అటక మీది మర్మం సీరియల్ నవల- 35 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం సీరియల్ నవల- 35

Share This

 అటక మీది మర్మం సీరియల్ నవల- 35

(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)

తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)



(తండ్రి కోరికపై కనిపించకుండా పోయిన ఫిప్ సాహిత్యాన్ని వెతికి పట్టుకోవాలని నిర్ణయించుకొన్న నాన్సీ ఆగంతకుడెవరో ఆ భవనంలో తిరుగుతున్నాడని గమనించి, తన స్నేహితురాళ్ళ సహాయంతో అతణ్ణి పట్టుకోవటానికి విఫలయత్నం చేస్తుంది. తరువాత అటక మీదకు రహస్య మార్గం ఉందేమోనని వెతుకుతున్న ఆమెతో, కనిపించిన అస్తిపంజరం తమకేదో సైగ జేస్తున్నట్లు బెస్ చెబుతుంది. వెంటనే అస్తిపంజరం ఉన్న బీరువాలో గాలించిన ఆమె  బీరువా వెనుక ఉన్న రహస్య గదిని కనుక్కొంటుంది. ఆ చీకటి గదిలో కనిపించిన పియానోలో ఎన్నో పాటలు ఉన్న కాగితాల చుట్టలు దొరుకుతాయి. వాటిని కనుగొన్న ఆనందంలో ఉన్న ఆమెను, ఇన్నాళ్ళూ ఆగంతకుడిలా తిరిగిన బుషీట్రాట్ వెనుకనుంచి పట్టుకొని, ఆమె చేతిలోని పాటల కట్టను లాక్కుంటాడు. ఆమె కాళ్ళూ చేతులను కట్టేసి, తన జేబులోంచి బ్లాక్ విడో సాలీడుని బయటకు తీసి పియానోపై వదులుతాడు. తరువాత ఆ గదికి, అటకకు మధ్య ఉన్న తలుపును మూసి, అడ్డ గడియను పెట్టి, గదిలో వెలిగే కొవ్వొత్తిని ఆర్పేసి, అతను సొరంగం ద్వారా బయటకు వెళ్ళిపోతాడు. బ్లాక్ విడో బారిన పడకూడదని కొట్టుకొనే నాన్సీని ఆమె మిత్రుడు నెడ్ వచ్చి రక్షిస్తాడు. ఫిప్ గురించి విన్న ఆమె స్నేహితులు వెంటనే కంగారుగా అటక దిగి, తోట వైపు పరుగుతీస్తారు. కొద్దిసేపటికి కోలుకొన్న ఫిప్ మౌనంగా రెండవ అంతస్తుకి వెళ్ళిపోతాడు. అదే సమయానికి అక్కడకు వచ్చిన తన తండ్రి కారులో బుషీట్రాట్ చిరునామా తెలుసుకొందుకు డైట్ యింటికి బయల్దేరుతుంది. డైట్ దగ్గర బుషీట్రాట్ చిరునామా తీసుకొని, పోలీసులతో వెళ్ళి అతన్ని బంధిస్తారు. నాన్సీ నేరస్తుణ్ణి నిర్ధారిస్తూ, అతని అసలు పేరు రిగ్గిన్ ట్రాట్ అని చెబుతుంది.  తరువాత .....)

 "ఇతనే!" బదులిచ్చిందామె. "నాకు తెలిసి యితని అసలు పేరు రిగ్గిన్ ట్రాట్."

మరునాడు నాన్సీ, ఆమె తండ్రి పోలీసు స్టేషనుకెళ్ళారు.  ఖైదీ అయిన ట్రాట్ తో మాట్లాడటానికి అధికారుల అనుమతి కోరారు.  పోలీసులు వారికి అతను పాత నేరస్తుడేనన్న విషయం తెలియపరచారు.  స్వతహాగా అతను తెలివైన రసాయన శాస్త్రవేత్త!  కానీ జైలుకెళ్ళి బయటకొచ్చాక, అతని నేరచరిత్ర తెలిసి ఎవరూ చేరదీయలేదు.  అందువల్ల డయానె తండ్రికి దగ్గర చుట్టమైన హొరేస్ డైట్ దగ్గర డ్రైవరుగా చేరాడు.

"బాగుంది.  దీనివల్ల మనకు చాలా విషయాలు తెలిశాయి" యువగూఢచారి ఉత్సాహంగా అంది. 

