నేర్చుకున్నాను
కళ్ళే వేంకటేశ్వర శాస్త్రి
ముత్తు లింగం కిళ్లీ కొట్టు దగ్గర ఆగమని సత్తిగాడు చెప్తే - సరేనన్నాను... వీడొకడు... పొద్దున్నే తగులుకున్నాడు నన్ను... సైకిల్ ఎక్కడ ఆపాలో తెలియటం లేదు... ఆ హోటల్లో కాదుకానీ.. హోటల్ ఎంట్రెన్సు లో! దాని ముందు అడ్డదిడ్డంగా సైకిళ్లు, స్కూటర్లు.
సైకిల్ అపాను, ఇంతలో సర్రున వచ్చిన ఆటో రిక్షా వాడు నా సైకిల్ ని ధన్ మని గుద్ది “కళ్లు కనిపించట్లేదా బక్క నాకొడకా..." అని గుర్రుమన్నాడు. ఆటోలో జనం మెచ్చుకోలుగా చూస్తుంటే, ఆ సంగతి అద్దంలో చూసి తెగరెచ్చిపోతున్న వాడ్ని "ఇంత పక్కగా ఆపాను, “నన్ను తిడతావేం" అన్నాను - కోపాన్ని ఆపుకుంటూ.
"ప్రక్కగానా... అంటే ఏమిట్రా... నేనే స్పీడుగా వచ్చి నీ సైకిల్ ని ముద్దెట్టుకున్నానంటావ్.." అన్నాడు డ్రైవర్ గాడు ఇంజన్ ఆపు చేస్తూ - వీరావేశంతో.
జరగబోయే 'ఫ్రీ షో ' చూద్దామని జనం పోగవడం మొదలైంది. నేనేమంటానోనని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న జనం - ఏమీ అనకపోయేసరికి నొచ్చుకొని, నన్ను నాలుగు తిట్టి, వాడితో “పాపం.. ఓడిపోయి శరణుజాచ్చిన వాడిలా ఉన్నాడు... పోనీలే బాబూ.... పాపం అనుకో.... ఆటోకేం కాలేదు కదా..." అన్నారు.
“తాగుబోతు ఎధవలు - ప్రొద్దున్నే బజార్న పడతారు. ఒరేయ్ ఏమిట్రా ఆ చూపు? గుడ్లు వత్తేస్తాను... ఏం కొడతావా?” అని డ్రైవర్ గాడు తన సీట్లోంచి లేవబోతున్నాడు.
అప్పుడు వినవచ్చిందో సన్నని కంఠం... ఆటో లోపలి భాగం నుండి “పోనిద్దూ... రమణారెడ్డి లాగున్నాడు..."
నా ఎర్రని మొహం మరింత ఎర్రబడుతుండగా, లోపలికి చూశాను - ఇలియానా ఎవరైనా ఉన్నారేమోనని.... కానీ, కాదు... గజాలా అంతకన్నా కాదు... కోకిల స్వరం... బాబూ మోహన్ గారి బంధువుంది.
గాంధీగారు గుర్తొచ్చారు. సైకిల్ని కొంచెం దూరంగా ఆపి, స్టాండువేసి, కిళ్ళీ కొట్టు వైపు నడుస్తుండగా కొట్టులో నుండి నరసింహం - కిళ్ళీలు తప్ప మరేదీ తినని నోటిలోంచి తన గార పళ్ళని ప్రదర్శిస్తూ "ఏంటి పరుచూరీ... ఏమైందీ సారీ?” అన్నాడు.
నేను సినిమా కథ వ్రాయబోతున్నానని చెప్పినప్పటి నుండీ - వాడు నన్ను అలాగే పిలుస్తున్నాడు. ఏమవుతుంది నరసింహం జీవితమే ఓ రణరంగం" అన్నాను.
ఓ వెర్రి నవ్వు నవ్వుతూ...
ప్రక్కనున్న మార్వాడీ తుపుక్కున దమ్మి, నవ్వాడు. నా షర్టు మీద వాడి జర్దా మరకలు... జాలిగా వాటివంక చూస్తున్న నన్ను చూసి చూడనట్లే, మార్వాడీగాడు "అరె - సౌండు పెంచు - ధర్మేందర్ - క్యామస్త్ మస్త్ హై..." అంటూ ధర్మేందర్ ని ప్రేమగా అజ్ఞాపించాడు. టేప్ రికార్డు వంక చేతి వేలితో చూపిస్తూ! ధర్మేందర్ మితభాషి.
కాసేపు నిలబడ్డాను "నా కిళ్ళీ ఏమైంది?" అని అడిగాను ఆ ఇద్దర్నీ. నేను వచ్చి ఇరవై నిమిషాలైం ది. నా తరువాత వచ్చిన వాళ్ళందరికీ కిళ్ళీలు ఓ వంద కట్టి ఉంటారు... ఆగలేక ఆ మాటే అన్నాను.
“సారీ పరుచూరీ... రేయ్ వెయ్యరా సాదా.. తమలపాకు సార్ కి" అని మళ్ళీ నవ్వాడు నరసింహం.
ఇంతకీ మీ సినిమాకి - మార్నింగ్ షోకి టిక్కెట్లు దొరుకుతాయో లేదో మాకు వారం ముందు చెప్పాలి మరి" అన్నాడు వాడు.
నిముషంలో కిళ్ళీ కట్టడం అయిపోయి నా చేతిలోకి వచ్చేసింది. నేను దాని వంక పరిశీలనగా చూసి "అరె... అందరికీ జర్గా ఎక్కువ వేస్తావు.... నేనేం పాపం చేశానయ్యా స్వామీ!" అన్నాను. అంటీ అంటనట్టు అంటించిన జర్దావైపు వెల వెల బోయి చూస్తూ...
"నెలకోసారి కనిపిస్తావు - జర్దారేటు పెరిగిపోవటం లేదూ?” అన్నాడు మూలనున్న ముత్తులింగం.
ఛీ! ఎపుడూ ఇంతే! ఇక్కడ కాస్తా బాగా కడతారని వస్తే అదేమిటో నన్ను చూస్తే వీళ్ళకి కుక్కని చూసినట్టుగా ఫీలింగు కిళ్ళీ నోట్లో దూర్చి ఏ దవడకి బిగించాలా అని క్షణం తటపటాయించి... కుడివైపున సెటిల్ చేసుకున్నాను. క్షణంలో కళ్ళు బైర్లు కమ్మాయ్.
ఇంతలో నలుగురు వెధవలు తూలుతూ వచ్చి నన్ను... జస్ట్ అలా ప్రక్కకి జరిపారు. తూలి గజం దూరం వెనక్కొచ్చి పడబోయి నిలదొక్కుకున్నాను.
“జర్దా ఎక్కువైనట్లుంది. అసలే హీరో పర్సనాలిటీ... అందులో ఈ జంకి కిళ్ళీ ఒకటా... ఛస్తావు..... ఎందుకయ్యా... ఈ దురలవాటు..." ఓ విలన్ గాడు రెండు దవడల్లో రెండు కిళ్ళీలు బిగించి ఖరీదైన సిగరెట్ పొగ నా మొహం మీద వదుల్తూ హితవు పలికాడు.
“జర్దా ఎక్కువై కాదయ్యా బాబూ - సున్నం.. సున్నం ఎక్కువై దవడ పగిలిపోయింది" అన్నాన్నేను... నాలుక, దవడ బుగ్గలు మండుతుంటే...
"ఎవడ్రా వాడు - మా ముత్తులింగం కిళ్లీకి వంకపెట్టే మొనగాడు..." అంటూ ఓ దేవదాసు మీద మీదకు రాసాగాడు.
"అది కాదు సార్... నా... నాలుకే... పుండుగా వుంటేనూ..." అంటూ ప్రక్కకి తప్పుకున్నాను. జేబులో చెయ్యి పెట్టి డబ్బు కోసం వెదకసాగాను. జేబులో కాగితాలు తప్ప నాణేలు తగలడం లేదు. గుండె గుభేల్ మంది. మైకం వదిలిపోయింది. చుక్కలు కనిపిస్తున్నాయ్. పట్ట పగలే! అప్పుడు తగిలింది - జేబుకి మూలనున్న చిన్న రంద్రం! ఐదు రూపాయల నాణేలు ఉండాలి! జరిగిందేమిటో అర్థమై పోయింది. జరగబోతున్న దృశ్యం కళ్ళముందు కనిపిస్తోంది.
"పరుచూరీ... డబ్బులు....” అంటున్నాడు నరసింహం.
''డబ్బులు పోయాయి నరసింహం... జేబుకి చిల్లు! చూసుకోలేదు. ఓ గంట ఆగి వచ్చి ఇస్తా...." గబగబా చెప్పాను. ధైర్యం జారిపోతున్నా కూడగట్టుకుంటూ! ఇంక నరసింహం ఎన్ని తిట్లు తిడతాడో, అక్కడ జనం నన్ను ఎంత వింతగా చూస్తారో!. తెలుసు! ఏం చేసేది?
“చిల్లి గవ్వ ఉండదు.. చల్లిజేబు తప్ప... జర్దా ఎక్కువేయాలట... సున్నం ఎక్కువైందట... సినిమా కథ రాస్తాడట. ఇదిగో! బ్రహ్మానందంలా చూడకు! ఈ మొహానికి సినిమా కథొకటి. బానే కథలు చెప్పటానికి..."
"సినిమానా? వీడా? ఎవడో కుర్రవెధవ మధ్యలో దూరి అందుకున్నాడు.
మరొకడు శిష్యునిలా అభినయిస్తూ వచ్చి "ఎవరుసార్ హీరో?” చిరంజీవి కొడుకా?” అన్నాడు పళ్ళికిలిస్తూ.
నరసింహం అక్కడ నుంచే మొదలెట్టాడు "నాగార్జున కొడుకు - రాఘవేంద్రరావు డైరెక్షన్ - ఇలియానా, జెనీలియా, ప్రియమణి, ఆసిన్ కాంబినేషన్లో....
అక్కడున్న జనమంతా నన్ను వేరే గ్రహం నుంచి జారి, ఈ లోకంలో పడ్డ వింతజీవిని చూస్తున్నట్లు చూడసాగారు. రకరకాల కామెంట్లు విసుర్తూ, పడి పడి నవ్వుతున్నారు.
నాకు నరాలు తెగిపోయినట్లుగా ఉంది. ఎవడో గొంతు నులిమి ఊపిరాడకుండా చేస్తున్నట్లుంది, జాకా చీన్ లోనో, బ్రూస్ లీలానో అక్కడున్న అందర్నీ చితకతన్నాలనే ఆలోచన వస్తోంది... కానీ...
అదిగో సత్తిగాడు ... వీడు... వీడ్ని చావగొట్టాలి ముందు... వాడు నెమ్మదిగా, హాయిగా, ఈల వేసుకుంటూ నడుస్తూ అక్కడి నుంచి వస్తున్నాడు.
నేను అన్నీ వింటూ సహిస్తూ, రెండు క్షణాలు మౌనంగా అలాగే నిలబడి అందర్నీ కెమెరా ఒక్క రౌండ్ తిప్పినట్లుగా పరిశీలనగా చూడటం ప్రారంభించాను.
సత్తిగాడు దగ్గరగా వచ్చాడు. కానీ సిగరెట్ కోసం కిళ్ళీ కొట్టువైపు మరలాడు. చటుక్కున వాడ్ని ఆపడానికి ఒక్క అడుగు వేశాను. ధభేల్న పడిపోయాను. కింద అరటి తొక్క.. నవ్వుతున్నట్లుగా"
అందరూ విరగబడి నవ్వుతున్నారు. ఎంత బాగా నవ్వగలరో - అంత చక్కగా అందంగా.
నన్ను సత్తిగాడు లేపి నుంచోబెట్టాడు. వాడి జేబు వంక చూశాను. ఎత్తుగానే ఉంది.
మెరుపు మెరిసింది. నా బుర్ర అనే ఆకాశంలో!
“ముందు చిల్లరుంటే తియ్...” అన్నాను మామూలు ధోరణిలో - ఐదు రూపాయల కాగితం తీశాడు.
ఆ కాగితాన్ని నరసింహం ముందుకెళ్ళి గిరాటేశాను. నరసింహం నోటు తీసి గాల్లో పరీక్షిస్తున్నాడు " 'వేరే నోటివ్వు" అంటూ తిరిగి నా ముందుకు విసిరేశాడు సీరియస్ గా.
నోటు మధ్యలో కొద్దిగా చిరుగుంది.
పళ్ళ బిగువన అవేశాన్ని అణచుకుంటూ మళ్ళీ గజం వెనక్కి వెళ్ళి వేరే నోటివ్వరా" అన్నాను. మళ్ళీ మామూలుగానే.
వంద చిల్లరుందా - పోనీ" అడిగాను సత్తిగాడిని.
వాడు అనుమానంగా చూస్తుండగా "వందనోటు వుంది. చిల్లర లేదు. వంద లెక్క పెట్టివ్వు..." అన్నాను ఏమాత్రం అనుమానం కనబడనీకుండా.
సుత్తిగాడి నుండి వంద నా చేతికి రాగానే... “ఆగు” అని వాడికి చెప్పాను. వాడికి ఏం అర్థం కాక అలాగే అక్కడే నిలబడిపోయాడు.
అయిదు రూపాయల నోటు నరసింహం ముందుంచాను. మళ్ళీ పరీక్ష చేయబోతున్న నరసింహాన్ని " 'చిల్లర నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాలే" అని చెప్పి సత్తిగానికి నా సైకిల్ కీ ఇచ్చి “ఉండరా ఇప్పుడే వస్తా" అని చెప్పి వడివడిగా రోడ్డు మీదకి నడిచాను.
తుఫాను రేగుతోంది లోపల గుండెలో! నల్ల మబ్బులు కమ్ముకుంటున్నాయ్ - బయట ఆకాశంలో, అయిదే అయిదు నిమిషాలు అనుకున్నదంతా చేసేశాను.
బార్ నుండి బయటపడ్డ నేను - బార్లో మనుషుల ముఖాలు గుర్తొచ్చి నవ్వుకున్నాను. నేను హాఫ్ బాటిల్ ని అగకుండా నీళ్ళు కలపకుండా గడగడా తాగేస్తుంటే - వాళ్ళంతా నన్ను అలెగ్జాండర్లా భావించిన ఫీలింగు! నాకు మళ్ళీ గుర్తుకొచ్చి పెదవులపై చిరునవ్వు రేఖ మెదిలింది.
అయితే నేను ఆ వైపు హాటల్ చుట్టూ తిరిగి ప్రత్యక్షమయ్యాను. రకరకాల కథలు చూసిన సినిమా లు, చదివిన వార్తలు జీవితంలో మింగిన గరళం... నన్ను కంట్రోల్ చేస్తున్నాయ్..
అణుశక్తిని - విధ్వంసానికి మానవకోటి ప్రయోజనానికీ దేనికంటే దానికి ఉపయోగించుకోవచ్చు...
ఇప్పుడు నేను చేయబోయేదీ అదే...
“డ్రంకెన్ మాంక్' ఎదురుగా నేను వాల్ పోస్టర్ని చూశాను. గోవుల గోపన్న పాత టాకీసులో ఆడుతోందట! గోవుల గోపన్న ప్లస్ డ్రంకెన్ మాంక్. .
నరసింహం ముందు ఇందాకటి జనం అలాగే ఉన్నారు.
“నరసింహం - చిల్లరేదీ?” నా కంఠంలో పెరిగిన స్థాయికి ఉలిక్కిపడ్డ జనం అందరూ తలలు తిప్పి నా వంక చూశారు. నా కళ్ళు చింతనిప్పుల్లా కనిపిస్తున్నాయ్ వాళ్ళకి! కానీ నేను గజం దూరంలో ఉన్నాను వారికి సత్తిగాడిక్కూడా అంతే దూరం మెయిన్ టెయిన్ చేస్తున్నాను.
“చిల్లర తీసుకో" నరసింహం అన్నాడు.
“అక్కడి నుంచే విసిరేయరాదూ బిజినెస్ మాగ్నెట్” అన్నాన్నేను.
జనం వంక చూస్తూ నరసింహం "కొద్దిగా జరగండి పరుచూరిగారికి చిల్లరివ్వాలి" అన్నాడు.
జనం జరిగారు. చిల్లర చూశాను. చిరిగిన నోట్లను సరిగ్గా నరసింహం మొహం మీద కొట్టాను. కానీ అవి గురి తప్పి గాలికెగిరి అతని యజమాని ముత్తులింగం ముందు పడ్డాయ్.
"నోట్లు చూసివ్వు మంచివి” గర్జించినట్లుగా అన్నాన్నేను.
ఈసారి ముత్తులింగం నరసింహంని కోపంగా చూశాడు. వేరేనోట్లనీ, చిల్లరనీ ఇచ్చాడు నరసింహం.
"థమ్సప్ బాటిలెంత?" కౌంటర్ చివరి భాగాన ఉన్న ఆ బాటిల్ ని అందుకుంటున్నట్లుగా నటించి, తూలినట్లుగా పక్కన ఇద్దరిమీద పడ్డాను, బాటిళ్లు రెండూ వేగంగా వెళ్ళి రోడ్డుమీద బాంబుల్లా పడ్డాయ్, క్షణం ఆలస్యం చేయలేదు నేను. వెనక్కి తిరిగి మందుబాబుల మొహాల్లోకి చూస్తూ “సారీ బ్రదర్స్ - కాలికి ఫ్రాక్చర్" అంటూ ఒక కాలికి కట్టున్న చిన్న బ్యాండేజ్ ని చూపాను.
నన్ను ఏమనాలో వాళ్ళకి అర్థం కావటం లేదు.
నరసింహం విస్తుపోతుంటే జేబుల్లోంచి ఇరవై నోట్లు రెండు తీసి పడేశాను. కౌంటర్ మీద ఏదో మాట్లాడబోతుంటే “నువ్వింకో కిళ్ళీ కట్టు - ఈసారి సరిగ్గా కట్టు" అని ఇటు తిరిగి సత్తిగాడిని పిలిచి ఆ రోడ్డుమీద గాజు ముక్కల్ని కాలువలో పడెయ్యమని చెప్పాను. వాడికీ ఇంకా ఏం అర్థం కావటం లేదు. కానీ, బుద్ధిగా వెళ్ళి చెప్పిన పని చేశాడు. మధ్య మధ్యలో నావంక చూస్తూనే.
కిళ్ళీ సిద్ధం చేశాడు నరసింహం. నోట్లో పెట్టుకుని వెంటనే “థూ!" అని జనంలోనే ఉమ్మాను “ఇంత జర్దా? అసలు నిన్ను స్వీట్ కిళ్ళీ కట్టమంటే ఇది కట్టావా ?” అని గర్జించాను ఒక అడుగు అటు వేస్తూ...
ఆశ్చర్యపోతున్న నరసింహం "అబద్ధమాడకు” అన్నాడు.
"నేను అబద్ధమాడటమేమిటి?” నా ప్రక్కన ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి చేరారు. వాళ్ళనడిగాను" ఏమయ్యా! నేను ఏ కిళ్ళీ కట్టమన్నానూ” అని "స్వీట్ కిళ్ళీయే కదండీ" అన్నారు ఆ ఇద్దరు కుర్రాళ్ళూ ముక్త కంఠంతో,
జనంలోంచి మరో ఇద్దరు ముందుకు రాబోతుండగా ఆ కుర్రాళ్ళు “ఈ సారి స్వీట్ కిళ్ళీ అనే అన్నాడు" కానీ కాస్త మెల్లగా! మేం విన్నాంగా అంటూ అడ్డుకున్నారు.
"ఆ పాటలాపు సింహం ముందు చెవులు సరిగ్గా పనిచేస్తాయి. శ్రోతలు కోరిన పాటల కొట్టా ఇది? అయితే నేనడిగిన పాట వెయ్ "నీ పాపం పండెను నేడు - నీ భరతం పడతా చూడు' ఉందిగా నీ దగ్గర ఆ పాట - వెయ్....
మార్వడీ 'మస్త్ మస్త్' గాడు ఇటువేపు తిరగ్గానే అప్పటికే కౌంటర్లో తాసులో ముంచిన చేత్తో క్యా షర్ట్ హై భాయ్, క్యా టేస్ట్ హై భాయ్" అంటూ, వాడి షర్టుకి మరకలంటించసాగాను. వాడి కాలు మీద నా కాలిని వేసి చిటికిన వేలుని గట్టిగా తొక్కాను 'సారీ భై సాబ్' అన్నాను. వాడు బాధతో గిల గిల్లాడుతూ ప్రక్కకి జరిగాడు.
