జీవిత భాగ స్వామిని కోల్పోతే ?
అంబడిపూడి శ్యామసుందర రావు
భూమి మీదకు వచ్చేది ఒక్కళ్ళమే, వెళ్ళేది ఒక్కళ్ళమే! కానీ భూమి మీదకు వచ్చినాక అనేక భంధాలు ఏర్పడతాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు, బంధువులు ఇలా ఎంతమందితోనే బంధాలను ఏర్పరచుకుంటాము. కానీ వీటిలో భార్యాభర్తల బంధము చాలా గొప్పది, ప్రత్యేకమైనది .పెళ్లినాటి ప్రమాణాలలో జీవితాంతము కలిసి ఉంటామని చెప్పుకున్న వాళ్ళను కూడా, ఏదో ఒకరోజు మరణము వారిని వేరు చేస్తుంది.
ముందు ఒంటరిగా జీవించటం అలవాటు ఉన్నా, ఆ తరువాత
భాగస్వామినీ కోల్పోయినాక ఒంటరి జీవితము గడపటం లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులు కూడా ఆడవారికి వేరు, మగవారికి వేరుగా ఉంటాయి. ఈ ఇబ్బందులు లేదా సమస్యలు ఆర్ధికపరమైనవి, సాంఘికపరమైనవి. వీటిని అధిగమించుకుంటూ జీవించడం, జీవిత భాగస్వామిని కోల్పోయిన వ్యక్తికి కత్తి మీద సాము లాంటిది. ఆ భాధలు అనుభవించే వాళ్లకే తెలుస్తాయి. సమాజములో భర్తను కోల్పోయిన ఆడవారు, భార్యను కోల్పోయిన మగవారు చాలా మంది ఉంటారు. ఈ వ్యాసము ద్వారా అటువంటి వారి సాధక బాధలను, మానసిక స్థితిని, సామాజికంగా వారు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకొనే ప్రయత్నము చేద్దాము.
చాలా ఏళ్ల క్రితము మా అమ్మ చనిపోయినప్పుడు నేను, మిగిలిన కుటుంబ సభ్యులు, ఇతర చుట్టాలు చాలా బాధపడ్డారు. కానీ ఎవరుకూడా మా అమ్మ మరణము మా నాన్నగారి మీద ఎలాంటి ప్రభావము చూపుతుందో అస్సలు ఆలోచించలేదు. ఆ తరువాత నా స్వానుభవం, అంటే, మా ఆవిడ గతించినప్పుడు మానాన్న గారు ఎలా భాధపడ్డారో నాకు అర్ధము అయింది. ఎవరైనా కూడా ఇటువంటి సంఘటనను ఎదుర్కోవటానికి పూర్తిగా సంసిద్దులై
ఉండరు కాబట్టి, ఇది ఒక పెద్ద ఊహించని పరిణామము. సరే జరగ రానిది, ఊహించనిది జరిగింది. పోయిన వాళ్లతో మిగిలిన వాళ్ళు పోవాలన్న పోలేరు. ఎంతవరకు ఈ భూమి మీద నూకలు ఉన్నాయో అంతవరకూ బ్రతుకు వెళ్లదీయాల్సిందే!
జీవిత భాగస్వామిని కోల్పోయినాక ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వారి దుఃఖాన్ని వెలిబుచ్చుతుంటారు. దీనికి ప్రత్యేకమైన విధానాలు అంటూ ఏమి ఉండవు. జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడు వారు మానసికముగా భౌతికముగా అనేక ఇబ్బందులు పడుతుంటారు. అంటే నిద్ర పట్టకపోవటం, ఆహార పానీయాలపై శ్రద్ద తగ్గటం, వేటిపైనా శ్రద్ద లేకపోవటం, నిర్ణయాలను సరిగా తీసుకోలేకపోవటం, మొదలైనవి. కానీ తప్పదు కాబట్టి మామూలు జీవనానికి రావటానికి ప్రయత్నిస్తారు.
ఇందులోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ విషయములో కుటుంబ సభ్యుల , మిత్రుల సహకారము అవసరము. చాలా మందికి ఈ విషయములో సహకారము తక్కువగా లభిస్తుంది. కాలక్రమేణా కాలము ఈ గాయాలను మాన్పుతుంది. అదీగాక కొత్త జీవితానికి అంటే ఒంటరి జీవితానికి కొద్దికొద్దిగా అలవాటు పడతారు.
కొంతమందిలో మటుకు ఈ ఎడబాటు లేదా జీవితభాగ స్వామిని కోల్పోవటాన్ని మరచిపోలేరు, మామూలు స్థితికి రాలేరు. ఈ పరిస్థితిలో వాళ్ళు డిప్రషన్ కి లోనవవుతారు. వారు దైనందిన కార్యక్రమాలను కూడా సరిగా నిర్వహించలేరు. ఈ పరిస్థితిలో వైద్యుడు లేదా ఆప్తమిత్రులు లేదా కుటుంబములోని సభ్యులతో బాధను పంచుకొని మామూలు జీవనానికి అలవాటు పడాలి.
