి."నిర్మొహమాటంగా చెప్పేసాను.

రమణ ప్రశ్నార్ధకంగా ఆయనకేసి చూసాడు. "నాకూ మా వూరిలో సొంత ఇల్లు ఉంది సర్. కస్టపడి కట్టుకున్నది.ఉన్న ఇంటిని సొంత బిడ్డలా చూసుకోవడం మా ఇంట్లో అందరికీ అలవాటు సర్." అన్నాడు సదా శివం వినయంగా. అతన్ని పైనుంచి కిందకు ఒకసారి చూసాను. నాకు వినయాలు, విధేయతలు నచ్చవు.మనదంతా రఫ్ అండ్ టఫ్.

" అలాగా ఇంట్లో ఎవరెవరు ఉంటారు?" అడిగాను.

" నేను, మా శ్రీమతి, మా నాన్నగారు." చెప్పాడు సదాశివం.

నేను నొసలు చిట్లించాను. " మీ ఫాదరా....మీరే రిటైర్ అయ్యాను అన్నారు.ఇంకా మీ ఫాదర్ కూడా ఉన్నారా."

ఒక్క నిముషం అతని ముఖం లో ఒక కోపపు కెరటం మెరసి మాయమవ్వడం చూసాను. ఎస్.మొదటిసారి కోడిమెడ తిప్పినప్పుడు విలవిల్లాడిన బాధలాంటి ఆ ఫీలింగ్ నాకు నచ్చింది.

" అవునండి. మా తాతగారికి తొంభై సంవత్సరాలు. " రమణ చెప్పాడు.

"సరే. కనీసం ఒక సంవత్సరం పూర్తిగా ఉండాలి. సాధారణంగా రెంట్ అగ్రిమెంట్ రాసుకోవాలి...అయితే సైమన్ పాల్, మీ మేనల్లుడు చెప్పారని ఒప్పుకుంటున్నాను. ఆరు నెలల అడ్వాన్సు, ఉండబోయే నెలకి ముందుగానే అద్దె పే చెయ్యాలి.మిగతా విషయాలు తెలుసుగా...కరెంటు బిల్, మెయింటినెన్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్ గా పే చేసేయాలి నాకు రసీదులు పంపాలి. రెంట్ కూడా ప్రతీ నెల అయిదవ తారీకున నా అక్కౌంట్ లో జమ చెయ్యాలి. సరేనా?"అంటూ లేచాను సింగల్ సోఫాలోంచి.

వాళ్ళూ లేచి నిలబడ్డారు.

రమణ వెంటనే రియాక్ట్ అయ్యాడు.

"సర్...ఏకంగా ఆరు నెలల అడ్వాన్సు అంటే...ఆయనకోచ్చే పెన్షన్ నెలకు 30 వేలు. ఒక నెల పెన్షన్ మీరు అడ్వాన్సు గా అడుగుతున్నారు.మీరు కొంచం తగ్గిస్తే..."

"ఆమాట ఆయన అడగాలి కదా రమణా...ఆయనకు లేని నొప్పి నీకెందుకు?" అన్నాను విసురుగా.

" వాడు చెప్పింది నిజమే సర్.ఆరు నెలల అడ్వాన్సు అంటే కష్టమే...మూడు నెలల అడ్వాన్సు ఇవ్వగలను సర్. పెన్షన్ అందుకున్నవెంటనే ఎవరి బాకీలు వాళ్ళకు తీర్చాకనే ఇంటి ఖర్చులకు వాడుకోవడం అలవాటు సర్.మీరు ఈ విషయం లో దయ చూపితే...?" అన్నాడతను.

నేను ఇళ్ళల్లోకి అద్దెకు వచ్చేవాళ్ల లీలలు కధలు కధలుగా విని ఉన్నాను.ఇలాగే ముందు బ్రతిమలాడి, తీరా ఇచ్చాకా ఇల్లు పాడు చెయ్యడం, చెప్పకుండా వెళ్ళిపోవడం, కరెంట్ బిల్ కట్టకపోవడం, పైగా ఇంటి యజమాని పైనే కేసులు పెట్టడం .. అదీ నాకు భయం. సాలోచనగా అన్నాను.

"సరే సర్. నాలుగు నెలల అడ్వాన్సు ఇవ్వండి." ఇక మీరు వెళ్ళవచ్చు అన్న రీతిలో

ఆయన వెంటనే జేబులోంచి ఇరవై వేలు తీసి ఇవ్వబోయాడు.

