జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 34
చెన్నూరి సుదర్శన్
(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ తన గత జ్ఞాపకాల్లోకి జారిపోతాడు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‌గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి అనుభవాలను వారితో పంచుకుంటూ ఉంటాడు.)
కళావతి అభిరుచి మేరకు విలువైన సౌందర్య సామాగ్రి అందిస్తూ ఆమె కరుణాకటాక్షాలకు పాత్రుడయ్యాడు.
గాల మేయగానే చేపపిల్ల పడ్తుందా.. దేనికైనా కాస్తా సమయం కావాలి. కాని కనకారావు అనతికాలంలోనే కళావతిని లేవదీసుకొని వెళ్ళగలిగాడు”
నేను అవాక్కయ్యాను. ఇది నిజమేనా..! అప్రయత్నంగా పైకి అనేసాను.
“నిజమా..?”
“నిజం సార్.. కూకట్పల్లి లాడ్జింగులో ఇద్దరూ ఆరాత్రి దొరికి పోయారు. వివరాలు తెలుసుకొని ఎస్సై నిర్ఘాంత పోయాడు.
ఖర్మకాలి ఆ ఎస్సై మన కాంతయ్య పూర్వ విద్యార్థి.
కాంతయ్యకు ఫోన్ చేసాడు.
కాంతయ్య మన యూనియన్ మెంబర్స్ నలుగురిని తీసుకొని వెళ్ళాడు.
అంతా కలిసి కళావతికి.. కనకారావుకు కౌన్సిలింగ్ ఇచ్చి ఏ కేసు లేకుండా తీసుకొచ్చారు.
ఎవరి నోరని మూయగలం.. ఈ వార్త, వార్తా పేపర్లలో ఎక్కలేదుగాని.. ఊళ్ళోని నోళ్ళు నొక్కుకునేలా చేసింది”
“అయిందేదో అయిపోయింది.. ఇంకా సమస్య సమిసి పోలేదెందుకు?” ఉండబట్టలేక అన్నాను.
“సూర్యప్రకాష్ సార్.. కథ పూర్తి కాలేదు.. అసలు కథ ఇప్పుడే ఆరంభమయ్యింది... పూర్తిగా వినండి..” అంటూ చిన్నగా నవ్వాడు.
నాలో కుతూహలం పెరిగింది.
“కనకారావుకు ముఖం చెల్లక లాంగ్ లీవు పెట్టి వెళ్ళాడు..
పది రోజులు గడిచాయో.. లేదో...! కాంతయ్య కనికరం కాలదన్ని కళావతి మళ్ళీ కనుమరుగయ్యింది.
కలయా..! నిజమా..! అని కాంతయ్య కళ్ళు తెరిచేసరికి కనకారావు తండ్రి దిగబడ్డాడు. పుత్రభిక్ష పెట్టుమని వేడుకోసాగాడు.
కళావతి లేకుండా తన ఒక్కగానొక్క కొడుకు కనకారావు బతకడని.. దయచేసి కళావతిని దానం చేయుమని కండువా ముందు పరిచాడట.
కళావతి సచ్చిందనుకొండి.. అనవసరంగా కోర్టులకు వెళ్లి డబ్బు దుబారా చేసుకోకండి.
ఎలాగూ చేసుకోడాని అతడికీ తెలుసు.. అందుకే వచ్చాడు. కళావతి తన కొడుకు వద్దనే ఉన్నదని కబురందించి జారుకున్నాడు.
మన కాంతయ్య కిమ్మనలేదు.. ఆ మహాతల్లి పిల్లలను వదిలేసి ఎలా వెళ్ళగలిగిందో అర్థంకాదు.ఇప్పటికీ కళావతి రాలేదు..
కాంతయ్య చేతల్లో ఇంకా మార్పు రాలేదు.
రిక్వెస్ట్ ట్రాన్స్ ఫర్ పెట్టుకున్నాడు.. బహుశః ఈ సమ్మర్లో బదిలీ కావచ్చు”
కాలేజీ లాంగ్ బెల్ కాంతయ్య కథాసశేషం నా ఆలోచనల నుండి మేల్కొలిపింది.
కాంతయ్య కాపురం కథా విశేషాలు నన్ను చాలా రోజుల వరకు వెంటాడుతునే ఉండేవి.. మర్చిపోలేక మనసు మదనపడేది.
***
ఆ సంవత్సరం వాల్యూయేషన్ క్యాంపులో మరో నిజం తెలిసింది.
సాధారణంగా వివిధ కాలేజీల్లో పనిచేసే.. మన పాత మిత్రులను క్యాంపుల్లో కలుసుకోవడం.. విశేషాలు తెలుసుకోవడం పరిపాటి.
ఆ సంవత్సరం మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలు మిళితమైన పెద్ద క్యాంపు.
మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేసే మ్యాథ్స్ లెక్చరర్లు ఇద్దరిని నాకు అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా అలాట్
చేసారు. అందులో ఒకరిది పెబ్బేరు జూనియర్ కాలేజీ. పేరు భరణి.
రంగనాథపురం నుండి జోవాలజీ లెక్చరర్ ఫణీంద్ర బదిలీ అయ్యింది అదే కాలేజీకి. బహుశః ఇప్పుడు ఆ
కాలేజీలో ఉండక పోవచ్చు.. తన రాజకీయ పలుకుబడితో సిటీ దగ్గరకు వచ్చిఉంటాడేమో! గాని భరణినడిగితే కొంత సమాచారం తెలియకపోదు.. ఫణీంద్ర పని చేసిన సమయంలో భరణి అదే కాలేజీలో ఉన్నాడో లేదో.. మరో అనుమానం. ఏది ఏమైనా ఫణీంద్ర గురించి తెలుసుకోవాలనుకునె జిజ్ఞాస మొదలయ్యింది నా మదిలో..
భరణి ఆపూట పేపర్లు వాల్యూ చేసి సబ్మిట్ చేయడానికి నావద్దకు వచ్చాడు. పేపర్లు మార్కులు వెరిఫై చేసాను. లంచ్ తరువాత మరో బండిల్ ఇస్తానని చెప్తూ..
“సార్.. ఫణీంద్ర జువాలజీ లెక్చరర్ ఇంకా పెబ్బెరు లోనే ఉన్నాడా?” అంటూ ఆరా తీశాను.
“అయ్యో..! మీకు తెలియదా సార్.. ఫణీంద్ర చనిపోయాడు ” అన్నాడు భరణి.
మ్రాన్పడి పోయాను.
“ఎప్పుడు సార్..” ఆశ్చర్యంగా అడిగాను.
“దాదాపు ఏడాదవుతోంది”
“ఎలా.. హార్ట్ ఎటాకా?”
“అలాంటి పాపాత్మునుకి అంత సులభమైన చావు వస్తుందా.. హత్య చేశారు”
“హత్యా..!” నోరు తెరిచాను. రాజకీయాలు చేస్తూంటాడు కదా.. ఎవరో లేపేసి ఉంటాడనుకున్నాను.
“హిమజ తెలుసనుకుంటాను.. ఫణీంద్ర ప్రియురాలు”
“ఆ.. తెలుసు మేమంతా రంగానాథపురంలో కలిసి పనిచేశాం”
“ఆమె కొడుకే ఫణీంద్రను పొడిచి పారేసాడు.
ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాడట. అయినా ఫణీంద్ర తన అలవాటు మార్చుకోలేదట.. చూసీ.. చూసీ.. ఒక రోజు మాటు వేసి వాళ్ళ ఇంట్లోనే మహా ఘోరంగా చంపేసాడట. ప్రాంతీయ పేపర్లోనూ వచ్చింది.
పొట్ట కోసి పేగులు లాగి మెడలో వేసుకున్నాడని చెప్పుకున్నారు” పాపం పండితే ఫలితమిలాగే ఉంటుంది అనే రీతిలో వివరించసాగాడు భరణి.
అలా ప్రాణంతీయాల్సింది కాదని నామనసు గొణిగింది.
“ఫణీంద్ర కూతురికి కారుణ్య నియామకం కింద రంగనాథపురంలోనే రికార్డ్ అసిస్టెంటుగా అప్పాయింటుమెంటు ఇచ్చారు సార్..
అక్కడ పనిచేసి ఆక్సిడెంటులో చనిపోయిన తెలుగు లెక్చరర్ పాపారావు కొడుకు జూనియర్ అసిస్టెంటుప్రమోటీని పెళ్లి చేసుకుందట.. పాపారావు కొడుకు మీకు తెలుసను కుంటాను”
“తెలుసు సార్..” అన్నాను.
లంచ్‌కు బయలు దేరాను.
నాలో ఆలోచనలు చెలరేగాయి.. ఫణీంద్ర దవడ పగలడం. హిమజ బాత్ రూంకు పరుగెత్తడం.. దృశ్యాలు
నా మనసు నుండి ఇంకా చెరిగి పోలేదు..
ఫణీంద్ర కూతురు పాపారావు కొడుకును పెళ్ళిచేసుకోవడం కాస్తా మనసు నెమ్మదించింది.
***
No comments:
Post a Comment