అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) - 31 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) - 31

Share This
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) -  31
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)


(తండ్రి కోరికపై కనిపించకుండా పోయిన ఫిప్ సాహిత్యాన్ని వెతికి పట్టుకోవాలని నిర్ణయించుకొన్న నాన్సీ ఆగంతకుడెవరో ఆ భవనంలో తిరుగుతున్నాడని గమనించి, తన స్నేహితురాళ్ళ సహాయంతో అతణ్ణి పట్టుకోవటానికి విఫలయత్నం చేస్తుంది. తరువాత అటక మీదకు రహస్య మార్గం ఉందేమోనని వెతుకుతున్న ఆమెతో, కనిపించిన అస్తిపంజరం తమకేదో సైగ జేస్తున్నట్లు బెస్ చెబుతుంది. వెంటనే అస్తిపంజరం ఉన్న బోరువాలో గాలించిన నాన్సీకి కొన్ని ఉత్తరాలతో పాటు పాటలు దొరుకుతాయి. తన స్నేహితురాళ్ళతో జెన్నర్ ఆఫీసుకి వెళ్ళిన ఆమెకు డఈట్ అన్న వ్యక్తి, బెన్ బాంక్స్ పేరుతో చలామణీ అవుతున్నట్లు గ్రహిస్తుంది. ఫిప్ వ్రాసిన పాత ఉత్తరాలను బట్టి ఆమె అటక మీద బీరువా వెనుక ఉన్న రహస్య గదిని కనుక్కొంటుంది. ఆ చీకటి గదిలో కనిపించిన పియానో మీటలన్నీ అదేపనిగా నొక్కిన నాన్సీ పియానోలోంచి ఒక రహస్యపు అర తెరుచుకోవటం, దానిలో రిగ్గిన్ అన్న వ్యక్తి పారవేసుకొన్న కార్డు కనిపించాయి. భోజనాలయ్యాక, ముసలాయన తాను క్రింద ఆగంతకుడి కోసం మాటు వేస్తానని, ఆ అమ్మాయిని అటక మీద విషయం చూడమని చెబుతాడు.  అయితే ఆగంతకుడు రాగానే సంకేతంగా తాను గుడ్లగూబలా అరుస్తానని కూడా పెద్దాయన చెబుతాడు.  పాపను నిద్రపుచ్చాక నాన్సీ వెలిగించిన కొవ్వొత్తితో అటక ఎక్కుతుంది. తరువాత )
@@@@@@@@@@@@

 దాన్ని వెలిగించి పట్టుకొని అటక ఎక్కింది. ఆమె పైకి చేరుకొనే సమయానికి దూరంనుంచి రాగయుక్తంగా మోగుతున్న గడియారం గంటలు వినిపించాయి.

"అర్ధరాత్రి నిశీధి వేళ! అన్నీ సవ్యంగా జరగాలని నేను ఆశపడుతున్నా!" నాన్సీ తనలో నవ్వుకొంది.
ఆమె పియానో డెస్క్ లో తన కొత్త పరిశోధనను ప్రారంభించింది. భరించలేని నిశ్శబ్దం. చీకటిగదిలో ఉక్కపోస్తున్న వాతావరణం ఆమెలో నిరుత్సాహాన్ని రగిలిస్తున్నాయి. దూరంనుంచి వినవచ్చే మొదటిగంట శబ్దానికి ఆమె ఊపిరి వేగాన్ని పుంజుకొంది. రెండవ గంట శబ్దం ఆమెను కలవరపరిచింది.

"ఆ శబ్దం దూరాన్నుంచే వస్తూండవచ్చు"నాన్సీ అనుకొంది. "ఈ శబ్దాల మధ్యలో తాను మార్చ్ సంకేతాన్ని వినలేకపోవచ్చు."

పని చేయటానికి మనస్కరించక ఆమె చాలాసేపు కదలకుండా నిలబడింది. బహుశా పెద్దాయనకు అవసరమైతే, పరుగున మెట్లు దిగి, ఆయన్ని త్వరగా చేరుకోవాలన్న ఆలోచన కూడా ఆమెను పనిలో పడనివ్వటం లేదు.