" నోనోనోనో...నాకు అన్ని రికార్డెడ్ గా ఉండాలి.నా బాంక్ ఎకౌంటు వివరాలు ఇస్తాను. అందులో ఆన్ లైన్ లో పే చెయ్యండి.

రమణా...సాయంత్రం వచ్చి ఆ వివరాలు తీసుకు వెళ్ళు.నమస్కారం మరి." అనేసాను 'ఇక వెళ్తారా అన్నట్టు'

"చాలా కృతజ్ఞతలు సర్. మా మేనల్లుడి దగ్గర ఉండే అవకాశం కల్పించారు. " అన్నాడు చేతులు జోడించి.

"సర్సరే సర్.మాకూ సొంత ఇల్లు వుంది...ఇలాంటి కధలు చెప్పక నా ఫ్లాట్ బాగా చూసుకోండి.అన్నట్టు మేము అందులోంచి వచ్చేసి ఏడాది దాటింది.లోపల ఎలా ఉందొ ఏమో...ఏమన్నా పొతే బాగుచేయించు కుని నాకు రసీదులు పెట్టండి.

అంతా ఒక్కసారి కాకుండా నేను చెప్పినపుడు నెలకో వెయ్యి చొప్పున తగ్గించి అద్దె పే చేద్దురుగాని ."

" అలాగే సర్...మావయ్య తరపున అన్ని సక్రమంగా జరిగేలా చూసే పూచే నాది.నామీద అభిమానంతో మీరు ఒప్పుకున్నారు. అంతే చాలు.వస్తాము సర్." అని మెట్లు దిగాడు రమణ.

" ధాంక్యూ వన్స్ అగైన్ సర్..." సదాశివం నమస్కరించి రమణను అనుసరించాడు.

వారు మలుపు తిరుగేంత వరకు నా కోర చూపు వారిని వెంబడిస్తూనే ఉంది.

* * *

మరో మూడు రోజుల్లోనే వాళ్ళు ఇంట్లోకి చేరారు. నాకు అడ్వాన్సు అంతా ఆన్లైన్ లో పే చేసారు...ఆ ఆదివారం సదాశివం వాళ్ళ ఫాదర్, భార్య లతో మా ఇంటికి వచ్చాడు.సడా శివం తండ్రి బాగా మాట్లాడారు. నా భార్య కమలకి కూడా పరిచయం చేసాను. వాళ్ళది నాతొ పోలిస్తే కొంచెం మధ్య తరగతి స్థాయి కుటుంబం. వాళ్ళు మాట్లాడి వెళ్ళాకా ఒక్కసారి నా గ్రామం, నాన్న, మా పొలాలు గుర్తుకు వచ్చాయి.

నాన్న వ్యవసాయం చేసి మమ్మల్ని కస్టపడి చదివించాడు.కూలివాళ్ళతో సమానంగా, ఒక కూలి జీతం అయినా మిగులుతుందని తానూ మా పొలం లో ఒక కూలివాడై పనిచేసాడు.వరదలొచ్చి పంట దక్కకపోయినా, వానలు రాక పైరు ఎండి పోయినా ఏ కష్టం ఎలా పడేవాడో మాకు తెలీదు.మా పిల్లలకు తిండి కి గాని, బట్టకు గాని, చదువుకు కాని ఏ లోటు లేకుండా చేసేవాడు.

'సెలవు రోజుల్లో మీ నాన్నకు సాయం చేయవచ్చుగా' అని అమ్మ అంటే, ' ఆ మట్టి పిసుక్కునే బతుకులు వాళ్ళ కెందుకే ' అని మందలించేవాడు. అందుకే ఆ మట్టి అన్నా, ఆ బురద అన్న నాకు అసహ్యం. 'నా భార్య కుండీలలో మొక్కలు పెంచు దామండీ' అంటుంది. అంటే కుండీ తెచ్చి మట్టితో ఉన్న మొక్కను తెచ్చి, కుండీలో మట్టి వేసి అందులో మొక్కను పెట్టి, మట్టి అయిపోయిన చేతులు కడుక్కోవడం అంటే ...ఛీ..ఛీ...నాకు పరమ అసహ్యం.

అందుకే నా ఇష్ట ప్రకారం ఇంటి నిండా నిజమైనవా అనిపించే అంత అందమైన ప్లాస్టిక్ మొక్కలతో, వాల్ క్రీపర్స్ తో..ఇపుడు ఉంటున్న డ్యూప్లేక్స్ సినీ సెట్టింగ్ ని తలపించేలా డెకోరేట్ చేసాను.ఎందుకో తెలీదు.ఒకపూట తిండికి లేక, కోరుకున్న బట్ట కట్టలేక ఉండే నా స్నేహితుల్ని ఎంతోమందిని బాల్యం లో చూసిన నాకు మట్టి అంటేనే అసహ్యం.