ఈ దుఃఖము కూడా ఆడవారిలో మగవారిలో వేరు వేరు గాఉంటుంది. ఎందుకంటే ఇద్దరూ ఉన్నప్పుడు భార్య ఇంటి పనులను చూస్తూ ఉంటే, భర్త బయటి వ్యవహారాలు చూస్తూ ఉంటాడు. భార్య పొతే భర్తకు ఇంటి వ్యవహారాలు ఏమి తెలియక ఇబ్బంది పడతాడు. భర్త పోతే భార్య బయటి వ్యవహారాలు ఏమి తెలియక ఇబ్బంది పడుతుంది. అందువల్ల
భార్య భర్తలలో ఎవరో ఒకరు పోయినాక రెండవ వాళ్లకు ఆయోమయముగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ధైర్యము తెచ్చుకొని, పరిస్థితులను అవగాహన చేసుకొని జీవనము సాగించాలి. ఒంటరిగా జీవించవలసినప్పుడు భద్రత కూడా ఆలోచించవలసిన విషయము కాబట్టి, ఒంటరిగా జీవించ వలసి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోవలసిన విషయాలు కొన్ని:
1. మీ గురించి మీరు శ్రద్ద వహించండి :-బాధపడుతూ ఉంటె అది ఆరోగ్యము పై ప్రభావము చూపుతుంది. కొంతమంది ఈ బాధను మరచిపోవటానికి మద్యపానానికి అలవాటుపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు కాబట్టి వీటికి దూరముగా ఉండి వేళకు భోజనము చేస్తూ, కొద్దిపాటి వ్యాయామము చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
పూర్వము ఇద్దరూ ఉన్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర కబుర్లు చెప్పుకుంటూ భోజనము చేసేవారు. ప్రస్తుతము ఒక్కళ్ళే కాబట్టి ఆ లోటును భర్తీ చేయటానికి టివి చూస్తూ భోజనము చేయవచ్చు.
2. వీలైనంత వరకు ఒంటరిగా బాధపడుతూ కూర్చోకుండా స్నేహితులతో బంధు మిత్రులతో కాలము గడపటానికి ప్రయత్నించండి ఆ విధముగా భాధను మరచిపోవచ్చు. అలాగే ఈ విధముగా బాధపడేవాళ్ళతో మన బాధలను పంచుకోవాలి. వాళ్ళు వారి బాధలను ఎలా అధిగమించారో తెలుసుకోవాలి.
3. ధార్మిక లేదా వేదాంత ప్రసంగాలను వింటూ ఉండాలి ఎక్కువ సమయము ఆలయాల సందర్శన, పుణ్య క్షేత్రాల సందర్శన లతో కాలము గడపాలి. ఇటువంటి చర్యలు మనస్సుకు ఉపశమనాన్ని కలుగజేస్తాయి.
4. సంగీతము పట్ల అభిమానాన్నిపెంచుకొని ఇష్టమైన సంగీతాన్ని వినటానికి శ్రద్ద చూపాలి. అదేవిధముగా సాహిత్యము ఆసక్తి పెంచుకొని గ్రంథపఠనమును అలవాటు చేసుకోవాలి.
5. ఒక్కసారిగా మీ జీవన విధానములో భారీ మార్పులు చేయకండి. వీటివల్ల మంచికన్నా చెడు ఎక్కవ జరుగుతుంది. అందువల్ల ఏదైనా కొత్త అలవాటు లేదా మార్పు విషయములో అలోచించి నెమ్మదిగా అలవాటు చేసుకోండి.
6 ఆరోగ్య సమస్యలను అశ్రద్ధ చేయకండా డాక్టర్లను సంప్రదిస్తూ ఉండండి. ఒంటరిగా ఉన్నా, జంటగాఉన్న ఆరోగ్యము చాలా ముఖ్యము.
7. మీతో పాటు మీ పిల్లలు కుడా భాధ పడుతున్నారు అన్న విషయము గమనించి వారికి ధైర్యాన్ని కలుగజేయండి. కుటుంబములోని ఒక వ్యక్తి చనిపోతే ఆ ప్రభావము మిగిలిన కుటుంబసభ్యుల మీద ఎంతో కొంత ఉంటుంది. మీరు ఒక్కరే కాదు బాధ పడేది. ఎటొచ్చి ఈ బాధ ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ కావచ్చు.
8. ఏది ఏమైనా కాలము ఎటువంటి గాయాలనయినా మాన్పుతుంది అన్నది సత్యము. ఈ విషయములో కూడా అది నిజము. ఏ విధముగానైనా ఈ బాధను మరచిపోలేము.
ఒంటరి జీవితమూ కష్టము అనుకునేవాళ్లు అదేవిధముగా బాధపడే వ్యక్తితో జీవితమూ పంచు కోవచ్చు. మళ్లా కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చుకానీ ఇటువంటి నిర్ణయము తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయము తీసుకోవాలి. రాబోయే సమస్యలను ధైర్యముగా ఎదుర్కోవాలి. ఆశావహ దృక్పధంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండే ప్రయత్నం చెయ్యాలి.
***
No comments:
Post a Comment