నాణ్యానికి మరోవైపు - అచ్చంగా తెలుగు

నాణ్యానికి మరోవైపు

Share This
 ||శ్రీ ||
నాణ్యానికి మరో వైపు....
రచన: శారదా తనయ


ముకుందరావు, జలజలు అమెరికాకు వచ్చారు వాళ్ళ అమ్మాయి అఖిలతో ఒక మూడు నెలలు గడపడానికి. అఖిలకు ఒక బాబు, వాడికి సంవత్సరంన్నర వయస్సు. 

ఒక వారం పదిహేను రోజుల ప్రయాణ బడలిక, క్రొత్త పరిసరాలకు అలవాటు పడడం జరిగిన తర్వాత జలజ మనమణ్ణి చూసుకోవడంలో పడిపోయింది. అమ్మ వచ్చాక అఖిలకు కూడా కాస్త వెసులుబాటుగా ఉంటోంది. తండ్రితో కలిసి ఇండియన్ స్టోర్ కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం, ఏదైనా బయట హోటళ్ళకు ఆర్డర్ చేస్తే వెళ్ళి తెచ్చుకోవడం లాంటి పనులను హాయిగా చేసుకోగలుగుతోంది. ఇక ముకుందరావుకు ఇంటి పరిసరాల్లోనే ఆయనలాగే రిటైరయి పిల్లల వద్దకు వచ్చిన లేదా ఉంటున్నఒకరిద్దరు స్నేహితులయ్యారు. అలా అని అమెరికాలో ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళింటికి వెళ్ళడం సభ్యత అనిపించుకోదు. తెల్లవారు జామునో, కుదరకపోతే సాయంత్రాలో వాకింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగేది. వీరందరూ ఉన్న కమ్యునిటీలోనే బిల్డర్లు రెండు సరస్సులని ఏర్పాటు చేసి చుట్టూరా కూర్చోడానికి బెంచీలు వేశారు. పెద్దవాళ్ళు కలిసి నడిచాక ఆ బెంచీల పైన కూర్చుని బాతాఖానీ కొట్టడం అలవాటయింది. 

ఇక ఈ కాలం పెద్దవాళ్ళు కలిసి మాట్లాడుకోవడం ప్రారంభిస్తే మాటల్లో దొర్లేవి రాజకీయాలు, ఇంటి పరిస్థితులు, పిల్లల గురించిన ఫిర్యాదులు ఇవే ఉంటాయన్నది అందరూ ఎరిగిన సత్యమే. అదీగాక ఇలా అమెరికాకో, ఆస్ట్రేలియాకో లేక యూరప్ కో వలస వెళ్ళిన పిల్లలు ఇండియాలోని తమ తలిదండ్రులను పట్టించుకోవడం లేదనీ, వారిని వృద్ధాశ్రమంలో చేర్చేస్తూ ఉంటారనీ, చివరికి వాళ్ళు చనిపోయినా అంత్యక్రియలకు వెళ్ళరనీ వచ్చే కథలను చదివిన ముకుంద రావుకు ఇక్కడ పిల్లలు వాటి గురించి ఏం చెబుతారో తెలుసుకోవాలని అనిపించింది. రోజూ తాము చర్చించే విషయాలలో ఈ మాటలు కూడా దొర్లడం, పెద్దవారు ఎప్పుడూ తమ పిల్లల్నే దోషులుగా నిలబెట్టి మాట్లాడడం కనిపించేవి.
తమ అబ్బాయి ఇండియాలోనే ఉండడం వల్ల, తమ నుండి దూరంలో ఉండడం వల్ల తమకు అలాంటి పరిస్థితి ఎదురవలేదు. కానీ అక్కడ కూడా చాలా మంది పెద్దలది ఈ ఫిర్యాదులే ఉండేవి. ఇంకా కొందరయితే కోడల్ని దుయ్యబట్టేవారు. వారిలో చాలా మంది భార్యను పోగొట్టుకుని తమ తిండీ తిప్పలకోసం కోడలి పైన ఆధారపడ్డవారుగా కనిపించేవారు. ఎంత సేపైనా వారు చెప్పినవి వినాలే కానీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరిస్థితి ఏమిటి అని తను తెలుసుకోలేడుగా ! అందుకని వారికి ఊరటనిచ్చే విధంగానే మాటలాడి ఇంటికొచ్చేసేవాడు. 