కానీ వేసవికాలం వెళ్ళాకా నెర్రలు తీసిన నేలమీద పడే తొలకరి వర్షం కురిసిన నాడు నాన్న కళ్ళు విచ్చుకున్న పత్తికాయలయ్యేవి.నాన్న చిన్నపిల్లవాడిలా పరుగులు తీస్తూ, పదునైన చినుకులు నేలమీద పడి ఎగసిన సన్నటి ధూళి ని ఆస్వాదిస్తూ " ఆహా...ఒహో..." అంటూ ఆ బురదలో గంతులేసేవాడు.

"ఏమిటినాన్నా.." అని అడిగితే ..." మట్టి పరిమళం రా...మట్టి పరిమళం.ఈ ప్రపంచంలో ఎన్ని సువాసనలున్నా అవన్నీ ఈ సువాసన ముందు దిగదుడుపే" అనేవాడు.

మీకో సంగతి తెలుసా...నేనెప్పుడూ జ్ఞానం వచ్చాకా నాన్న పక్కలో పడుకోలేదు. ఆ మట్టి వాసన భరించలేక.వయసు వచ్చేటంతవరకూ అమ్మ పక్కలోనే. కస్టపడి చదువుకోకపోతే ఆ మట్టే పిసుక్కోవాల్సివస్తుందని సాధ్యమైనంత ఇష్టపడి చదివి ఈరోజు సబ్-రిజిస్త్రార్ స్థాయికి ఎదిగాను.అమ్మాయి బ్యాంకు ఆఫీసర్ గా చేస్తోంది. అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు.

హైదరాబాద్ బదిలీ అయిన కొత్తలో...ఇపుడు సదాశివానికి అద్దెకు ఇచ్చిన ఫ్లాట్ ని కొన్నాను. కొన్న ముహూర్తం ఎలాంటిదో గాని నాకు బాగా కలిసివచ్చింది. ఇంకా ఆస్తిపరుడ నయ్యాను. అందుకే ఆ ఫ్లాట్ అంటే ఇష్టం నాకు.

నాలుగు నెలలు గడిచాయేమో...

ఒకరోజు సదాశివం వాళ్ళ నాన్నగారితో ఇంటికొచ్చారు. నడవలేని తండ్రిని అతి కష్టం మీద అతను తీసుకు రావడం నా బెడ్ రూమ్ లోంచి కనిపిస్తూనే ఉంది. నేను ఆఫీస్ కు తయారవుతున్నాను. కమలను పురమాయించాను.

కమల నాకన్నా నాలుగాకులు ఎక్కువ చదివిన నా జీవిత భాగ స్వామీ.

గబగబా వాళ్ళు మెట్లు ఎక్కకుండానే గుమ్మంలోనే ఆపేసింది.

"ఆయన స్నానం చేస్తున్నారు...ఆఫీస్ కు టైం అవుతోంది.ఏమిటో చెప్పండి." అంది.

"లోపల అబ్బాయి వచ్చేటంత వరకు కూర్చుంటామమ్మా. అబ్బాయితో ఒక్క నిముషం మాట్లాడి వెళ్ళిపోతాను." అంటున్నాడు సదాశివం తండ్రి రామబ్రహ్మం గారు.

" వద్దండి. ఈవేళ అర్జెంట్ మీటింగ్ ఉందట. బహుసా మీరు మాట్లాడే సమయం ఉండదు. ఏమిటో చెప్పండి.ఆయన ఆఫీస్ కి వెళ్ళాక నేను ఫోన్ చేసి చెబుతాను." అంది కమల.

"మేము ఇల్లు ఖాళీ చేస్తున్నమమ్మా..."

"కమలకు కోపం వచ్చేసింది.నాకైతే దవడ కండరాలు బిగుసుకున్నాయి. డ్రెస్ వేసుకుంటున్నాను.వెళ్తే నా సమయం

పాడవుతుందని నిగ్రహించుకున్నాను. కానీ నా తరపున కమల అడగాల్సినవన్నీ అడిగేస్తోంది.

" ఇల్లు ఖాళీ చేస్తున్నారా ...ఎందుకు?ఏడాది పాటు ఉంటానన్నారు. మీరు మధ్యలో ఖాళీ చేస్తే ఎవరొస్తారు ఇప్పటికిప్పుడు?

