అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) - 32
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)
(తండ్రి కోరికపై కనిపించకుండా పోయిన ఫిప్ సాహిత్యాన్ని వెతికి పట్టుకోవాలని నిర్ణయించుకొన్న నాన్సీ ఆగంతకుడెవరో ఆ భవనంలో తిరుగుతున్నాడని గమనించి, తన స్నేహితురాళ్ళ సహాయంతో అతణ్ణి పట్టుకోవటానికి విఫలయత్నం చేస్తుంది. తరువాత అటక మీదకు రహస్య మార్గం ఉందేమోనని వెతుకుతున్న ఆమెతో, కనిపించిన అస్తిపంజరం తమకేదో సైగ జేస్తున్నట్లు బెస్ చెబుతుంది. వెంటనే అస్తిపంజరం ఉన్న బీరువాలో గాలించిన నాన్సీకి కొన్ని ఉత్తరాలతో పాటు పాటలు దొరుకుతాయి. తన స్నేహితురాళ్ళతో జెన్నర్ ఆఫీసుకి వెళ్ళిన ఆమెకు డైట్ అన్న వ్యక్తి, బెన్ బాంక్స్ పేరుతో చలామణీ అవుతున్నట్లు గ్రహిస్తుంది. ఫిప్ వ్రాసిన పాత ఉత్తరాలను బట్టి ఆమె అటక మీద బీరువా వెనుక ఉన్న రహస్య గదిని కనుక్కొంటుంది. ఆ చీకటి గదిలో కనిపించిన పియానో మీటలన్నీ అదేపనిగా నొక్కిన నాన్సీ పియానోలోంచి ఒక రహస్యపు అర తెరుచుకోవటం, దానిలో రిగ్గిన్ అన్న వ్యక్తి పారవేసుకొన్న కార్డు కనిపించాయి. భోజనాలయ్యాక, ముసలాయన తాను క్రింద ఆగంతకుడి కోసం మాటు వేస్తానని, ఆ అమ్మాయిని అటక మీద విషయం చూడమని, ఆగంతకుడు కనిపిస్తే తాను గుడ్లగూబలా అరిచి సంకేతమిస్తానని చెబుతాడు. పాపను నిద్రపుచ్చాక నాన్సీ వెలిగించిన కొవ్వొత్తితో అటక ఎక్కుతుంది. ఆ చీకటి గదిలో పియానో బటన్లను అదేపనిగా నొక్కిన ఆమె ముందుకు పళ్ళెంలాంటిది వచ్చి, దానిలో ఎన్నో పాటలు ఉన్న కాగితాల చుట్టలు దొరుకుతాయి. వాటిని కనుగొన్న ఆనందంలో ఉన్న ఆమె తన వెనుక ఒక మనిషి ఆకారం భూమిలోని సొరంగం నుంచి పైకి వచ్చినట్లు తెలియదు. ఇన్నాళ్ళూ ఆగంతకుడిలా తిరిగిన బుషీట్రాట్ ఆమెను వెనుకనుంచి పట్టుకొని, ఆమె చేతిలోని పాటల కట్టను లాక్కుంటాడు. ఆమె కాళ్ళూ చేతులను కట్టేసి, తన జేబులోంచి బ్లాక్ విడో సాలీడుని బయటకు తీసి పియానోపై వదులుతాడు. తరువాత ఆ గదికి, అటకకు మధ్య ఉన్న తలుపును మూసి, అడ్డ గడియను పెట్టి, సొరంగం వైపు నడుస్తాడు. తరువాత. . . . )
కొవ్వొత్తిని చేతిలోకి తీసుకొని వెనుదిరిగి నేల మీద ఉన్న సొరంగం వైపు నడిచాడు. నాన్సీ ఊహించినట్లుగానే ఆ సొరంగం గతంలో కూలీలు నివసించిన యిళ్ళ సమూహానికి తీసుకెడుతుంది. ఆమె తనను విడిపించుకోవాలని నిరాశతోనే పెనుగులాడుతోంది.
"ఎందుకొచ్చిన శ్రమ చెప్పు. నువ్వు తప్పించుకోవటం కల్ల" అంటూ ట్రాట్ ఆక్షేపించాడు. "బ్లాక్ విడో నీ దగ్గరకు త్వరగా రాకపోవచ్చు. కానీ ఎప్పటికైనా అది నిన్ను కనుక్కొంటుంది" అంటూ చేతిలోని కొవ్వొత్తిని పియానో డెస్క్ వైపు తిప్పి చూపించాడు.
సాలెపురుగు మెల్లిగా పియానో డెస్క్ కోడు మీద కిందకు దిగుతూండటం నాన్సీ చూసింది. పియానో నుంచి తను ఉన్న ప్రాంతానికి పన్నెండు అడుగులైనా లేదు.
