పట్టిచ్చిన పుట్టుమచ్చ - అచ్చంగా తెలుగు

పట్టిచ్చిన పుట్టుమచ్చ

Share This

పట్టిచ్చిన పుట్టుమచ్చ

 (మాజొన్నవాడ కధలు -8)

టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)

ఉదయం 10 గంటలు. పెంచిలశెట్టి హోటల్‌ముందు ఆటో ఆగింది. అందులోంచి ముప్పై ఏళ్ళు వయసున్న యువకుడు ట్రంకుపెట్టెతో దిగాడు. బేరం ఎక్కడ నారిగాడి హోటల్‌కు పోతుందోనని శెట్టి గబగబా బయటికొచ్చి " ఏంగావాల నీకా! మాకాడన్నీ ఉన్నాయబయా! లోపలికిరా!" అని నవ్వుతూ పలకరించాడు. అప్పుడే బయటికొచ్చిన నారాయణ "వీడెమ్మ కడుపుగాల! దరిద్రుడు….మడిసగపడ్డం ఆలీశం…. వాసనబట్టి కుక్కమాదిరి లగెత్తుకొస్తాడీ దొంగనాయాలు!" గొణుక్కుంటూ, శెట్టిని గుర్రుగా చూస్తూ లోపలికి వెళ్ళాడు నారాయణ.

"థ్యాంక్సండీ! నా పేరు క్రిష్ణన్‌నాయర్. బెంగుళూరినుంచి వస్తున్నాను" అన్నాడు. "మంచిదయ్యా! అమ్మణ్ణిని జూడ్డానికే గదా! ఇంకా చానా టైముండాది  రా అబయా రా! రా! ముందు టిపినీ.. గిపినీ… జేసుకో! రా!" అని తీసుకోంబొయ్యి "ఒరే! నరిసిమ్ములా ఇట్రారా..ఈ అబ్బాయికేం గావాల్నో కాస్తా మంచి సెబ్బర చూడు" అని లోనకు వెళ్ళాడు.

టిఫిన్ అయింతర్వాత డబ్బులిస్తూ నాయర్ "శెట్టిగారూ! ఇక్కడ కాఫీ-టీ ఉండవా?" అన్నాడు. “లేదబయా! ఈపనికే చస్తాఉళ్ళా! మనోళ్ళు.  అదిగదిగో ఆడ ఉండాది చెంచయ్య టీబంకు, ఈ వూరు ఓలుమొత్తం ఆడ్నే గదా తాగేది. నువ్వూ ఆడ్నే దాగాల." అన్నాడు.

"శెట్టిగారూ! నేను ఈ ఊర్లో ఉండిపోదామని వచ్చాను" అన్న మాట విని ఉలిక్కిపడి "ఏందబయా! ఏందేందీ! ఏంపనిజేస్తావో నువ్వు? ఏమిటోళ్ళు మీరు? చదువుకున్నట్టున్నావు. చక్కంగా సినిమా హీరో లాగా ఉండావు. పెద్ద పట్నమాసంనుండీ వచ్చీ… ఈ పల్లెటూర్లో ఏందయ్యా ఉండేది?”  

"మేం   బెంగుళూరులో నాయర్ల కుటుంబం. ఇక్కడ రాజులంటారేమో! చిన్నప్పుడే మా అమ్మా నాయనా తమిళనాడు బార్డర్లో శ్రీలంక గొడవల్లో చనిపోయారు. బెంగుళూరులో కాఫీలు-టీలు అమ్మేవాడిని, ఇక్కడ గూడా అదేపని జేసుకోవాలని వచ్చా!"

"రాజులా మీరు? ఒరి నీ పాసుగూల. అట్నా! నీ గడ్డం మీసాలు ఆ కణతల కాడ ఉన్న పెద్ద పుట్టుమచ్చను  చూసి సాయెబ్బు లబ్బాయనుకున్నా!  సర్లే ఏడో ఎందుగ్గానీ.. నెలకు రెండేలిస్తే ఈడ్నే మా ఓటలు ముందే లచ్చణంగా టీ అంగడి బెట్టుకోవచ్చు. ఆచ్చేపణేంలే...కానీ... మాకు మాత్రం డబ్బుల్లేకుండా  రోజూ కాపీలు టీలు యియ్యాలయ్యో!” అన్నాడు తొర్రిపళ్ళు బయటబెట్టి నవ్వుతూ. 

"దానికే భాగ్గెం సరే! శెట్టిగారూ! నాకుండడానికి ఇళ్ళు ఏమైనా దొరుకుతుందా! ఈడ ?"

