జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 33 - అచ్చంగా తెలుగు
జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 33

                                                                                   చెన్నూరి సుదర్శన్ 

(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్  తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతాడు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.) 

“అది మనలాంటి బక్రాలకు.. క్లాసు సమయానికి రావడం.. క్లాసు అయిపోగానే పరుగెత్తడం.. ఒకరికి కిరాణా షాపు.. మరొకరికి చిట్‍ఫండ్ కంపెనీ.. ఇలా ఎవరి వ్యాపారాలు వారివి.. ఉరుకులు.. పరుగుల జీవితం కొందరికి కాలేజీ పార్టు టైం జాబ్.. అందుకే స్టాఫ్‍రూమ్ ఎప్పుడూ ఖాళీగానే కనబడుతుంది”

నేను ఆశ్చర్యపోయాను. 

పరుగు పందెంలా పంతుళ్ళు ఉంటే.. కాలేజీలేలా బాగుపడునోయ్.. అంటూ ఒక దేశభక్తీ గీతానికి పేరడీల వినిపించింది మనసులో..

ఇద్దరం కలిసి నాలుగడుగులు వేసామో..! లేదో..! మా వెనకాలే కాంతయ్య రావడం గమనించాను. ఇక తప్పదన్నట్లు నేను వెనుతిరిగి  కాంతయ్యను ఆహ్వానించాను.

కాంతయ్య ముఖంలో ఫ్లడ్ లైట్స్ వెలిగాయి. ఉత్సాహంగా పరుగులాంటి నడకతో వచ్చి మాతో కలిసాడు. 

ముగ్గురం కలిసి ఇరానీ టీ హోటల్‍కు వెళ్లాం. 

కాంతయ్య ఆవురావురుమంటూ టీ తాగేసాడు. ఖాళీ కప్పును టేబుల్‍పై పెడ్తూ..

“సార్.. నాకు లాస్ట్ పీరియడ్ వుంది.. వస్తాను” అంటూ సుడిగాలిలా వెళ్ళిపోయాడు.

“ఎందుకంత ఉర్కులాట.. ఉంటే.. బిల్లు పే చేయాల్సి వస్తుందని కాబోలు” అన్నాను. 

భూమయ్య ఖాళీ కప్పును  పక్కకు పెట్టి పదిసెకన్ల పాటు నవ్వాడు.          

“సార్.. కాంతయ్య  బిల్లు పే చేయడమంటే సూర్యుడు పడమట ఉదయించినట్లే..” అంటూ బలవంతంగా నవ్వాపుకొని “అతడొక పరాన్న జీవి.. అందుకే తన సంసారాన్ని చేజేతులా కొల్లేరు చేసుకున్నాడు”

నేనూ టీ తాగడం పూర్తి  చేసి.. భూమయ్య వంక విషయం చెప్పమన్నట్లుగా చూసాను. నా ముఖకవళికలను అర్థం చేసుకుంటూ “సూర్యప్రకాష్ సార్ మీరు ‘అహనాపెళ్ళంట’  సినిమా చూసారా?” అంటూ అడిగాడు భూమయ్య. 

“చూసాను”

“అందులో కోటా శ్రీనివాసరావు.. రాజేంద్రప్రసాద్‍ల పాత్రలు తెలుసు కదా.. అలాంటి పాత్రే మన కాంతయ్యది”

“అంటే పిసినారా?”

“పిసినారా..! అని మెల్లగా అంటారేంటి? సార్... పరమపిసినారి.. మహాపిసినారి.. పిసినారిసంఘానికి అధ్యక్షుడనుకో” 

“అయితే కాంతయ్య సార్ కథ వినాలిసిందే. పద.. మనం మన కంప్యూటర్ గదికి వెళ్లి మాట్లాడుకుందాం” 

టీ సర్వ్ చేసిన అబ్బాయికి డబ్బులిచ్చి ఇద్దరం తిరిగి కాలేజీకి బయలు దేరాం. 

కంప్యూటర్ గది తాళం తీసి కూర్చున్నాం . 

వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. గది ముందు వేప చెట్టు ఏ.సి. గాలినందిస్తోంది.

“భూమయ్య సార్.. కాంతయ్య కథ కానివ్వండి” అంటూ ప్రోత్సహించాను.

“ప్రకాష్ సార్.. మన లెక్చరర్లకు గౌరవప్రద  స్యాలరీస్  ఇస్తుంది ప్రభుత్వం. అయినా అంత కక్కుర్తి పడటం మంచిది కాదు.

కాంతయ్యకు ఇద్దరాడ పిల్లలు. రత్న మాణిక్యాలు. వజ్రాలనుకో.. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. వారి గురించి ఎంత పొగడినా తక్కువే.. అలా ఉంటారు పిల్లలు. కాంతయ్య నోట్లో నుండి ఊడిపడ్డట్లు మెరిసి పోతూ ఉంటారు. కాంతయ్య సతీమణి కళావతి సాధారణ రూపం.. సామాన్య గృహిణి. 

ఈ ఊళ్లోనే కమ్మరి కాలనీలో కాపురం. వీరి ఇంటి ప్రక్కనే ఒక ప్రైవేటు కాలేజీ లెక్చరర్ కనకారావు బ్యాచలర్. కాంతయ్య, కళావతి బలహీనతలను బాగా ఒంట పట్టించు కొన్నాడు. కళావతిపై కన్నేశాడు.. లొంగదీసుకోవాలని పథకాలు పన్నాడు. 

మెల్లగా కాంతయ్యతో సాన్నిహిత్యం పెంచుకొని ఇంట్లోకి బియ్యం.. పప్పు.. ఉప్పూతో సహా సర్వం సమకూర్చే వాడు. ఇంట్లో పనుల్లో చేదోడు వాదోడుగా ఉండే వాడు. కాంతయ్య తెగ సంబరపడి పోయే వాడు. మిణుగురు పురుగుల వెలుతురుంది కదా అని కరెంటు కట్ చేసే రకం.

(ఇంకా ఉంది)   

No comments:

Post a Comment

Pages