"జాతర"
నాగ్రాజ్....
నీలవర్ణ నింగిపై కారుమబ్బులు నల్లని
తివాచీ పరిచాయి
జయజయధ్వానాలతో మేఘాలు ఉరేగుతున్నాయి
మొయిలు హర్షాతిరేకాల మెరుపు దివిటీలు పట్టింది
ఆకాశంలో వానదేవుని జాతర
వానదేవుడు వచ్చేవేలైందని
రైతన్న పొలం గట్లపై చెమటగంధం అలుకు జల్లి
నాగేటి చాళ్ల ముగ్గులేసాడు
నేలకన్నెకి విత్తుగింజలవాయినమిచ్చాడు
పుడమిపైని తరువులన్ని వింజామరలై
చల్లని గాలి సందేశమిచ్చాయి
ఉరుములు మెరుపుల మంగళ వాయిద్యాలనడుమ
వరుణ రాజుకు నేలకన్నెకు లగ్గం
ముక్కోటిదేవుళ్ళు చినుకుల అక్షింతలు చల్లుతున్నారు
జీవకోటి చినుకుసవ్వడి సంగీతంలో నాట్యమాడుతున్నారు
మట్టిగంధం పూసుకున్నారు
నింగీ నేల ఏకమైనజాతర
పులకించిన పుడమి పచ్చని బోనమెత్తుకుంది
***
No comments:
Post a Comment