ఆసరా
లత పాలగుమ్మి
అబ్బబ్బా!! మామయ్య గారూ, మీ మతిమరుపుతో ఛస్తున్నాను. రోజూ అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు. మీకంటే మతిమరుపు..... బుర్ర లేదు...... కానీ నాకుంది కదా..... చెప్పలేక ప్రాణం మీదకు వస్తోంది నాకు ...... అని విసుక్కుంది శ్యామల ఎనభై అయిదు ఏళ్ళు పైబడ్డ మామగారిని.
"పొనీలే శ్యామా!! పాపం..... పెద్దవాళ్ళైపోయారు, ఏదో తెలీక అడుగుతారు" అని అంటున్న భర్త రాఘవ మాట పూర్తి కాకుండానే ఖయ్యిమంది శ్యామల.....
మీరు ఒక రోజంతా ఇంట్లో ఉండి ఆయన ప్రశ్నలకి జవాబులివ్వండి....... అప్పుడు మీకు తెలిసొస్తుంది ఎంత కష్టవెూ. మీ అన్నలు, తమ్ముళ్లు అందర ఫోన్లో తెగ ప్రేమా, జాలి ఒలకబోస్తారు కానీ ఎవరైనా బాధ్యత నెత్తి మీద వేసుకున్నారా।?మీరు తప్పించి.........అత్తయ్యగారు పోయి పదేళ్లు అయ్యింది......... కనీసం ఒక్కసారయినా తీసుకు వెళ్ళారా?? వచ్చి చూసి పోవడమే కానీ.........ఇంక నా వల్ల కాదు.
ఉదయాన్నే ఉరుకులు పరుగులు పెడుతూ మీకు, మీ అబ్బాయికి, కోడలికి బాక్సులు కట్టివ్వడం, కోడలు మనవడిని డే కేర్ లో వేస్తానంటే వాళ్ళు ఎక్కడ బాగా చూడరోనని ఆ బాధ్యత కూడా నా నెత్తి
మీదే వేసుకున్నా, మనవడంటే ముద్దు కొద్ది.
ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ అల్జ్హెయిమేర్ పేషేంట్ ని చూడటం ఇంకో ఎత్తు. మొన్నటికి మొన్న మీ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటానండీ!! “మా ఆవిడకి ఫోన్ చేసి రమ్మంటాను” అని మామయ్య గారు బట్టలు సర్దుకుంటుంటే..... రండి, భోజనం చేశాక వెళుదురు గాని అని చెప్పి సర్ది చెప్పాను. తర్వాత ఎలాగూ ఆయనకు గుర్తు ఉండదు కదాని. ఆయనకు కొడుకు ఇంట్లో ఉంటున్నట్లు గుర్తు ఉండదు, భార్య పోయినట్లు గుర్తుండదు.
రోజూ చూసినా నేనెవరో ఆయనకు గుర్తు ఉండదు....... ఒకోసారి ఆయనెవరో కూడా ఆయనకు గుర్తు ఉండదు. “రోజుకు పదిసార్లు నా పేరేంటమ్మాయ్!? ఇది ఎవరిల్లు!? నేనెందుకు ఇక్కడ ఉన్నాను!? అని అడుగుతారు”. చెప్పి చెప్పి అలిసిపోతున్నా. ఇంక నా వల్ల కాదు ఈయన్ను భరించటం.
“అందరిని కాన్ఫరెన్స్ కాల్ కి పిలవండి. ఆరుగురి దగ్గరా తలా రెండు నెలలు ఉంటే సరిపోతుంది. ఎవరికీ బరువు కాదు. మీరు ఎప్పటిలా నవ్వుతూ కొట్టేస్తే ఊరుకునేది లేదీసారి ........... ఈ రోజు ఏ ఒకటి తేల్చాలి మీరు, అప్పటి దాకా నేను అన్నం మెతుకు కూడా ముట్టను” అని భీష్మించుకు కూర్చుంటుంది శ్యామల.
ఈ సారేదో సీరియస్ గానే ఉందే వ్యవహారం అని టెంషన్గా భార్య కేసి చూస్తాడు రాఘవ్. అతనికి తెలుసు వాళ్ళెవ్వరూ ఆయనని చూడరని. అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెడదామంటే తనకే ఇష్టం లేక ఇంటికి తీసుకు వచ్చాడు. ఇంత మంది పిల్లలున్న ఆయనని హోంలో ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక. “అదీనూ ఈ పరిస్థితుల్లో”.
“ఈ లోగా బామ్మా!! బెద్ద తాతగాలు కనిపించతమ్ లేదు అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ వచ్చి రాని మాటలతో చెప్పాడు మూడేళ్ళ మా మనుమడు రాహుల్”.
వాడి వెనుకే పని అమ్మాయి కూడా వచ్చి "అవునమ్మా పెద్దయ్య గారు ఎక్కడా కనిపించటం లేదు అంది ఖంగారు పడుతూ.
రాహుల్ కి పెద్ద తాతగారంటే మహా ప్రీతి. ఎప్పుడూ ఆయన చర్మంతో ఆడుకుంటూ తాతా!! నీ స్కిన్ ఎందుకిలా వేలాడుతోంది అని అడుగుతాడు. దానికి ఆయన బోసి నవ్వుతో " ఇంక నా వయసైపోయిందిరా!! ఆ భగవంతుని పిలుపు కోసం ఎదురు చూస్తున్నా" అంటూ...... ప్రొద్దుపోయిందిగా నాయనా!! మీ ఇంటికి వెళ్ళు, మళ్ళీ మీ వాళ్ళు వెతుక్కుంటారు అంటారు. వాడేమో ముద్దుగా చేత్తో నుదుటి మీద కొట్టుకుని "తాతా ఇది మన ఇల్లే, నేను మీ ‘మనవరిని’ అంటాడు. వాడికి మనవడిని అని చెప్పటం రాక”.
రాఘవ్, శ్యామల ఖంగారుగా రోడ్డున పడ్డారు. చుట్టుప్రక్కల వాళ్ళందరిని, తెలిసిన వాళ్ళని వాకబు చేస్తారు. ఎక్కడా కనపడలేదు. ఆయన నడవలేరు కాబట్టి ఎక్కువ దూరం వెళ్లి ఉండరని వాళ్ల కి ఒక ధైర్యం.
సాయంత్రమైపోయింది. ఆయన జాడ లేదు. “పాపిష్టిదాన్ని, ఎందుకు మామయ్య గారి ముందు గొడవ పడ్డాను !? ఆయన మనసు బాధ పడినట్లుంది. అందుకే వెళ్ళిపోయారు. ఏదైనా మనసుకి భాధ కలిగించే విషయమైతే గుర్తుండిపోతుంది ఆయనకు" అని
తనని తనే నిందించుకుంటూ కూర్చుంటుంది శ్యామల.
రాఘవ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు మౌనంగా. తన్ని తిట్టినా బాగుండేది అనిపించింది ఆమెకు.
మామయ్య గారి రూమ్ లోకి వెళ్లి కూర్చుంటుంది. రూమ్ నీట్ గా పెడతానని, టైం టు టైం అన్ని సమయానికి అమర్చుతానని, ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో నీ లాంటి కోడలు దొరికిందని ఇదివరలో మెచ్చుకునేవారు. ఈ మధ్య అల్జ్హెయిమేర్ చివరి దశకు వచ్చి మరీ విసిగించడంతో.....తనూ యాభై లో పడబట్టి ఓపికలేక.......ఎవరూ చూడటం లేదనే ఉక్రోషంతో అలా అన్నదే కానీ ఆ పెద్దాయన మీద అభిమానం లేక కాదు అని బాధ పడుతుంది శ్యామల.
ఎక్కడికి వెళ్ళిపోయారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో, కనిపించకపోతే ఏం చెయ్యాలి??
జేబులో అడ్రస్ కాగితం అన్నా పెట్టలేదే!?
ఎవరైనా సహాయం చేద్దామన్నా..... మా అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ...... కనీసం తన పేరు కూడా చెప్పే స్థితి లో లేరు కదా!!
“ఇలా తప్పిపోయిన వాళ్ళే తిండి లేక మాసిపోయిన బట్టలతో అక్కడక్కడా అడుక్కుంటూ కనపడతారు...... సొంత వాళ్ళు చూసినా గుర్తు పట్ట లేని స్థితిలో ఉంటారు” అనే ఆలోచనలకే ఒణికిపోతుంది ఆమె.
"మా మామయ్య గారు దొరికేలా చూడు నాయనా!! మళ్ళీ ఎప్పుడూ ఆయనను ఏమీ అనను" అంటూ వెయ్యి దేముళ్ళకి మొక్కుకుంటూ కూర్చుంటుంది.
రాఘవ్ వచ్చి దిగాలుగా కుర్చీలో కూలబడ్డాడు.
ఈలోపు బామ్మా!! అంటూ రాహుల్ కేక........ శ్యామల, రాఘవ్ పరిగెత్తుకుని బయటకు వెళ్ళి చుస్తే వాడు పెద్ద తాతగారి చేతి మీద తన బుల్లి చెయ్యి వేసి మెల్లగా నడిపించుకుని తీసుకు వస్తుంటాడు పని అమ్మాయితో కలిసి. నీకు ఎక్కడ దొరికారురా!? అని ఆశ్చర్యంగా అడిగి, ఆనందంతో కళ్ళు చెమర్చగా మామయ్యగారి చెయ్యి పుచ్చుకుని లోపలికి తీసుకు వెళుతుంది శ్యామల ఎంతో రిలీఫ్ గా.
"అమ్మా!! పెద్దయ్య గారు ఎప్పటి నుండి తిరుగుతున్నారోనమ్మా!! మా గుడిసెల కాడికి వచ్చేశారు. ఆయాస పడిపోతుంటే కాసేపు కూసోపెట్టి టీ తాయించి తీసుకు వచ్చాను" అని పనమ్మాయి చెప్తుంటే శ్యామల కళ్ళకి అది దేవతలా కనపడింది ఆ క్షణంలో.
“రాఘవ్ ఆప్యాయంగా వాళ్ళ నాన్న గారి చేయి పట్టుకుని ఇలా ఎప్పుడూ ఇల్లు వదిలి వెళ్ళద్దని ప్రామిస్ చేయించుకుంటాడు” ఆయనకు గుర్తు ఉండదని తెలిసినా సరే తన సంతృప్తి కోసం...... ఏమో!! కొన్ని గుర్తు ఉంటాయంటారు. గుర్తుండాలని, గుర్తుంటుందని ఆశిద్దాం.
*********
No comments:
Post a Comment