శివం - 66
రాజ కార్తీక్
( హర సిద్దుడు కుంభన్న చెప్పిన విధంగా శిల్పాన్ని సిద్ధం చేసి తన జీవితంలో రాబోతున్న మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు... )
హర సిద్ధుడు " అన్నా, నువ్వు చెప్పిన విధంగా శిల్పాన్ని సిద్ధం చేశాను. మరొకసారి నువ్వు పరీక్షించు ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయో లేవో సరిగ్గా చూడు, మళ్లీ పోయినసారి లాగా నా శిల్పాలను చూచి ఏమీ వంకలు పెట్టకూడదు."
కుంభన్న "బ్రహ్మాండంగా ఉంది, నీ తప్పును తెలుసుకొని సరిదిద్దుకొని ఈ శిల్పంలో ఎటువంటి దోషం లేకుండా పనితనం చూపించావు, ఇక మీద కూడా నీవు చేసే ఏ పని లో నైనా చిన్న తప్పు కూడా లేకుండా చేస్తావు, ఆ నమ్మకం నాకు ఉంది. ఇక ప్రపంచమే నీ పనితనాన్ని మెచ్చు కోవాల్సి ఉంది."
హర సిద్దు "చాలా సంతోషంగా ఉంది అన్నా! నా మనసుని అర్ధం చేసుకుని నన్ను అభిమానించి, నాకు ఒక అవకాశం ఇస్తున్న నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉందన్నా," అంటూ ఎంతో ఆనందపడ్డాడు. తనకన్నా ఎత్తున్న బండరాయిని భగవంతుడిగా చేసి, నిలువెల్లా మురిసిపోయాడు. అలాగే కుంభన్న చెప్పిన విధంగా పానవట్టం దగ్గర తాకిన భాగానికి ఉదరం ముందుకు వచ్చిన విధంగా అద్భుతంగా చేశాడు.
ఏ కళాకారుడైనా తన అభిరుచికి తగ్గ గుర్తింపు రాబోతుంది అంటే ఆనందమే కదా,అందులోనూ హర సిద్దు కి ఇంకా కొంచెం ఎక్కువ ఆనందం సరైన గుర్తింపు కోసం ఆదరణ కోసం ఎదురు చూస్తున్నా డు కదా!
హర సిద్దు "అన్నా ఇంతకీ ఎందుకు ఈ శివలింగం ఇలా ఉంది? ఈ శిల్పం వెనుక ఉన్న కథేంటి నా దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు చేయించుకున్నావు?"
కుంభన్న "అంతా నీకు అర్థమవుతుంది. చిన్న చిన్న లోపాలు కూడా లేని శిల్పకళ పెద్ద పెద్ద కథలు చెప్పబోతోంది."
హర సిద్దు "అన్నా, నిజానికి చిన్న చిన్న లోపాలు పెద్ద పెద్ద కళ్ళు చూస్తాయి. ఆ పెద్ద పెద్ద కళ్ళు ధనవంతులకు అనుకూలంగా ధనం లేని వారికి వ్యతిరేకంగా ఉంటాయి."
భక్తులారా! ఎప్పుడైనా ఎక్కడైనా ఇటువంటి పరిస్థితుల్లో అయినా మీరు ధర్మాన్ని కాపాడండి. మిమ్మల్ని తప్పక నిన్ను కాపాడుతాను చెప్పడానికి చిన్న విషయమైనా ఇందులో చాలా అంతరార్ధం ఉంది. అలాగే చిన్న చిన్న లోపాలను సరి చేసుకుంటూ మీ జీవితంలో ముందుకు వెళ్ళండి. ప్రశాంతమైన జీవితానికి మార్గం సుగమం చేసుకోండి. మీ వృత్తిలో ధర్మాచరణ ఉండేలా చూడండి."
కుంభన్న "అవును హర సిద్దా! నువ్వు చెప్పింది వాస్తవమే, ధనం మూలం ఇదం జగత్, వెళ్ళి రా సిద్దా! ఈ రోజు ఇంటికి వెళ్లి మీ అమ్మకి ధనం తో తిరిగి వస్తానని చెప్పు."
ఎప్పుడూ బతుకుతెరువు కోసం ఆరోజు బతకడం కోసం తన సముపార్జన చేసిన హర సిద్దు కి ధనం వస్తుంది అనే ఆనందంలో
"అన్నా, నాకు అంత డబ్బు పిచ్చి లేదన్న! ఏదో కొంచెం మంచిగా బతకడానికి డబ్బు కావాలని కోరుతున్నాను. అది నీ రూపంలో నిజం అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నా. నాకు డబ్బు రాగానే అది మా అమ్మ కి ఏర్పాటు చేసి, తను ఇక కష్టపడకుండా హాయిగా ఉండే ఏర్పాటు చేస్తానన్నా."
కుంభన్న "నువ్వు ఎంత మంచి వాడివి హర సిద్దా, కన్నతల్లి బాగుండాలనే నీ కోరిక న్యాయమైనది. ధనముని సక్రమంగా ఉపయోగించాలనుకునే నీకు, లక్ష్మి దేవి, కుబేరుడు పరమేశ్వరుడి అనుగ్రహంతో చాలా ధనం ఇవ్వాలని కోరుకుంటున్నాను, వస్తే ఏం చేస్తావ్ హర సిద్ద?"