ట్రాట్ వారితో మనఃపూర్వకంగానే మాట్లాడాడు.

"నువ్వు ఫిలిప్ మార్చ్ సంగీతపు వ్రాతప్రతులను హోరేస్ డైట్ కి అమ్మింది నిజమేనా?" నాన్సీ అడిగింది.

ట్రాట్ అవునన్నట్లు తలూపాడు.

డైట్ పాటలను బాణీ కట్టడానికి, వాటిని అమ్మటానికి చాలా కష్టపడేవాడని, ఆర్ధిక యిబ్బందులతో నలిగిపోయేవాడని అతను చెప్పాడు.  ఒక రోజు  ట్రాట్ తన యజమానికి జిత్తులమారి సలహా ఒకటి యిచ్చాడు.  బజార్లో బాగా అమ్ముడుపోయే పాటలు ఎక్కడ దొరుకుతాయో తనకు తెలుసునని చెప్పాడు.

"అయినప్పటికీ, ఎక్కడ అన్నది అతనికి చెప్పలేదు."

ఇంకా వివరాలకి పోగా, సైన్యంలో పనిచేసే రోజుల్లోనే ట్రాట్ కి ఫిప్ మార్చ్ తో పరిచయం ఉంది.   

మార్చ్ స్థాయి గురించి తెలుసుకొన్న ట్రాట్ అతని విశ్వాసాన్ని చూరగొని, అంచెలంచెలుగా మార్చ్ భవంతిని కొల్లగొట్టాడానికి ఒక ప్రణాళిక రచించాడు.

"కానీ అతనెప్పుడూ తన స్వర సాహిత్యాన్ని ఖచ్చితంగా ఎక్కడ దాచాడో చెప్పలేదు" ఖైదీ వెల్లడించాడు.

ట్రాట్ సైన్యం నుంచి బయటకొచ్చిన కొన్నాళ్ళకే ఒక నేరంపై జైలుపాలయ్యాడు.  కొన్నేళ్ళ జైలు శిక్ష అనుభవించాక బయటపడ్డ అతను ప్లెజెంట్ హెడ్జెస్ ని చూడటానికి వెళ్ళాడు.  అక్కడ వాతావరణాన్ని చూశాక ఆ భవంతిలో దోపిడీకి పాల్పడినా, తనకు కిట్టుబాటు కాదని అతనికి అర్ధమైంది.  హోరేస్ డైట్ దగ్గర పనిలో జేరాక, ఫిప్ తరచుగా సంగీతబాణీలను గానంచేయటం ట్రాట్ కి గుర్తుకొచ్చింది.  అవి ఫిప్ స్వరపరచిన బాణీలేనని, కానీ అవి అముద్రితాలని అతను తనకు చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది.   వెంటనే అతను వాటిని వెతకాలని నిర్ణయించుకొన్నాడు.  ఒకరోజు ఆ ప్రాసాదంలో యింటిల్లపాదీ ఊరెళ్ళినప్పుడు ట్రాట్ యింట్లోకి దూరి ప్రదానమైన అటక మొత్తం గాలించాడు.  అప్పుడు అతనికి బరువైన బట్టల బీరువా కప్పి ఉంచిన మోట తలుపు కనిపించింది.  ఆ తలుపు తెరవగానే కొద్దిగా కింద ఉన్న రెండవగది, దానిలోకి దిగటానికి ప్రధాన అటక నుంచి మూడు మెట్లు కనిపించాయి.  ఆ మెట్లను దిగి రెండవగదిని శోధించగా, పియానో డెస్క్ మీద ఫిప్ విడిచిపెట్టిన ఒక పాట కనిపించింది.   దాన్ని ట్రాట్ తీసుకెళ్ళి తన యజమాని హోరేస్ డైట్ కి అమ్మాడు.  అతను వెంటనే మరికొన్ని పాటలను తీసుకొని రమ్మని కోరాడు.