మాకు అద్దె నష్టం.పైగా ఎవరూ లేని ఇంటికి మెయింటినెన్స్ కట్టుకోవాలి. దయ తలచి ఇచ్చినందుకు ఇదా మర్యాద.

ఇంతకీ ఎందుకు ఖాళీ చేస్తున్నారు?"

"అది కాదు మేడం.నాన్నగారికి వెన్నుపూస ఆపరేషన్ జరిగింది. మూడవ అంతస్తు లో ఉన్న ఫ్లాట్ లోకి మెట్లు ఎక్కి వెళ్ళాలంటే చాలా కష్టమై 'ఆర్ధరైటిస్' తో బాధపడుతున్నారాయన.ఇక మీదట మెట్లు ఎక్కితే ప్రాణానికే ప్రమాదమట.

లిఫ్ట్ లేకపోయినా మేనల్లుడికి పెద్ద దిక్కుగా ఉందామని అనుకున్నాం. అలాగే నా భార్య ఇదివరకు లేని 'సయాటికా' నొప్పితో బాధపడుతోంది. ఈనెల కరెంట్, మెయింటినెన్స్ అన్ని కట్టేసాము.ఈ నాలుగు నెల ల బిల్లులన్నీ ఈ కవరులో ఉన్నాయి.ఈ కవరు సర్ కి ఇచ్చి సరిచూసుకోమనండి.మాది నాలుగు నెలల అడ్వాన్సు మీ దగ్గర ఉంది. మీకేమైనా రావాల్సి వస్తే తీసుకుని మాకు మిగిలిన సొమ్ము పంపమని చెప్పండి." అన్నాడు సదాశివం.

" లిఫ్ట్ లేని ఇల్లు అని చూసుకున్ననాడు తెలీదా...మా ఇంటిలోకి వచ్చాకా రోగాలోచ్చాయని మీరు వేరే ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తే ఇక మా ఇంటికి ఎవరైనా అద్దె కు వస్తారా? అయినా మీరు రోగిష్టి వాళ్ళని తెలియక అద్దెకివ్వడం మాదీ బుద్ది తక్కువ. అసలు మిమ్మల్ని కాదు. ఆ రమణని అనాలి. మేనమావంటూ తీసుకు వచ్చి మా నెత్తిన పెట్టాడు.ఈసారి కనబడితే కడిగేస్తాను.సరే...వెళ్ళండి.వెళ్ళండి." కమలకు బి.పి. పెరిగినట్టు అరిచేసింది.

"అదికాదమ్మా..." సదాశివం తండ్రి ఎదో అనబోయాడు.

"వెళ్ళిపోయే దానికి ఇంకా వరసలేందుకు లెండి.వెళ్లి రండి." కమల వాళ్ళ ముఖం మీదే తలుపు వేసేసింది.

చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళందరూ చూస్తుండగా అవమాన భారంతో తలవంచుకుని తండ్రిని జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు సదాశివం.

లోపలి వచ్చిన కమల అంది." అంతా విన్నారుగా. వెధవ సంత. నాతొ చెప్పకుండా ఇచ్చారు.చూడండి ఎంత నష్టమో...ఇక మీదట ప్రతీనెలా మళ్ళీ మేయిన్టినేన్స్ కట్టుకోవాలి. ఆ అడ్వాన్సు తిరిగి వాళ్ళ మొహాన కొట్టండి." అంది కవరు విసుగ్గా నా చేతిలో పెడుతూ...

" ఆ.బాగా పెట్టావు గడ్డి. అడ్వాన్సు తిరిగి ఇవ్వడమేమిటి? మతిలేని మాట.ఇల్లు వద్దని పోయింది వాళ్ళు. ఇలాంటిదేదో చేస్తారనే నాలుగు నెల ల అడ్వాన్సు తీసుకున్నా.వాళ్ళు ఇక రారు. మనమేమీ మాట్లాడవద్దు. అర్ధమైందా?"

"ఇదొక్కటి మంచి పని చేసారు.రండి టిఫిన్ చేద్దురుగాని."

కమలను అనుసరించాను.

* * *

ఆరు నెలల తర్వాత అపార్ట్ మెంట్ వాచ్ మాన్ ద్వారా తెలిసింది సదాశివం తండ్రిగారు పోయి నెల రోజులు దాటిందట.

ఎందుకో చివుక్కుమనిపించింది నాకు.రమణని అడిగి అడ్రెస్స్ తీసుకుని రమ్మని వాచ్ మన్ పురమాయించాను. వాడు అడ్రస్ తెచ్చాడు. కమల రానంది.

