కుప్పుసామి శతకము - త్రిపురనేని రామస్వామి.
పరిచయం:దేవరకొండ సుబ్రహ్మణ్యం
కవి పరిచయం:
కుప్పుసామి శతకకర్త త్రిపురనేని రామస్వామి (15/01/1887-16/01/1943), "కవిరాజు"గా సాహిత్యలోకానికి చిరపరిచితులు. ఈకవి కృష్ణా జిల్లాలోని అంగలూరు గ్రామంలో జన్వరి 16, 1887 లో ఒక సామాన్య రైతుకుటుంబంలో జన్మించారు. బాల్యం నుండి సాహితీజిజ్ఞాసతో పెరిగి తన బాల్యంలోనే ఇంటర్మీడియట్ చదువున్నతున్నప్పుడే అవధాన ప్రక్రియ చేపట్టారు. తన 23వ ఏట కారెంపూడి కదనం, కురుక్షేత్ర కదనం అనే రెండు నాటికలను రచించారు. పై చదువులకు విదేశాలకు వెళ్ళీ అక్కడ నుండీ తిరిగి వచ్చి కొద్ది కాలం తెనాలిలోను మచిలీపట్ట్నంలోను న్యాయవాదవృత్తి చేపట్టారు. విదేశాలళో ఉన్నప్పుడు వీరు కృష్ణపత్రికలో అనేక వ్యాసాలు వ్రాసి ప్రచురించారు. అనేక దేశభక్తి గీతాలము రచించారు.
రామస్వామి రచయిత కవిఏ కాకుండా గొప్ప సంఘ సంస్కర్తగా పేరుపొందారు. ఆయన ముఖ్య వ్యాసంగము సంఘ సంస్కరణే. స్మృతులు, పురాణాలు, వ్యవస్థీకృత మతము వలన వ్యాపించిన కుల వ్యవస్థ మీద, సామాజిక అన్యాయాల మీద ఆయన పూర్తి స్థాయి ఉద్యమము ప్రారంభించాడు. సంస్కృత భాషలో ఉన్న పెళ్ళి మంత్రాలను తెలుగులోకి అనువదించి, అచ్చులో సరళమైన వివాహ విధి అను పద్ధతిని తయారు చేసాడు. ఈయన స్వయంగా అనేక పెళ్ళిళ్లకు పౌరోహిత్యము వహించి జరిపించాడు. ఆంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు. మనసా, వాచా, కర్మణా రామస్వామి ఓ సంస్కర్త. ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలను సాథనముగా త్రిపురనేని ఎంచుకున్నాడు. రామస్వామి తన ఆలోచనలను సాహిత్యం ద్వారా వ్యక్తపరచడమే కాక ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నించాడు. ఈయన చేసిన ముఖ్య రచనలు:
1. సూతపురాణము, 2. శంబుకవధ, 3.సూతాశ్రమ గీతాలు, 4. ధూర్త మానవ శతకము, 5. ఖూనీ, 6.భగవద్గీత, 7. రాణా ప్రతాప్, 8. కొండవీటి పతనము, 9. కుప్పుస్వామి శతకం, 10. గోపాలరాయ శతకం, 11. పల్నాటి పౌరుషం, 12. వివాహవిధి.
ఆయన సాహిత్య కృషిని గుర్తించి, ఆంధ్ర మహాసభ ఆయనకు కవిరాజు అనే బిరుదునిచ్చి గౌరవించింది. 1940లో గుడివాడ ప్రజానీకము గజారోహణ సన్మానము చేసారు.1943 జనవరి 16 న త్రిపురనేని రామస్వామి మరణించాడు.
1987 వ సంత్సరంలో భారతదేశ ప్రభుత్వము వారు ఆయన స్మారక చిహ్నముగా ఆయన పేరు మీద తపాళా బిళ్ళను జారీ చేయడం జరిగింది.
రామస్వామి పెద్దకుమారుడు త్రిపురనేని గోపీచందు తెలుగులో ప్రప్రథమ మనస్తత్వ నవల అసమర్థుని జీవయాత్ర రాసి తెలుగు సాహిత్యముపై చెరగని ముద్ర వేశాడు.
పెద్దకుమార్తె సరోజిని దేవి భారతీయ పాలనా యంత్రాంగపు అధికారి అయిన కానుమిల్లి సుబ్బారావును వివాహమాడినది.
త్రిపురనేని గోకులచందు కూడా తెలుగు సాహితీ రంగమునకు తనదైన రీతిలో తోడ్పడ్డాడు. ఈయన రచనలలో, 1950లలో వచ్చిన బెంగాల్ కరువుకు దర్పణము పట్టిన నాటకము విశిష్టమైనది.
రామస్వామి చిన్న కుమార్తె చౌదరాణి స్వాతంత్ర్యోద్యమ సమయములో భారతీయ నావికా దళములో తిరుగుబాటుదారైన అట్లూరి పిచ్చేశ్వరరావుని పెళ్ళి చేసుకొన్నది. ఈమె తమిళనాడులో తొలి తెలుగు బుక్‌స్టోర్ ప్రారంభించిన తొలి మహిళ. ఈమె 1996లో చనిపోయింది.
ఈ తరానికి బాగా తెలిసిన, తెలుగు చలనచిత్ర నటుడైన త్రిపురనేని సాయిచంద్ సుప్రసిద్ద రచయిత త్రిపురనేని గోపిచంద్ కుమారుడు, కవిరాజు త్రిపురనేని రామస్వామికి మనుమడు.
శతక పరిచయం:
"కుప్పుసామి" అనేమకుటంతో 102 ఆటవెలది వృత్తాలలో రచింపబడిన ఈశతకం నీతిపద్య శతకాల కోవకి చెందినది. కవి ఈశతకం ద్వారా తను నమ్మిన సిద్ధాంతాలను వ్యక్తీకరించారు. ఆనాడు సమాజంలో ఉన్న మూఢాచారాలను, అంటరానితనాన్ని ఖండించారు. చక్కని అందరికీ అర్థమయ్యే భాషలో ఈరచన సాగిపోతుంది. కొన్ని నీతి పద్యాలని ఇప్పుడు చూద్దాము.
ఆ. మున్ను పెద్దలు చెప్పిన వెన్నొ కలవు,
ఎన్నకుండిన నీతులు కొన్ని కలవు
పేరుగాఁ గ్రుచ్చి మెడలోన వేతువానిఁ
గుతిల పడకుండఁ దాల్చుము కుప్పుసామి
ఆ. పిలువకుండ వచ్చి పెద్దమాటలు చెప్పు
వానినెపుడు నమ్మ వలదు, వలదు
మేలుకలుగబోదు మెఱమెచ్చుల కతండు
తప్పుచెప్పుచుండుఁ గుప్పుసామి
ఆ. నీతిలేనివాని నిరసించు జగమెల్ల
నీతిశాలి కెపుడు నెగడు లేదు
నీతిశాలి నెపుడు నీతియే కాపాడుఁ
గుజనుబారినుండి కుప్పుసామి
ఆ. కమ్మ నెత్తావి దెసలెల్లఁ జిమ్మునట్టి
గంధఫలి చెంతఁజేరదు గండు తేఁటి
తేనె లేదన్న సంగతిఁ దెలిసికొనుచుఁ
దప్ప కీనీతి స్మరియింపు కుప్పుసామి
ఆ. నమ్మకంబున్న లేకున్న నచ్చకున్నఁ
బరులమాటకుఁ దలయూఁచు వాఁడు సత్య
మాత్మ గౌరవమేలేని యట్టివాఁడు
ముప్పుపుట్టు వానిని నమ్మఁ గుప్పుసామి
ఆ. ఎంతనీతి కలిగి యెపుడు వర్తించిన
నెంత నియతికల్గి యెప్పుడున్నఁ
ద్రాగుబోతు నమ్మరాదు నిజంబుగా
ముప్పువచ్చు దానఁ గుప్పుసామి
ఆ. రాజు వ్యభిచారి యైనచో రసికుఁడంద్రు
త్రాగి తందనాలాడుచో భోగియంద్రు
పాడిదప్పిన మంత్రాంగ పరుఁడటంద్రు
తప్పు తెలియని లోకులు కుప్పుసామి
సమాజంలో ఉన్న మూఢాచారాలను ఈకవి తీవ్రంగా నిరసించాడు.
ఆ. గుడికిఁ దఱచుపోయి గొణుగుచుండెడివాఁడు
చెడ్డపాపమేదొ చేసియుండు
నదియె వానిఁబట్టి యట్టిట్టు పీడింప
గుడికిఁ బోవు నతఁడు కుప్పుసామి
ఆ. ప్రొద్దుపొడువకుండ నిద్దుర మేల్కాంచి
బుడిగిబుడిగి నీట మునిఁగి మునిఁగి
మొగమునిండ బూది పూసినమాత్రానఁ
గుదుటఁబడునె మనసు కుప్పుసామి
ఆ. చదువుకొన్న భార్య సహధర్మచారిణి
యగుటకన్న మంత్రి యగుట కోరు
జగతి మంత్రి గొప్పొ సహధర్మచారిణి
గొప్పొ తెలిసి మెలఁగు కుప్పుసామి
ఆ. చేతగామిఁ బనులు చెడిపోయి నంతనే
విధిని దూరుచుంద్రు వెఱ్ఱివారు
విధికి దీననేమి పెత్తనంబుండునో!
తప్పుమాటగాక కుప్పుసామి
ఆ. చదువు చెప్పకుండ జడురాండ్రఁగాఁ జేసి
స్త్రీలఁ దిట్టిపోయఁ జెల్లుచుండె
దోస మెవరియందు దొరలాడుచుండెనో
చెప్పఁబోవ రెవరు కుప్పుసామి
ఆ. తలలు గొఱిగించి కావి బట్టలనుగట్టి
మెడల రుద్రాక్షమాలిక లిడినయంత
ముక్తి వచ్చునే నిస్సంగ బుద్ధిలేక
కుమతి మాటలనేమి కుప్పుసామి
జంతుబలులను తీవ్రంగా వ్యతిరేకించారు ఈకవి.
ఆ. జీవహింస చేసి జీవింతు ననుకంటెఁ
జెట్టయెందుఁ గూడఁ బుట్టఁబోదు
జీవహింస మాని జీవింపరాదొకో?
కొంత మేలు దానఁ గుప్పుసామి
ఆ. మాంసము భుజింప నిచ్ఛించి మానవుండు
మ్రొక్కు మ్రొక్కంచు దేవుని ముందుఁబెట్టి
గొంతుగోసి యే మృగమునో కుడుచుచున్నఁ
గోపపడకున్న దేవుండు? కుప్పుసామి
కొన్ని పద్యాలు వేమన శతములోని పద్యాలకు అనుకరణలు గా కనిపిస్తాయి.
ఆ. కులములోన నొక్క కుజనుండు పుట్టినఁ
గులము జెడును దానఁ గులకలంక
మందువల్ల నెంత మంది నిర్దోషులో
గోడు గుడుచు చుంద్రు కుప్పుసామి
చక్కని భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో రచింపబడిన ఈశతకం అందరూ చదవతగినది. మీరూ చదవండి. మీ మిత్రులచే చదివించండి.
***
No comments:
Post a Comment