సుబ్బుమామయ్య కబుర్లు - అచ్చంగా తెలుగు
మాటలు
ప్రతాప వెంకట సుబ్బారాయుడు 


పిల్లలూ, ఎలా ఉన్నారు?
సంవత్సరం చివర్లో ఎంచక్కా పరీక్షలు లేకుండా పై తరగతికి వెళుతున్నారు, పైగా కరోనా వల్ల బోలెడన్ని సెలవులు కదూ!
సరే..ఈసారి మనం మాటల గొప్పదనం తెలుసుకుందాం..
భాష కనుక్కున్నాక మన భావాలు ఎదుటివారికి చెప్పడం సులువైపోయింది. ప్రపంచం ఇంత అభివృద్ధి బాటలో నడవడానికి కారణం ఒక రకంగా భావ ప్రకటన సౌలభ్యమే!
మాటల విషయం వచ్చిందికాబట్టి, మనం కొన్ని విషయాలు ముచ్చటించుకోవాలర్రా!
మాట్లాడ్డం ఒక కళ. ఎదుటివాళ్లకి అర్థమయ్యేలా, విన సొంపుగా మాట్లాడాలి. నోరు దాటితే ఊరు దాటుతుంది అంటారు కదా, ఇది మనం ముందుగా తెలుసుకోవాలి. మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. లేదంటే, కొన్నిసార్లు ప్రమాదం కొనితెచ్చుకున్నట్టే! మౌనం బంగారం అనడం వినే ఉంటారు. అంటే అసలు మాట్లాడ వద్దని కాదు. పొదుపుగా, అవసరామికి తగ్గట్టుగా మాట్లాడమని. దీన్నే ఆచి తూచి మాట్లాడడం అంటారు. మాటలు ఒకరిని నొప్పించకూడదు, మెప్పించాలి. మాట్లాడే విధానంబట్టి మనిషి వ్యక్తిత్వం మీద అంచనా ఏర్పడుతుంది. అబద్ధాలు, ఒకరిమీద పితూరీలు చెప్పడం మంచిది కాదు, ఇవి తర్వాత్తర్వాత తెలిసిపోతే మనకున్న విలువ పోతుంది. స్నేహంలో ఉన్నప్పుడు కొంతమంది తమ రహస్యాలు స్నేహితులతో పంచుకుంటారు. అది వాళ్ళ మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ముచేయకూడదు. ఎవరితో పొరబాట్న కూడా అవతల వాళ్ల విషయాలు చెప్పకూడదు.
యుద్ధాలు నివారించడానికి రాయబారులని పంపుతారు. వాళ్లకి విషయం పై తగిన అవగాహన ఉండడంతో పాటు, మాట్లాడ్డంలో మెళకువలు తెలిసుండాలి. అప్పుడే శత్రుదేశంవాళ్లు శాంతి సందేశానికి సంతుష్టులై యుద్ధ విరమణకు ఒప్పుకుంటారు. 
ఉద్యోగాల్లో మార్కేటింగ్ అని ఒక శాఖ ఉంటుంది. వాళ్లు అమ్మాల్సిన వస్తువును కొనుగోలుదార్లకు మాటల్తో, అందంగా పరిచయం చేస్తారు. ముచ్చటపడి కొనుక్కునేలా చేస్తారు. 
సో మీరందరూ మంచిగా, తియ్యగా, కమ్మగా మాట్లాడి ఎదుటివారిని ఆకట్టుకుంటారు కదూ..
ఉంటానర్రా..
మీ సుబ్బుమామయ్య.

No comments:

Post a Comment

Pages