తెలుగుకూటమి విశేషాంశములు. - అచ్చంగా తెలుగు

ది. 23-05-2020, శనివారము నాటి తెలుగుకూటమి విశేషాంశములు.
  శ్రీ బండ్లమూడి పూర్ణానందం.ఎం.ఏ. బి.యిడి.
తెలుగు ఉపాధ్యాయుడు.
చేపలుకు +919440143670
అణుశక్తి కేంద్రీయ విద్యాలయము-హైదరాబాదు-62
ఈ మెయిలు - amruthasiri.amrutha@gmail.com

ది. 23-05-2020 శనివారము రోజున తెలుగువారంతా కలిసి తెలుగుకూటమి ఆధ్వర్యంలో పి.కోదండరామయ్య గారి అధ్యక్షతన సాయంత్రం 7 గంటలకు అంతర్జాలం వేదికగా సమావేశము జరిగినది.ఇది దృశ్యశ్రవణ విధానములో చక్కని క్రమశిక్షణతో సాగినది. తొలుత కోదండరామయ్య గారు సభలో ఉన్నవారందరికి శుభాభినందనలు తెలియజేశారు.అధ్యక్షులవారు సమావేశమునకు వచ్చిన ప్రతి ఒక్కరికి సభలో మాట్లాడే అవకాశాన్ని కలిగించారు.ఈ సభ ఎంతో హుందాగా, గౌరవంగా గంభీరమైన విషయజ్ఞానమును ప్రసాదిస్తూ ముందుకుసాగింది. ప్రస్తుత విషయం, ఉభయరాష్ట్రాలు
మరియు ఇతరప్రాంతాలలోని తెలుగువారు మాతృభాషను అభ్యసించలేక పోతున్న పరిస్థితులు, క్రమక్రమంగా తెలుగు కనుమరుగుఅవుతున్నఈ సమయములో "తెలుగు భాష వికాసము " నకు, మనంతీసుకొనవలసిన చర్యలగురించి చక్కని చర్చజరిగినది.సుమారు 57 మంది సభ్యులు ఈసమావేశములో పాల్గొన్నారు.ఈ వేదికలో ఆశీనులైన భాషాభిమానులు అమెరికా,ఆస్ట్రేలియా, స్వీడను,సింగపూరు, ఆఫ్రికా,లండను,భారతదేశములనుండి పాల్గొన్నారు.గతంలోనల్గొండలో తమపరిపాలనకాలములో నూరుశాతము తెలుగును పరిపాలనభాషగా అమలుచేసిన ఐ.ఏ.ఎస్ ఆఫీసరు ముక్తేశ్వరావుగారు కూడా ఈ సమావేశమునకు విచ్చేసినారు. కోదండరామయ్యగారు సభఉద్దేశమును తెలియజేస్తూ ప్రపంచములోని తెలుగువారంతా,తమతమ ప్రాంతములలో భాషావ్యాప్తికి తోడ్పాటునందించవలసినదిగా కోరినారు.అంతర్జాతీయంగా తెలుగువారంతా అంతర్జాలంలో కలుసుకొని తమభావాలు పంచుకోవటం శుభపరిణామమని శ్రీరహ్మనుద్దీన్ గారు చెప్పారు.సిలికానాంధ్ర సంస్థ నుండి కూచిభొట్ల ఆనంద్ గారు మాట్లాడారు.అమెరికాలో తెలుగుభాష వ్యాప్తి గురించి వివరించారు.డెట్రాయిట్ నుండి ఆరె సీతారామయ్యగారు 'తమప్రాంతములో తెలుగుభాషకు చేస్తున్న సేవ'గూర్చి మాట్లాడారు.శ్రీ సురేష్ కొలిచాల ,యూనికోడుఫాంట్లు తయారీగూర్చి ప్రసంగించారు.ఆఫ్రికానుండి సుధాకర్ గారు,కర్నూలు నుండి శ్రీమతి ఇందిరారెడ్డి మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడనుంచి బుచ్చయ్యచౌదరిగారు మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుభాషపై అనుసరిస్తున్న విధానములు, తీసుకొస్తున్న మార్పులగురించి తమబాధను, ప్రజల బాధను తెలియజేశారు. సింగపూరు నుండి జ్యోతేశ్వరరెడ్డిగారు మాట్లాడుతూ మనభాష, మనసంస్కృతులు తెలిసినవారు పరిపాలకులుగా వస్తే భాషకు మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.తెలుగు వికీపీడియాసభ్యులు కశ్యప్ గారు మాట్లాడారు.చక్కని పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డిగారు తెలుగు శాసనాలు, భాషను కాపాడుకొనవలసిన విషయముల గూర్చి ప్రసంగించారు.నేటి ప్రభుత్వాలు మాతృభాషకు పట్టంగట్టవలసిన ఆవశ్యకతను వివరించారు.కంప్యూటరు ఇంజనీరు మధురెడ్డిగారు ఫ్లోరిడా నుంచి మాట్లాడుతూ తెలుగుభాష వాడుక, ప్రభుత్వము యొక్క అన్నిరంగాలలో కనిపించాలని కోరినారు. సర్వేజనా ఫౌండేషన్ సభ్యులు సన్యాసిరావుగారు భాషావ్యాప్తికి పలుసూచనలు చేశారు. రాంప్రసాద్ గారు తెలుగుభాష వ్యాప్తి ,పిల్లలు నేర్చుకొనే రీతి గురించి, వారి బంధువులు,మిత్రులు, తల్లిదండ్రులు, తోడ్పడవలెనని కోరినారు.