"ఈ అన్వేషణను త్వరగా ముగించాలి" అని ఆమె నిర్ణయించుకొంది.

మొదట పియానోపై ఒకచోట నొక్కి, ఎడమవైపున మరొకసారి నొక్కింది. సొరుగులాంటిదేమి బయటకు రాలేదు. అటు వైపు పదే పదే ప్రయత్నించినా ఫలితం కనబడలేదు. వెంటనే కుడిచేతి వైపుకు జరిగి ప్రయత్నించింది. ఎట్టకేలకు ఆమె ప్రయత్నాలకు ఫలితం దక్కింది.

లోతులేని పళ్ళెం లాంటిది పియానో డెస్క్ మధ్యనుంచి మెల్లిగా బయటకొచ్చింది. దాని నిండా కాగితాలు ఉన్నాయి.

ఆమె నాడి వేగంగా కొట్టుకోసాగింది. కానీ ఆ ఒత్తిడిని బలవంతంగా అణచుకొందామె. ఆ ట్రేని ఆమె పియానో డెస్క్ కి కొద్దిదూరంలో ఉన్న బల్ల దగ్గరకు మోసుకెళ్ళి, దానిలోంచి పేపరు చుట్టలను, మడత పెట్టిన కాగితాలను బయటకు తీసింది. ఆదరాబాదరాగా వాటినన్నింటిని విప్పి చూసింది. ఆమె ఊహించినట్లుగానే అవి అన్నీ స్వరపరచిన గీతాలు. ప్రతి పాట పైభాగంలో వంకరటింకరగా ఫిలిప్ మార్చ్ జూనియర్ అన్న సంతకం చేయబడి ఉంది.

"ఇంతవరకూ వీటిని ప్రచురించలేదు" నాన్సీ ఉత్సాహంగా అనుకొంది. "ఆ దొంగ వీటిని చూసి ఉండడు."

ఆ పాటలబాణీలను ఒకదాని తరువాత ఒకటిగా కూనిరాగం తీస్తూ, అవి అత్యంత ప్రజాదరణ పొందుతాయని ఆమె ఊహించుకొంది. కళ్ళముందు గుండ్రంగా తిరుగుతున్న ఊహల్లో, రంగుమాసి దెయ్యాలకొంపలా ఉన్న ఆ పురాతన భవనం తన పాత వైభవాన్ని సంతరించుకొని మెరిసిపోతోంది. పాప మంచి విద్యావంతురాలవుతుంది. మిస్టర్ మార్చ్. . .

తన ఊహల్లో పూర్తిగా ములిగిపోయిన ఆమె చీకటిగదిలో తన చుట్టూ జరిగే మార్పులను గ్రహించే స్థితిలో లేదు. ఆమె వెనుకే నేలపై ఉన్న పియానో డెస్క్ చప్పుడు కాకుండా కొంతవరకు పక్కకు జరిగి ఆగింది. ఆ ప్రాంతంలో ఒక సొరంగం ఏర్పడింది. ఆ సొరంగంలోంచి ఒక మనిషి నిశ్శబ్దంగా పైకి లేచాడు. వెంటనే తనలో తను నవ్వుకొన్నాడు.

"ఈమె నాకోసమే వీటిని కనుక్కొంది" అంటూ లాలసగా చూశాడు.

నాన్సీకి తన ప్రతి కదలికను ఒక మనిషి గమనిస్తున్నాడన్న విషయం తెలియదు. ఆమె తను కనిపెట్టిన వ్రాతప్రతులను దొంతరగా పెట్టి చుట్టగా చుట్టింది. తరువాత గోడ తిన్నెపై పెట్టిన కొవ్వొత్తిని అందుకోబోతుండగా, తన వెనుక అలికిడిని గమనించిందామె.

వెంటనే భయంతో ఆ యువ గూఢచారి కొయ్యబారి ఉన్నచోటే స్తంభించిపోయింది. ఆగంతకుడు ఆమె ముందుకు దూకాడు. ఆమె అరిచేలోపునే, ఆ దొంగ తనను ఒడిసిపట్టుకొని ఒకచేత్తో ఆమె నోటిని మూసేశాడు.