ఇక్కడ దీని గురించి కొద్దిగా పరిశీలన జరుపుదాం అనిపించింది. ఎలాగూ తనకేం పని లేదు. రోజుకొక్క గంట వాకింగ్, అప్పుడప్పుడు కూతురితో బయటికి వెళ్ళడం. బాబుతో కొంత సేపు ఆడుకోవడం తప్ప వేరే పనేం లేదు. కాకపోతే ఈ పరశీలన ఎలా జరపాలి అనుకుంటూ ఉండగా అనిపించింది. తనకు బయట చర్చలో జరిగిన విషయాలను తన కూతురితో చర్చిస్తే నాణ్యానికి మరోవైపు ముఖం బయటపడుతుంది అనే ఐడియా తట్టింది. ఆ రోజు నుండి ఆ విధానాన్ని అమలు చేశాడు ముకుంద రావు. 
ముందిగా తనను రోజూ కలిసే అరవాయన రామచంద్రన్ గురించి వాకబు చేశాడు. రామచంద్రన్ గారు వీళ్ళున్న ఇంటి వరసలోనే ఉంటారు. ఆయన అబ్బాయి, కార్తీక్ కి అమెరికాలో ఉద్యోగం. కోడలు కూడా పన్లోకెళుతుంది. ఆయనకు వయస్సు డెబ్భై నాలుగో డెబ్భై ఐదో ఉండవచ్చు. ఆయన గురించిన విషయాలు మాట్లాడుతూ ఉంటే కొంత ఆశ్చర్యం కలిగింది ముకుందరావుకి. రామచంద్రన్ గారు ఆయన వియ్యంకుడు కోదండ రామన్ గారు ఒకే ఇంట్లో ఉంటారు. ఇద్దరూ బాల్యస్నేహితులు. కలిసి చదువుకున్నారు.  కోదండ రామన్ గారి అమ్మాయి మేఖలను ఇష్టపడి తన కొడుక్కు తెచ్చుకున్నారట రామచంద్రన్ గారు. కోదండ రామన్ గారికి ఇద్దరూ అమ్మాయిలే. ఈ అమ్మాయి మేఖల చిన్నది. పెద్దమ్మాయి కూడా అమెరికాలోనే ఉంటుందట. ఆయనకీ మధ్య ఒంట్లో బాగుండక పోయేటప్పటికి మేఖల బాధ పడడం చూసిన కార్తీక్ ఒక ఉపాయం చెప్పాడట. అదేమిటంటే తాము ఉంటున్న ఐదు బెడ్ రూముల ఇంట్లో ఒక బెడ్రూంని మేఖల తల్లిదండ్రులకు ఉండడానికి ఇచ్చేటట్టు. కానీ మేఖలే పట్టుబట్టి ఆ బెడ్రూంలో ఒక మూలలో ప్రత్యేకంగా వండుకోవడానికి ఏర్పాటు చేయించిదట. అటాచ్డ్ బాత్రూం ఎలానూ ఉంటుంది కాబట్టి ఉన్నంతలో వారిద్దరూ విడిగా ఉన్నట్టే. కుంపటి వేరుగా ఉంటే కొంపలంటుకోవు అన్నది నిజం.    దంపతులిద్దరూ అమెరికా పౌరసత్వం తీసుకున్నవారే కాబట్టి ఎవరి తలిదండ్రులను వారి స్పాన్సర్ చేయవచ్చు అనే చట్టం క్రింద వారిని తమ దగ్గర పెట్టుకున్నారు. కోదండ రామన్ దంపతులు అప్పుడప్పుడు తమ పెద్దమ్మాయి ఇంటికి వెళ్ళి వస్తుంటారట. ముకుంద రావు ఒకసారి రామచంద్రన్ గారింటికి వెళ్ళినప్పుడు ఆయన్ను కలిశాడు. ఆయనకు ఒంట్లో బాగుండకపోవడంతో బయటకు రావడం లేదనీ, కానీ కొన్ని రోజుల్లో ఆయనకు నయమయినాక రావచ్చనీ తెలిసింది. తనకు తెలిసీ ఆడపిల్లల తలిదండ్రులకు అల్లుడినుండి ఇంతకు మించిన సదుపాయం కల్పించడం సాద్యపడదు అనిపించింది. రామచంద్రన్, కోదండ రామన్ ఇద్దరూ హాయిగా నవ్వుకుంటూ కబుర్ల చెప్పుకోవడం గమనించాడు ముకుంద రావు. అఖిల చెప్పిన ఇంకో విషయం ఏమిటంటే  మేఖల చెప్తుందిట తన మామగారు తనకెంతో సపోర్ట్ ఇస్తారని, అత్తగారెంతైనా అత్తగారేనని చెప్తూ. 