ఆ ఆదివారం నేను సదాశివం ఇంటికి వెళ్లాను.

చెప్పులు విడిచి లోపలికి వెళ్ళబోతూ ఆగిపోయాను.

"నన్ను క్షమించు మావయ్యా...నాకు పెద్ద దిక్కుగా ఉంటారనుకున్నానే గాని, తాతగారి మరణానికి పరోక్షంగా నేనే కారణం అవుతానని అనుకోలేదు.మెట్లు ఎక్కి దిగడం వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించి పరిస్తితి చేయిదాటిపోయాకా ఇల్లు మారినా ప్రయోజనం లేకపోయింది. నన్ను నన్ను నమస్పూర్తిగా క్షమించు మావయ్యా..."రమణ బావురుమన్నాడు.

" ఇందులో నీ తప్పేమీ లేదురా..అలా జరగాలని ఉంది.జరిగింది.అంతే. ఆరోగ్యం సగం కుంగ దీస్తే , వాళ్ళు అవమానించిన విధానం తాతగారిని మరీ క్రుంగ దీసింది రా.ఇంటికి వచ్చి గుమ్మంలో నిలబడిన తొంబై సంవత్సరాల పెద్దమనిషిని దోషిని నిలబెట్టినట్టు నిలబెట్టి మాట్లాడిన విధానం తాతగారిఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఎంత చదువు చదివితే ఏం ప్రయోజనం? ఎంత డబ్బు సంపాదిస్తే ఎం లాభంరా? మనిషి అన్న వాడికి మానవత్వం అనే పరిమళం లేకపోయాకా? ఛీ...అతనిదీ ఒక బతుకేనా? అతన్ని కాదు.అతన్ని అల పెంచిన తల్లి తండ్రులననాలి.తాము పడిన కష్టం తమ పిల్లలు పడకూడదని, వాళ్ళు కోరిందల్లా ఇచ్చి పెంచుతారే, ఆ వెధవ తల్లి తండ్రులననాలి . వాళ్ళ పెంపకాన్ని దుయ్యబట్టాలి.

నీకింకో సంగతి చెప్పనా...వాళ్ళ నాన్న ఎవరో కాదు.తాతగారి భూముల్ని కౌలుకు తీసుకుని కుటుంబాన్ని పోషించుకున్నవాడట. చాలా మంచివాడట. కూలివాళ్ళతో సమానం గా పనిచేసేవాడట. 'నీకెందుకయ్యా ...అంత శ్రమ ' అని తాతగారంటే ' భూమితల్లికి చేసిన సేవే నా కుటుంబాన్ని కాపాడుతుంది బాబు. మనిషి పుట్టింది మట్టిలోంచి. కలిసిపోయేది ఆ మట్టి లోనే. ఆ కష్టం తెలిసిన ప్రతీవోడు మానవత్వంతో పరిమళిస్తాడు సామీ.ఆ మానవత్వ పరిమళం లేనివాడు మనిసే కాదు సామీ.' అనేవాడట. అలాంటి తండ్రికి ఇలాంటి వాడు పుట్టడం డబ్బు సంపాదించి గోప్పవాడవడం వాడికి గొప్పేమో గానీ....నా దృష్టిలో అలాంటివాడు గడ్డిపువ్వుతో సమానం. ఆ పరిమళం లేని మనిషి గురించి మనం ఇంకా మాట్లాడుకోవడం మహా పాపం. వదిలేయ్.డబ్బే ఈ ప్రపంచంలో అనీ సమకూర్చుతుంది అనుకుని బతికే అలాంటి వాళ్లకు మాడు పగిలేలా దెబ్బ తగిలిన నాడు గాని మనిషి విలువ తెలీదు. నువ్వు అనవసరమైన ఆలోచనలు మాని హాయిగా ఇంటికి వెళ్ళు. ఇంకొక మాట. అతను. అతని కుటుంబం స్నేహం అనే పదానికి అనర్హులు. నా మాటలు అర్ధమైతే సరే సరి. లేకపోతె నీ ఇష్టం. వెళ్లిరా. "

"అత్తతో చెప్పేసి వెళ్తాను మామయ్యా.." రమణ లేచిన చప్పుడు.

నిలువునా నేల క్రుంగి పోతున్న భావం మనసును మెలిపెట్టి కళ్ళ నీళ్ళు సుడులు తిరిగుతుండగా నిశ్శబ్దంగా వడివడిగా అడుగులు వేసుకుంటూ వెనక్కు తిరిగి ఇంటిదారి పట్టాను నేను.

***

No comments:

Post a Comment

Pages