"బుషీట్రాట్" అతని లావాటి వేళ్ళ మధ్యనుంచి ఆమె కీచుస్వరం ధ్వనించింది.

"దయచేసి రిగ్గిన్ ట్రాట్ అని పిలు తల్లీ!" అంటూ వెక్కిరింతగా నవ్వాడు. "నువ్వు నన్ను గుర్తుపట్టావని గ్రహించాను. నేను కూడా గుర్తుపట్టాను. ఆ రోజు డైట్ ఫాక్టరీలో నాపై నిఘా వేసింది నువ్వేగా! కానీ ఎక్కడా నీకు నేను దొరకలేదు."

నాన్సీ అతని నుంచి తప్పించుకోవాలని పెనుగులాడింది. అతని చేతిపట్టు ఉక్కుపంజరంలా ఉంది. అతడు జేబులోంచి రుమాలు తీసి దులిపి ఆమె నోట్లో కుక్కాడు. నేర్పుగా జేబులోనుంచి రెండు తాళ్ళను బయటకు తీశాడు.

"అవసరానికి పనికొస్తాయని ఎప్పుడూ వీటిని మోసుకెడుతుంటాను" ముసిముసిగా నవ్వుతూ అన్నాడతను. "తమ పనేదో తాము చూసుకోని వాళ్ళకోసం వీటిని వాడుతాను. మీ యింటికొచ్చిన ముసలాడు మార్చ్ పైకి రాయి విసిరి గాయపరిచింది నేనే! అలాచేస్తే, నువ్వు భయపడి యిక్కడికి రావనుకొన్నాను. కానీ నువ్వు వచ్చినందుకు యిప్పుడు సంతోషిస్తున్నాను."

వెనుకనుంచి పట్టుకొన్న ఆ మనిషి మోకాళ్ళపై నాన్సీ కాలితో బలంగా తన్నింది. అతను బాధతో కొద్దిగా జంకాడు. కానీ తన పట్టును వదల్లేదు.

"కొట్లాటకి దిగుదామా? నేను ఏర్పాటుచేస్తా" వెక్కిరింతగా అన్నాడు.

అతను ముందుగా నాన్సీ చేతులను వెనక్కి విరిచి కట్టాడు. తరువాత యువ గూఢచారిని నేలపై పడదోసి కాళ్ళను దగ్గరకు లాగి కట్టేశాడు. ఆమె తెగువతో పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఆమెను పూర్తిగా తన దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేసుకొని క్రూరంగా నవ్వాడు.

"ఇంతకాలంగా నన్ను కలవరపరిచిన రహస్యాన్ని ఛేదించినందుకు ధన్యవాదాలు. మార్చ్ నాకు దొరకగా మిగిలిన పాటలను ఎక్కడ దాచాడోనని చాలాకాలంగా వెతుకుతున్నాను. ఇన్నాళ్ళకి నువ్వు అందించిన ఈ విలువైన కట్టతో నా ఆందోళన తీరిపోయింది" అన్నాడు.

ఆమెతో జరిగిన పెనుగులాటలో నేలపై పడిపోయిన వ్రాతప్రతులను ఏరి ఒకపక్క చంకలో పెట్టుకొన్నాడు. తరువాత రెండవ చేతిని జేబులోకి పోనిచ్చాడు.

"నిన్నిలా విడిచి వెడుతున్నందుకు విచారిస్తున్నాను" అంటూ క్రూరంగా నవ్వాడతను. "కానీ ఈ చిన్న ప్రాణి యిక్కడ జరిగిన విషయమేదీ నీకు గుర్తుకి రాకుండా సాయపడుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను."

నేలపై మెలికలు తిరుగుతూ గింజుకొంటున్న ఆమెకు అతని మాటల్లోని మర్మం అర్ధం కాలేదు. అతను జేబులోంచి ఒక సీసాను బయటకు తీశాడు.