"చూడబయా! గార్లూ… గీర్లూ... అంటూ ఈ బోడిముండ మర్యాదలు మా పల్లెటూర్లల్లో ఏం బల్లా  గానీ… శెట్టీ అని పిలువబయా చాలు.  సరే.. అవతలీధిలో మొన్నే బోయిశెట్టి ఇళ్ళు ఖాళీ జేసి నెల్లూర్లో బాలాజీనగర్లో అంగడి బెట్టుళ్ళా.... నాలుగు  రూములిల్లు.  లోన సందులో చుట్టిల్లుండాది. వంటకు గూడా చానా బాగుంటాది. పైన మిద్దెమీద అంతా ఖాళీ!  బాడుగ మాత్రం నాలుగువేలని జెప్పమన్నాడు. తాళం చెవులు నాకాడ్నే ఉండాయి. ఆపాట్న నీ యిష్టం.  నీదే ఆలిశం". శెట్టి చెప్పిన బాడుక్కి ఒప్పుకోని చేరిపోయాడు నాయర్.                                                        

*   *   *

మరుసటిరోజు ఉదయాన్నే 7 గంటలకు బిర్రుగా టిఫిన్ లాగించి "శెట్టిగారూ! నేను నెల్లూరుదాకా బొయ్యి వంట సామాన్లు, టీ-కాఫీల బిజినెస్సుకు గావాల్సిన వస్తువులు ఎత్తుకొస్తా!" అని చెప్పిపోయిన వాడు రాత్రి 9 గంటలకు ఆటోలో రెండు పెద్ద గోతాముల సామానుతో దిగాడు. "ఏందబయా ఏమైపోయావని దిగులుపడ్డాము. సరే! ఆ ప్లాస్టరేంది? కుడిచెయ్యి వేళ్లకి ఆ కట్టేంది? యాక్సిడెంటా ఏంది? ఏడన్నా వణ్ణం దిన్నావా లేదా?" అని ప్రశ్నల వర్షం కురిపించాడు. నాయర్ నవ్వుతూ నెల్లూళ్ళో ఆటో యాక్సిడెంటు. చిన్న దెబ్బ తగిలింది అంతే! ఈపూటకు ఇక్కడే టిఫిన్ చేసి మాత్రలేసుకుంటా" అన్నాడు. "అట్నే జాగర్తయ్యా సామే...! పెళ్ళవ్వాల్సినోడివి… పిలగాడివి అక్కడా ఇక్కడా దిరిగి దెబ్బలు అవీ దగిలించుకోగాక!" అన్నాడు. 

*   *   *

పది రోజులనుంచీ నాయర్ కాఫీలు, మామూలు టీలే గాక,  అల్లంటీ, లెమన్‌టీ, గ్రీన్ టీ  అంటూ అని కొత్త కొత్త రుచులు తక్కువ రేటుకు జొన్నవాడ జనానికి అలవాటు చేశాడు.  "నువ్వసాధ్యుడవయ్యా సామీ! నీ దెబ్బకు ఆ      టీ-బంకోడు  వాడేనయ్యా.. చెంచయ్య బిత్తరపొయినాడు పో! నిన్న రాత్రి కొంపకు బొయ్యేపుడు నా కాడికొచ్చాళ్ళే! ఆడి మొహం జూస్తే చాలు. నవ్వొస్తా ఉంది. ఆముదందాగినట్టు బెట్టి ఏడస్తా ఉన్నాడు లోపల్లోపల్నే….. నాయాలు ఇంతకాలం పోటీ లేకుండా బొయింది వాడికి. ఇప్పుడు బడిళ్ళా బ్యాండా! " అన్న శెట్టి మాటలకు నవ్వి "వాడి బేరం వాడిది. మన బేరం మనది. ఎదురుంగా ఉన్న ఆ నారాయణ హోటల్‌కు ఆ పదిమందయినా వచ్చేది ఆడ్ని జూసిగాదు. వాడి వంటల రుచి జూసీ గాదు. ఆడి బార్య  శమంతకమణి అందం జూసి... ఆ అమ్మి బయట నిలబడి పకపక నవ్వతా ఉంటే జనం లగెత్తుకొచ్చి దూరతా ఉన్నారు లోపలికి.  ఆ ఓటల్లో రుచా! పచా! నాకు దెలవదా ఏందీ! అయినా ఆ నారాయణకు అంత చిన్న పిల్ల బార్యేంది?" అనేసరికి శెట్టి నవ్వి "అబయో! మంచి తెలివిగల్లోడివే! గమ్మున బట్టేశావే వాడి మందల. పెంచిల్శెట్టి పెసరదోశేస్తే వాసన ఆమడ దూరానికి గొడతాదంటారు తిర్నాళ్ళ జనాలు తెలుసా నీకు? నాయరా! అసలు కద దెలవదు నీకు. ఆడి మొదటిపెళ్ళాం లేచిపొయింది. మనోడేం తక్కవ దిన్నాడా? గ్రంధసాంగుడే! రేబాలకు బొయ్యి మాయమాటల్జెప్పి దీన్ని లేపుకొచ్చాడు. ఆళ్ళు కాపోళ్ళు. వీడు బత్తుడు. అదంతా పెద్ద తిర్నాళ్ళ తిర్నాళ్ళయిందిలే! పెద్ద రచ్చయ్యి పెద్దమనుషుల దాకా, పోలీసుల్దాకా బొయింది కత. ఇద్దరికీ ఇష్టమైందని అందరూ గమ్మునున్నారు. శమంతకమణిని జూసినా? డ్రెస్సులేసుద్ది.  అట్టనేం బొప్పేం గాదయ్యో! చిన్న పిల్లేం గాదు చూడ్డానికి అట్టాగుంటుందంతే! దానికీ యిప్పుడు  35 యేళ్ళు పైమాటే!.  టవున్లో పదో తరగతి జదివే కూతురుంది దానికి. అదీ  మాంచి కత్తి లాంటి చక్కని చుక్కనుకో! " అన్నాడు.