మురళిగారు తమప్రాంతములో 14 మందిపిల్లలకు మాతృభాష తెలుగులో అమ్మ,నాన్న, అన్న,అక్క అని పిలుచుకొనేటట్టు చేయగలిగారని చెప్పారు.సభలోని వారంతా చప్పట్లతో తమసంతోషమును తెలియజేశారు.లండన్ వాసి స్వాతిరెడ్డిగారు భాషాభినివేశముతో తెలుగుపై తెలుగులో తీయగా పాటపాడి సభికులను అలరించారు.ఇంకనూ చాలామంది తెలుగు అభిమానులు ఈ కార్యక్రమములో పాలుపంచుకొని తెలుగుతల్లికృపకు పాత్రులైనారు.గత రెండు నెలలుగా కరోనాబాధలో,లాక్ డౌనులోనున్న అంతర్జాతీయ తెలుగుభాషాభిమానులు, అంతర్జాలవేదికగా ఒక్కటై కలిసినారు.రాత్రి 8గం..40 నిముషములకు సభ ముగిసినది. ప్రతినెల రెండుపర్యాయములు అంతర్జాల అంతర్జాతీయ తెలుగుభాషాభిమానుల సమావేశము జరుపవలెనని పెద్దలు అభిప్రాయపడ్డారు.
తెలుగుభాష వ్యాప్తికి కొన్ని సూచనలు--
1.తెలుగు భాష వ్యాప్తికి విద్యార్థుల తల్లిదండ్రుల సహాయసహకారములు చాల అవసరము.
2.తెలుగు భాషాభిమానులు తమ పరిసరప్రాంతములలో భాషపై ఆసక్తికలిగించు కార్యక్రమములు నిర్వహించవలెను.
3.ప్రభుత్వమువారికి మాతృభాష వాడకము గురించి విజ్ఞప్తి పత్రములు,పోస్టుకార్డులద్వారా,ఈమెయిల్ ద్వారా పంపవలెను.( కోదండరామయ్యగారిని సభ్యులకు ప్రభుత్వమువారి
మెయిల్ చిరునామాలు ఇవ్వవలసినదిగా కోరటమైనది.)
4.ప్రతి సంవత్సరము పుట్టినరోజుతోపాటు తెలుగుభాష దినోత్సవము ప్రతి ఇంట్లో జరుపుకొనవలెను.
5.తెలుగు పాఠ్యపుస్తకములలో నాటికల రూపములో భాష గొప్పతనము తెలుపుతూ రచనలుండవలెను. 6.ప్రతినెల భాషకు సేవజేసిన మహానుభావులను స్మరించుకొనే పద్ధతి ఏర్పడవలెను.
7.చిత్రపరిశ్రమలోని మహానుభావులు,తెలుగుభాషాభిమానులు భాష వ్యాప్తి గురించి ఆలోచన చేయవలెను.
8.తల్లి ప్రధమ గురువుగానున్న మనసమాజములో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం మాతృభాష ప్రాధాన్యతగూర్చి ప్రభుత్వానికి విన్నపముల ద్వారా,పలుమార్లు, తమభావాలు తెలియపరచవలెను.
9.తెలుగువారి కళారూపాలు హరికథలు, బుర్రకథలు,ఒగ్గుకథలు,వీథినాటికల ద్వారా భాష చైతన్యము ప్రజలలో కలుగజేయవలెను.( మన జట్టు సభ్యులు ఒకటి, రెండు రచనలు చేసి అందిస్తే మిగిలిన వారికి స్ఫూర్తి కలుగుతుంది.)
10.కళాశాలలలో, విశ్వవిద్యాలయములలో, న్యాయస్థానములలో, ప్రభుత్వపరిపాలనా విభాగములలో కంప్యూటరు శిక్షణ కేంద్రములలో తెలుగుయూనికోడు వాడుక గూర్చి ప్రచారములోనికి తీసుకు రావలయును.సాంకేతికముగా తెలుగువాడకము పెంచాలి.( దీనికోసం ఉచితముగా ఆన్ లైన్ లో శిక్షణనిచ్చే వాలంటీర్లను ఎంపికచేసుకొనవలెను.)
11.మాతృభాష పదములను మాత్రమే వాడుతూ ప్రతి విద్యార్థి 3 నిముషములు మట్లాడగలిగే ప్రతిభను పొందునట్లు పోటీ పెట్టవలెను.(దీనిని గూగుల్ మీట్ ద్వారా నిర్వహించవచ్చు.)
12.భాష విప్లవము తీసుకురాగలిగే రచనలకు, రచయితలకు ప్రోత్సాహమందించాలి.
13.పరభాషా వ్యామోహము పోగొట్టే తెలుగు రచనలకు ప్రోత్సాహము కలిగించాలి.
14.తెలుగులో రెండునిమిషాలలో చెప్పే కథల పోటీలు విద్యార్థులకు (వకృత్వపు) నిర్వహించవలెను.
(దీనిని గూగుల్ మీట్ ద్వారా కూడా నిర్వహించవచ్చు.)
15.గుడి, బడి కేంద్రంగా చేసికొని విద్యార్థులకు కంఠస్ట పద్య పోటీలు నిర్వహించవలెను.
(దీనిని గూగుల్ మీట్ ద్వారా కూడా నిర్వహించవచ్చు.)
అందరికీ మప్పిదాలు.
telugumata@googlegroups.com



No comments:

Post a Comment

Pages