ఈ చర్చల విషయాన్ని మేఖల తన భర్త అరవింద్ కు చెబితే ఆయన కూడా తనకు తెలిసిన తన స్నేహితుల తలిదండ్రుల అనుభవాల్ని చెప్పాడు.  ఆయన స్నేహితుడు ఒక ఉత్తర భారతీయుడట. ఆయన తలిదండ్రులు అమెరికా వచ్చి వెళ్ళాక ఆ అనుభవాలు అరవింద్ తో పంచుకున్నాడట. ఈ అబ్బాయిని తలిదండ్రులిద్దరూ పీల్చి పిప్పి చేశారట. అమెరికా అంత తిప్పమనడం, హోటళ్ళలో సరిగ్గా బిహేవ్ చేయక పోవడం, తిండి సౌకర్యాల పట్ల చాలా పట్టింపులు, వీటన్నిటితో పాటు లెక్కలేనంత కొనుగోళ్ళు చేయడం. పాపం ఈ అబ్బాయికి దడ పుట్టిందట. ఇవన్నీ కాకుండా అమెరికాలో ఉన్న వాళ్ళిద్దరి బంధువుల ఇళ్ళకి వెళ్ళాలని పట్టు బట్టడం. ఒక్కోరు ఒక్కో మూల ఉండడం వలన విమానాల్లో వెళ్ళాల్సి రావడంతో చాలా ఖర్చయిందట. ఇలాంటి తలిదండ్రుల పట్ల పిల్లలకి ఏవగింపే ఉంటుందని అరవింద్ అన్నాడు. మేఖల కూడా “ అవున్నాన్నా ! ఇక్కడ మేమెంత పైసా పైసా కూడబెట్టాలో తెలుసా ! అలాంటిది వాళ్ళు వచ్చినఫ్ఫుడు అలా ఖర్చు చేస్తూ పోతే చాలా బాధనిపిస్తుంది. కావలసినప్పుడు లీవులు కూడా దొరకవు ఇక్కడ. చాలా బాధ గా ఉంటుంది. “ అంది. ముకుందరావుకు అనిపించింది, పెద్దవాళ్ళుగా తలిదండ్రుల బాధ్యత రోల్ మోడల్ గా ఉండడం కూడా అని. 

ఇలా ఒక రెండు సన్నివేశాలు అర్థమయ్యాక ముకుందరావుకి ఇంకా ఇలాంటి వాటి గురించి  తెలుసుకోవాలనే ఉత్సుకత ఎక్కువయ్యింది. ఈయన ఉత్సాహం చూసి అఖిల, అరవింద్ లిద్దరూ తమకు తెలిసిన కొన్ని ఇలాంటి విషయాలను ఆయనకు చేరవేయసాగారు. రోజూ రాత్రి డైనింగ్ టేబుల్ పైన రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు అలాంటివేమన్నా ఉంటే చర్చకు వచ్చేవి. ముకుందరావు కూడా తనతోపాటు వాకింగ్ కు వచ్చే సీనియర్ సిటిజన్లతో ఈ విషయం గురించి ముచ్చటించేవాడు. 