"ఇది ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావా?" క్రూరంగా ఎగతాళి చేశాడు. "దీన్ని బ్లాక్ విడో అంటారు, నా ప్రియమైన గూఢచారీ! ఓ! భయంతో వణికిపోతున్నావా? అయితే ఇది నీకేమి చేయబోతోందో తెలుసుకోవాల్సిందే!"

బుషీట్రాట్ కళ్ళు ఉన్మాదంతో మెరిశాయి. పియానో డెస్క్ పై ఒక మూల అతను సీసాలోని సాలెపురుగును విడిచిపెట్టాడు. వెంటనే అది నేల దిక్కుగా పాకసాగింది. దాన్ని చూసి అతను సంతృప్తితో చిన్నగా నవ్వాడు.

నాన్సీ సాలీడు వచ్చే మార్గంలో లేకుండా పక్కలకు దొర్లింది. ఒక్కక్షణం ఆమె చూపులు అటక మీదకెళ్ళే మూడు మెట్లను చూశాయి.

"నేను పాకుతూ వెళ్ళి ఆ మెట్లపైకి చేరుకోగలిగితే, దీని బారి నుంచి తప్పించుకోవచ్చు."

"ఆ ముసలాడి నుంచి సాయం ఆందుతుందని కలలు గనకు" అంటున్న ట్రాట్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. "అతను తోటలో గాఢనిద్ర పోతున్నాడు. చాలా చాలాసేపటి వరకు లేవడు."

అతడు తన పనిని నిర్విఘ్నంగా పూర్తిచేసుకొన్నందుకు ముసిముసిగా నవ్వుకొన్నాడు. నాన్సీకి గుండె కొట్టుకోవటం ఆగిపోయినట్లనిపించింది. మార్చ్ కి యితనేమి హాని చేశాడో?

"ఖచ్చితంగా యిప్పుడు యిక్కడికి ఎవరూ వచ్చే ఆస్కారం లేదు" ట్రాట్ చెప్పసాగాడు. "ఆ అటక తలుపు తెరుచుకోకుండా యిటువైపు గడియ పెడతానుగా!"

తాను తప్పించుకోవాలనుకొన్న అటక తలుపు దగ్గరకు అతను వెడుతూంటే ఆమె మనసు కుంగిపోయింది. పెద్దాయనతో కలిసి తను బలవంతంగా తెరిచిన అటక తలుపులను వేగంగా దగ్గరకు మూశాడు. తాము విరక్కొట్టిన పొడవైన అడ్డకర్రను సరిగా సర్ది గడియ పెట్టేశాడు.

పట్టలేని ఆనందంతో ట్రాట్ చుట్టూ చూశాడు. పాకుతున్న సాలెపురుగును సీసాలోకి ఎక్కించి, దాన్ని బలంగా కుదిపాడు.

"ఈ మధ్య సరియైన పనిలేక పిచ్చిముండ నీరసించిపోయింది. దాన్ని కొంచెం హుషారెక్కించాను" అంటూ సాలీడును మళ్ళీ పియానో డెస్క్ పై విడిచిపెట్టాడు. బ్లాక్ విడో డెస్క్ మీద కొంతదూరం పాకి, ఆ సంగీత వాయిద్యపు పసుపురంగు మీటలపైకి జారింది..

"అవసరానికి పనికొస్తుందని ఎప్పుడూ ఒక సాలెపురుగును నాతో పాటు మోసుకెడుతుంటాను" ట్రాట్ వివరించాడు. "సరె! ఓ యువతీ! నీకు శుభరాత్రి" అంటూ నాన్సీకి యికిలిస్తూ చెప్పాడు. "వీడ్కోలు కూడా! శాశ్వతంగా నీకు వీడ్కోలు."

ఆమెకు భయం కలిగేలా కొవ్వొత్తిని చేతిలోకి తీసుకొని వెనుదిరిగి నేల మీద ఉన్న సొరంగం వైపు నడిచాడు.

(తరువాయి భాగం వచ్చే సంచికలో)

No comments:

Post a Comment

Pages