"అందమైన కలలు కంటూ ఉండు. అది నిన్ను కలుసుకొంటుంది" గొణుగుతూ తన చేతిలోని కొవ్వొత్తిని ఊదేస్తాడు. జేబులోంచి తీసిన ఫ్లాష్ లైట్ వెలిగించి సొరంగంలోకి దిగాడు. తాను పూర్తిగా మాయమయ్యే ముందు పియానోడెస్క్ ను ఆ సొరంగం పైకి లాగాడు.
ఆ గది పూర్తిగా అంధకారంతో నిండిపోయింది. బ్లాక్ విడో మెల్లిగా తన సమీపానికి వస్తున్నట్లు నాన్సీ గ్రహించింది. కానీ ప్రాణాంతకమైన దాని కాటును తప్పించుకోవటానికి, తానెటు పక్కకు దొర్లాలో ఆమెకు తట్టటం లేదు. ఆ విషపు సాలీడు ఏ క్షణాన్నయినా తనను కాటు వేయవచ్చని ఆమె గ్రహించింది. అప్పుడే ఆమెకో ఆలోచన వచ్చింది. అది తన పైకి ఎక్కినా, తాను నిశ్చలంగా పడుకొని ఉంటే అదేమి చేయదు. ఈమె వల్ల తనకు ప్రాణహాని లేదని భావించి, సాలెపురుగు తనను కాటు వేయకుండా తన మీదనుంచి దిగి వెళ్ళిపోయే అవకాశం లేకపోలేదు.
బుషీట్రాట్ కిరాతకచర్య వల్ల తనలో పెల్లుబికిన కోపం నాన్సీని పూర్తిగా లొంగదీసుకొంది. 'ఫిప్ మార్చ్ పాటలను అతనే దొంగిలించాడనటానికి తనే ప్రధాన సాక్ష్యం. అంతేకాదు. తన మార్గానికి అడ్డు తగిలే వారిపై ప్రయోగించటానికి ప్రాణాంతకమైన బ్లాక్ విడోలను మోసుకెడుతుంటాడన్న నిజం కూడా తనకు తప్ప మరెవ్వరికీ తెలియదు.
"నేనిక్కడనుంచి ఎలాగైనా బయటపడాలి" నాన్సీ తనలో పదే పదే అనుకొంది. "ఆ రాక్షసుడు తప్పకుండా అరెస్టు కావాలి."
నోట్లో గుడ్డ కుక్కి ఉండటాన నాన్సీ అరవలేదు. కనీసం నోటిపళ్ళతో తనకు కట్టిన తాళ్ళను వదులు కూడా చేసుకోలేదు. అయితే ఆమె చేయగలిగేది ఒకే పని! అది తన కాళ్ళను గాల్లోకి లేపి, బలంగా పాదాలతో నేలపై మోదగలదు. ఆ శబ్దాలు ఎఫీ గదివరకూ చేరుతాయా? ఒకవేళ చేరినా పిరికిదైన పనిపిల్ల అటక మెట్లెక్కి, ఈ గది తలుపులు పగలకొట్టి, ఈ చీకటిగదిలోకి వచ్చే సాహసం చేస్తుందా?
"నేను ఆపదలో ఉన్నానని ఆమెకు అనిపిస్తే తప్పకుండా చేస్తుంది" నాన్సీ నిర్ధారించుకొంది.
వెంటనే ఆమె దొర్లుకొంటూ ప్రధానమైన అటక మెట్ల వద్దకు చేరుకొంది. తరువాత తన పాదాలతో శక్తికొలది ఆ మెట్లపై మోదసాగింది. కొద్ది నిమిషాలు ఎదురుచూసింది కానీ ప్రతిస్పందన పొందలేదు. దానితో ఈ మార్గంలో తనకు రక్షణ లభిస్తుందనే ఆశను వదులుకొంది.
"ఆ పియానో డెస్క్ ను తను పక్కకు జరుపగలిగితే సొరంగమార్గం ద్వారా బయటకు వెళ్ళొచ్చు కదా!" అని మరొక ఆలోచన ఆమెకొచ్చింది. "అక్కడనుండి తను కిందకు వెళ్ళటానికి ఒక మెట్లదారి ఉండాలి."
కానీ కాళ్ళు చేతులు కట్టివేసి ఉన్న తను యీ చిమ్మచీకటిలో సొరంగం పైనుంచి లోపలకు దిగే ప్రయత్నంలో తూలి మెట్లపైన పడితే, తెలియని మార్గంలో కిందకు దొర్లుకొంటూ పోయి విపరీతంగా గాయపడే అవకాశం లేకపోలేదు.
అకస్మాత్తుగా తన పేరుతో ఎవరో పిలుస్తున్నట్లు నాన్సీకి వినిపించింది. ఆ శబ్దం దూరంనుంచి వినిపిస్తోంది. ఆమె గుండె జారిపోయింది. కానీ మరుక్షణం ఆమెలో ఆశను రేకెత్తిస్తూ ఎక్కడినుంచో కంగారుగా పరుగెత్తే పాదాలచప్పుడు వినిపించింది.
"నాన్సీ! నాన్సీ!" పిలుస్తున్న మగగొంతుక వినిపించింది.
"ఓ! నేను కలగనటం లేదనుకొంటాను" తలపోసిందామె.
"నాన్సీ! ఎక్కడున్నావు?" ఈసారి ఆడపిల్ల గొంతు వినిపించింది.
ఇప్పుడు తనను పిలుస్తున్న అనేక గాత్రాల సముదాయం వినిపించింది. మళ్ళీ మళ్ళీ తన పేరునే వాళ్ళు పిలుస్తున్నారు.
ఇప్పుడు ఆమెలో ఎక్కడలేని శక్తి వచ్చింది. వెంటనే తన శక్తినంతా కూడదీసుకొని పాదాలతో నేలపై విరామం లేకుండా మోదసాగింది. మరుక్షణం ఎవరో తన శరీరంతో అటక మీది తలుపును బలంగా ఢీకొట్టినట్లు వినిపించింది. వెంటనే తలుపులకు యిటువైపు పెట్టిన అడ్డగడియ విరిగిపోయి భళ్ళున తెరుచుకొన్నాయి. ఆమె ముఖంపై ఫ్లాష్ లైట్ వెలుతురు పడింది.
"అదృష్టం కొద్దీ నువ్వు క్షేమంగా ఉన్నావు" అన్న మాటలు నాన్సీకి వినిపించాయి. తనకు పట్టిన అదృష్టాన్ని ఆమె నమ్మలేకపోయింది. తల పైకెత్తి చూసిన ఆమెకు తన స్నేహితుడు నెడ్ నికర్సన్ కనిపించాడు.
బెస్, జార్జ్, ఎఫీ అతని వెనుకే గుంపుగా ఆ గదిలోకి వచ్చారు. కానీ నెడ్ అక్కడి పరిస్థితులను పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తీసుకొన్నాడు.
ముందుకు దూకి, నాన్సీ నోట్లో కుక్కిన గుడ్డను బయటకు లాగాడు. జేబులోంచి చాకును తీసి ఆమె చేతులను కట్టిన తాళ్ళను కోసేశాడు. నాన్సీ తన కాళ్ళకున్న తాళ్ళను విప్పుకొంటూంటే నెడ్ సాయపడ్డాడు.
"నాన్సీ! నీకేదైనా అపాయం జరిగి ఉంటే. . . ఇలా ఎవరు చేశారు?" ఆగ్రహంతో అడిగాడతను.
"బుషీ ట్రాట్" బదులిచ్చిందామె. వెంటనే " ఓ! నెడ్. ." అంటూ వణుకుతున్న చేతితో నేలవైపు చూపిందామె.
నెడ్ నిలబడ్డచోటుకి కేవలం రెండడుగుల దూరంలోనే బ్లాక్ విడో ఉంది. దాన్ని చూడగానే ఎఫీ భయంతో కేకపెట్టింది. నెడ్ వేగంగా వెళ్ళి తన బూటుకాలితో ఆ సాలెపురుగును నేలకు నొక్కి నలిపేసాడు. మిగిలినవారంతా ఉపశమనంతో ఊపిరి పీల్చుకొన్నారు.
"మిస్టర్ మార్చ్ ని ఎవరైనా చూశారా?" నాన్సీ కంగారుగా అడిగింది.
మిగిలినవారంతా ఆమెను కలవరపాటుతో చూశారు.
"అతను తన గదిలో నిద్రపోవటం లేదా?" ఎఫీ అడిగింది.
నాన్సీ వారికి బుషీట్రాట్ కుటిలమైన మాటలను చెప్పింది. వెంటనే జార్జ్ అటక మీద మెట్ల దగ్గరకు, అక్కడనుంచి కింద అంతస్తుకి, అటుపిమ్మట యింటి బయట తోటలోకి తుపాకీగుండులా దూసుకొనిపోయింది. బెస్, ఎఫీ ఆమెను అనుసరించారు.
నాన్సీ వాళ్ళ వెనుక వెళ్ళబోతుంటే నెడ్ ఆమె భుజాన్ని పట్టుకొని ఆపాడు.
"నిజంగా నీకేమీ కాలేదుగా?" అతని గొంతులో ఆందోళన తొణికిసలాడింది.
(తరువాయి భాగం వచ్చే సంచికలో)
No comments:
Post a Comment