*   *   *

ఉదయాన్నే ఆటో ఆగిన శబ్దం విని పెంచిలశెట్టి బయటికి వచ్చాడు. తీరా బేరమేమోనని జూస్తే నారిగాడి కూతురు నాగమణి వాళ్ళింటి ముందు దిగింది. "ఎండాకాలం సెలవలనుకుంటా! ఆస్టల్‌నుంచి పెట్టే బేడాతో దిగింది టక్కులాడి. దానమ్మ తల్లో దూరిందిది. స్టైల్‌జూసినా…. దానేషాలు అదీ…. ఓరి నీయమ్మ బడవ!" అన్నాడు ఓరకంట నాయర్‌ను చూస్తూ. నాయర్ కూడా నిజంగానే "చక్కని చుక్క ఇది. దీని సెలవులయ్యేలోపు లైన్లో బెట్టాల ఎట్టాగైనా" అని మనుసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. “యోవ్... నాయరా! నారిగాడు గడప దాట్నీడు దాన్ని. అమ్మా నాయినకు  మంచి ముద్దు ఈ అమ్మి. మనకెందుకు లేనిపోని పితలాటకం… పని జూస్కో! పో!” అన్నాడు తన్మయత్వంతో నాగమణిని జూస్తున్న నాయర్‌తో.

నాగమణి పాలుబోయించుకునేటప్పుడూ, ముగ్గేసేటప్పుడూ,  కూరలకు వచ్చినప్పుడూ,   సాయంత్రపూట దేవళానికి పోతున్నప్పుడూ దినచర్య రోజూ ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు నాయర్. ఒక  శుక్రవారం  సాయంత్రం నాగమణి పూలబుట్ట తీసుకుని దేవళానికి బయలుదేరగానే నాయర్ చేతిలో ఒక సంచీతో అదరా బాదరా  బయలుదేరి "శెట్టిగారూ డేవళందాకా బొయ్యొస్తా! ఎవరన్నా వస్తే కాస్తా కూచోబెట్టు" అని చెప్పి గబగబా నడిచాడు.  ప్రదక్షిణాలు చేసి నాగమణి ఒకచోట కూర్చుంది. మెల్లిగా అక్కడచేరి "నాగమణిగారూ!" అని చిన్నగా దగ్గాడు. ఏమిటన్నట్లు చూసింది. "నేను మీ ఎదురుగా ఉంటాను. నాపేరు నాయర్" అన్నాడు. “చూసాన్లే! నాయరో గీయరో… నీ పేరు దెలవదు. కొత్తగా వచ్చిన టీ అంగడాయనే గదా నువ్వు? ఐతే ఏంటి? అన్నట్టు చూసింది. "నేను రెండు పట్టు చీరలు కొన్నాను. ఒకటి అమ్మణ్ణికి, ఇంకోటి నా మరదలుకు. నా మరదలు అచ్చం మీలాగే ఉంటుంది.  ఒకటి మీరు సెలక్ట్ చేస్తే ఇంకోటి అమ్మణ్ణికి ఇస్తాను" అన్నాడు. "నాకేం దెలుస్తుంది? నేనెందుకు సెలెక్ట్ చెయ్యడం! నీ మరదల్నే అడుగు! " అంటూ లేవబోయే సరికి "ప్లీజ్!" తప్పదు అన్నట్టుగా దండం పెట్టాడు. తప్పించుకునే మార్గంలేక ఇదుగో అడిగావు కాబట్టి చెప్తున్నా! ఈ ఎల్లో చీరె రెడ్ బార్డర్ మీ మరదలికీ. రెడ్ కలర్ ఎల్లో బార్డర్ అమ్మణ్ణికి" అనేసి లేచింది. "ఈ చీరె కాస్తా పట్టుకోండి అమ్మణ్ణికి చీరె ఇచ్చేసి గబాల్న వస్తా!" అంటూ చీరె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఒక పది నిముషాల తర్వాత తిరిగొచ్చి, చుట్టూ జనం ఆట్టే లేకపోవడం గమనించి,  నాగమణి చెవిలో "ఈ చీరె మీకే ఉంచండి" అనేసి "ఇదుగో  ఏందిది? నాయరో! నాకొద్దు. మా అమ్మ చంపేస్తుంది. తీసుకో అంటుంటే...!" అని అరుస్తూ ఉన్నా వినబడనట్టు తుర్రుమని తూనీగ మాదిరి వెళ్ళిపోయాడు. ఇంతలో చిన్నప్పటి స్నేహితురాలు స్వప్న కనిపించి "అక్కడ అమ్మవారి చీరెలు తక్కువ ధరలకు ఇస్తున్నారు చూస్తావా! అరే అప్పుడే కొనేసినట్టున్నావే! " అంది చేతిలోని చీరె జూసి. " అవును మే.... ఇది జూడు! ఇందాకే కొన్నా! అని చేతిలోని చీరె చూపించింది. "శానా బాగుందే నీకు కరెక్టు మాచ్" అంది. "సర్లే ఇంటిదాకా ఒక సారి రా! మా అమ్మ చీరె గొన్నానని ఏమన్నా గలభా జేస్తుందేమో!" అనగానే " సరే పద పద నేనూ తొందరగా పోవాలి" అంది. 

