గాన కోకిల-ఎం.ఎల్.వసంతకుమారి - అచ్చంగా తెలుగు

గాన కోకిల-ఎం.ఎల్.వసంతకుమారి

Share This
గాన కోకిల-ఎం.ఎల్.వసంతకుమారి 
శారదాప్రసాద్ 




ఎం.ఎల్.వసంతకుమారి 1950లలో కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని. ఆమె పూర్తి పేరు మద్రాసు లలితాంగి వసంతకుమారి. కర్ణాటక సంగీతంలో ఆవిడకు ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి కు ఉన్నంత పేరుంది. ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి,  డి.కె.పట్టమ్మాళ్ ఆమెకు సమకాలీనులు. 

ప్రముఖ నటి శ్రీవిద్య అమె కూతురు. 1958లో విడుదలైన భూకైలాస్ చిత్రంలో ఆమె పాడిన మున్నీట పవళించు నాగశయనా పాట, తెలుగులోనే కాకుండా ఆమె పాడిన పాటల్లో అత్యుత్తమమైనది.మాయాబజార్ (1957) చిత్రంలో ఆమె పాడిన శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా పాట కూడా బాగా పేరుపొందింది. శ్రీమతి ఎం.ఎల్.వసంతకుమారి కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో గొప్ప విదుషీమణిగానూ అలాగే ప్లేబాక్ సింగర్ గానూ అందరికీ సుపరిచితురాలు. దక్షిణాది గాయినీమణుల్లో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, ఎం.ఎల్.వసంతకుమారి మరియూ డి.కే.పట్టమ్మాళ్ గార్లు "Female Trinity of Carnatic Music " గా పేరుపొందారు. ఆమెది సంగీత నేపథ్యం ఉన్న కుటుబం. ఆమె తండ్రి శ్రీ కుతనూరు అయ్యస్వామి అయ్యర్, తల్లి శ్రీమతి లలితాంగి - వీరిరువురూ కన్నడ భాషలో పురందరదాసు రచించిన కృతుల్ని పాడటంద్వారా, ఆ కృతులకు జనబాహుళ్యంలో విశేష ప్రచారాన్ని కలిగించారు.

 వసంతకుమారి గారిని  చదువుకోసం, మద్రాసులో ఓ కాన్వెంటు స్కూల్ లో చేర్పించిన వారు తమ కూతుర్ని డాక్టర్ని చేద్దామని కలలు కన్నారు. ఎం.ఎల్.వసంత కుమారిలో ఉండే ఒక గొప్ప గాయినిని గుర్తించి, ఆమెకు  కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో తర్ఫీదునిచ్చింది ఆమె గురువు శ్రీ జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం గారు. ఎం.ఎల్. పద్నాలుగేళ్ళ చిరుప్రాయంలోనే బెంగళూరులో ఒక సోలో కచేరి చేశారు. శ్రీమతి యమ్.యస్.సుబ్బులక్ష్మిగారు జనబాహుళ్యంలో అన్నమాచార్య కృతులకు ప్రచారాన్ని కలిగించినట్టుగా ఎం.ఎల్. వసంతకుమారి గారు పురందరదాసు "దేవర నామాలకు" విశేష ప్రచారాన్ని కలిగించారు.

 ఈ మహాగాయినీమణి తమిళంలో పలు చిత్రాలకూ మరియూ తెలుగులో కొన్ని సినిమాల్లో కూడా నేపథ్యగాయినిగా సేవలందించటం, మన సినిమా రంగం చేసుకున్న అదృష్టమనే చెప్పుకోవచ్చు.ఎం.ఎల్.గారు ఎందరో శిష్యులకు శాస్త్రీయ సంగీతంలో శిక్షణనిచ్చి తీర్చిదిద్దారు. ఈ తరం గాయకుల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచిన గాయినీమణి సుధా రఘునాథన్ గారు ఎం.ఎల్ ప్రియ శిష్యురాలు. అలాగే ఎం.ఎల్ గారు తన కూతురు శ్రీవిద్య గారికి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇచ్చినా ఆమె నటనారంగాన్ని ఎన్నుకుని సినిమా నటిగా స్థిరపడ్డారు.పురందరదాసు పదాలకు ప్రాచుర్యాన్ని కలిగించినందుకుగానూ మైసూరు యూనివర్సిటీ ఆమెకు 1976లో గౌరవ డాక్టరేట్ ఇవ్వగా, భారత సర్కారు పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.

సంఖ్యాపరంగా ఎం.ఎల్. తెలుగు సినిమాల్లో పాడిన పాటలు తక్కువే అయినప్పటికీ, కొన్ని పాటలు ఎప్పటికీ మర్చిపోలేనంత మధురంగా పాడారు. భూ కైలాస్ లో "మున్నీట పవళించు నాగశయనా" పాటలో "నరసింహమై వెలసినావు, ప్రహ్లాదు రక్షింప నరసింహమై  వెలసినావు" - అనే పంక్తుల్ని పాడేటప్పుడు ఒక్కసారి గమనించండి - ఆ వాక్యం మొదలుకాగానే ఎం.ఎల్ గొంతు హై పిచ్ లోకి మారుతుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మారిపోతుంది. నరసింహావాతారం రౌద్రావతారం కాబట్టి అలా మార్పు చూపించారన్నమాట. అంటే అప్పట్లో ఇటువంటి చిన్న విషయాల్నీ కూడా ఎంత క్షుణ్ణంగా ఆలోచించి ఆచరణలోకి పెట్టేవారనటానికి ఇదొక నిదర్శనం అనిపిస్తుంది. కాబట్టి అప్పటి పాటలు ఇప్పటికీ అజరామరంగా నిలిచి ఉన్నాయి. ఎం.ఎల్.వసంతకుమారి గారు తెలుగు సినిమాలలో పాడిన కొద్ది పాటల్లోనూ శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న పాటలే ఎక్కువ. ఈమెకు లభించిన సత్కారాలు -1976లో  మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్,1977లో  సంగీత కళానిధి బిరుదు,భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ పురస్కారం ముఖ్యమైనవి.జూలై 3, 1928 న జన్మించిన ఈమె,అక్టోబర్ 31, 1990 న మరణించారు.  

' అప్సరసా అప్సరసా, అందిస్తావా నీ లిప్సురసా' లాంటి పాటలు వినిపిస్తోన్న ఈ కాలంలో ఇటువంటి సంగీత పరమైన పాటల్ని విని మెచ్చుకునేవారున్నారా? అన్నది ప్రశ్న. అయినా ఆమె పాటలు,కీర్తనలు ఏ కొద్దిమందినైనా ఆలరించినట్లైతే ఈ వ్యాసాన్ని రాసినందుకు నేను తీసుకున్న కొద్దిపాటి శ్రమకు ధన్యత చేకూరినట్టేనని భావిస్తాను.

***

No comments:

Post a Comment

Pages