మందు బాబుల వైపు తిరిగి “అరే! చక్కని పర్సనాలిటీ వుంది మీకు! నేను రెకమండ్ చేస్తాను. విలన్ ప్రక్కన నిల్చుండాలి ఎప్పుడూ - రెండుమూడుసార్లు హీరో చేత చావు దెబ్బలు తినాలి అంతే. అదీ డూప్ లుంటారుగా.. డోంట్ వర్రీ వేస్తారా?" అన్నాను.
ఇంతలో ఇద్దరు ఆటో డ్రైవర్లు అటుగా వచ్చారు. నా సైకిల్ కి ఆటో ఢీ కొట్టిన డ్రైవర్ గాడు - రిటర్న్ జర్నీలో రావడం గమనించి వాళ్ళకి సైగ చేశాను.
ఆటోని ఆపారు ఆ ఇద్దరూ! వాడిని ఆటో నుండి కాలరు పుచ్చుకొని బైటికి లాగారు. నాకు తెలుసు జరగబోయేది. నేను ఆ ఇద్దరికీ రెండు పెగ్గులు కొట్టించానుగా! ఆ మందు పనిచేస్తోంది. లోపల.
“ఏరా! మా సార్ ని ఏమో అన్నావంట! ఆడవాళ్ళు ఆటోలో ఉన్నారని చూసి రెచ్చిపోయావా? నేను తెలుసుగా ఆటో యూనియన్ సెక్రటరీని, ఇతను తెలుసుగా, మన ప్యానెల్ మెంబరే! మన సంఘం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం... కానీ, నువ్వే తప్పుచేసి అతన్ని తిడతావా?"
డ్రైవర్ గాడిని ఉతికి ఆటోలో పడేశారు. ఈ లోగా సత్తిగాడి జేబు నుండి మరో వంద లాక్కుని, ఆగకుండా వెళ్ళాను బయటికి.
బార్ లో ఇవ్వాల్సిందేం లేదు. నా హాఫ్ కీ, వాళ్ళిద్దరికీ (పెగ్గులకి) వాడింది. ఛీఫ్ సరుకే గనుక లెక్క సరిపోయింది. మరో ఇరవై ఆ ఇద్దరిలో ఒకటికిచ్చి “నా సినిమాలో నీకు వేషాలు గ్యారంటీ - కానీ ఈ అటో డ్రైవర్ గాడు మళ్ళీ మాట్లాడకుండా మాత్రం చూసుకొండి" అన్నారు.
నేను తిరిగి వస్తుండగా జనం కొంచెం అటూ ఇటూ చెదిరిపోవడం గమనించాను.
ఇంతలో ఒక అబ్బాయి తిలోత్తమ నుంచి పరిగెత్తుతూ వస్తూ... “సర్! ఇక్కడ సినిమా స్టోరీ రైటర్ సాయిబాబా గారెవరో ఉన్నార్ట... ఫోన్... రండి.. త్వరగా" అని అరిచాడు.
"నేనే - సాయిబాబాని... పద..." అన్నాను. ఫోన్లో సంభాషణని ఎన్ని చెవులు వింటున్నాయో నాకు తెలుసు.
"ఆఁ.. నేనే సాయిబాబాని.... ఏంటీ ? హన్మకొండ లాడ్జిలో దిగారా? సరే - ఏంటి? ఎప్పుడు? 31వ తేదీకా ? అలాగే... మొత్తం స్టోరీ... ఒక స్టోరీ కాదు... ఆయన అడిగినవన్నీ రెడీ అయ్యా యని చెప్పండి. ఏంటీ హలో... హల్లో... మీరెళ్ళిపోతున్నారా? ఆఁ !. అవును. నేను ఇదిగో ఇక్కడ ఉన్నాను. సరే! మీకు టైం లేదంటున్నారుగా, ఆఁ ... సరే సరే వస్తానని చెప్పండి. డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పండి.