"అన్నా, మన దగ్గరున్న డబ్బు కి మనం
సంరక్షకులమే కాని, యజమానులం కాదు. దుబారాగా పోకుండా ఎన్నో లక్షల మందికి ఉపయోగిద్దాం అన్నా. ఆ దేవుడు ఇవ్వాలే గానీ ఎంతమంది ఆకలినైనా, చేతనైనంతలో తీర్చవచ్చు."
హర సిద్దు మనసు చూసి నేను తధాస్తు అన్నాను. చూద్దాం హర సిద్దు జీవితంలో ఏం జరగబోతోందో...
కుంభన్న "హరి సిద్దు, నీలాంటి ఉత్తములు ఉన్నందుకే ఇంకా ధర్మం నడుస్తుంది, నీ కఠినమైన మాటలు చూసి అందరూ తప్పుగా అర్థం చేసుకునే వారు కానీ నిన్ను సరైన రీతిలో అర్థం చేసుకుంటే వారు ఒక అద్భుతమైన మనిషిని చూస్తారు. నాతో మాట్లాడిన విధంగానే సరళంగా అందరితో మాట్లాడు."
హర సిద్దు"అది స్వతహాగా వచ్చేది అన్నా, తెచ్చుకుంటే వచ్చేది కాదులే! నా తంటాలు పడతానులే " అన్నాడు సరదాగా.
కుంభన్న "ఎప్పుడూ పదిమందికి పెట్టాలి అనే ఆలోచనతో ఇలాగే ఉండు. నీకు వద్దన్నా దేవుడు ఇస్తూనే ఉంటాడు."
హర సిద్దు " సంతోషం అన్నా. నీతో మాట్లాడుతుంటే మనసు ఆనందంగా ఉంది. ఏ జన్మ బంధమో అన్నా, నీకు నాకూ! చాలా తక్కువ సమయంలోనే మనిద్దరి మనస్తత్వం బాగా కలిసిపోయింది. నీ మాటలు నేను పూర్తిగా నమ్ముతున్నాను , నువ్వు ఇప్పుడు ఇవ్వబోతున్న అవకాశం నా జీవితం మార్చ బోతోందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను."
కుంభన్న"అలాగే ఇంటికి వెళ్లి రేపు వేకువజాము కల్లా వచ్చెయ్. ఇద్దరం బయల్దేరుదాం. మనం చాలా దూరం వెళ్ళాలి, నేను ఇక్కడే శిల్ప శాల లో ఏర్పాట్లు చూస్తాను. "
ఇంటికి వెళ్ళిన హర సిద్ధునికి సరైన ఆదరణ లభించలేదు, అది ఎందుకో దానికి కారణం ఏమిటో సమయం వచ్చినప్పుడు, తెలుస్తుందిలే!
పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల సిద్దు ఇంట్లో ఏమీ చెప్పలేక మొహం చెల్లని వాడి మల్లే వేకువజామునే తన తల్లి ఇచ్చిన తినుబండారాలు తీసుకొని వచ్చాడు.
కుంభన్న రెండు యెడ్లకి బండి కట్టి ఆ బండి మీద అతను చెప్పిన శిల్పాన్ని ప్రతిష్టించిన విధంగా పెట్టాడు, ఏదో అడుగుదాం అనుకునేలోపే అటుగా వెళ్తున్న రైతులు ఎవరైనా సాయం చేసి ఉంటారులే అని అనుకొని ఇద్దరూ తమ ప్రయాణం మొదలుపెట్టారు.
దారి మధ్యలో ఇద్దరూ చలోక్తులు విసురుకుంటూ సరదాగా నవ్వుకుంటూ, పచ్చని పొలాలు చెరువు గట్లు సేదతీరుతూ హాయిగా వెళ్తున్నారు. ప్రకృతి కూడా వారి స్నేహాన్ని చూసి పులకరించింది.
అలా చాలా సేపు ప్రయాణం చేసిన తర్వాత, బండి ఒక ఊరి శివార్లలో ఆగింది.
కుంభన్న "ఆకలి వేయట్లేదా హర సిద్దా? ఇదిగో మీ అమ్మ ఇచ్చిన ఈ తినుబండారాలు తిను."
హర సిద్దు ఆ తినుబండారాలను రెండుగా చేసి ఒక భాగాన్ని కుంభన్నకి ఇచ్చాడు.
చాలా రుచిగా ఉన్నాయి తిను హర సిద్ధ, అని కుంభన్న తనకి ఇచ్చినది మళ్లీ ఇవ్వబోయాడు.
"నీ దగ్గర వేరు నా దగ్గర వేరు ఉన్నాయా" అని రుచి చూసి, ఎంతో రుచిగా ఉంటం గమనించాడు.
"ఉండు హర్ సిద్ధ నేను మంచి నీరు తీసుకు వస్తాను "అని కుంభన్న వెళ్ళిపోయాడు.
హర సిద్ధుడు తీవ్రమైన నిద్ర లోకి జారుకున్నాడు
చాలా సేపు గడిచింది.
నిద్రలేచిన హర సిద్దు "అన్నా ఇలా నిద్రపోయి సంవత్సరాలయింది. ఎక్కడున్నావ్, అని లేచాడు."
కుంభన్న కనపడలేదు..తను ..చెక్కిన బొజ్జ లింగం, ఎడ్లు లేని ఆ బండి మాత్రమే ఉన్నాయి.
దగర్లో చుట్టూ తిరిగి చూశాడు, కనపడలేదు.
చుట్టూ "కుంభన్నా" అని కేకలు వేశాడు, కనపడలేదు.
ఏమి జరగబోతోంది...
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment