గోపాల శతకము - సత్యవోలు సుబ్బారావు - అచ్చంగా తెలుగు

గోపాల శతకము - సత్యవోలు సుబ్బారావు

Share This

 గోపాల శతకము - సత్యవోలు సుబ్బారావు

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం
 


కవి పరిచయం:
గోపాల శతక కర్త సత్యవోలు సుబ్బారావు పీఠికాపుర నివాసి. తల్లి వేకమాంబ, తండ్రి వేంకటరత్నం.
ఈకవి తనగురించి ఈశతకములో ఈవిధంగా చెప్పికొనినాడు.

సీ. సకలభూతములను సదయతఁ బాలించు, కుంతిమాధవుండు మా సొంతవేల్పు
అగజాసమేతుఁడై యలరు కుక్కుటరూప, ధరుఁడు శంకరుఁడు మాదైవతంబు
గయలందు మిగులఁ బ్రఖ్యాతి గాంచిన పాద, గయ మాకుఁ దీర్థ విఖ్యాత భూమి
రాజాధిరాజు శ్రీరావు సూర్యరాయ, మహిపతి మమ్మేలు మనుజవిభుఁడు
ఆ. వినుత సత్యవోలు వేంకటరత్నమం
త్రికిని వేంకమాంబికకును సుతుఁడ
సుజనహితుఁడ నన్ను సుబ్బరాయండండ్రు
కాపురంబు పీఠికాపురంబు.

క. పరమేశ్వర! యీశ్వరవ
త్సరమున ఫాల్గుణబహుళదశామినాటికినేఁ
బరిపూర్తిచేసి యిడితిన్
వర చరణసమర్పణముగ వరగోపాలా!

ఈకవి ఇతర రచనల గురించిగానీ మరే విషయములు దొరకలేదు.

శతక పరిచయం:  

ఈశతకం 1933 సం|| లో ప్రచురింపబడినది. భక్తి రసప్రధానమైన ఈ కందపద్య శతకంలో  108 పద్యాలున్నాయి. భాష సరళంగాఉండి అందరికి సులువుగా అర్థం అయ్యేరీతిలో రచింపబడినది.
కొన్ని పద్యాలను చూద్దాము.

కం. వందనము నందనందన!
సుందరవదనారవింద! శుభగుణబృందా!
వందిత నిర్మల సనకస
నందనహృత్పద్మభృంగ! నవగోపాలా!

కం. ఎందఱినో కాచినా వని
యెందఱొ సెప్పంగ వింటి నిది నిజమేనా?
సందియము నొందె నామది
వందితపాదారవింద! వరగోపాలా!

కం. తలఁచెద ననుదునమును నినుఁ
బలుకుము దయగల్గియొక్క పలుకది చాలున్
వలదందు నితరములు నా
వలనం గృపఁజూపరాదె? వరగోపాలా!

కం. గోవర్ధనగిరియంతటి
లావుంగల నగము బంతిలాగున వడిగా
లేవఁగ నెత్తిన నీకున్
భావింపఁగ భారమైతినా గోపాలా!

దశావతారములన్ని ఒకే పద్యంలో చొప్పించిన ఈకందపద్యం చూడండి

కం. ధర మీన కూర్మ కిటి కే
సరి వటు భృగురామ రామచంద్రాది మహా
స్థిర రూపములెత్తుచు నీ
ధర నేలితివయ్య సౌఖ్యదా గోపాలా!

ఈశతకంలోని చాలా పద్యాలు కృష్ణశతకంలోని పద్యాలకు అనుకరణలుగా కనిపిస్తాయి. ఉదాహరణకు ఈ క్రింది పద్యాలను చూదండి.

కం. ఉదరమున విశ్వమంతయుఁ
గుదురుగ నిలుపుకొని దానిఁ గుతుకముతోడన్
బదిలంబుగఁ బాలించెడి
సదయాత్మా! పరమపురుషా! గోపాలా!

కం. కాళిందిమడుఁగునకుఁ జని
కాళాహిశిరంబుమీద గంతుల నిడఁగాఁ
జాలితివా? నను దయతోఁ
బాలింపఁగ నీవు చాలవా? గోపాలా!

చక్కని సులభమైన భాషలో అందరికి అర్థం అయ్యే రీతిలో రచించిన ఈశతకం మీరూ చదవండి. మీ మిత్రులతో చదివించండి.

***

No comments:

Post a Comment

Pages