ఇలా ఉండగా ఒక వీకెండ్ కి దగ్గరగా ఉన్న ఒక లేక్ కి ఔటింగ్ వెళదామని నిశ్చయించారు అఖిల అరవింద్ లు. వీళ్ళతో పాటు ఇంకో మూడు ఫ్యామిలీలు కూడా వస్తారనీ, అందరూ అక్కడికి శనివారం మధ్యాహ్నానికి చేరుకుని, సాయంత్రం అక్కడ గడిపి, రాత్రికి అక్కడే ఉండి మరుసటిరోజు బోట్ రైడింగ్, దగ్గర్లో ఉన్న ఒక డ్యాం, దాని చుట్టూ ఉన్న పరిసరాలు చూసుకుని ఆదివారం సాయంత్రం 5 గంటలకు బయలుదేరి తిరిగి రావడం అని ప్రోగ్రాం. అక్కడ రాత్రి ఉండడానికి కాటేజెస్ ఉన్నాయి కాబట్టి ఎవరెవరి ఫ్యామిలీకి ఎన్నెన్నిరూములు కావాలో బుక్ చేసుకున్నారు అందరూ. పక్క ఇంటి అరవ ఫ్యామిలీ నుండి రామచంద్రన్ దంపతులు వస్తున్నారని తెలిసాక ముకుందరావుకు హాయిగా అనిపించింది. లేకపోతే యువతల మధ్య తనను పలకరించేవారు లేకుండా పోతారు అన్నది ఆయన అమెరికాకు వెళ్ళి అక్కడ ఏదో పార్టీకి వెళ్ళినాక తెలిసిన సత్యం.  ఆ పార్టీకి జలజ తను రానంది, బాబును చూసుకుంటానికి ఉండిపోతానంటూ. ముకుందరావు పిల్లలతో పాటు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ అరవింద్ తన స్నేహితులతోనూ, అఖిల తన గుంపుతోనూ మాట్లాడుతూ ఉండి పోయారు. తనొక్కడే పెద్దవాడవడంతో మీడియా రూములో కూర్చోమని చెప్పి టివి రిమోట్ చేతికిచ్చి వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు అఖిల వచ్చి “ నాన్నా! ఏం కావాలి తినడానికి “ అంటూ జ్యూసో, డ్రింకో లేదా కారప్పూసో తెచ్చివ్వడం మాత్రం జరిగింది. టివి రిమోట్ తిప్పుతూ ఇండియాలో అప్పుడే టెలికాస్ట్ అయిపోయిన పాచి ప్రోగ్రాములు చూస్తూ గడపాల్సి వచ్చింది. డిన్నర్ కు రమ్మనగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది ముకుందరావుకు. అందుకే రామచంద్రన్ వస్తున్నారనగానే కాస్త నెమ్మదనిపించింది, తనకు కంపెనీ దొరుకుతారని. అఖిల చెప్పింది మరో ఫ్యామిలీలో కూడా ఒక పెద్దాయన ఉన్నారని, ఆయన కూడా వస్తున్నారని . దాంతో ముకుందరావు కాస్త స్తిమిత పడ్డాడు. అన్ని బుకింగ్స్ అయిపోయాయి. 
వీకెండ్ కి అందరూ బయలుదేరి లేక్ దగ్గరికి వెళ్ళి పోయారు. సాయంత్రం లేక్ చుట్టూ ఉన్నపరిసరాలన్నీతిలకించారు. అస్తమిస్తున్న సూర్యుణ్ణి, తరువాత ఆయన కాంతికి పోటీనివ్వాలని చూసే దీపాలని చూస్తూ రాత్రి డిన్నర్ కి రెడీ అయ్యారు.  డిన్నర్ టైములో రామచంద్రన్, ముకుంద రావులతో పాటు మరో పెద్దాయన, ఆయన పేరు సూర్యనారాయణ శాస్త్రి, పక్క పక్కనే కూర్చున్నారు. అందరి హడావిడుల మధ్య భోజనం ముగించారు. భోజనాల్లో తన పక్కన కూర్చున్న శాస్త్రి మాత్రం తనకు గల తిండి పట్టింపుల గురించి, తను ఆచరిస్తున్న ఆచార వ్యవహారాల గురించి ముకుందరావుకు చెప్తూ పోయాడు. తెలుగు వాడు కావడం వలన ముకుంద రావుతోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉండడంతో రామచంద్రన్ గారితో పెద్దగా మాట్లాడడానికి వీలు పడలేదు. 
మరుసటి రోజు ప్రొద్దున్న5.30  కే అలవాటుగా లేచిన ముకుందరావు బయటికి రాగానే రామచంద్రన్ కనిపించారు. ఆయన కూడా అలా తొందరగా లేచే అలవాటున్నాయనే. ఇద్దరూ కలిసి అలా కాసేపు బయట తిరిగి వద్ద్దామని బయలు దేరారు. కొన్ని అడుగులు వేశారో లేదో ముకుందరావుకు తన పేరు పిలిచినట్టనిపించింది. తిరిగి చూస్తే శాస్త్రిగారు. ఆయన తొందరగా అడుగులు వేస్తూ వచ్చి వీళ్ళని కలుసుకుని కాస్త నిష్టూరంగా “ నన్ను కూడా పిలిస్తే ఏం పోయింది ?” అన్నారు. ఎందుకో ఆయన ఆ ధోరణి ముకుందరావుకు నచ్చలేదు. “ అయ్యా ! నేను వీరిని కూడా పిలవలేదు. నేను బయటకు వచ్చాను. వీరు కూడా ఉన్నారు. బయలుదేరాం అంతే. అయినా మీరు నిన్నింకా నాకు పరిచయమయ్యారు. మీ అలవాట్లు నాకెలా తెలుస్తాయి ? మిమ్మల్ని లేపి మీ నిద్రనెలా         చెడగొట్టగలను ? “ అన్నాడు. దానికాయన బదులేం ఇవ్వకుండా మొహం కాస్త చిన్నది చేసుకున్నాడు. ముగ్గురూ కలిసే ఒక రెండు కిలో మీటర్లు తిరిగినా ఎవ్వరూ మాట్లాడుకోలేదు. తరువాత టిఫిన్లు, బోట్ రైడింగ్, దగ్గర్లోని డ్యాం దాని దగ్గరి పార్కు అన్నీ చూసుకుని ప్రోగ్రాం ప్రకారమే తిరిగి వచ్చేశారు. 
మరుసటి రోజు రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు ముకుందరావు శాస్త్రిగారితో తనకు జరిగిన అనుభవాన్ని చెప్పాడు. అప్పుడు అఖిల చెప్పింది. “ నాన్నా ! ఈయన చాలా పట్టింపులున్న మనిషట. కోడలు చెప్పింది. అమెరికాకు వచ్చినా ఊళ్ళో ఎలా తనకు జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా జరగాలని పట్టు బడతారట. పూజలూ, పునస్కారాలకు ఏమాత్రం తక్కువ కాకూడదట. ఏ వస్తువైనా దొరకదంటే ఒప్పుకోరట. పండగ రోజుల్లో తను తల స్నానం చేసి మడిగట్టుకునే వండాలట. అదేమన్నా అంటే నా భార్యే ఉంటే ఇలా ఉండేదా అన్నీ అమర్చిపెట్టేది అని తిట్టడం. ఇద్దరూ విసిగిపోయారట. ఇంకో నెల ఉంటారేమో. మళ్ళీ ఇండియా వెళ్ళి ఆరునెలలంటే ఆరునెలలకి వచ్చేస్తారు. అక్కడా అంతేనట, ఇంకో కోడల్ని వేదించుకు తింటారట. ఆ అమ్మాయి అంటుంది ఇండియాలో అయితే ఎలాగోలా సర్దుకు పోవచ్చు. అక్కడ అన్నీ దొరుకు తాయి. ఇక్కడ దొరకవంటే వినరు. పైగా అస్తమానమూ అభ్యంతరాలేనట. పిల్లల్ని సరిగా పెంచడం లేదు, శ్లోకాలేమీ చెప్పించడం లేదు. పొద్దున్నే రోజూ స్నానాలు చేయించరు. వాళ్ళకి ఎంగిలి, అంటు అంటూ ఏమీ తెలియదు ఇలా. మనమల్ని పట్టుకుని లెక్చర్లిస్తారట. వాళ్ళబ్బాయి,అదే ఈవిడ భర్త, నాన్నగారూ మీరే కాసిని శ్లోకాలు చెప్పించండి అంటే ఇదిగో అబ్బాయ్! నేను నీకు నేర్పించాను. నా ధర్మం. నీ పిల్లలకు నువ్వు నేర్పాలి అంతే అంటారట.  కోడలు ఉద్యోగం చెయ్యడం ఆయనకు ఇష్టం లేదట. అలాగని డబ్బు తక్కువ కాకూడదట. అదేదో వర్క్ ఫ్రం హోమ్ అనేదో ఉంటుంది కదా.అది తెచ్చుకుంటే సరి. దేనికైనా తెలివుండాలి అని దెప్పుడుట. ఎలా వేగాల్రా ఆరు నెలలు అని ఒకటే వాపోతుంది నాతో “ అన్నది. ముకుంద రావుకు మరో సన్నివేశం అర్థమయింది. తలిదండ్రులని పిల్లలు పట్టించకోవడం లేదనీ, వృద్ధాశ్రమంలోకి తోసేస్తారని అందరూ అనుకోవడం, పత్రికల్లోనూ అలాగే కథలు రావడంలో అదే నిజమేమో అనిపిస్తుంది కానీ ఇలా తరచి చూస్తూ పోతే తప్పు అన్నది రెండు వైపుల నుండి కూడా ఉండవచ్చు అనిపిస్తుంది అని తోచింది. 

ముకుందరావు యొక్క విషయ జిజ్ఞాసకు ముచ్చట పడిన అల్లుడు అరవింద్ ప్రతి రోజూ ఇలాంటిదేదో ఒక సన్నివేశాన్నోసంఘటననో చెప్పడం కొనసాగించాడు. అతడి ఉత్సాహంలో రెండు కారణాలు కనిపించ సాగేయి ముకుందరావుకి. ఒకటేమో తనకు తెలిసిన అనుభవాన్నిపంచుకుంటూ ముకుందరావుకు సహాయపడడం అన్నదైతే, తన తరం వాళ్ళ పైన పడిన నిందకు తగిన సంజాయిషీ ఇచ్చినట్టవుతుందేమోనన్న ఒక భావన కూడ ఉండవచ్చుననిపించింది.  ఎందుకంటే తమ తరం వాళ్ళను నిర్దయుల క్రింద, కృతఘ్నుల క్రింద జమ కట్టడం జరుగుతోందని అక్కడ ఉన్నవాళ్ళందరికీ అర్థమయినట్టు అనిపించింది ఆయనకి. అదే కాకుండా తాము అక్కడ వాళ్ళ స్నేహితుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళ స్నేహితులు తమ పిల్లలతో ఇంటికి వచ్చినప్పుడు కానీ తమను ప్రత్యేకంగా చూసుకోవడం, తమకు కావలసినట్లు రుచులు చేయడంలో కష్ట పడడం, తమ పిల్లలను తాత అవ్వలకు మొక్కండంటూ చెప్పడం లాంటివి చూసి ముకుందరావులో అక్కడి వాళ్ళ కష్టాలు అర్థమవ్వసాగాయి ఆయనకి. 
