రైలు ప్రయాణం - అచ్చంగా తెలుగు
రైలు ప్రయాణం
అనీల్ జీడిగుంట 

అలవాటు ప్రకారం గంట ముందే రైల్వే స్టేషన్ కి చేరుకున్నాను. చాలా రోజుల తర్వాత రిజర్వేషన్ చేయించుకోకుండా వెళ్తున్నాను. అసలే బాగా రద్దీ గా ఉండే రైలు. సీటు దొరకడం దేవుడెరుగు కనీసం నుంచోడానికి చోటు ఉంటుందో లేదో. ఇలా నా ఆలోచనల మధ్యలోనే రైలు నేను నుంచుని ఉన్న ప్లాట్ఫారం మీదకి వచ్చింది. నేను ఎక్కే స్టేషన్ లో పది నిమిషాలు ఆగుతుంది కాబట్టి తొక్కిసలాటలు ఉన్న మెల్లిగా ఎక్కచ్చు అని అనుకున్నాను. జనరల్ బోగి నేనున్నచోట ఆగలేదు. కనుక కొంచం ముందు కి వెళ్లాల్సి వచ్చింది. సరిగ్గా ఏసీ బోగి పక్కనే ఉంది జనరల్ బోగి.  

ఏసీ భోగి దగ్గర టీసీ నుంచుని ఉన్నాడు. "సర్, ఆన్లైన్ లో రిజర్వేషన్ దొరకలేదు. ఏమైనా సీట్లు ఖాళీగా ఉన్నాయా?". "స్లీపర్ లో అన్ని నిండిపోయాయి. సెకండ్ ఏసీ లో మాత్రమే ఉన్నాయ్" అన్నాడు. మళ్ళీ అతనే అన్నాడు "ఎక్కడి వరకు వెళ్ళాలి"?. "విజయవాడ వరకు వెళ్ళాలి సర్.". "టికెట్ కి  వెయ్యి రూపాయలు అవుతుంది." అన్నాడు. జనరల్ బోగి చూస్తే ఎక్కలేమో అనిపించింది. అలాగే టికెట్ కి వెయ్యి అంటే చాలా ఎక్కువ. నా  పక్కన ఉన్నవ్యక్తి అన్నాడు "సర్, వెయ్యంటే చాల ఎక్కువ. నేను అయితే కష్టమో నష్టమో జనరల్ భోగి ఎక్కుతాను" అన్నాడు.  ఇంక సమయo వృధా చేయడం వల్ల లాభం లేదు, అలాగే అంత డబ్బు పెట్టి ఏసీ ఎక్కే పరిస్థితి లేదు. కష్టమైనా జనరల్ భోగి ఎక్కేసాను. 

బోగి మొత్తం జనాలతో కిక్కిరిసి పోయి ఉంది. కింద పైనా అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ జనాలు కూర్చున్నారు, పడుకుని కూడా ఉన్నారు. చాలా దూరం ప్రయాణించే వాళ్ళు కూడా ఇదే బోగి ఎక్కారేమో అనిపించింది. నుంచున్న చోటే అలాగే కదలకుండా ఉన్నాము. మేము ఎక్కగానే తలుపు దగ్గర ఇద్దరు కూర్చున్నారు. బాత్రూం దగ్గర కూడా కూర్చున్నారు. ఒక్క నిమిషం చాలా బాధ అనిపించింది. ఎప్పుడు సుఖంగా రిజర్వు చేస్కుని వెళ్తుండడం వల్ల ఈ బాధలు ఏమి తెలీలేదు. వచ్చే నిద్ర ఆపుకుంటూ, ఎవరైనా లోపలకి వస్తే జరుగుతూ మళ్ళి వెళ్లి కూర్చుంటూ అలా ఎన్నో మైళ్లు ప్రయాణిస్తూనే ఉంటారు. 

