అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) - 33
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)
(తండ్రి కోరికపై కనిపించకుండా పోయిన ఫిప్ సాహిత్యాన్ని వెతికి పట్టుకోవాలని నిర్ణయించుకొన్న నాన్సీ ఆగంతకుడెవరో ఆ భవనంలో తిరుగుతున్నాడని గమనించి, తన స్నేహితురాళ్ళ సహాయంతో అతణ్ణి పట్టుకోవటానికి విఫలయత్నం చేస్తుంది. తరువాత అటక మీదకు రహస్య మార్గం ఉందేమోనని వెతుకుతున్న ఆమెతో, కనిపించిన అస్తిపంజరం తమకేదో సైగ జేస్తున్నట్లు బెస్ చెబుతుంది. వెంటనే అస్తిపంజరం ఉన్న బీరువాలో గాలించిన నాన్సీకి కొన్ని ఉత్తరాలతో పాటు పాటలు దొరుకుతాయి. తన స్నేహితురాళ్ళతో జెన్నర్ ఆఫీసుకి వెళ్ళిన ఆమెకు డైట్ అన్న వ్యక్తి, బెన్ బాంక్స్ పేరుతో చలామణీ అవుతున్నట్లు గ్రహిస్తుంది. ఫిప్ వ్రాసిన పాత ఉత్తరాలను బట్టి ఆమె అటక మీద బీరువా వెనుక ఉన్న రహస్య గదిని కనుక్కొంటుంది. ఆ చీకటి గదిలో కనిపించిన పియానో మీటలన్నీ అదేపనిగా నొక్కిన నాన్సీ పియానోలోంచి ఒక రహస్యపు అర తెరుచుకోవటం, దానిలో రిగ్గిన్ అన్న వ్యక్తి పారవేసుకొన్న కార్డు కనిపించాయి. భోజనాలయ్యాక, ముసలాయన తాను క్రింద ఆగంతకుడి కోసం మాటు వేస్తానని, ఆ అమ్మాయిని అటక మీద విషయం చూడమని, ఆగంతకుడు కనిపిస్తే తాను గుడ్లగూబలా అరిచి సంకేతమిస్తానని చెబుతాడు. పాపను నిద్రపుచ్చాక నాన్సీ వెలిగించిన కొవ్వొత్తితో అటక ఎక్కుతుంది. ఆ చీకటి గదిలో పియానో బటన్లను అదేపనిగా నొక్కిన ఆమె ముందుకు పళ్ళెంలాంటిది వచ్చి, దానిలో ఎన్నో పాటలు ఉన్న కాగితాల చుట్టలు దొరుకుతాయి. వాటిని కనుగొన్న ఆనందంలో ఉన్న ఆమె తన వెనుక ఒక మనిషి ఆకారం భూమిలోని సొరంగం నుంచి పైకి వచ్చినట్లు తెలియదు. ఇన్నాళ్ళూ ఆగంతకుడిలా తిరిగిన బుషీట్రాట్ ఆమెను వెనుకనుంచి పట్టుకొని, ఆమె చేతిలోని పాటల కట్టను లాక్కుంటాడు. ఆమె కాళ్ళూ చేతులను కట్టేసి, తన జేబులోంచి బ్లాక్ విడో సాలీడుని బయటకు తీసి పియానోపై వదులుతాడు. తరువాత ఆ గదికి, అటకకు మధ్య ఉన్న తలుపును మూసి, అడ్డ గడియను పెట్టి, సొరంగం వైపు నడుస్తాడు. గదిలో వెలిగే కొవ్వొత్తిని ఆర్పేసి, అతను సొరంగం ద్వారా బయటకు వెళ్ళిపోతాడు. బ్లాక్ విడో బారిన పడకూడదని కొట్టుకొనే నాన్సీని ఆమె మిత్రుడు నెడ్ వచ్చి రక్షిస్తాడు. ఫిప్ గురించి విన్న ఆమె స్నేహితులు వెంటనే కంగారుగా అటక దిగి, తోట వైపు పరుగుతీస్తారు. తరువాత . . . .)
"నిజంగా నీకేమీ కాలేదుగా?" అతని గొంతులో ఆందోళన తొణికిసలాడింది.
"నిజమేనయ్యా స్వామీ!" అంటూ నవ్విందామె. "మొదట్లో కొద్దిసేపు నేను భయపడ్డ మాట నిజమే! ఒప్పుకొంటున్నాను. కానీ ప్రస్తుతం బాగానే ఉన్నాను. నిజం."
"నువ్వు ఖచ్చితంగా నన్ను బెదిరిస్తున్నావురా!" అంటూ ఆప్యాయంగా ఆమె తలపై మెల్లిగా తట్టాడు.
తరువాత వాళ్ళిద్దరూ మెట్లు దిగి బయటకెళ్ళారు.
"కూలీల నివాసాల దగ్గర" ముందు వెడుతున్న అమ్మాయిలకు యువ గూఢచారి అరిచి చెప్పింది.
నెడ్ పట్టుకొన్న ఫ్లాష్ లైట్ వెలుతురులో ఆమె వారందరికీ దారి చూపిస్తూ ముందుకు కదిలింది.
వారికి లేత ఊదారంగు పూలతో నిండిన పొద దగ్గర మెలికలు తిరిగి పడి ఉన్న మార్చ్ కనిపించాడు.
ఎఫీ భయంతో వణికిపోతూ గట్టిగా ఏడుపు లంకించుకొంది. " ఆయన. . . ఆయన. . ."
నెడ్ చలనం లేకుండా పడి ఉన్న ఆ శరీరాన్ని పొదలోనుంచి బయటకు లాగాడు. నాన్సీ పెద్దాయన నాడి పట్టుకొని చూసింది.
"బ్రతికే ఉన్నారు" చెప్పిందామె. కానీ తట్టుకోలేని దెబ్బ తగిలి స్పృహ కోల్పోయారు."
వారంతా సాయం పట్టి ముసలాయన్ని యింట్లోకి చేర్చారు. వాళ్ళందరూ చేసిన సపర్యల వల్ల అతను త్వరగానే స్పృహలోకొచ్చాడు. చీకటిగదిలో తనకు జరిగినదేదీ అతనికి చెప్పవద్దని నాన్సీ మిగిలినవారిని వారించింది. స్పృహ వచ్చిన వెంటనే పెద్దాయన విశ్రాంతి కోసం రెండవ అంతస్తులోని తన గదికి వెళ్ళిపోయాడు.
"ఉన్నపళంగా నేను రివర్ హైట్స్ కి వెళ్ళాలి" నాన్సీ చెప్పింది. "ఎఫీ! ఇప్పుడు నీకు వివరించి చెప్పలేను. కానీ యికపై యిక్కడ ఒంటరిగా ఉన్నా నీకెలాంటి భయం లేదు. ఆ నీడలాంటి ఆకారం యికపై యీ ప్రాంగణానికి రాదు."
"ధన్యవాదాలమ్మా!" చెబుతున్న పనిపిల్ల కళ్ళు కృతజ్ఞతతో మెరిసాయి. "నువ్వు, నీ స్నేహితులందరూ కలిసి వెళ్ళవచ్చు. నేను పెద్దాయన్ని, ఆయన మనుమరాలిని శ్రద్దగా చూసుకొంటాను."
"ఈ అర్ధరాత్రి నువ్వు ఎక్కడికెడతావు?" జార్జ్ అడిగింది.
"లారెన్స్ డైట్ యింటికి. అతని దగ్గర బుషీట్రాట్ చిరునామా ఉందని నాకు తెలుసు."
ఇరువైపులనుంచి వరుసలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకొన్నారు. చివరికి నాన్సీ వారు చెప్పదలచుకొన్నదేమిటో కారులో వెళ్ళేటప్పుడు చెప్పమని కోరింది. ఆ భవనంలోనుంచి అందరూ బయటకొచ్చే సమయానికి ఒక కారు ప్లెజెంట్ హెడ్జెస్ ప్రాంగణంలోకి మలుపు తిరుగుతూ కనిపించింది. వారికి నాన్సీ తండ్రి కర్సన్ డ్రూ ఆ కారు డ్రయివర్ సీట్లో కనిపించాడు.
"ఎంత అదృష్టం" అంటూ నాన్సీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది.
కారు ఆ యింటి ముందుకొచ్చి ఆగింది.
"ఓ నాన్నా! మిమ్మల్ని ఈ సమయంలో యిక్కడ చూడటం పట్టరాని సంతోషాన్ని కలిగించింది" అంటూ యువ గూఢచారి తండ్రి దగ్గరకెళ్ళింది. "మాతో పాటు మిస్టర్ డైట్ యింటికి మీరొస్తారా?"
"తప్పకుండా!" చెప్పాడతను. " కానీ ఎందుకు? అక్కడ మరిన్ని ఆధారాలు దొరుకుతాయా?"
"ఫిప్ మార్చ్ పాటలను దొంగిలిస్తున్నది బుషీట్రాటేనని కనుగొన్నాను. ఇంతకాలంగా తనకు దొరకని పాటలన్నింటినీ యీ రాత్రే దొంగిలించి పట్టుకుపోయాడు. వెంటనే మిస్టర్ డైట్ నుంచి అతని చిరునామా తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయాలి."
త్వరగా కారెక్కండి" చెప్పాడతను.
నాన్సీ దారిలో ఆ సాయంత్రంనుంచి అప్పటివరకూ జరిగిన సాహసగాధను పూసగుచ్చినట్లు తండ్రికి, స్నేహితులకు వివరించింది. అటకమీద ఆమె ఎదుర్కొన్న విషమ పరిస్థితిని విని, డ్రూ నిర్ఘాంతపోయాడు.
"నువ్వు అలాంటి అవకాశాలు తీసుకోకూడదురా!" తండ్రి గొంతులో లీలగా ధ్వనించిన ఆప్యాయతకి యువ గూఢచారి చలించిపోయింది. "ధైర్యం మంచిదే! కాదనను. కానీ ట్రాట్ లాంటి కర్కోటకుడి దగ్గర. . ."
నాన్సీకి నచ్చిందదే! పరిశోధనల్లో తండ్రి తనకు ప్రోత్సాహాన్నిస్తుంటాడు. తను అనుకోని కష్టాల్లో యిరుక్కొన్నపుడు సున్నితంగా మందలిస్తూ సలహాలిస్తాడే తప్ప, తన ఉత్సాహంపై నీళ్ళు చల్లి యింట్లో కూర్చోమని కేకలేయడు. ఈ కేసు పూర్తికాగానే తనే మరొక కేసును అప్పజెప్పి తనను ప్రోత్సహించి తన విజయాలకు అజ్ఞాతంగా సహకరిస్తాడు. అలాంటి తండ్రి దొరకటం నిజంగా తన అదృష్టమే!
"ఓ నాన్నా! పియానో డెస్క్ కింద రహస్యద్వారం ఉందని ఎలా అనుకొంటాను? ఏమైతేనేం? సమయానికి నా స్నేహితులొచ్చి నన్ను కాపాడటం నా అదృష్టంగా భావిస్తాను" అంటూ ఆమె నెడ్ వైపు ఆప్యాయంగా చూసింది.
"లేచిన వేళ బాగుంది కనుక సమయానికి మేమొచ్చి ఆదుకొన్నాం" నెడ్ ఆమెను చూస్తూ అన్నాడు.
(తరువాయిభాగం వచ్చే సంచికలో)
No comments:
Post a Comment