నెత్తుటి పువ్వు - 25
మహీధర శేషారత్నం
(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన సరోజ అనే అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తాడు రాజు. బట్టల కొట్లో పనిచెయ్యనని చెప్పేస్తుంది సరోజ. ఒకరోజు లక్ష్మి రాజును సరోజ గురించి నిలదీస్తుంది. పోలీస్ స్టేషన్ లో ఒక కేసును విచారిస్తూ కానిస్టేబుల్ భాస్కర్ కవితలు చెబుతుంటాడు, )
తల అంటు...
అందులోనే ఉంది ఎంగిలి ఆలోచనలు కడుగు” అని మరొకటి
....” సగం ఒడ్డున చేప పిల్ల.
సగం నీటిలో చేప పిల్ల.
ఇవతలికొస్తే తిందామని ఆశతో కొందరు
లోనికొస్తే కలిసి నడుద్దామని మరికొందరు.
“మాటలే అర్థం కావు నాకు, ఇంక మీ తవికలేం అర్థమవుతాయి బాబోయ్ మీకో దండం” నాటకీయంగా దండం పెట్టింది.
“ఇది పోలీసు స్టేషనా? కవి సమ్మేళనమా!” విసుక్కున్నాడు రైటర్.
“ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు చెప్పినట్టు కూసింత కళాపోసనుండా లండి రైట్రుగారూ, మీరూ రైట్రే కదా! వెక్కిరింతగా అన్నాడు భాస్కర్.
పెళ్ళీ పెటాకులూ ఇంకా కాలేదుగా, ఇలాగే ఎగురుతావు కొన్నాళ్ళు. అయ్యాక అప్పుడణుగుతుంది తిమ్మిరి విసురుగా అన్నాడు సత్యం.
శుభం పలకరా మంకెన్నాఅంటే పెళ్ళికూతురు ముండెక్కడ చచ్చిందీ అన్నాట్ట వెనకెటకెవడో | అలాగ పెళ్ళిపక్కన పెటాకులెందుకు గురువుగారూ! ఏదో ఆశీర్వదించండి. నాటకీయంగా అన్నాడు భాస్కర్.
“గురుడు మంచివాడే కాని పాపం కొంచెం మూలశంక పురుషుడు” లేడీ కానిస్టేబుల్ చెవిలో గుసగుసగా అన్నాడు భాస్కర్.
కిసుక్కున నవ్విందావిడ. సత్యం తన పనిలో మునిగి గమనించలేదు.
ఈలోగా కావల్సినవన్నీ సర్దుకొని, ఫొటో గ్రాఫర్ కి ఫోన్ చేసి రావల్సిన ప్లేసు చెప్పి బయల్దేరారు శంకరం, నాగరాజు “బెస్ట్ ఆఫ్ లక్ గురువుగారూ!” చెప్పాడు భాస్కర్. బయటికి నడుస్తూ “భాస్కరం ఉంటే పోలీస్ స్టేషన్లా ఉండదు, పెళ్ళి వారిల్లులా ఉంటుంది హాయిగా కళకళలాడుతూ” అన్నాడు నాగరాజు.
“ఊఁ! తెలివైనవాడూ, మంచివాడే కాని కాస్త ఉమనైజర్” అన్నాడు శంకరం.
“అవునా!” ఆశ్చర్యంగా అన్నాడు నాగరాజు.
“అంతేకాదు, అతను ఓపెన్‌గా తనని తాను సమర్థించుకుంటాడు. ఎలాగో తెలుసా!” నవ్వుతూ అన్నాడు శంకరం.
“ఎలా?” ఆశ్చర్యంగా అడిగాడు నాగరాజు.
చలం పేరు చెప్పి అదే గుడిపాటి వెంకటాచలం గారి పేరు చెప్పి, స్వేచ్ఛ, ప్రేమ కావాలట పెళ్ళి చేసుకుంటే స్వేచ్ఛ పోతుంది కాబట్టి పెళ్ళి చేసుకోకూడదు అని అన్నాడు కాని చలం పెళ్ళి చేసుకున్నాడు కనుక మళ్ళీ వంశోద్దారకుడి కోసం పెళ్ళి చేసుకోవాలిట. మళ్ళీ ఎవరిని చూస్తే మనసవుతుందో వాళ్ళతో నిరాక్షేపంగా సెక్స్ చేయచ్చుట.
“చలం అలా అర్థమయ్యాడా!” నాగరాజు నవ్వాడు.
“అర్ధమవడమా! నా బొందా! చేసే వెధవ పనులకి ఒక ముసుగు తగిలించుకోవడం, జీవితంలో ఆయన స్ట్రగులయ్యేడు. వీడికి, నాకు సమర్ధనకు అవసరానికి ఒక పేరుకాని ఫ్రీ లవ్ గురించి వీడికేం తెలుసో నాకు తెలియదు. కాని ఆ మాట్లాడిన తీరు నాకు నచ్చలేదు” ముఖం చిట్లించాడు శంకరం.
అసలు చలం ఆలోచనా విధానమే నాకు నచ్చదనుకో. ఫ్రీ లవ్, ఫ్రీసెక్స్ వల్ల పిల్లలు పుడితే స్టేట్ పెంచాలి, స్వచ్ఛంద సంస్థలు పెంచాలి అని బిడ్డల శిక్షణ లాంటి పుస్తకం వ్రాసిన చలం అనడమేమిటో, పెంచడం అంటే అన్నం పెట్టి బట్టలివ్వడమనా? మమకారంతో పెరుగుతారు పిల్లలు అన్నంకంటే కూడా... ఏమోలే! నాలాంటి చిన్న బుర్రలకు పెద్ద విషయాలెందుకు” నువ్వేనాడు శంకరం.
నాగరాజు సాలోచనగా తల ఊపాడు.
ఎవరిని చూస్తే మనసవుతుందో... రోజా కదిలింది మనసులో “ఈ రోజులలో ఆలోచనా విధానాలు, అవసరాలు మారిపోయాయి. శారీరక అవసరాలు, మానసిక అవసరాలూ మారిపోయాయి. ఇప్పుడు చదువులంటే మార్కులు, మనిషంటే మనీ.. వేరే ఆలోచనలేదు.” మౌనంగా ముందుకు సాగారు.
*****
తలుపు తీస్తూనే రోజా రాజును అల్లుకుపోయింది.
“ఏయ్! రోడ్డు కెదురుగా ఏమిటిది?” అంటూ సున్నితంగా పక్కకినెట్టి తలుపు వేసాడు. “ఏమయిపోయావు? నువ్వు వచ్చి ఎన్నిరోజులయింది?” ఆరాటంగా నిలదీస్తున్నాట్లు అడిగింది. “ఇప్పుడేమయింది! వచ్చాగా..” విసుగ్గా అన్నాడు.
“అదే ఎన్నిరోజులకని అడుగుతున్నా...... ఈసారి కాస్త గట్టిగా అంది.
“ఏమిటా అధికారం?” విసుక్కున్నాడు.
“అధికారము.... నాకు నీ మీద అధికారం లేదా?.....”
“అబ్బ రోజా! నాకు చాలా తలనొప్పిగా ఉంది. విసిగించకు నిజమే! నీకు నా మీద అధికారం లేదు. అధికారం లేదా!” ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ అంది. కాళ్ళు కడుక్కొచ్చి మంచం మీద వాలేడు.
కాస్త టీ పెట్టు. తలనొప్పిగా ఉంది.
రోజా మౌనంగా లోపలికెళ్ళి టీ పెట్టి తెచ్చింది.
“ఇదిగో!” పక్కనే స్టూలుమీద పెడుతూ అంది.
రాజు లేచి టీ తాగుతూ రోజాకేసి చూసాడు.
No comments:
Post a Comment