ఫోన్ పెట్టేసి, సైకిల్ పెట్టిన చోటుకి నడుస్తూ సత్తిగాడ్ని కూడా నా వెంట తీసుకెళ్తూ సైకిల్ తీయమని వాడికి చెప్పి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా వెనక్కొచ్చాను.
మళ్ళీ నా కెమెరా కంటిని త్రిప్పితే ఈసారి ముఖాలన్నీ... లైట్ లెస్....
"నరసింహం.." కొట్టు దగ్గర ఆగి క్షణం నిల్చున్నానో లేదో...
“సార్! కిళ్ళీ బాగా కట్టాను సార్! డబ్బులు ఏమీ వద్దు సార్... తరువాత చూసుకోవచ్చంటున్నారు. మా బాస్. సారీ సర్! నన్ను మరచి పోవద్దు సార్...” కిళ్ళీ ఇవ్వబోతున్న నరసింహంతో,
“నాకు ఇక కిళ్ళీల అవసరం రాదు" అన్నాను.
దారిలో ఇద్దరు కుర్రాళ్ళకీ చెరో పాతిక చేతిలో పెట్టి మందుక్కదిలాను... వాళ్ళు ఒకప్పటి నా స్టూడెంట్సే... అదృష్టవశాత్తూ టైంకి అక్కడ కనబడితే విషయం చెప్పాను. స్కూల్లో నాటకాల్లో శిక్షణ ఇచ్చే వాడిని. ఇప్పుడు స్వీట్ కిల్లీ' అనే చిన్న అబద్ధం ఆడించడానికి వాడుకున్నాను.
తప్పదు. ప్రేమిస్తే! ప్రాణమిస్తా.
చులకనగా చూస్తే, నీతి సూత్రాన్ని పక్కన పెడతా...
న్యూటన్ గమన సూత్రం ప్రతి చర్యకీ ప్రతిచర్య ఉంటుంది.
జీవితంలో హాస్యం ఇలా కూడా జరుగుతుందని దొరుకుతుందని, ఇది నా సినిమా స్క్రిప్ట్ లో వాడుకోవచ్చని అనుకుంటూ బయల్దేరాను.
కానీ సత్తిగాడు అసలు నన్ను కిళ్ళీ కొట్టు దగ్గర ఎందుకు ఆగమన్నట్టు?
"ఏరా! ఏదో చెప్తానని పొద్దున్నుంచీ తిరుగుతున్నావ్, ఇక్కడ ఆగమన్నావ్. నీ రెండొందలూ నేను తీసుకున్నాను. ఇప్పుడు చెప్పు." అన్నాను.
“సారీ! అందరూ నీ గురించి సినిమా రైటర్ అని హేళన చేస్తున్నారు. నీ ఆకారం చూసి నిన్ను చులకనగా భావిస్తున్నారు. నేను నీకు ఏదో చెప్పాలని వచ్చాను. కానీ మరచిపోయాను, పోనీలే కానీ, నా విషయం ...”
“రెండొందలేగా, ఆ డైరెక్టర్ గాడి సెక్రటరీ ఓ రెండు వేలు రేపు పంపుతానన్నాడు. రేపు కాకపోతే 31లోగా పంపుతాడుగా! రెండొందలు కాదు నాలుగొందలు తీసుకో.
“అబ్బెబ్బె! అది కాదురా. నాక్కూడా చిన్న వేషం...” నసిగాడు సత్తిగాడు.
“అలాగేరా. నీకంటేనా. పద ఇంటికి...”
ఇంకొక్కరికి డబ్బులివ్వాలి... తిలోత్తమ లాడ్జికి ఫోన్ చెయ్యమని చెప్తే ఆ పనిని విజయవంతం చేసిన మరో మిత్రునికి.
అయితే ఇంతకీ నా కథ సినిమాగా వస్తుందా రాదా అనే డౌట్ మీకూ ఉందా? నాదీ అదే పరిస్థితి! కానీ ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఒక్క విషయం నేను నేర్చుకున్నాను. ఇక ముందు ఇలాంటి సినిమా కథల సంగతులు జరగక ముందే చెప్పకూడదని
***
No comments:
Post a Comment