చీరె మాత్రం బెమ్మాండంగా ఉంది గానీ నాగమణమ్మా! ఇంత తక్కువ ధరకు ఇత్తారా..అని డవుటనుమానంగా చూసింది  వాళ్ళమ్మ. నాగమణి భయంగా స్వప్న చాయల చూసింది. "అవునమ్మా! బాగుంది చీరె" అనేసరికి "సర్లే! లోపల బీరువాలో పెట్టు. వచ్చే నెల్లో మా సుబ్బన్న కూతురు పెళ్ళి ఉళ్ళా..దానికి కట్టుకోవచ్చు" అనగానే "హమ్మయ్య" అని ఊపిరి పీల్చింది. స్వప్నను సాగనంపడానికి బయటికొచ్చి "నీకు దండమే తల్లీ! కాపాడావ్!" అనేసరికి "నేను జేసిందేముంది? నీ డబ్బులతో నువ్వు కొనుక్కున్న భాగ్యానికి" అంటూ నవ్వుతూ వెళ్ళింది. ఎదురుగా నాయర్ సక్సెసా? అన్నట్టు బొటనవేలు పైకెత్తి చూపించాడు. తలకొట్టుకుని.. గాల్లోనే వాడికి దండం పెట్టి లోనకొచ్చింది. ఆ రాత్రి నాగమణికి నిద్రపట్టలేదు. అసలు నాకెందుకిచ్చాడబ్బా వీడు చీరె.. నాయర్ చూడ్డానికి హీరో లాగా ఉన్నాడు బాగానే…  కొంపదీసి ప్రేమా దోమా అంటాడా? జాగ్రత్తగా ఉండాలి ఈ మొగనాయాళ్ళతో అని ఏవేవో ఆలోచనలతో నిద్రపొయింది.

*   *   *

"మేయ్.. నాగమణమ్మో! జాగ్రత్త. ఆవంతన తలుపులు బార్లా దీస్కోని లోపల టీవీ కాడ గూచోబాక అదే లోకంగా! కాస్తా మంచి సెబ్బర గమనిస్తా ఉండాల. మేం నెల్లూరు దాకా పోయి మాపిటికి వస్తాము చిన్న చిన్న పన్లున్నాయాడ." హోటల్ మూసేసి అప్పగింతలు చెప్తూ ఆటో ఎక్కుతున్న నారాయణను భార్యను గమనిస్తున్నాడు నాయర్.  సమయం 12 గంటలు దాటింది. దేవళానికొచ్చే జనం పలచబడ్డారు. పెంచలశెట్టి ఆపూటకు హోటల్‌పని ముగించి నరిసిమ్ములను మిగతా పిలకాయలను ఇళ్ళకు పంపించాడు. "భాగ్గెమా! సామాన్ల లిస్టు రాయమంటినే రాసినా!" అంటూ లోపలికి పొయినాడు. నాయర్ మెల్లిగా తల దువ్వుకోని గడ్డం సవరించుకుంటూ  వెళ్ళి నారాయణ యింటి తలుపులు కొట్టాడు. "మా అమ్మా నాయినా ఇంట్లో లేరు. ఎవురూ!" అంది నాగమణి. "నేను నాయర్‌ను ఒకసారి తలుపులుదీ! నీతోనే మాట్లాడాల!" అన్నాడు. కొంతసేపు అలికిడి లేదు. ఐదు నిముషాల తర్వాత తలుపులు తెరిచి "ఏంది నాయరా! చెప్పు!" అనింది. నవ్వుతూ నిలుచున్న అతన్ని జూసి "ఏంది తొందరగా జెప్పు" అని తనూ నవ్వింది. "లోపలికి రావచ్చా! అని అడిగిన ప్రశ్నకు కొంచెం రోడ్డుమీద అటూ ఇటూ చూసి లోనకు రమ్మన్నట్టు సైగ  చేసింది. లోపల సోఫాలో కూచుని చిన్నగా దగ్గాడు. "మంచి నీళ్ళు కావాలా ఏంది?" అని లోపలికి వెళ్ళి తెచ్చిచ్చింది. తాగి "కూర్చో! నాగూ! ఐదు నిముషాలు మాట్లాడాలి" అన్నాడు. నాగూ అని చనువుగా పిలిచే సరికి కాస్త బిత్తరపోతూ చూసింది. "నేను విషయం నాన్చదల్చుకోలేదు. నిన్ను ప్రేమిస్తున్నాను. ఇష్టమైతే పెళ్ళి చేసుకుంటా! మొదట నిన్నడిగి, తర్వాత మీవాళ్ళతో మాట్లాడదామని అనుకున్నా!  అని లేచాడు. "కూర్చోండి! మీరు నాయర్లంటే? ఏమిటోళ్ళో!" అంది.   అంటే "ఇక్కడ రాజుల కులం అనుకోవచ్చు". నాగమణి తలవంచుకుని కాలు బొటనవేలు నేలమీద రాస్తూ "నాకేమీ అభ్యంతరం లేదు. మీ వాళ్ళు ఒప్పుకుంటారా?“  అనగానే "నాకెవ్వరూ లేరు. ఏకో నారాయణ! నువ్వొప్పుకున్నావు కాబట్టి అంతే చాలు” అని సంతోషంగా నవ్వాడు. "డబ్బులకు కొదవలేదు. నా దగ్గర బాగానే ఉన్నాయి. బోయిశెట్టి ఇల్లు నేనే కొని రీమాడల్ జెయ్యించాలనుకుంటున్నా! నువ్వు కూడా పెళ్ళయ్యాక ఎక్కడో తెలేని ఊరుకి బోకుండా ఇక్కడే హాయిగా ఉండొచ్చు". “సరే” అన్నట్టు తలూపింది. ఈలోపు గిఫ్టుగా ఇది ఉంచండి" అని చిన్న పొట్లాం ఆమె చేతిలో ఉంచాడు. తెరిచి చూస్తే ప్రదానపు ఉంగరం. ఎలాగోలా అమ్మానాయన్ను ఒప్పించాలి. పిలగాడు మంచోడే! హీరో లాగా ఉన్నాడు అనుకుంది.