నా ఆలోచనలకు భంగం కలిగినట్టుగా ఒకడు అందరిని దూసుకుని వెళ్ళిపోతున్నాడు. వాడి చేతిలో బ్రష్, పేస్ట్ ఉన్నాయ్. ఒకరు ఎవరో వాడిని ఆపి "ఎక్కడికెళ్తున్నావ్? అక్కడ చూసావా? నుంచోడానికి స్థలం ఉందా? ఇక్కడ ఇంత మంది ఉన్నారు. నువ్వు ఈలోపలే బ్రష్ చేసుకోకపోతే ఏమి నష్టం లేదు వెళ్లి కూర్చో" అని తోసేసాడు. మనసులో బాధగా ఉన్నాను నాకు ఒక్కసారి అది చూసేసరికి నవ్వు వచ్చింది. ఆ బోగి లో పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక సీట్ కి ఇంకో సీట్ కి మధ్యలో ఉన్న స్థలం లో కూడా పక్క లేకుండా పడుకుని, వాళ్ళ సామాను ఎక్కడ ఉందొ మర్చిపోయి, అటు ఇటు వెళ్లే వాళ్ళు కాళ్ళు తొక్కుతూ వెళ్తున్న పట్టించుకోకుండా, అలాగే పడుకునే ఉన్నారు. ఇంతమంది మధ్యలో ఈ అబ్బాయి ఎవడో చాలా పెద్ద ధైర్యం చేసాడు అనే అనిపించింది. 
రైలు లో ఎంతమంది ఉన్నారు అనే దాని మీద నిమ్మితం లేని  రైలు ఇంజిన్ మాత్రం చాలా వేగం తో నడుస్తోంది.  ఇలా ఉండగా తలుపు దగ్గర కూర్చున్న ఇద్దరు నిద్రలో మునిగి తేలుతున్నారు. అదే పని గా తూలడం, మళ్ళి లేవడం ఇలా జరుగుతోంది. "ఏ బాబు, లేండి అక్కడనుంచి, కింద పడతారు", వెనకనుండి ఒక గొంతు వినిపించింది. వాళ్ళు ఇద్దరు ఆయన్ని అసలు పట్టించుకున్నట్టు లేరు. అలాగే కూర్చున్నారు. ఈసారి కొంచం నిద్ర ఆపుకున్నట్టు అనిపించింది.నిజానికి కొంచం నిద్ర తట్టుకోగలిగితే అదే సుఖమైన చోటు. హాయిగా కూర్చోవచ్చు, గాలికి గాలి కూడా వస్తుంది.. మల్లి నా ఆలోచనలకి భంగం. నా కుడి కాళ్ళ దగ్గర ఒకరు వచ్చి కూర్చున్నారు. కూర్చున్నారు అనడం కన్నా నా కాళ్ళు పైకి ఎత్తేసి దౌర్జన్యం గా కూర్చున్నారు అనడం కరెక్ట్. ఆలా ఒంటి కాళ్ళ తపస్సు చేసినట్టు సుమారు పది నిమిషాలు నుంచున్నాను. నా వల్ల కాలేదు. పోనీ "పక్కకి జరగవయ్య బాబు"  అందాము అంటే వాడు నిద్ర లో ఉన్నాడు, ఎవరి మాట అసలు వినేటట్టు లేదు. ఇంకా కనీసం నాలుగు గంటల ప్రయాణం ఉంది. ఇలా వెళ్లడం అయితే ఖచ్చితం గా కుదరదు. ఇందాక నాతో పాటు ఎక్కినా ఆయనతో  "అయితే అయింది వెయ్యి రూపాయలు  కట్టేసి ఆ ఏసీ భోగి లో ఎక్కేసి ఉంటె అయిపోయేది. డబ్బులు గురించి చుస్తే ఇలా వెళ్లడం చాల కష్టం గా ఉంది. పైగా ఇంకో స్టేషన్ రాబోతోంది. అక్కడ ఎంత మంది ఎక్కుతారో తెలీదు" అని అన్నాను. "సర్, అదే వెయ్యి రూపాయలు నాకు విజయవాడ ఉండడానికి సరిపోతుంది. ఇంకా కొంచం సేపు గడిస్తే వెళ్లిపోవచ్చు. నేను చెప్పడం చెప్పాను, ఆ పైన మీ ఇష్టం" అని అన్నాడు. "వీడికి ఏమి తెలుస్తుంది. వీడు కూడా ఒంటి కాళ్ళ మీద నుంచునే పరిస్థితి వస్తే చచ్చినట్టు వస్తాడు" అనుకుంటూ వచ్చే స్టేషన్ కోసం ఎదురు చూస్తున్నాను. 
అనుకుంటుండగానే స్టేషన్ వచ్చింది. దిగేవాళ్ళకన్నా ఎక్కేవాళ్లే ఎక్కువ కనబడ్డారు. అసలు దిగనివ్వకుండా ఎక్కిస్తున్నారు. కాసేపు తర్వాత అర్ధమైంది, నేను ఒక్కడినే అనుకుంటా అక్కడ దిగేది అని. ఎలాగో అలాగే కష్టం మీద దిగాను. పక్కనే ఎసి బోగి ఉండడం వల్ల పెద్ద ముందు కి వెళ్లాల్సిన అవసరం రాలేదు. టీసీ కూడా అక్కడే నుంచుని ఉన్నాడు. "హమ్మయ్య"  అని అనుకుని వెంటనే ఆయన దగ్గరికి వెళ్లి "సర్, నాకుఒక టికెట్ ఇవ్వండి. ఒక స్టేషన్ తర్వాత ఎక్కుతున్నాను కదా ఏమైనా డిస్కౌంట్ ఉందా" అన్నాను. "ఆలా ఉండదండి. వెయ్యి రూపాయలే ఇవ్వాలి" అన్నాడు ఆయన. "తొందరగా ట్రైన్ ఎక్కండి. సీట్ నెంబర్ యాభై నాలుగు. నేను అక్కడికే వచ్చి డబ్బులు తీసుకుని టికెట్ ఇస్తాను" అన్నాడు. అంతే!  వెంటనే లోపలికి వెళ్లి ఆ నెంబర్ సీట్ దగ్గరకి వెళ్లి, అది సైడ్అప్పర్ కావడం వల్ల పైకి ఎక్కేసాను.  హాయిగా దుప్పటి కప్పుకుని టీసీ కోసం ఎదురు చూస్తునా, తెలీకుండానే మెల్లిగా నిద్ర లోకి జారుకున్నాను. ఎసి అంటే అంతే గా మరి. 

హఠాత్తుగా ఎదో అలికిడి అయితే చూసాను. రైలు అప్పుడే ఆగింది. “విజయవాడ స్టేషన్ వెల్కమ్స్ యు” అని అనౌన్స్మెంట్ వస్తోంది. వెంటనే కిందకి దిగాను. ఆ తర్వాత ఆ టీసీ కోసం అంతా వెతికాను. ఆయన ఎక్కడా కనిపించలేదు. ఈలోగా రైలు కూడా స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది. ఎగ్జిట్ వైపు నడుస్తుంటే జనరల్ బోగి లో నాతొ పాటు ఉన్న వ్యక్తి కనబడ్డాడు. "ఏమైనా డబ్బులు ఉంటే ఆ దర్జానే వేరండి. మీరు డబ్బు గురించి ఆలోచించకుండా హాయిగా ఎసి భోగి లో ఎక్కి వచ్చారు. మీరు ఆ స్టేషన్ లో దిగిన తర్వాత, మీరు చేసిన పనే నేను కూడా ఎందుకు చేయలేదు అని ఒక వంద సార్లు అయినా అనుకుని ఉంటాను. మీరు దిగిన స్టేషన్ లో ఒక ముప్పై మంది ఎక్కారు. నన్ను బాత్రూం వైపు కి తోసేశారు. అసలు అక్కడ చోటే లేదు. ఎక్కడో ఒక మూల నుంచున్నాను. ఒక కాళ్ళ మీద ఇంకొక కాళ్ళు పెట్టి. దానికి తోడు బాత్రూం లోంచి వచ్చే వాసన, ఇంక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నరకం చూసాను. నాకు ఒకటి మాత్రం అర్ధమైంది. ఏదైనా చేయాలి అనుకుంటే వెంటనే చేయాలి తప్ప  మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే అవ్వదు " అని అన్నాడు. ఆయన ముఖం లో బాధ కొట్టి నట్లు కనిపిస్తోంది. "నేను అసలు డబ్బులే ఇవ్వలేదండి. టీసీ తర్వాత తీస్కుంటా అని మాయం అయ్యాడు. బహుశా ఎక్కడో ఉండి నా దగ్గరకి వొచ్చేసరికి లేట్ అయ్యి ఉంటుంది, రైలు వెళ్ళిపోయింది" అని  చెపుదాం అనుకున్న. కానీ అసలే బాధలో ఉన్నవాడికి ఈ విషయం కూడా చెప్తే ఇక ఆ రోజు నిద్ర పట్టదు అని నాలో నేనే దాచేస్కున్నాను. పైసా పెట్టకుండా సుఖం గా ప్రయాణం చేశాను అని మనసులో ఆనందం గా ఉన్నా, సహజం గా వచ్చిన నిజాయతి వల్ల మనం రైల్వేస్ వారికి అన్యాయం చేసామేమో అని అనిపించింది.. దానికన్నాఎక్కువగా బాధ పడిన విషయం అయితే  “నేను డబ్బులు పెట్టగలిగాను కాబట్టి ఆ నరకం నుంచి తప్పించుకున్నాను. మరి అలాగే చాలా దూరం ప్రయాణించే వాళ్ళ పరిస్థితి ఏంటి?” అని. పెరుగుతున్న జనాభా తో ఎవరు దీనికి ఒక పరిష్కారం చూపలేరు. ఇక మనం కూడా చేసేది ఏమి ఉంది అంటూ నా వెంట ఒకటే పడ్తున్న ఆటో వాడి ఆటో లో కూర్చున్నాను.  
***

No comments:

Post a Comment

Pages