శివం - 64 - అచ్చంగా తెలుగు
శివం - 64
హరసిద్ధుని కథ 
రాజ కార్తీక్


(హర సిద్ద చెక్కిన శిల్పాల గురించి విశ్లేషణ మొదలయ్యింది. ఆ విగ్రహాల మాటున ఉన్న  కధలు ఏంటో చూద్దాము...)

కుంభన్న "చెప్పు హర సిద్ద, ఏమిటి ఇక్కడ ఒక బాలుడు, దగ్గరే ఇద్దరు తల్లి తండ్రుల విగ్రహాలు ఉన్నాయి? "

(హరసిద్దుడు తెలియకుండానే కుంబన్నతో 'ఓ మాహదేవా!' అంటూ ఇలా‌మాట్లాడసాగాడు)..

''ఓ మాహదేవా....నన్ను మా తాతయ్యా నానమ్మలు అల్లారు ముద్దుగా పెంచారు ... అందుకే  నా తల్లి తండ్రుల స్థానము వారికే ఇచ్చాను. ఇప్పుడు వారు ఇరువురు లేరు. నాకు అసలైన ప్రేమ, ఆదరణ అంటే ఏమిటో చూపింది వారే! జమిందారి బిడ్డ ఐన నేను, చివరికి ఇలాంటి ఒక విపత్కర స్థితిలోకి వచ్చాను. నాకు జన్మను ఇచ్చిన తల్లి తండ్రులు కూడా వారితో సమానమే అని చెప్పటానికే ఆ శిల్పం...' 

కుంభన్న "బాగుందిలే కానీ ..ఏ కళాకారుడు ఐనా అలాగ తన జీవితాన్ని సుక్ష్మంగా తన కళలో భద్ర పరుచుకుంటాడేమోలే ! అంతేలే హర సిద్దా, అంతటి జమిందారి బిడ్డవి, ఇలా రాచరికం పోయిన రాజు లాగా ఐపోయావ్ అన్నమాట..ధనం లేని వాడి మాటలు జనాలకు పొగరు లానే ఉంటాయి హరసిద్ద" 

హర సిద్ద "అవును అన్న ..అప్పటి బుద్ధి ఇప్పటికి బికారి ఐన పోలేదు" అని తన మీద తానే జాలితో, బాధగా ఛలోక్తి  వేసుకున్నాడు. 

కుంభన్న"మరి ఇది ఏమిటి హర సిద్ద, చేతిలో నుండి అన్నీ జారిపడి ఉన్న పూల చెట్లు ,పువ్వుల రెమ్మలు?"

హర సిద్ద "అన్నా, నాకు సరి ఐన సమయంలో నా తల్లి తండ్రులు సరి ఐన సహాయం చేయక పోవటం నా తలరాత అని సరి పెట్టుకున్నా!  అలా నా ఆశలు అన్నీ మొగ్గ నుండి రాలిపడ్డ రేకుల లాగా రాలిపోయాయి. అదీ అన్న ఈ విగ్రహం వెనుక కథ! నా తండ్రి కూడా చనిపోవడం వల్ల నా తల్లి ప్రోద్బలంతో నేను చేసిన పనులు అన్ని విఫలమయ్యాయి. దాని వల్ల వచ్చిన గొడవల వల్ల ఇప్పటికి ఇంట్లో.. ఏదో ఒక గోలేనన్నా "

కుంభన్న"అబ్బ ఎంత సృజనాత్మక హర సిద్ద? ఎంత బాగా చెక్కావ్ ఈ శిల్పం ? అసలు తప్పే లేదు. నువ్వు చెపితే కాని నాకు అర్ధం కాలేదు."

"అవును అన్నా ..మన జీవితంలో ఏదైనా కోల్పోయేటప్పుడు బాగా బాధపడతాము ..కాకపోతే సాధించే సమయంలోనే సరిగ్గా అన్నీ కలిసి రావు, అదీ కర్మ ఏమో అన్న "అని తన గురించి తాను అనుకుంటూ తన బాధను వెల్లడిస్తున్నాడు ..