*   *   *

ఆరోజు శుక్రవారం. ఉదయం 7 గంటలు. ఏదో టూరిస్టు బస్సు దేవళం ముందు ఆగింది. జనం బిలబిలమంటూ దిగారు. అందరూ హోటళ్ళ బయట పెట్టిన తొట్లనీళ్ళతో మొహాలు కడుక్కొని టిఫిన్లకు ఎగబడ్డారు. అంతా కేరళా వాళ్ళు. మళయాలంలో గందరగోళంగా మాట్లాడుకుంటున్నారు. పెంచిల్‌శెట్టి హోటల్ నిండి పోవడంతో కొంతమంది నారాయణ హోటలుకు వెళ్ళి తింటున్నారు. నాయర్‌ అందరికి ఒకేసారి కాఫీలు, టీలు అందించలేక ఇబ్బంది పడుతున్నాడు. కొందరిని ఎక్కడో చూసినట్టుంది గానీ సరిగ్గా గుర్తు రావడంలేదు.  ఒక వ్యక్తి టీ తాగుతూ రోడ్డుమీద నిల్చుని తనను అలాగే చూస్తుండడం గమనించిన నాయర్ ఒక్కసారి ఏదో గుర్తొచ్చి ఉలిక్కిపడి గబ గబ ఏదో పనున్నట్టు లోపలికి వెళ్ళాడు. "అందరూ ఓ పాలి ఇనండి! సరిగ్గా తొమ్మిది గంటలకు బస్సు బయలుదేరుతుంది. తొందరగా దర్శనం పూర్తి చేసుకుని రండి. మిస్ అయినారంటే  సాయంత్రం  కాళహస్తి లోనే మళ్ళీ! " అని తెలుగు, మళయాళం, అరవంలో మైక్‌లో అరిచి చెప్తున్నాడు డ్రైవర్.

*   *   *

"గుర్నాధం! ఆ టీఅంగడి ఆయన్ను చూశావా?" "ఆ.. ఆ...చూశా.. కాఫీ బాగుంది కదా.." అన్న గుర్నాధంతో "అబ్బ కాఫీ కాదండీ..బాబూ... రెండేళ్ళ కింద మనం చెంగనూరు బ్రాంచిలో పని చేసినప్పుడు  సబ్‌స్టాఫ్ అక్కడ 50 లక్షలతో ఉడాయించిన నరసింహన్ మాదిరున్నాడు గదా! రోజూ పట్నంతిట్ట నుంచీ వచ్చేవాడు. అక్కడొక అబ్బాయినిబెట్టి జెరాక్సు షాపు నడిపేవాడు. లోను గూడా యిచ్చావుగదా?" అన్న భూపాల్ మాటలకు అడ్డొస్తూ "వాడు సన్నం..వీడు లావు..వాడికి గడ్డం లేదు..వీడికుంది" అన్నాడు. "లేదు లేదు కచ్చితంగా వాడే వీడు! కణతల దగ్గర ఆ పెద్ద పుట్టుమచ్చను  గమనించారా? వీడు నవ్వినప్పుడు వాడు లాగే ఉన్నాడు" అన్న భూపాల్‌తో "అయినా రెండు ఏళ్ళు అయింది. ఆ గొడవలు ఇప్పుడు నీకూ నాకూ ఎందుకు? నువ్వూ నేనూ బ్యాంకు ఓనర్లమా ఏంది?  టైం వేస్టు యెవ్వారాలు గాకపోతే!: అని తేలిగ్గా కొట్టేశాడు గుర్నాధం.

"లేదు గుర్నాధంగారు మీరు హాయిగా పింఛన్ తీసుకుంటూ మనకెందుకులే అని అనికుంటున్నారు. 50 లక్షల బ్యాంకుసొమ్ము కాజేసినవాడిని అలా వదిలెయ్యకూడదు. మీరు సహకరిస్తే మనం నియరస్ట్ టవున్ నెల్లూరు వెళ్ళి పోలీసులను కలుద్దాం. మన లగేజ్ బస్సులోంచి తీసేసుకుందాం. విషయం తేలే వరకు ఇక్కడే ఉందాం" అన్న భూపాల్ మాటలకు నవ్వి "నాయనా నువ్వు కావాలంటే ఉండు! నేను వెళ్ళాలి నాకొద్దీ యెదవ పితలాటకం. తర్వాత కోర్టంటారు. సాక్ష్యాలంటారు. ఎదవ గొడవ.! రిటైరయ్యి హాయిగా ఉన్న నన్ను ఈ గొడవల్లో ఇరికించబాక! పుణ్యం ఉంటుంది." అంటూ బస్ ఎక్కాడు. చేసేది లేక భూపాల్ తన లగేజ్ తీసుకుని నెల్లూరులో దిగిపోయాడు.

*   *   *

మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పోలీసు జీపు పెంచిల్‌శెట్టి హోటల్ ముందాగింది. అందులోంచి యిద్దరు కానిస్టేబుల్స్ దిగి "నాయరంటే ఎవరు?" అన్నారు. నాయర్ పరిస్థితి ముందుగానే ఊహించి తన మేనమామ ఉన్న బెంగుళూర్‌కు ఫోన్ చేసి కధంతా చెప్పాడు. రంగమంతా సిద్ధం చేసుకున్నాడు. "నేనే నాయర్ ఏంటి కధ?" అనగానే "మా ఎస్సైగారు మిమ్మల్ని ఒకసారి తీసుకు రమ్మన్నారు" అంటూ జీప్ ఎక్కించి పోలీస్‌స్టేషన్ ముందు ఆపారు.  వెళ్ళే ముందు పెంచిల్‌శెట్టికి ఇలా తెలీని వాళ్ళెవరో నన్ను స్టేషన్‌కు రమ్మన్నారని చెప్పి బయలుదేరాడు. 

పోలీసువారికి భూపాల్ అంతకు ముందు చెంగనూరులో ఇచ్చిన ఎఫ్.ఐ.ఆర్ కాపీ నెట్‌లో డవున్లోడ్ చేసి, నరసింహన్ ఆధార్ కార్డు వగైరా, కంప్లైంట్ కు జతచేసి ఇచ్చాడు. ఎస్సై నాయర్‌ను ఎన్ని ప్రశ్నలు వేసినా సంతృప్తికరమైన సమాధానం లేదు. ఎఫ్.ఐ.ఆర్ లో నాయర్‌కు కుడి కణత మీద పెద్ద పుట్టుమచ్చన అలాగే కుడి చేతికి 6 వేళ్ళు అని ఉంది. నాయర్‌చేతికి 6 వేళ్ళు లేవు. "సార్! ఈన చెప్తున్నట్టు నాపేరు నరసింహన్ కాదు. నన్ను నమ్మండి.  నాది అసలు కేరళ కాదు. ఈ డ్రైవింగ్ లైసెన్సు, రేషన్ కార్డు చూడండి" నేను బెంగళూరోడ్ని అని చూపించాడు. అవి చూసి మీవాళ్ళెవరైనా బెంగుళూరులో ఉన్నారా? అని అడిగిన ఎస్సై ప్రశ్నకు "మా తల్లిదండ్రులు లేరు. మా మావ ఉన్నాడు. కావాలంటే మాట్లాడండి" అని నంబర్ ఇచ్చాడు. నాయర్ చెప్పిన నంబరుకు ఫోన్ చేస్తే వాళ్ళ మామ నాయర్ గురించి వివరాలు చెప్పాడు. భూపాల్ ఇచ్చిన ఆధార్ కార్డు కాపీ పై నరసింహన్ అని చెంగనూర్ దగ్గర ఉన్న పటనంతిట్ట అడ్రసు ఉంది. ఫోటొ మాత్రం చూడ్డానికి గడ్డంలేని నాయర్ మాదిరే ఉంది. కాకపోతే ఫొటోలో కొంచెం సన్నగా ఉన్నాడు. కణత మీద పెద్ద పుట్టుమచ్చ మాత్రం ఉంది. భూపాల్ జతచేసిన ఆధార్ కార్డులో ఉన్న నంబర్ కంప్యూటర్‌లో ఓపన్ చేసి ఫింగర్ ప్రింట్స్ వెరిఫై చెయ్యిస్తే నాయర్‌వి  ఏ వేలూ మాచ్ కాలేదు. ఎస్సై‌కి ఏంచెయ్యాలో పాలుపోలేదు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. అదే క్షణంలో ఎస్సై మొబైల్ రింగయ్యింది. "సార్! నమస్కారం సార్!  నాయర్!  అవును సార్! !  నాయర్… స్టేషన్‌లోనే ఉండాడు సార్! ఇంటరాగేట్ చేశాను. ప్రూఫులు ఏవీ మాచ్ కాలేదు సార్! ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాను సార్! " అన్నాడు. ఆ తర్వాత అటునుంచి వచ్చిన సందేశం విని "షూర్ సర్! మీరు చెప్తుంటే ఇంకా ఎందుకు?" అన్నాడు. ఒక్క క్షణం అటు భూపాల్, ఇటు నాయర్ నివ్వెరపోయి చూస్తున్నారు. మొబైల్ స్విచాఫ్ చేసి "మిస్టర్! నాయర్ నువ్వు వెళ్ళొచ్చు!" అన్నాడు. భూపాల్ వేపు తిరిగి "సార్! దిస్  ఎవిడెన్స్ ఈజ్ నాట్ సఫిషియంట్..  కణతమీద పెద్ద పుట్టుమచ్చ తప్ప ఇంకే ఆధారమూ లేదు. కుడి చేతికి ఐదు వేళ్ళు మాత్రమే ఉన్నాయి. చూశారుగదా! ఏ ఎవిడెన్సుతో అరెస్టు చెయ్యాలి?  సారీ!" అంటూ కంప్లైంటు కాగితాలు చించి బుట్టలో పడేశాడు. భూపాల్‌కు ఏంజెయ్యాలో పాలుపోక పోలీసు్‌స్టేషన్ బయటికొచ్చి ఆటో ఎక్కి రైల్వే స్టేషనుకు దిగాలుగా బయలుదేరాడు. అప్పటికే నాయర్ ఆటో ఎక్కి జొన్నవాడ దారి పట్టాడు.

