బహుముఖ ప్రజ్ఞాన శ్రీ రావికొండలరావు - అచ్చంగా తెలుగు

బహుముఖ ప్రజ్ఞాన శ్రీ రావికొండలరావు

Share This

                           బహుముఖ ప్రజ్ఞాన శ్రీ రావికొండలరావు

డా.పోడూరి శ్రీనివాసరావు....


బహుముఖ ప్రజ్ఞాశాలి రచయిత, నటుడు మంచి సున్నిత హాసానికి మరోపేరయిన శ్రీ రావి కొండలరావు గారి గురించి వ్రాయడమంటే ఒక మహా గ్రంధమే అవుతుంది. వారొక సినీనటులుగానే, రచయితగానే చాలామందికి తెలుసు. కానీ నాణేనికి రెండు పార్శ్వాలున్నట్లు... ఆమహానుభావుడు తెరముందు, తెరవెనక వివిధ పాత్రలు పోషించారు. గాత్రదానం, సహాయ దర్శకత్వం, నటన, కథ, మాటలు, ప్రచారం, నిర్మాణ నిర్వహణ లాంటివి ఒక పార్శ్యమైతే, సినిమా పాత్రికేయం, సంపాదకత్వం, వెండి తెరనవల, సినిమా చరిత్ర రచనలు రెండో పార్శంలో కనిపిస్తాయి.

          1932 ఫిబ్రవరి 11వ తేదీన రావికొండలరావుగారు తూర్పు గోదావరి జిల్లా లోని సామర్లకోటలో జన్మించారు. అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళంలో పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసం శ్రీకాకుళంలో జరిగింది. పార్వతీపురంలో కొంతకాలం చదివారు.

          1948 లో తన పదహారో ఏట, సినీమాల మీద ఇంట్రస్టుతో, ఇంట్లచెప్పకుండా, చిన్న పెట్టెలో రెండు జతల బట్టలు కుక్కి పూర్ణారావు అనే మిత్రుడి వద్ద ఇరవై రూపాయలు అప్పుచేసి మద్రాసుకు రైలెక్కేసాడు శ్రీ కొండలరావు, పూర్ణారావు ఎక్కడ నుంచి తెచ్చాడో తెలియదు గాని, ఇరవై రూపాయలు కొండలరావు జేబులో కుక్కి తనే మద్రాసుకు రైలు టికెట్ కొని మద్రాసు వెళ్లే పాసింజరు రైలెక్కించాడు. ఆ పాసింజరు రైలు కలకత్తా నుంచి వెళ్తుంది. శ్రీకాకుళం నుంచి మద్రాసుకు టిక్కెట్టు పన్నెండు రూపాయలు, ఆ రైలులో ఎక్కువ మూడో తరగతి పెట్టేలే. రెండో, మూడో ఇంటర్ క్లాసు. ఒకటి రెండో ఫస్ట్   క్లాసు. మూడోతరగతి అన్నీ కర్రసీట్లు. ఫస్ట్ క్లాసువైపు సామాన్యులు కన్నెత్తి కూడా చూడలేరట.

          అలా కిక్కిరిసిన జనాల మధ్య, కర్రసీట్ల మూడోతరగతి పాసింజరు రైలులో శ్రీకాకుళం నుంచి బయలుదేరిన కొండలరావు మూడు రోజులు దీర్ఘ ప్రయాణం చేసి మద్రాసు చేరాడు. తన అన్నయ్య ఆర్.కె. రావు (కామేశ్వరరావు) చెన్నైలో మోనోయాక్టరుగా, మిమిక్రీ  ఆర్టిస్టుగా ఉంటూ, సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుసు,