కుంభన్న"ఏమిటి అయ్యా, ఈ విరిగి పోయిన హృదయ శిల్ప చాతుర్యం?"

హర సిద్ద "అదా అన్నా, అదే మరి నేను ఒక కన్యను వివాహం ఆడ దలిచాను ..కానీ వారు నా ఆర్ధిక స్థితి అంతంత మాత్రం అని నన్ను .."

కు " ఓహో ..బాగుంది ...ఇంకా. ఇంకొక అమ్మాయి దొరక లేదా?"

అదే చెప్తున్న అన్నా ..మరొకరు నాతో స్నేహం నటించి, నాకు అనుకూలంగా నటించి, నన్ను వారి అవసరాలకు బాగా వాడుకొని, తీరుబడిగా తీరికగా నన్ను నిషేధించారు. వారి కుటుంబానికి ఎంత సాయం చేసినా విశ్వాసం లేకుండా ప్రవర్తించారు. వారు చేస్తున్న చేష్టలు 'నీతో పని అయిపోయింది. ఇంక నీతో నాకు పని ఏముంది?' అన్నట్లు చేసిన నటన చూసి, నేను నిదానగా మౌనం వహించాను.

కుంభన్న "ఓహో అదేనా అయితే ఈ శిల్పం గుండె మీద పొడిచిన కత్తి, మరియు జరుగుతున్న  రక్తస్రావం! బాగానే ఉంది నీ సృజనాత్మకత"

కు "అవునయ్యా, ఇదేంటి? కొంతమంది జనమంతా అటువైపు తిరిగి ఉన్నారు. కానీ ఒక్కడు మాత్రం ఇటు వైపు తిరిగి ఉన్నాడు? "

హ సి "అవునన్నా క్షణికావేశంలో నేను చేసిన తప్పుకి ఎంత క్షమాపణ వేడుకున్నా, నా కుటుంబం అంతా నాకు దూరం అయ్యారన్నా! దూరం అవ్వడమే కాకుండా నాకు సహాయం చేసే వారిని కూడా నాతో మాట్లాడకుండా చేశారు. అన్నా తప్పైపోయిందని క్షమాపణ వేడుకున్నా, నిన్ను ఇలానే చేయాలి అని అందరూ దూరమయ్యారన్నా! అందుకే అందరూ ఉండి అనాధ బతుకు బతుకుతున్నా"

కు "పోనీలే హర సిద్ధా! నువ్వు మనస్ఫూర్తిగా నేను తప్పు చేశాను అని తెలుసుకున్నావు కదా! ఇక ఎవరు విన్నా వినకపోయినా, ఆ పరమేశ్వరుని క్షమాపణ కోరుకో ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు. మరొకసారి ఆ తప్పు చేయకు. అంతకుమించి మానవమాత్రుడివి నువ్వు ఏమి చేయగలవు చెప్పు?"

కు "మరి ఇదేం విగ్రహం అయ్యా ?ఎవరో ఒక పెద్దాయన భలే ఉన్నారు. ఈ ఋషి ఎవరో మనిషి గుండె మీద తడుముతున్నారు? కాని నీ తల పని చేయకుండా కొడుతున్నారు? ఖచ్చితంగా ఏదో ఉంటుంది, లేకపోతే ఇంత బాగా చెక్క వు  కదా హహహ"

హా "నీకు తెలియదా కుంభన్నా, నా జీవితంలో నాకు బాగా ఇష్టమైన వారు చనిపోయిన తర్వాత నేను చాలా నిరాశ లో ఉన్నాను. అన్నా, ఆ సమయంలో పరిచయం అయ్యారు నాకు నా గురువు. ఆయన తండ్రి కన్నా ఎక్కువగా భావించారు. కానీ ఆయన మాత్రం నేను ఆవేశంలో తండ్రి అని భావించిన కోపంలో ఆయన అన్న మాటలు మనసులో పెట్టుకుని, నా జీవితాన్ని తనకున్న అండదండలతో ఎక్కి రాకుండా చేసి, మళ్లీ నీ కోసం ఏమైనా చేస్తా అని నా కళ్ళముందే నా మీద కపట ప్రేమ చూపించారు అన్నా! నా తండ్రి కన్నా ఎక్కువ ప్రేమ చూపించినందుకు నాకు సరైన గుణపాఠం నేర్పారు అన్నా"

