శ్రీథర మాధురి -77
(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు )
చాలా ఏళ్ళ క్రితం, టిబెట్ లో ఒక గొప్ప యోగిని కలిసే అవకాశం నాకు దక్కింది. నాతో మరో ఇద్దరు ఉన్నారు, ఆయనతో ఆయన బృందం ఉంది. మేమిద్దరం ఒకరికొకరం అభిముఖంగా కూర్చున్నాము. ఒక గంట పాటు కలిసి, ధ్యానం చేసాము. చివరికి, ఇద్దరం పగలబడి నవ్వుకుని, ఒకరినొకరం హత్తుకున్నాము. మళ్ళీ నవ్వుకుంటూ, ఆ ప్రదేశాన్ని వదిలి, వెళ్ళిపోయాము.
నాతో ఉన్న ఒక వ్యక్తి ఇలా అడిగాడు,”మీరిద్దరూ ధ్యానం చేసారు, అది నాకు అర్ధమయ్యింది, కాని ఇద్దరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు, తర్వాత హత్తుకున్నారు, మళ్ళీ పెద్దగా నవ్వసాగారు. ఎందుకని?”
నేను – మేమిద్దరం ధ్యానం చేసామని నీకెలా తెలిసింది?
అతను – మీరిద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు, కళ్ళు మూసుకుని కదలకుండా ఒక గంట పాటు అలాగే ఉన్నారు.
నేను – కాబట్టి, నీ అంచనా ప్రకారం, మేము కూర్చుంటే, కళ్ళు మూసుకుంటే, కదలకుండా గంటపాటు అలాగే ఉంటే దాన్ని ధ్యానం అంటారా?
అతను – అందరూ అలాగే అంటారు.
నేను – కాబట్టి, నువ్వు ఇతరులు చెప్పిన దానికి అనుగుణంగా ఒక అవగాహనకు వస్తావా? దాన్ని నువ్వు అర్ధం చేసుకోవడం అంటావా? నీ అవగాహన ఇతరులు చెప్పిన మాటలపై ఆధారపడి ఉంటుంది కాని, నీ స్వంత అనుభూతిపై ఉండదా? ఇతరుల శరీర భాషపై ఆధారంగా నువ్వన్నీ నిర్ణయించేసుకుంటావా?
అతను – ఓకే గురూజీ, కనీసం మీరు ఎందుకు నవ్వారో నాకు చెప్పండి?
నేను – గతంలో మా తెలివితక్కువ పనులను తల్చుకుని మేము నవ్వుకున్నాము.
అతను – కాని, రెండుసార్లు ఎందుకు?
నేను – రెండోసారి నేనెందుకు నవ్వానంటే, నువ్విలా మూర్ఖపు ప్రశ్నలు అడుగుతావని నాకు తెలుసుగనుక ! ఆయన వెంట ఉన్నవారు కూడా ఇటువంటి తెలివిమాలిన ప్రశ్నలే అడుగుతారు కనుక, ఆయనా నవ్వారు. కాబట్టి, మొదట మేము మా గతకాలపు మూర్ఖపు నడవడిని తల్చుకుని నవ్వుకున్నాము, రెండోసారి గురువులను ప్రశ్నించడం ద్వారా మా శిష్యులు చెయ్యబోయే మూర్ఖపు పనుల గురించి నవ్వుకున్నాము.
దైవం పట్ల పూర్తి నమ్మకం కలిగి ఉండండి. ఆయన చెయ్యదల్చుకున్న పనులకు మిమ్మల్ని తన పరికరంగా వాడుకుంటారు. ఆయన్ని అందుకునేందుకు మీ హృదయాన్ని తెరచి ఉంచండి. అన్నీ ఆయన దయవల్లే జరుగుతాయి. జరిగేవన్నీ పూర్తిగా ఆయన దయ, అనుగ్రహం వల్ల మాత్రమే జరుగుతున్నాయి. అంతా ఆయన దయ, అనుగ్రహం.
మీ జీవితపు వెలుతురు పార్శ్వమే చూడండి. కొన్నిసార్లు సమస్యలు చుట్టుకుంటాయి. సహనంతో ఉండండి. చుట్టుప్రక్కలే పరిష్కారం కూడా ఉంటుంది. మనలో కొంతమంది కష్టాలు చెప్పుకుంటూనే ఉంటారు. ఇది ఒక అలవాటు. దుఃఖిస్తూ జీవించడాన్ని వారు ఆస్వాదిస్తారు, జీవితపు అనుకూల పార్శ్వాన్ని చూడడం వారికి ఇష్టం లేదు. ఒకవిధంగా వారూ అమూల్యమైనవారే, మనకు ఎలా ఉండకూడదో నేర్పుతున్నారు. ఈ స్వపీడనా నిరతులను(తమను తామే బాధించుకుంటూ ఆనందించేవారు) చూసి, నేను జాలి పడుతున్నాను.
***
No comments:
Post a Comment