ఇలా ఉండగా ఇంకో సంఘటన జరిగి, అది కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఆ రాత్రి చర్చకు లోనయ్యింది. అరవింద్ స్నేహితుడొకాయన పంజాబీ అట. ఆ అబ్బాయి తెలివి తప్పి పడిపోయి ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చిందట. పరిశీలిస్తే ఆ అబ్బాయి చాలా రోజులుగా యాంటి డిప్రెసెంట్ మాత్రలు వేసుకుంటూ కొన్ని రోజులనుండి మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం జరిగిందట. ఈ రోజు స్నేహితులందరూ వెళ్ళి చూసొచ్చారట. ఆ అబ్బాయి వీళ్ళతో తన కష్టాలు పంచుకున్నాడట. అతడి గురించ్ చెబుతూ అరవింద్ “ ఆ అబ్బాయి తలిదండ్రులు ఢిల్లీలో ఉంటారు మామగారూ! ఆయన ఈ మధ్యే  రెండేళ్ళ క్రితం సర్కారీ ఉద్యోగం చేసి రిటైరయ్యారట. మంచి హోదాలోనే ఉండేవారట అప్పుడు. ఇప్పుడు వచ్చే పెన్షన్ ఆయన హోదా నిభాయించడానికి చాలడం లేదట. తల్లి కూడ అలాంటి మనిషేనట. పార్టీలనీ, మహిళా సంఘాలలో మెంబరనీ ఆవిడ ఖర్చులు కూడా విపరీతమేనట. అప్పట్నుండీ ఈ అబ్బాయిని పీడించడం ( ఇది అరవింద్ వర్షన్ అనుకోండి. అందుకే ఈ పదం. ) మెదలుపెట్టారట. నెలకు ఏం లేదన్నా 1500 డాలర్లు పంపాల్సి వస్తుందట. అంటే ఇండియా రుపాయల్లో రమారమి లక్ష రుపాయలు. మా నాన్నకు అంత జీతం కూడా వచ్చేది కాదు. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు అని వాపోతాడట. వాళ్ళకు అంత పంపాల్సి రావడం, ఇక్కడి కుటుంబ ఖర్చులు, పిల్లవాడి డే కేర్ ఫీజు, ఇవన్నిటికీ వచ్చే జీతం చాలక కటకట అనిపించగా, అమ్మతో అంత పంపలేనని అన్నాడట. అందుకామె నిష్టూరాలాడిందట. అక్కడి సొసైటీలో తమ పరువును కాపాడాల్సిన బాధ్యత కొడుకుదేనని వాదించిందట. తండ్రి కూడా కలుగజేసుకుని, తలిదండ్రులకు కావలసిన సౌకర్యాలను అమర్చే బాధ్యత కొడుకుదేనని చెప్తూ, అంతే కాదు చెల్లెలి పెళ్ళి ఘనంగా చెయ్యాలి, దానికి కావలసిన డబ్బును కూడా ఇవ్వల్సిన బాధ్యత కొడుకుదే అని గట్టిగా చెప్పడం తో ఏం చెయ్యాలో తెలియని ఈ స్నేహితుడు అన్నీమరచి పోవడానికి డ్రగ్స్ కు శరణయ్యాడట. అంతకు ముందు ఇలాంటి చిన్న చిన్న వాదనలకు విసిగిపోయి, నిద్ర లేక యాంటీ డిప్రెసెంట్ మాత్రలు వేసుకోవడం ఆరంభించాడట. ఇప్పుడు డ్రగ్స్ తీసుకునేసరికి వికటించి ఆస్పత్రి పాలయ్యాడట. వాళ్ళ అమ్మా నాన్న ఇప్పుడు వస్తున్నారట కొన్ని రోజులు ఉండడానకి. ఇంకా ఏం కాచుకుందో వాడికి “ అన్నాడు. 
భోజనం ముగించి పడుకున్న ముకుంద రావుకు మాగన్నుగా నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఒక కల. వయసైన ఒక ఆడ మగా రాక్షస వేషాల్లో చేత్తో ముళ్ళ గదల్ని పట్టుకుని ఇద్దరు యువకుల్ని తరుముతున్నట్టు. “మమ్మల్ని చూసుకోవాలి. మాకు కావలసింది ఇప్పించాలి. అది మీ బాధ్యత “ అంటూ వెంటబడడం కనిపించింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్న ముకుంద రావును చూసిన జలజ “ ఏంటండీ ఏదైనా పీడకలా ? “ అని అడగ్గానే ముకుందరావు కలగురించి చెప్పాడు. “ ఇక మీద ఈ అనుభవాలు వినకండి మహాశయా ! మన పిల్లలు అలా లేరు. అందుకు సంతోషించండి. మనిద్దరికీ వచ్చి పోయే చార్జీలు మన అల్లుడే పెట్టుకున్నారు. అది మరచిపోకండి. ఇంద. మంచినీళ్ళు తాగి నిద్రపొండి. “ అని ఓదార్చగా ముకుందరావు పక్కకు ఒత్తిగిల్లాడు. 

 ***

No comments:

Post a Comment

Pages