కు"పోనీలే హర సిద్ద,  ఆయన ఎటువంటి వాడైనా నీవు గురువుగా భావించి సేవ చేశావు కదా! అది ఖచతంగా ఆ పరమేశ్వరుడికి చెందుతుందిలే బాధపడకు."

హా సి "బాధ పడక ఏం చేయమంటావ్ అన్నా? నా జీవితం మీద నాకే అసహ్యంగా ఉంది. జీవితంలో పైకి వస్తానని చేసిన ప్రయత్నం విఫలం అవుతూ ఉంటుంది. ఎవరైనా సహాయం చేస్తారు అనే సరికి ఇలా వెన్నుపోటు పొడుస్తారు. నేను అన్న మాటలు జనాలకి కనబడతాయి కానీ, వారు చేసిన చేష్టలు కనపడవు. అందుకేనేమో నేను మూర్ఖుడినని నా సోదరి లాంటి ఒక సోదరి అనేది. నీ కన్నా తెలివైనవాడు లేడు, నీ కన్నా తిక్కల వాడు లేడు, అని. నిజమేమో తెలివి విషయాల్లో ఏమోగానీ ఒక్క తిక్క విషయంలో మాత్రం ఇది వాస్తవం! ఈ రోజు కూడా ఎవరు ఏమి చెప్పినా నమ్మేస్తానన్నా. ఈ బుద్ధి నాకు ఎప్పుడు పోతుందో?
తప్పు చేసి క్షమించు అన్నా పొరపాటు నన్ను క్షమించు అన్నా ఎవరూ పట్టించుకోవట్లేదు అన్నా. అది ఇటువంటి తప్పు ఒక ధనవంతుడు చేస్తే, నా బంధువులు కానీ నా గురువు గాని, ఒక్క మాట కూడా అనలేదు. ఇలా సమానత్వం లేని తీర్పులకు నాకు ఇంకా కోపం ఎక్కువ అయిపోతుంది అన్నా. అందుకే అందరికీ దూరంగా ఉన్నాను. బతకలేక చావలేక ఏదో గుడ్డివాళ్ళ విగ్రహాలు చూపించుకుంటూ స్వచ్ఛమైన మనసున్న మంచి వాళ్ళతో మాట్లాడి నడుపుకుంటూ ఈ పూట గడిస్తే చాలు అనుకొని బతుకుతున్నా అన్నా. ఆ భగవంతుని కోరుకునేది ఒక్కటే అన్నా! నా ప్రతిభకు సామర్థ్యానికి తగిన ఒక పని కల్పించమని అడుగుతున్నాను. మరి నా మొర విని, ఈ ఒక్క పని చేయమని అడుగుతున్నా, మహాదేవా! "

కు "అవునా అంతా బానే ఉంది కానీ మరి స్నేహితులు ఎవరూ నీకు లేరా? వాళ్ళ వివరాలు ఏమీ లేవు?"

హా"ఇక ఆ విగ్రహాలు కూడా మొదలు పెడితే మీ ఊరే చాలదన్నా!"

కు "ఎవరితో పని లేదు , నేనే నీకు ఒక గొప్ప అవకాశం ఇస్తాను. ఈ అవకాశం నీ జీవితాన్ని మారుస్తుంది .ఏంటి నమ్మవా? ప్రపంచంలో ఎంతోమందిని ఎన్నో సార్లు నమ్మి, ఇలా అయిపోయావూ, ఈ ఒక్కసారి నన్ను నమ్ము."

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages