దైవం మనుష్య రూపేణా
కురుగంటిశ్రీరామచంద్రమూర్తి
పూర్వం జగన్నాధపురం అనే గ్రామములో నరసింహశాస్త్రి యనే బ్రాహ్మణుడుండేవాడు. ఆయన చాలా మంచి అనుష్టానపరుడు,ధర్మనిరతుడు. ఆయన భార్య కూడా అనుకూలవతి. మంచి దైవభక్తి కలది. శాస్త్రిగారు గొప్ప స్ధితిపరుడు కాకపోయినా,ఉన్నంతలో దానధర్మాలు చేస్తూ తృప్తిగా జీవించేవాడు. వివాహమై చాలా సంవత్సరాలు గడిచినా, వారికి సంతానం కలగలేదు.
దాని కోసం ఎన్నో పూజలు, వ్రతాలు, మొక్కని దేవుడు లేడు. నిరంతరం హరి నామస్మరణ చేయటం ఆయనకు అలవాటు. తరచూ అతిధులు వస్తూ పోతుంటారు శాస్త్రిగారింటికి. అనుకూలవతి యగు భార్య కావటాన గౌరవ మర్యాదలకు లోటు చేసేవారు కాదు ఎవ్వరికి.
ఒకరోజు శాస్త్రిగారు సాయంసంధ్యా సమయాన తన ఇంటి ఆరుబయట అరుగుమీద కూర్చుని వుండగా పొరుగూరి నుండి ఒకబ్రాహ్మణ బాటసారి తన వద్దకు వచ్చాడు. చూస్తే చాలా సత్బ్రాహ్మణుడిగా కనిపించాడు శాస్త్రిగారికి. అయ్యా! తమరెవరు! అని మర్యాద పూర్వకముగా ప్రశ్నించారు. అందుకు ఆబ్రాహ్మణుడు “నా పేరు మాధవయ్య అంటారు. నేను ఈఊరులో లక్ష్మయ్య అనే షావుకారు వద్దకు అప్పు చెల్లిద్దామని వస్తే, ఆయన తీర్ధయాత్రల నిమిత్తం ఊరు వెళ్ళినారని తెలిసింది. పొద్దుపోయినది కాబట్టి ఈరాత్రికి మీఇంట బస చేయనిస్తే, ఉదయాన్నే లేచి మాఊరు వెళ్ళుతాను” అన్నాడు మాధవయ్య. శాస్త్రిగారు అందుకు “ఎంత భాగ్యం తప్పక మా ఆతిధ్యం స్వీకరించి అలాగే వెళ్ళుదురు అన్నారు.” భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని కాసేపు కుశలప్రశ్నలు వేసుకున్నారు. శాస్రిగారు తమకు సంతాన కొరత గురించి తెలుపుతూ బాధ వ్యక్తం చేసారు. తాంబూలం స్వీకరించిన తర్వాత మాధవయ్య ఆదంపతులను ఆశీర్వదిస్తూ “మీకు త్వరలోనే పుత్రయోగము కలుగుతుందని పలికారు. ఆ మాటకు ఆ దంపతులు ఆనందించారు.
మర్నాడు ఉదయాన్నే మాధవయ్య బయలుదేరుతూ ”అన్నట్టు మరచాను శాస్రిగారు మీరు నాకొక చిన్న సాయం చేయండి యని తన వద్ద నున్న పైకమును, ఆషావుకారు వచ్చిన తర్వాత అందచేయమని వివరములు చెప్పి ఆయన చేతి కిచ్చాడు. శాస్త్రిగారు తీసుకొని సరే నన్నారు.
ఒక నెలరోజులు గడిచాక నరసింహశాస్త్రిగారి భార్య గర్బవతి అయింది. ఆదంపతుల ఆనందానికి అవధులు లేవు. తాము చేసిన పూజలు ఫలించాయని మిక్కిలి సంతసించారు. కొన్నిరోజులు గడిచాక షావుకారు లక్ష్మయ్య తీర్ధయాత్రలను ముగించుకొని వచ్చారు.
నరసింహశాస్త్రిగారు మాధవయ్య ఇచ్చిన సొమ్మును షావుకారుకు ఇవ్వటానికి వెళ్ళి, జరిగినదంతా చెప్పారు. అందుకు షావుకారు తనకు ఆమాధవయ్య ఎవరో తెలియదని, తానెన్నడు అప్పు ఇవ్వలేదని ఆసొమ్ము తనది కాదని చెప్పాడు. శాస్త్రిగారికి ఆశ్చర్యం కలిగింది. సరేనని మాధవయ్య చెప్పిన వివరాలను బట్టి పొరుగూరికి వెళ్ళి విచారించగా అక్కడ అలాంటి వ్యక్తి ఎవరులేరని తెలిసింది.
శాస్త్రిగారికి మరింత ఆశ్చర్యానికి గురి అయినారు. వచ్చి జరిగదంతా భార్యకు పూసగుచ్చినట్లు వివరించాడు ఆలోచించగా వారికి అప్పుడర్ధమైంది“ వచ్చినవాడు మాధవయ్య కాదు మనల్ని కరణించడానికి వచ్చిన సాక్షాత్ ఆ మాధవుడేనని పట్టరాని ఆనందంతో ఆస్వామికి కైంకర్యాలు చేసి పులకించిపోయారు. తర్వాత పుట్టిన కుమారునికి మాధవుడని నామకరణచేసి అల్లారుముద్దుగా పెంచుకున్నారు. షావుకారు లక్ష్మయ్య తను దైవదర్శనార్ధమై తీర్ధయాత్రలకు తిరిగితే, నరసింహశాస్త్రికి దేవుడే మనుష్య రూపములో వచ్చి కరుణించాడు. అందుకే అంటారు దైవం మానవ రూపేణా నమ్మిన భక్తులకు తప్పక కాపాడుతాడన్నది సత్యం. సత్యం. మనము సర్వం ఆశ్రీమన్నారాయణుకే సమర్పంచాలి.
***
No comments:
Post a Comment