          కానీ ఎక్కడుంటాడో ఎడ్రసుతెలియదు. ఎలా కలవాలో తెలియదు. అయినా గుర్తు తెచ్చుకుని, కామేశ్వరావు అన్నయ్య తనతో అంతకు ముందు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ, ముందు బి.ఎన్.కె.ప్రెస్, చందమామ ఆఫీసు అక్కడినుండి ఆల్ ఇండియా రేడియో స్టేషను చేరుకున్నాడు. రేడియో స్టేషను నుంచి అప్పుడే బయటకు వస్తున్న అప్పటితరం సినీ హీరో సి హెచ్. నారాయణరావుని చూసి అమ్మయ్య! అనుకున్నాడు కొండలరావు, అంతకుముందు శ్రీకాకుళంలో "మిస్ ప్రేమ బి.ఎ." అనే నాటకం వేయడానికి వచ్చినప్పుడు, కామేశ్వరావు అన్నయ్య వారికి సహకరించడం, ఆసమయంలో కొండల రావు కూడా నారాయణరావుగారిని కలవడం జరిగింది. ఆ పరిచయం సందర్భంగా నారాయణరావు గారికి విషయం చెప్పి కామేశ్వరరావు గురించి అడగగా, వారు కామేశ్వరావు అడ్రసు, వెళ్లాల్సిన బస్సు నంబరు అవీ వివరంగా చెప్పారు.

          బ్రతుకు జీవుడా! అనుకుంటూ ఆయన చెప్పిన విధంగా ప్రయాణం చేసి అన్నయ్య ఇంటికి చేరాడు కొండల్రావు.  రాత్రి తొమ్మిది గంటలకు సడెన్ గా ప్రత్యక్షమయిన కొండలరావునిచూసి, అన్నయ్య వదిన ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ప్రారంభం రావికొండలరావు గారి సినీ ప్రయాణ ప్రస్థానం.

          కొండలరావుకి బాల్యం  నుంచే కథారచన, నాటకాల పై ఆసక్తి. చిన్న వయసులోనే బంగారు పాప' అనే బాలల పక్ష పత్రికను నడిపారు. ఆయన రచనలు 'బాలు', 'ఆనందవాణి' పత్రికలో ప్రచురితమయ్యాయి. యుక్తవయసులో కొంతకాలం ఆరెస్సెస్ లో  క్రియాశీల సభ్యుడిగా కూడా పనిచేసారు. కొద్ది కాలం జైలు శిక్ష కూడా అనుభవించారు.

          1956లలో మద్రాసులో ఆనందవాణిపత్రికలో సబ్ఎడిటర్‌గా చేరారు. అక్కడ కొంతకాలం పనిచేశాక ప్రసిద్ధ సినీ రచయితడి.వి నరసరాజు గారి ద్వారా పొన్నలూరి బ్రదర్స్ సంస్థవారి కథా విభాగంలో చేరారు. అంతకు ముందే ఒక మళయాళ చిత్రానికి డబ్బింగ్ కూడా వ్రాశారు.

          1958లో శోభ చిత్రానికి కమలాకర కామేశ్వర రావుకు సహాయకునిగా పనిచేస్తూ ఆ సినిమాలో వైద్యుని పాత్ర పోషించారు. ఆతర్వాత మరికొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగాపని చేసారు. 'నర్తనశాల చిత్రానికి కామెడీ ట్రాక్ వ్రాశారు,

          కీలుబొమ్మలు,ప్రేమలో ప్రయాణం,గూఢచారి 116,ముగ్గురు వీరులు, పంతులమ్మ ఆలీబాబాన నలభై దొంగలు, వీరాభిమన్యు, దాగుడు మూతలు, ప్రేమించి చూడు, అర్ధరాత్రి, చంటబ్బాయ్, బంగారు పంజరం

          ఇలా ఎన్నో సినిమాలు, సుమారు ఆరు వందల సినిమాలు రచించారు.

          తొలిచిత్రం శోభ అయినా, నటుడిగానే కొనసాగించాలని నిర్ణయించుకున్న చిత్రం 'దాగుడు మూతలు' నటుడన్న వాడు ఒకే తరహా మూస పాత్రలకే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో “అర్ధరాత్రి" సినిమాలో పక్కా విలన్ పాత్ర నటించారు.

          చిన్నప్పటి నుంచీ నాటకాలంటే అమితమైన ఆసక్తి కల కొండలరావు "నాలుగిళ్ల చావిడి", "పట్టాలు తప్పిన బండి, ప్రొఫెసర్ పరబ్రహ్మం, కుక్కపిల్ల దొరికింది... ఇలా ఎన్నో బహుళ ప్రజాదరణ పొందిన నాటాలు రచించారు. వాటిల్లో “ప్రొఫెసర్ పరబ్రహ్మం" నాటకం దేశవ్యాప్తంగా 50 సార్లు ప్రదర్శింపబడింది.