ఆటో దిగంగానే ఎదురొచ్చిన పెంచిల్‌శెట్టి "నాయరా! నీకేం గాలేదు గదా! మన దేవళం చైర్మన్ రెడ్డిగారి అన్న కొడుకే నెల్లూరు డి.ఎస్.పి. ఫోన్లో రెడ్డిగారికి చెప్పా అంతా! నేంజూసుకుంటాలే! అని ఫోన్లో చెప్పాడు. గంటలో నువ్వొచ్చావు." అన్నాడు. నాయర్ వంగి శెట్టి కాళ్ళకు నమస్కరించాడు. "నీపాసుగూల నేంజేసిందేముందీ అంటా! నువ్వు ఏ తప్పూ జెయ్యలేదని నాకు తెలుసు అందుకే జెప్పా! ఇదిగో అమ్మోరికి రేపు కుంకుమ పూజ్జేయిచ్చు. అన్నీ సర్దుకుంటాయి.. అంతా మంచే జరుగుద్ది. నిశ్చింతగా ఉండింక ఏ బయంలే పో!  " అన్నాడు.

*   *   *

"మిస్టర్ భూపాల్! ఆర్యూ షూర్!" అన్న జనరల్ మేనేజర్ మాటలకు "100% షూర్ సార్!" అన్నాడు. "సరే! రా కారెక్కు! అని డీ.ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్ళి విషయం మొత్తం లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. వెంటనే స్పందించిన ఆయన ఇద్దరు కానిస్టేబుల్స్ ను మఫ్టీలో వారి వెంట ఉండమని చెప్పి నెల్లూరు డీ.ఎస్పీ కి ఉత్తరం వ్రాసి ఇచ్చాడు. ఎంక్వైరీ చాలా కాన్‌ఫిడెన్షియల్‌గా చెయ్యమని అన్ని వివరాలు పొందుపరచాడు. ముందుగా పట్నంతిట్ట వెళ్ళి నరసింహన్ ఇంటిపక్కన ఉన్నవాళ్ళు,  నరసింహన్ ను బాగా గుర్తు పట్టగలిగిన ఉన్నవాళ్ళు అయిన ఇద్దరిని కలిపి, భూపాల్‌తో సహా ఐదుగురిని ఒక టాక్సీ లో నెల్లూరు పంపాడు. ఫోన్ చేసి నెల్లూరు డిఎస్పీ కి మాట్లాడాడు.

*   *   *

భూపాల్ ను జూడగానే నెల్లూరు డీఎస్పీ లెటర్ తీసుకుని, సీఐడీ డిపార్ట్మెంట్ ఎస్సైని పిలిచి  ఆధార్ కార్డ్ నంబరును కంప్యూటర్లో  ఎంటర్ చేయించి ఆధార్‌కార్డ్ డవున్లోడ్ చేయించాడు. ఆశ్చర్యం! ఫొటొ వేరే ఉంది. మిగతా వివరాలు అన్ని సరిపోయాయి. ఇతను ఎవరో గుర్తుపట్టగలరా అనే సరికి, బయట కూర్చున్న పట్నంతిట్ట వాళ్ళకు పిలిచి చూపిస్తే “ఇది కారు ఆక్సిడెంట్లో చనిపోయిన మాంబళం నరసింహంది” అని చెప్పారు. ఆపేరు తో సెర్చ్ చేయిస్తే నరసింహన్ డ్యూటీ లోకి చేరే ముందు నెలలో అతను చనిపోయినట్టు హిందూ పేపర్లో వచ్చిన కథనం ప్రింటవుట్ తీసుకున్నారు. ముద్దాయి అసలు పేరు నాయర్. ఫొటో మార్ఫింగ్ చేసి మీ వద్ద పనిలో చేరాడు. సర్టిఫికేట్లు కూడా చనిపోయినతనివే ఇచ్చుంటాడు. అనగానే భూపాల్ బ్యాంకుకు ఫోన్ చేసి సర్టిఫికేట్స్ స్కాన్‌డ్ కాపీలు తెప్పించి ఆ విషయం ధృవపరుచుకున్నారు. ఆ ఆధార్ కార్డ్ ఆధారంగా పాన్ కార్డ్ ఇతని ఫొటో తో సంపాయించి ఉంటాడు అని డీఎస్పీ అనగానే అతనికి ఒక జెరాక్సు షాపు గతంలో పట్నంతిట్టలో ఉన్నట్టు ఆ ఊరివాళ్ళు చెప్పారు. చనిపోయినతను సర్టిఫికేట్లు ఇతను సంపాదించి ఇదంతా చేశాడు. అని గుట్టు బయట పెట్టాడు.

