బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు ధ్వజారోహణం
డా.తాడేపల్లి పతంజలి
ధ్వజావరోహణ ఉత్సవం బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవ నాటి రాత్రి జరుగుతుంది. గరుడకేతనాన్ని ధ్వజస్తంభం మీద నుండి దించుతారు. శ్రీదేవి భూదేవీ సహిత మలయప్పస్వామి సమక్షంలో వేదపండితులు వేదం పారాయణ చేస్తారు. బ్రహ్మాది దేవతలకు, అష్టదిక్పాలురకు వీడ్కోలు చెబుతారు.
ఈ వీడ్కోలు చెప్పు కీర్తన అన్నమయ్య సాహిత్యంలో సుప్రసిద్ధమైనది.
భోగీంద్రులును మీరుబోయి రండు
వేగన మీదటి విభవాలకు ॥పల్లవి॥
1.హరుడ పోయిరా అజుడ నీవును బోయి
తిరిగిరా మీదటి తిరుణాళ్ళకు
సురలు మునులును భూసురులుబోయి రండు
అరవిరి నిన్నాళ్ళు నలసితిరి ॥భోగీం॥
2.జముడ పోయిరా శశియు నీవును బోయి
సుముఖుడవై రా సురలగూడి
గుములై దిక్పతులు దిక్కులకుబోయి రండు
ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి ॥భోగీం॥
3.నారద సనకసనందనాదులు
భూరి విభవములబోయిరండు
దూరముగాబోకిట్టే తొరలి వేంకటగిరిఁ
జేరి నన్నిట్లనే సేవించుడీ ॥భోగీం॥ (రేకు: 70-5 సం.1-368)
తాత్పర్యము
వేంకటేశుని వీడ్కోలు వచనాలను అన్నమయ్య ఈ కీర్తనలో మనకు చెబుతున్నాడు.
ఇక్కడ భోగీంద్రులారా ! ( ఓఆదిశేషుడు, వాసుకి మొదలయినవారా !) మీరు వెళ్లిరండి. మళ్లీ వచ్చే బ్రహ్మోత్సవాలకు తప్పకుండా త్వరగా (= వేగన) రండి.
విశేషాలు
మీరు అంటే . హంస, సింహ, ముత్యపుపందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, గరుడ, హనుమంత, సూర్యప్రభ, చంద్రప్రభ, రథ వాహనాలారా ! అని కూడా అర్థం వస్తుంది. మీరంతా కూడా వెళ్లిరండి.
తొమ్మిది రోజులపాటు తిరుమల మాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేతంగా- ఉభయ నాంచారులతో బ్రహ్మోత్సవాలలో తన విహారానికి సహకరించిన వాహనాలకు స్వామి వారు మొదటగా వీడ్కోలు చెబుతున్నారు .అంటే తన సేవ చేసిన వారిని స్వామి అదరిస్తాడని కవి ప్రబోధం.
1 వ చరణం:
ఓ శివుడా ! పోయిరా ఓ బ్రహ్మా ! నీవును పోయి మళ్లీ వచ్చే తిరునాళ్లకు తిరిగిరా !
దేవతలారా ! మునులారా ! భూసురులారా ! పోయి రండు.మీరంతా ఎంతో సగము విరిసిన మొగ్గలా ఈ బ్రహ్మోత్సవాలలో ఎంతో అలసిపోయారు, ఇక మీరు కూడా వీడుకోలు తీసుకోండి.
2వ చరణం:
ఓ యముడా ! పోయిరా ఓ చంద్రుడా ! నీవును ప్రసన్నుడవై మరలా దేవతలతో కలిసి వచ్చే బ్రహ్మోత్సవాలకు రా ! ఇప్పటికి వీడ్కోలు. ఓ అష్ట దిక్పాలకులారా ! మీరందరూ నా మీద భక్తితో సమూహాలుగా వచ్చారు. సంతోషంతో ఇన్నాళ్ళు ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని అలసిపోయారు. ఇక మీ మీ దిక్కులకు పోయి మళ్లీ వచ్చే బ్రహ్మోత్సవాలకు తప్పకుండా రండి.
విశేషాలు
అష్టదిక్పాలకులు
(దిక్కుల పేర్లు, దిక్పతుల పేర్లు, నగరాలు, భార్యలు, వాహనాలు వరుసగా చదువుకోవాలి)
1. తూర్పు- ఇంద్రుడు (అమరావతి - శచీదేవి - ఐరావతం)
2. పూర్వదక్షిణము -అగ్ని (తేజోవతి - స్వాహాదేవి - తగరు)
3. దక్షిణము -యముడు (సంయమిని - శ్యామలాదేవి - మహిషం)
4. దక్షిణపశ్చిమము -నిరృతి (కృష్ణాంజన- దీర్ఘాదేవి - నరుడు)
5. పడమర -వరుణుడు (శ్రద్ధావతి - కాళికాదేవి - మొసలి)
6. పశ్చిమోత్తరము -వాయువు (గంధవతి - అంజనాదేవి - లేడి)
7. ఉత్తరము -కుబేరుడు (అలక - చిత్రలేఖ- గుర్రం)
8. పూర్వోత్తరము- ఈశానుడు (యశోవతి - పార్వతీ దేవి- వృషభం)
03 వ చరణం:
ఓ నారద సనకసనందనాదులారా ! అధిక శాంతి వైభోగాలతో వెళ్ళిరండి.మళ్లీ ఏడాదికి వస్తాయని తిరుమలను విడిచి మరీ దూరంగా వెళ్లిపోకండి. నాకు దగ్గరగా, అందుబాటులో ఉంటూ నన్ను ఎప్పట్లానే సేవించండి
విశేషాలు
భోగీంద్రులతో మొదలుపెట్టిన కీర్తన సేవతో ముగిసింది. లోకంలో భోగులు ( ఐశ్వర్య సుఖాలు అనుభవించేవారు) ఐశ్వర్య దుష్ఫలితం తలకెత్తకుండా తప్పకుండా
వేంకటేశ్వర పద సేవ చేయాలని అన్నమయ్య లౌకిక సందేశం. స్వస్తి.
***
No comments:
Post a Comment