          అలాగే కొండల రావుగారి అన్నయ్యకు ఆర్.కె.రావు గారు మోనో యాక్టర్‌గా లభించిన కీర్తిని పురస్కరించుకుని,  విజయ నగరంలో 1960లో రాజలక్ష్మి ఫౌండేషన్ వారి సభ ఏర్పాటు చేసారు. ఆ అభినందన సభకు గుమ్మడిగారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. రమణారెడ్డిగారి మ్యాజిక్ ప్రదర్శన ఏర్పాటు చేసారు. ఈ సభ విశేషం ఏమిటంటే కొండల రావుగారి అన్నదమ్ములు ఏడుగురూ .... అందులో సన్మాన గ్రహీత ఆర్, కె.రావు తప్పించి, మిగిలిన ఆరుగురు సోదరులు అంతా కలసికొండలరావు వ్రాసిన కుక్కపిల్ల దొరికిందినాటకం ప్రదర్శించారు. ఇలా ఒక అన్నతమ్ముడికి సత్కారం జరుగుతుంటే, తక్కినసోదరుల్లో, ఒకసోదరుడు రాసిన నాటకాన్ని సోదరులంతా కలిసి ప్రదర్శించడం గొప్ప విశేషం - బహశా ప్రపంచంలోనే ఇది ఒక రికార్డు.

          1960లో సహనటి రాధాకుమారితో వివాహం, 1952-53లలో శ్రీకాకుళం నుంచి, విజయనగరం రాఘవ నాటకోత్సవాల్లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు, విజయనగరంలో ఉండే జె.వి. రమరామూర్తి సోమయాజులు బృందం వేసినఆత్రేయ వ్రాసిన "ఎన్.జి.వో' నాటకంలో రాధాకుమారిని మొట్టమొదటిసారి రావి కొడలరావు చూడడం తటస్థించింది. ఆ సంవత్సరం ఆమెకు ఉత్తమ నటి బహుమతి వచ్చింది. ఆ తర్వాత కూడా పలు పర్యాయములు నాటక ప్రదర్శనలలో కలుసుకుంటూండడం, రాధాకుమారి చాలా సార్లు ఉత్తమ నటిగా బహుమతులు పొందడం జరుగుతూనే ఉంది.

          అప్పటికే రావికొండలరావుగారు సినీఫీల్డ్ లో సహాయ దర్శకునిగా పనిచేస్తున్నారు. రాధాకుమారి కూడా తనకున్న నటనానుభవంతో చలనచిత్ర సీమలో కాలుపెట్టాలని ప్రయత్నిస్తోంది. కాని ఆ రోజుల్లో సినిమాల్లో నటించడం అంత సులభం కాదుకదా! కొండల రావుగారి సిపార్స్ మీద తొలిగా, డబ్బింగుకు ప్రయత్నించడం. మొదలు పెట్టింది,రాధాకుమారి. రాధాకుమారిని తీసుకుని, డబ్బింగుకు ప్రయత్నాంచే సమయంలో వివిధ స్టుడియోలకు, కలిసితిరగడంతో వాళ్ళ మధ్య ప్రేమ చిగురించింది. కొంతమంది పెద్దలు కూడా, ముళ్లపూడి వెంకటరమణగారిలాంటి వాళ్ళు- ఇలా తిరక్కండి, హాయిగా పెళ్ళిచేసుకోండి, అంటూ సలహా ఇచ్చారు. కొండలరావుగారు కూడా ఇష్టపడ్డాం. ఇంట్లోనే ఒకనటి ఉంటుంది. ఇకనాటకాలు వేసుకోవడానికి ఇబ్బందేం ఉంటుంది. ఇంతకు ముందులా, స్త్రీ పాత్రలు లేని నాటకాలు వ్రాసుకోనక్కరలేదు. స్త్రీ పాత్రలతో నాటకాలు వ్రాస్తే, భార్యకు భార్య నటికి నటి కలిసివస్తాయి" అనుకున్నారు. మొదట పెద్దవాళ్లకి ఈ విషయం నచ్చలేదు. కొండలరావుగారి తల్లి ముందు సమ్మతించకపోయినా తర్వాత మీ ఇష్టం. అంది.