*   *   *

భూపాల్‌ను కూడా వచ్చిన కానిస్టేబుల్స్ ను అక్కడే ఉండమని, పట్నంతిట్ట వాళ్ళకు పల్లెటూరి వేషాలు వేయించి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్‌తో బాటూ జీపులో జొన్నవాడకు పంపాడు. సీ.ఐ జీపు ఒక ఫర్లాంగు దూరంలో ఆపి వాళ్ళిద్దరిని హోటెలుకు వెళ్ళి టీ తాగి నాయర్‌ను బాగా చూసి కన్‌ఫరం చేసుకోని రమ్మని, తెలుగు రాదు కాబట్టి కేవలం సైగలతో టీ అడగమని అక్కడేమీ మాట్లాడవద్దని, అక్కడే కాసేపు అటూ ఇటూ తిరిగి రమ్మని పంపాడు. వెళ్ళిన వాళ్ళు అరగంటలో తిరిగి వచ్చి అతనే పట్నంతిట్ట లో ఉన్న వ్యక్తని కచ్చితంగా తేల్చి చెప్పారు. వాళ్ళను జీపులో ఎక్కించుకొని వేషాలు తీసేసి మామూలు వ్యక్తులుగా మార్చి మళయాళంలో నాయర్‌తో ఏమి మాట్లాడో చెప్పి, టీ అంగడి ముందు జీపు ఆపి జీపులోపల కూర్చుని అంతా  గమనించసాగాడు సీ.ఐ. 

వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి మళయాళంలో "ఏం సింగమలై ఎలా ఉన్నావు?" ఇక్కడ ఉన్నావా? అంటూ పలకరించే సరికి నాయర్‌కు మొహంలో నెత్తురు చుక్కలేదు. సమయానికి పెంచిలశెట్టి ఫ్యామిలీతో నెల్లూరుకు వెళ్ళున్నాడు. ఎదురుగా పోలీసు జీపు. ఏం చెయ్యాలో అర్ధంగాక హోటెల్లోపలకు వెళ్ళడం గమనించిన సీ.ఐ వెంటనే అలర్టయి గబగబ పెంచిలశెట్టి హోటెల్ వెనక్కు వెళ్ళి నిలబడ్డాడు. దొడ్డి దోవగుండా బయటికి వస్తాడని ఊహించాడు కాబట్టి వాకిలి పక్కన కనబడకుండా దాక్కుని రాగానే వెనకనుంచి పట్టుకుని పెడరెక్కలు విరిచి బేడీలు వేశాడు. హోటెల్ చుట్టూ పోగైన జనాన్ని పక్కకు తప్పుకోమని పెద్దగా అరుస్తూ జీపులో ఎక్కించి డీఎస్పీ ఆఫీసుకు తీసుకుని వచ్చాడు. 

      *   *   *

డీఎస్పీ ఆఫీసులో భూపాల్‌ను, పట్నంతిట్టలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళను చూసి తప్పించుకునే మార్గంలేక మొదట్లో కాస్తా బుకాయించినా పోలీసు లాఠీ దెబ్బ పడేసరికి నిజం కక్కాడు. కుడిచేతికున్న ఆరోవేలు జొన్నవాడకు రాగానే  మరుసటిరోజు ఆపరేషన్ ద్వారా తొలగించుకున్నట్టు ఒప్పుకున్నాడు. బోయిశెట్టి ఇంట్లో ట్రంకు పెట్టెలో దాచిన డబ్బూ, నగలూ స్వాధీనం చేసుకుని సీలువేసి అక్కడి పోలీసువారితో సీ.ఐ ని కూడా పంపించి  చెంగనూరు డీఎస్పీకి అప్పజెప్పే ఏర్పాటు చేశాడు.   

మరుసటిరోజు ఈనాడు పేపర్లో విషయం చదివిన జొన్నవాడ జనం నివ్వెరపోయారు. అంత మంచి అబ్బాయని అంతా బాధ పడ్డారు. మింగాలేక కక్కాలేక లోలోపల ఆనందపడ్డ వాళ్ళు టీ బంకు చెంచయ్య, నారాయణ కూతురు నాగమణి మాత్రమే!  నాగమణి తొందరపడి విషయం ఇంట్లో చెప్పనందుకు, పెద్ద గండం తప్పినందుకు కామాక్షమ్మకు ఘనంగా పూజ చేయించింది. చెంచయ్యకూడా మంచి చీరె, పెద్ద పూల మాల అమ్మవారికి సమర్పించి, ఇట్టాగే ఎళ్ళిపోనీయమ్మా నా బతుకు తల్లీ... అని దండం పెట్టుకుని ఊపిరి పీల్చుకున్నాడు. “త్వరలో మంచి  సినిమా హీరో లాంటి మొగుడు రావా”లని పూజారి దీవిస్తుంటే నాగమణి  "హీరో కాకపోయినా పర్వాలేదు. మంచివాడైతే చాలు. టీ అంగడి నాయర్ మాదిరి మోసగాడు, దొంగ కాకుండా ఉంటే… చాలు పూజారి గారూ" అనేసి వెంటనే నాలుక కొరుక్కుంది." 

-0o0-

No comments:

Post a Comment

Pages