జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 32 - అచ్చంగా తెలుగు
జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 32
చెన్నూరి సుదర్శన్

(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్  తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతాడు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.) 

నేను నీరసపడి పోయాను. అన్నం సహించలేదు. వెంటనే  పూర్తయినట్లు చెయ్యి కడుక్కున్నాను. కర్చీఫ్‍తో మూతి తుడ్చుకుంటూ అలాగే ముఖాన్ని కప్పేసుకున్నాను..కన్నీరాగడం లేదు. 
ఇందువదన నేను కలిసి స్టాఫ్ రూంలో టీ కాసే దృశ్యాలు నా కళ్ళల్లో కదలాడుతున్నాయి. కన్నీళ్లను ఆపే శక్తి లేకుండా పోయింది.. 
బాస్కర్, బాలరాజు నన్ను అపార్థం చేసుకుంటారేమోనని జాగ్రత్త పడ్డాను.
ఇది ముమ్మాటికీ ఆ ముసల్ది చేసిన హత్యే.. పాతకి.. అని నామనసు ఘోషించింది,
దాదాపు వారం రోజుల వరకు నా మనసు అధీనంలో లేదు. ఇందువదన తన  చేజేతులా చేసుకున్న 
తప్పిదం.
ఈ రోజుల్లో గూడా  ఇలాంటి సత్తెకాలపు సత్తెమ్మలున్నారంటే  నమ్మశక్యమా..? కాని ఇది నిజం. ముమ్మాటికీ నిజం.
***
2002-2003 రెండు అకడమిక్ సంవత్సరాల మధ్య కాలంలో మెదక్ జిల్లాలోని బుధేర కాలేజీలో పనిచేసాను.. 
అక్కడ ఏసమస్యలూ ఎదుర్కోలేదు.. చాలా ప్రశాంతంగా గడిచింది.. నాకు నచ్చిన కాలేజీ అది.. 
చూస్తూండగానే రెండేళ్ళు రెండు నెలల్లా గడిచి పోయాయి.. కాని ఆతరువాత కాలేజీ మరిన్ని చేదు అనుభవాలను రుచి చూపించింది..    
2004 లో బుధేర నుండి కవలంపేట జూనియర్ కాలేజీకి బదిలీ అయ్యాను.
ఇది కాస్తా పెద్ద కాలేజీ. ఇందులో ఉర్దూ మీడియం కూడా ఉంది. స్టాఫ్  ముప్పై మంది  దాకా ఉంటారు. 
  అందులో ముఖ్యంగా మునిపల్లిలో నా కొలీగ్ ఫిజిక్స్ లెక్చరర్ భూమయ్య ఉండటం.. నాకు ఎక్కడలేని సంతోషం కలిగింది. మళ్ళీ అతడి జోక్స్ వినవచ్చు.. మంచి టైంపాస్..
మిగతా లేక్చారర్లంతా దాదాపు అంతా నాకు తెలిసిన వాళ్ళే..  అందులో కామర్స్  లెక్చరర్ కాంతయ్య  గురించి కథలు, కథలుగా చెప్పుకునే వాళ్లు క్యాంపులో. 
అది అతడి పర్సనల్ విషయం మనకెందుకులే అనుకునే వాణ్ణి. కాని పర్సనల్ విషయాలు విద్యార్థులకు తెలిస్తే ఆ పర్సన్ చెప్పే  పాఠాలు వారి తలకెక్కించుకోరు.. పెద్ద చెప్పొచ్చాడులే నీతులు.. అని అతడి గురించి వ్యతి రేకంగా ఆలోచించుకుంటారు. 
ఒక మనిషి నీతివంతుడైతేనే నీతులు బోధించడానికి అర్హుడు. సంఘంలో అతడికి గౌరవం దక్కుతుంది..
కాని నేటి సమాజంలో కొందరు రాజకీయ నాయకులు  అవినీతిపరులై .. అవినీతిని పారద్రోలండని పిలుపునిస్తున్నారు. 
కొందరు రచయితలు సైతం అభ్యుదయ భావాలతో రచనలు చేస్తారు.. కాని వారిలో అభ్యదయ భావం ఇసుమంతైనా కనబడదు. 
సంఘంలో ఉపాధ్యాయవృత్తి అతిపవిత్రమైనది. ఆ వృత్తి పవిత్రతను కాపాడాలంటే అందులో పనిచేసే వారంతా  ఆడర్శవంతులై మెలగాలి. వారి పాఠాలు  కేవలం తరగతి గదులకు మాత్రమే పరిమితి గాకుండా సంఘ శ్రేయస్సుకు దోహదపడాలి. 
మనం విద్యార్థులకు చదువు చెబ్తుంటే.. విద్యార్థులు మనల్ని చదువుతారని తెలుసుకోలేని కాంతయ్య కష్టాలు కొనితెచ్చుకున్నాడు.
స్టాఫ్ ఒకరకంగా అతన్ని ఎకాకిని చేసిందనడంలో ఏమాత్రమూ సంశయం లేదు. 
అయినా కాంతయ్య ముఖంలో ఆవగిజంతైనా అవమానపు ఛాయలు కనబడేవి కావు. ‘స్థిత ప్రజ్ఞుడు’ అనే పదముత్పాదక మూలం అతడేనేమో..! అనే అనుమానం కలుగక మానదు.
ఇది పూర్తిగా అతడి స్వవిషయం.. కాలేజీకి ఎటువంటి సంబధమూ లేదు.. అయినా పరోక్షంగా కాలేజీ పరిపాలనా యంత్రాంగంపై ప్రభావం పడుతోందని నేను జాయినైన పది రోజుల్లోనే గమనించాను. 
కాంతయ్య కాపురం  కథలన్నీ కాలేజీ హరి కథలు.. బుర్రకథలై.. పాడుతుంటే పాఠాలు వినడం మానేసి పారిపోయే వారు విద్యార్థులు. 
ఒక రోజు సాయంత్రం నాలుగు కావస్తోంది. నాక్లాసులు పూర్తయ్యాయి. మరో గంటయితే గాని కాలేజీ నుండి విముక్తి లభించదు. టీ తాగుదామనిపించింది. నేనొక్కడినే వెళ్లి తాగడం నాకు మనస్కరించదు. నా కంప్యూటర్ గదినుండి స్టాఫ్ రూంకు వెళ్ళేసరికి ఎదురుగా భూమయ్య లెక్చరర్ కనిపించాడు. 
“హలో.. బహుతిక్కశాస్త్రం బోధించే ఏ.భూమయ్య సార్ రండి.. టీ తాగొద్దాం..” అంటూ సరదాగా  పిలిచాను. మునిపల్లిలో నేనాతడి  రూమ్మేట్ ని. ‘పెద్దలకు మాత్రమే’ జోక్స్ చెప్పడంలో డాక్టరేట్ పట్టాకు అర్హుడు.     
“ఉష్..మెల్లిగా పిలవండి సార్.. మనం వెళ్ళేది టీ కోసం.. కుర్చీలకు చెవులుంటాయి. అవి విని కాంతయ్య సార్ చెవి కొరికాయంటే.. మన వెంట నీడలా రాగలడు” అంటూ చిరునవ్వుతో బయలుదేరాడు. 
“స్టాఫ్ ఎవరూ లేరేంటి?”
“క్లాసులు అయిపోగానే వెళ్ళిపోవడం ఈ కాలేజీలో ఆనవాయితీ”
“అదేంటి.. కాలేజీ ఫైవ్ థర్టీ వరకు కదా..”
(సశేషం)

No comments:

Post a Comment

Pages