          పెళ్లి పత్రికలు, శుభలేఖలు కళ్యాణమంటపాలు ఏమివేవు. ఇద్దరూ ఒకరోజు తిరుపతి వెళ్లి స్వామి సాక్షిగా అక్కడే రాధా కుమారి మెళ్ళో తాళికట్టారు. రావికొండల రావుగారు, 1960లో.

          రావికొండలరావు, రాధాకుమారి దంపతులకు కుమారుడు శశికుమార్, కోడలు లత, మనమలు రవికిరణ్, సాయి కిరణ్, కొండలరావు గారి భార్య శ్రీమతి రాధాకుమారి 2012 మార్చ్ లో తనువు చాలించారు. అప్పటి నుండి శ్రీ కొండలరావుగారి ఆరోగ్యం  తరచుగా ఇబ్బంది పెడుతూండేది.

          అయినా ఎప్పుడూ నలుగురు కావాలని కోరుకునే కొండలరావుగారు, సాహితీ, సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటూ, తను హుషారుగా ఉండడమే కాకుండా, తన చుట్టుపక్కల ఉన్న వాళ్లను కూడా అందరినీ చైతన్యవంతులుని చేయడమే గాకుండా నవ్వుల్లో ముంచెత్తుతూండే వారు.

          కొండలరావుగారు చేసిన తొలి సినిమా రచన "చల్లని నీడ'. దీనికి తాతినేని రామారావుగారు దర్శకుడు. 1968లో విడుదలయ్యింది. కానీ ఎందుకో ఆ సినిమా అంత విజయవంతం కాలేదు. అప్పటికే ఆయన (కొండలరావుగారు) సినిమాపత్రిక 'విజయచిత్ర లో సబ్ ఎడిటర్ గా పనిచేస్తుండేవారు. ఆరోజుల్లోవిజయచిత్రా పత్రిక చాలా ఆకర్షణీయంగా,బహుళ జనాదరణపొందిన పత్రికగా పేరొందింది. ఆ పత్రిక  అంత ఆకర్షణీయంగా రూపొందించడంలో కొండలరావుగారి కృషి ఎంతైనా ఉంది. కొండలరావుగారు విజయచిత్రా పత్రికలో 1966 నుంచి 1992 వరకు పనిచేసారు.

          అదేవిధంగా కొన్నితరాల పిల్లలకు, పెద్దలకు కధామృ తాన్ని అందించిన 'చందమామ పత్రిక నిర్వహణ, కథల ఎంపికలో కీలక పాత్ర పోషించారు, శ్రీ కొండల రావు. అలా విజయా సంస్థకు అత్యంత ఆప్తుడిగా, నమ్మకస్థుడుగా ఉన్నందువల్లే కాబోలు... - చందమామ విజయా కంబైన్స్  నిర్మించిన బృందావనం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం వంటి చిత్రాల రచన, నిర్వహణ బాధ్యతలను ఆయనకు అప్పచెప్పాల్సిందిగా నాగిరెడ్డి సూచించారు. రావి కొండలరావు ఆ బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించారు.

          రావి కొండలరావు- రాధాకుమారిల జంట ఎన్నో సినిమాల్లో భార్యాభర్తలుగా నటించారు. వారిద్దరూ దాదాపు 128 చిత్రాల్లో భార్యాభర్తలుగా నటించారు. భార్యాభర్తలుగా ఉంటూ సినిమాల్లో సెంచరీ కొట్టిన జంట మాది' అని ఆయన చెప్పేవారు.  ఇదో రికార్డు.

          'బంగారు పంజరం' సినిమాలో ఆయన నటనకు ఉత్తమ సహాయనటుడుగా నంది పురస్కారం లభించింది.

          'పెళ్లి పుస్తకం చిత్రానికి ఉత్తమ కథారచయితగా నంది అవార్డ్ వచ్చింది.

          కాలమిస్టుగా ఆంధ్రప్రభ వారపత్రికలో'బ్లాక్ అండ్ వైట్ పేరుతో వ్యాసాలు వ్రాసారు. ఆ వ్యాసాలతో వచ్చిన గ్రంధానికి ఉత్తమ సినీ రచన కేటగిరీలో నంది అవార్డు వచ్చింది.

          ఇక రావికొండల రావుగారి పప్రస్థానం చెప్పాలంటే---

·         రంగస్థలం మీద తొలి పాత్ర -10వ ఏట

·         తొలిబాలల రచనలు - 1946-1947 ('బాల' పత్రిక)

·         అచ్చయిన మొదటికథ-దైవేచ్చ (యువ 1948)

·         తొలినాటిక - 'స్వయంవరం (1952)

·         ప్రసిద్ధనాటిక –కుక్క పిల్ల దొరికింది (భారతి 1956 డిసెంబర్)

·         తొలి పత్రికా ఉద్యోగం - ఆనందవాణి (1956)

·         సినిమాల తొలివేషం - శోభ (1958)

·         వివాహం –రాధాకుమారి తో (1960)

·         ఆంధ్రజ్యోతి సినిమా విలేఖరి- 1965

·         పేరుతెచ్చిన చిత్రం - ప్రేమించి చూడు' 1965

·         'విజయచిత్ర' పత్రిక నిర్వహణ - 1966-1992

·         ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం - బంగారు పంజరం(1969)

·         దర్శకత్వం వహించిన తొలినాటిక  - స్వయంవరం

·         ఆలిండియా రేడియో నాటికలు - 100(ఇదొక రికార్డు)

·         పేరు గాంచిన నాటకాలు – నాలుగిళ్ళ చావిడి, పట్టాలు తప్పిన బండి, ప్రొఫెసర్‌ పర బ్రహ్మం(దేశ వ్యాప్తంగా 50సార్లు ప్రదర్శితం)

·         స్వర్ణ నంది - పెళ్లిపుస్తకం కథకు (1992) .

·         ఉత్తమపుస్తకానికి నంది పురసారం -బ్లాక్ అండ్ వైట్ (2005)

·         హైదరాబాదుకు 2001 లో వచ్చారు.

          ఇక అవార్డులు, రివార్డుల విషయానికి వస్తేనాటకరంగం లో చేసిన సేవకు 2001లో పొట్టి శ్రీరాములు విశ్వవిధ్యాలయం వారి పురస్కారం;‘కన్యాశుల్కంసీరియల్ కు (దర్శకుడు) 2004 లో 9 నంది పురస్కారాలు; 2008లో యు.ఎస్. ఎ. వారి రామినేని ఫెండేషన్ అవార్డ్; గరిమెళ్ల రామ్మూర్తి రంగస్థల పురస్కారం;2009లో జంధ్యాల స్మారక  పురస్కారం, భారత్ కల్చరల్ ఇంటెగ్రేషన్ కమిటీ బహుమానం (రూ.1,00,116తో), విన్నకోట రామన్నపంతులు రంగస్థల పురస్కారం, 2010లో నల్లమిల్లి మూలారెడ్డి నాటక పరిషత్ రంగస్థల పురస్కారం, 2011లోఏఎన్నార్ స్వర్ణ కంకణం, సమైక్య భారతివారి రావికొండలరావు నాటుకోత్సవం సందర్భంగా సన్మానం, నిజామాబాద్ నాటక పరిషత్ వారి స్వర్ణోత్సవ సందర్భంగా పురస్కారం, 2012లో ఎమినెంట్ జర్నలిఫ్ట్ అవార్డ్, నండూరి సుబ్బారావు పురస్కారం, వంగూరి ఫౌండేషన్ (యు.ఎస్.ఎ.) వారిచే లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డ్;2014లతో కొండలరావు 82వజన్మదినాన్ని పురస్కరించుకుని రవీంద్రభారతిలో గురు సత్కారం, లక్ష రూపాయల నగదుతో అజో-విభో-కందాళ ఫౌండేషన్ వారి జీవితకాల సాధనపురస్కా రం .2015లో ....

