అమ్మనెందుకు పోల్చటం? - అచ్చంగా తెలుగు

 అమ్మనెందుకు పోల్చటం?

భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.


కొవ్వొత్తితో అమ్మనెందుకు పోల్చటం?

అది కొంతసేపు వెలిగి తరిగిపోతుంది,

కానీ,అమ్మ జీవితాంతం కరుగుతూనే ఉంటుంది,

వెలుగులను పంచుతూనే ఉంటుంది.

ఆవుతో అమ్మనెందుకు పోల్చటం?

ఆవు పాలను మాత్రమే ఇస్తుంది,

కానీ, అమ్మ పాలతోపాటు 

ముద్దులు,మురిపాలను కూడా ఇస్తుంది.

భూదేవితో అమ్మనెందుకు పోల్చటం?

భూదేవి సహనం మాత్రమే చూపుతుంది,

కానీ, అమ్మ సహనంతో పాటు త్యాగాన్ని,

అనురాగాన్ని కూడా చూపుతుంది.

ఆకాశంతో అమ్మనెందుకు పోల్చటం?

ఆకాశం విశాలత్వాన్ని మాత్రమే కలిగిఉంటుంది,

కానీ,అమ్మ హృదయం విశాలత్వంతోపాటు,

ప్రేమతత్వాన్నికూడా కలిగి ఉంటుంది.

కల్పవృక్షంతో అమ్మని ఎందుకు పోల్చటం?

కల్పవృక్షం అడిగినది మాత్రమే ఇస్తుంది,

కానీ, అమ్మ అడిగినవి,అడగనివి కూడా ఇస్తుంది.

దేవతతో అమ్మని ఎందుకు పోల్చటం?

దేవత కేవలం అనుగ్రహాన్ని మాత్రమే కలిగిఉంటుంది,

కానీ,అమ్మ అనుగ్రహంతో పాటు 

నిగ్రహాన్ని కూడా కలిగిఉంటుంది.

  ***

No comments:

Post a Comment

Pages