అన్నమయ్య “ఇల్లాలు” కీర్తనలు-2/3
తాళ్లపాక అన్నమాచార్య శృంగార సంకీర్తన
డా.తాడేపల్లి పతంజలి
రేకు: 1231-3 సంపుటము: 22-183
నీవాడే సరసము నిన్ను నింతసేసెను
యీవేళ నలమేల్మంగ కియ్యవయ్య పంతము ॥పల్లవి॥
పొలతి నీకంపినపూవులచెండు దీసుక
చెలికత్తెనే వేసేవు చెలరేగి
కలికి దవ్వులనుండి కంటినంటా నిమ్మపంట
కొలువులోననే నీకొప్పుదాక వేసెను ॥నీవా॥
వీడెము నీకంపితేను వేగ మే కైకొని యాపె-
వూడిగపుసతి నొర నొగి నించగా
ఆడనే వుండి నీదేవులందుకుదనపుక్కిటి -
వీడెము నీకొంగున వెస మూట గట్టెను ॥నీవా॥
కాతరాన నీవంపినకానికపంచదార
దూతికకుజవిచూపి తోరలించగా
యీతల శ్రీవేంకటేశ ఇల్లాలు మోవితేనె
వాతెర నంటించి నిన్ను వలపించుకొనెను ॥నీవా॥
తాత్పర్యము
॥పల్లవి॥
శ్రీవేంకటేశ ! నువ్వు మా అమ్మ అలమేలు మంగమ్మతో అడే సరసము నిన్ను ఇంత చేసిందయ్యా !( పంతము పట్టుకొనేటట్లు చేసింది)
ఈరోజు, ఇప్పుడే మా అమ్మ అలమేలు మంగమ్మకు నీ పంతము సమర్పించవయ్యా ! ( ఒట్టు తీసి గట్టున పెట్టినట్టుగా మా అమ్మ మీద పంతము ఏదో పెట్టుకొన్నావ్ ! ఆ పంతము విడువమని భావం)
1వ చరణం
శ్రీవేంకటేశ ! తమరువారు ఎంత పనిచేసారు? !
మా అమ్మ అలమేలు మంగమ్మ (పొలతి) నీకు పంపిన పూవులచెండు తీసుకొని పంతముతో దగ్గరగా ఉన్న చెలికత్తెపై దానిని అతిశయించి విసిరేసావా!?
నీ ఇల్లాలయిన మా అమ్మ అలమేలు మంగమ్మ (కలికి) దూరము నుండిఈ కథా కమామిషు చూస్తున్నది. పూల హారము విసిరేసావు కదా ! దెబ్బకు దెబ్బలా- నిమ్మపండ్ల గుత్తిని - సభలో అందరూ చూస్తుండగా నీ తల తాకేటట్లు మా అమ్మ అలమేలు మంగమ్మ వేసింది. బాగా కుదిరిందా?
2 వ చరణం
మా అమ్మ అలమేలు మంగమ్మ నీకు తాంబూలము పంపించింది. వేగంగా ఆ తాంబూలాన్ని ఆమె పరిచారికకు
సౌమ్యంగా అందిస్తావా? ఔరా ! ఎంత సాహసం? ! అక్కడే ఉండి తమరు చేసిన కార్యక్రమము చూసి- ఆ మహా ఇల్లాలు వెతికి వెతికి తనపుక్కిటిలో ఉన్న తాంబూలాన్ని నీ ఉత్తరీయపు కొంగులోవేగంగా మూట కట్టింది. బాగా కుదిరిందా?
3 వ చరణం
శ్రీవేంకటేశ ! ఏదోలే! భర్తగారివి కదా అని భయపడుతున్నట్లు నటిస్తూ - నీ పంతము తగ్గటానికి పంచదార కానుక పంపింది. తమరు ఏం చేసారు? నీ ఇల్లాలు పంపిన పంచదారకానుకను – అదితెచ్చిన దూతికకే రుచి చూపించి పంపిస్తావా? !
ఇక్కడ నీ ఇల్లాలు మా అమ్మ అలమేలు మంగమ్మ ఊరుకొంటుందా? చక్కగా తన పెదవి తేనెను నీ అధరానికి అంటించి నిన్ను వలపించుకొన్నది. జై అలమేలు మంగమ్మ! జై ఇల్లాలు!
***
No comments:
Post a Comment