శ్రీథర మాధురి - 76 - అచ్చంగా తెలుగు

శ్రీథర మాధురి - 76

Share This
శ్రీథర మాధురి -76
(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ చెప్పిన ఒక కథ )


వీధుల్లో తిరుగుతున్న ఒక బాలుడు ఉండేవాడు. ఒక గురువు అతన్ని చూసి 'ఓం నమః శివాయ' అనే మంత్రోపదేశం చేశారు. మొదటి అతను కేవలం దాన్ని పఠించసాగాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతను అందులో ఒక దివ్య లయను కనుగొని, ఆ మంత్రాన్ని అత్యంత శ్రద్ధతో జపించసాగాడు.  ఆ మంత్రం యొక్క దివ్యమైన శబ్దతరంగాల కంపనాలు విశ్వమంతా వ్యాపించసాగాయి. 33 కోట్ల దేవతలూ, భువికి దిగివచ్చి ఆ పిల్లవాడి ముందు కూర్చున్నారు. ఆ మంత్రం కైలాసాన్ని చేరింది. గణాలు, మునులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, బానన్(శివుడి యొక్క ఒక స్వరూపం), భైరవుడు, అందరూ కైలాసాన్ని వదిలి వెళ్లారు. పార్వతి దేవి కూడా ఇక ఆగలేక, శివుడి వంక చూసింది. శివుడు యోగ నిద్రలో ఉన్నాడు. పార్వతి శివుడిని మేల్కొలిపింది. శివుడు ,"నాకు ధ్యానభంగం ఎందుకు చేసావు పార్వతీ? ఏదైనా నిన్ను కలత పెడుతుందా?" అని అడిగాడు. 
పార్వతి ఇలా అంది , "ఓ స్వామీ! ఆ బాలుడు 'ఓం నమఃశ్శివాయ' అనే జపించడం మీకు వినపడలేదా? మీరు భువికి వెళ్లి అతడికి కావాల్సిందేదైనా ఇచ్చేసి, ఆ జపం ఆపించవచ్చు కదా?" 
శివుడు నవ్వి, పార్వతితో ఇలా అన్నాడు, "నేను వెళ్తాను కానీ ఆ తర్వాత నన్ను ఎందుకు వెళ్ళము అని నువ్వు బాధపడతావు."
పార్వతి ఇలా అంది ,"నేను ఏమీ బాధపడను. దయచేసి వెళ్లి అతనికి ఏమి వరం కావాలో ఇవ్వండి."
శివుడు దిగివచ్చాడు. మహావిష్ణువు శివుడితో ఇలా అన్నాడు, " మేమతని తపస్సుకు భంగం కలిగించము. అతను కేవలం నిన్నే పేరు పెట్టి పిలుస్తున్నాడు. నువ్వే అతనిని మేలుకొలుపు."
శివుడు ఆ బాలుడిని మేల్కొల్పాడు. బాలుడు తన ముందున్న పెద్ద సమూహాన్ని చూసి, శివుడిని ఇలా అడిగాడు, " మీరెవరు? వీళ్లంతా ఎవరు?"
శివుడు ఇలా అన్నాడు, "నేను సాక్షాత్తు ఓంకార స్వరూపుడయిన నమశ్శివాయం ను. వారంతా నీ జపాన్ని చూసి ఆకర్షింపబడిన దేవతలు, పితృదేవతలు. నిన్ను చూసేందుకు వచ్చారు. 
 నువ్వు పిలిస్తే నేను వచ్చాను కనుక, నువ్వు ఏదైనా వరం అడగవచ్చు, నేను ఇస్తాను."

బాలుడు ఇలా అన్నాడు ,"ఒక గురువు నాకు ఈ మంత్రాన్ని ఇచ్చారు. ఇది చదివితే నేను ఉత్సాహంగా ఉంటానని చెప్పారు. ఈ మంత్రం యొక్క సౌందర్యంలో నన్ను నేను కోల్పోయాను. మీరేదో వస్తారన్న ఆశతో నేను ఈ మంత్రాన్ని జపించలేదు. ఇక వరం సంగతి వదిలేయండి, నాకు ఏమీ అక్కర్లేదు. నేను ఈ మంత్రంతోనే ఆనందంగా ఉన్నాను. మీరు వెళ్ళవచ్చు."

శివుడు ఇలా అన్నాడు, "నేను నిజమైన శివుడిని నువ్వు నమ్ముతున్నట్టు లేదు. నేను రామోజీ ఫిలిం సిటీ నుంచి ఈ దుస్తులను అద్దెకు తెచ్చుకున్నానని నువ్వు భావిస్తున్నట్లుగా ఉంది. నేను నీకు దీర్ఘదృష్టిని ఇస్తాను. ఇప్పుడు నన్ను చూడు. నేను కైలాసానికి వెళ్ళేదాకా నీవు నన్ను చూడగలవు. నేను కైలాసానికి వెళ్ళాక, నీవు నన్ను ఒక్కసారి పిలువు. నేను వెనక్కి వచ్చి నీకు వరాన్ని ఇస్తాను. రా, నన్ను చూడు. " 

బాలుడు శివుడిని చూశాడు, శివుడు కైలాసానికి తిరిగి వచ్చాడు. పార్వతి భద్రకాళి గా మారిపోయింది ఆమె ఇలా అంది, "స్వామీ! నేను మిమ్మల్ని భువికి వెళ్లి, ఆ బాలుడికి వరమివ్వని వేడుకున్నాను, అతడు తిరస్కరించాడు. ఇది ఇది నాకు అవమానంగా భావిస్తున్నాను. అటువంటి బాలుడు బ్రతికి ఉండకూడదు. నేను అతన్ని నా త్రిశూలంతో సంహరిస్తాను.

శివుడు నవ్వి ఇలా అన్నాడు, "అందుకే నేను వెళ్ళనన్నాను. ప్రశాంతంగా కూర్చో. " నమః శివాయం, నమః శివాయం" అని జపిస్తూ, ఆ బాలుడు శివ స్వరూపుడు అయ్యాడు. నేను భువికి వెళ్లడం వల్ల మనుష్య స్వరూపిని అయ్యాను. ఆ బాలుడు నన్ను చూసి ఉండకపోతే నేను కైలాసానికి తిరిగి వచ్చి ఉండేవాణ్ణి కాదు. అతని దృష్టి వల్లే నేను నీ వద్దకు తిరిగి రాగలిగాను."
  
అందుకే దైవాన్ని కొనియాడండి, దైవం యొక్క స్థాయికి ఎదగండి.
***

No comments:

Post a Comment

Pages