          ఇంకా అనేకానేక సన్మానాలు, పురస్కారాలు . . . ,

          రావికొండలరావుగారినైజం విభిన్నంగా ఉండేది. వారు ఉన్న దానితో సంతృప్తి చెందేవారు. బాల్యం నుంచి అన్నింటిలో ముందుండాలనీ, గెలుపు సాధించాలనీ, అందరూకోరుకున్నట్లు వారు కోరుకోలేదు. ఎక్కడికక్కడ సర్దుబాటు చేసుకోవడమే వారికిష్టం కాబోలు, చదువులోనైనా అంతే, చేసిన ఉద్యోగాల్లోనైనా అంతే, నటించిన సినిమాల్లోనైనా అంతే, వ్రాసి ప్రదర్శించిన నాటకాల్లోనైనా అంతే. నాటక ప్రదర్శనలు జరుగుతూంటే ఎంతో పెద్ద పెద్ద పేరున్న సంస్థలు పోటీలో పాల్గొంటుండగా,వాటికి బహుమతులు ఖాయమనుకుంటున్న సందర్భాల్లో, అనూహ్యంగా వారి నాటకానికి బహుమతి రావడం జరిగేది. కొండలరావుగారు సరసచతురుడు . హాస్యానికి పెద్దపీట  వేసేవారు. వారు మాట్లాడుతుంటే రోజులు సైతం నిముషాల్లా గడచిపోతాయి.

          వారిచతురోక్తులు విందామని కాబోలు ఆభగవంతుడు కొండలరావుగారిని88 సంవత్సరాల వయసులో తనదగ్గరకు పిలిపించుకున్నాడు. జులై 28 వతేదీ హటాత్తుగా గుండె పోటుతో హైదరబాదులో ఒక ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూకన్నుమూసారు. తనకెంతో ఇష్టువైన శ్రీబాపు-రమణ గార్లతో ఇష్టాగోష్టి జరపడానికి సురలోకానికి తరలిపోయారు. అశేష సాహితీలోకం, చలనచిత్ర పరిశ్రమ, శ్రీ కొండలరావు మృతికి నివ్వెరపోతూ, నివాళులర్పించింది. ఒక బహుముఖప్రజ్ణాశాలి నింగికెగసి,కాంతులు విరజిమ్మాడు.

*****

          శ్రీకొండలరావు బాబయ్యగారితో నాకున్న ప్రత్యక్ష పరిచయం సుమారు 2 సంవత్సరాలు , వారు అధ్యక్షులుగా ఉన్న"సాహిత్య సంగీత సమాఖ్యలోనూ, 'సునాద వినోదిని"లోనూ నేనుకూడా సభ్యుడిగా ఉండడం, ఆకార్యక్రమాల్లో కొద్దిగా ఉత్సుకతతో పాల్గొనడం వల్ల నాకు వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. వారినెప్పుడూ బాబయ్యగారని పిలచేవాడిని ప్రతి నెలా రెండవ ఆదివారం, మోతీనగర్‌లోగల వారింట్లో జరిగే సమావేశా లకు వీలు కుదిరినపుడల్లా వెళ్లడం, శ్రీ ఆకెళ్ల సిరివెన్నెల, వైజాగ్ ప్రసాద్,రాళ్లపల్లి, రేలంగి నరసింహారావు, శ్రీమతి విజయదుర్గ,మొదవైన హేమాహమి లతో పరిచయాలు ఏర్పడడం, అడపాతడపాశ్రీ కొండలరావు బాబయ్య గారు కూడా ఫోన్లో పలకరించడం ఒకమహద్బాగ్యంగా పేర్కొనదగ్గ విషయం. కొండలరావుగారితో పరిచయం అయ్యాక వారు నిర్వహిం చిన సమావేశాల్లో సుమారు 6,7 సమావేశాల్లో నేను పాల్గొనడం జరిగింది.

          ఈపైన తెలిపినవిషయాలన్నీ కొండలరావుగారి జీవన ప్రయాణం గురించి సవివరంగా తెలియ చెప్పిన ఈ కథనం. శ్రీరావి కొండలరావుగారి స్వీయ రచన  "నాగావళినుంచి మంజీరవరకు” (ఒకవిధంగా ఆయన ఆత్మకథ) నుంచి సేకరణే. అంటే ఒకవిధంగా ఈ వ్యాసానికి ప్రేరణ, రచనకూడా శ్రీ రావి కొండలరావు బాబయ్యగారే.

          దీనితో ఆ మహానుభావుడితో నేనుకలిసి తీసుకున్న ఫొటో కూడా పంపుతున్నాను. అతి తక్కువ పరిచయం ఉన్నవారు మాకు పంచిన ప్రేమానురాగాలు అనన్యమైనవి. వారికి సద్గతులు కలగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ - ఈ వ్యాసం.

***

No comments:

Post a Comment

Pages