"తరువాత రెండవ అటకనుంచి మెట్లదారికోసం వెతికాను" ట్రాట్ చెప్పాడు.  "ఫిప్ పాతభవనంలో తను గడిపిన బాల్యం గురించి ఎక్కువగా వల్లించేవాడు.  ఒకసారి కూలీల నివాసాల దగ్గర ఆడుకొనేటప్పుడు అతనొక రహస్యద్వారాన్ని చూశాడట!  చూసేవాళ్ళకు అక్కడ  తలుపు ఉన్నట్లే తెలియదు.  అది గుర్తుకొచ్చిన నేను ఆ తలుపును కనుగొన్నాను.  దాన్ని తెరవగానే సన్నటి మెట్లదారి కనిపించింది.  ఆ దారి మనని కూలీల నివాసాల మీద ఉన్న చిన్న అటకమీదకు తీసుకెడుతుంది.  ఆ అటక గదే ప్రధాన అటకను ఆనుకొని ఉన్న గది.  ఆ గదిలో నేలమీద ఒకచోట నాకు సొరంగమార్గం కనిపించింది.  దానిలోకి దిగి చూడగా, అది ఈ సన్నటి మెట్లదారిని కలిసింది.  వెంటనే ఆ సొరంగద్వారంపైకి పియానో డెస్క్ ని జరిపాను."

    ఆ మెట్లదారిని కనుగొన్నాక మార్చ్ యింట్లోకి ఎలాంటి యిబ్బంది లేకుండా రహస్యంగా వచ్చిపోయే వీలు చిక్కింది.  పాత ప్రాసాదం లోపల రహస్యమార్గంలో కదిలినప్పుడు తన అడుగుల చప్పుడు అసాధారణంగా ప్రతిధ్వనించేదని, ఆ శబ్దాలతోనే ఎఫీని భయపెట్టేవాడినని దొంగ చెప్పాడు. కనిపించని సంగీతం కోసం అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవి నిష్ఫలమయ్యేవి.  ఒక రోజు అతన్ని ఆశ్చర్యపరుస్తూ "పియానో మీటల అడుగున అనూహ్యంగా ఒక సొరుగు తెరుచుకొని, రెండు పాటలను బయటపెట్టింది" అని చెప్పాడతను.  అప్పుడే తన దగ్గర ఉన్న చిన్న కాగితాన్ని అతను పడేసుకొన్నాడు. అది నాన్సీకి దొరికి, తన గుట్టు మొత్తం రట్టు చేసేసింది.

తనకు దొరికిన రెండు పాటలను హోరేస్ డైట్ కి అందజేశాడు ట్రాట్.  అతను ఆ రెండు గీతాలను బెన్ బాంక్స్, హారీహాల్ అన్న రెండు పేర్ల మీద ముద్రించాడు.  ఆ రెండు పాటలు అతితక్కువ సమయంలోనే ప్రజాదరణను చూరగొన్నాయి.  దానితో ఫిప్ సృష్టించిన అన్ని గీతాలను కనుక్కోవాలని ట్రాట్ తీర్మానించుకొన్నాడు.

అవి అన్నీ పియానో డెస్క్ లోనే ఎక్కడో రహస్యంగా దాచబడ్డాయని ట్రాట్ నిర్ధారణకొచ్చాడు.

అందువల్ల తరచుగా ఆ రెండవగదిలోకి వచ్చి తన అన్వేషణను ముమ్మరం చేశాడు.  కానీ నాన్సీ తన స్నేహితురాళ్ళతో వెతకటానికి ఎక్కువగా ప్రధానమైన అటకను ఎక్కుతూంటే, తాను వాళ్ళకు దొరికిపోవచ్చుననే భయం ఎక్కువవుతోంది.

దానితో వాళ్ళందరినీ కుట్ర పన్ని భయపెట్టాలని తీర్మానించుకొన్నాడు.  అందుకే ముందుగా అటకకున్న తలుపుకు కన్నంపెట్టి, తరువాత దానిగుండా బట్టలబీరువాకు కన్నం పెట్టాడు.

 తరువాత తాను తీసుకొచ్చిన సీసాలోని ప్రాణాంతకమైన బ్లాక్ విడో సాలీణ్ణి ఆ కన్నంలోకి విడిచిపెట్టాడు.  అది ఆ చిన్న కన్నం గుండా పాక్కుంటూ బీరువాలోకి వెళ్ళింది.  ఆపైన బీరువాలో బట్టలను వెతికే ఎఫీని కరిచింది.

"నేను నిరాశపడ్డాను" ట్రాట్ అన్నాడు.

"హోరేస్ డైట్ సంగతేమిటి?" నాన్సీ అడిగింది.

ట్రాట్ దొంగిలించి తెచ్చిన పాటల వలన తనకు మంచి పేరు రావటంతో మరిన్ని పాటలను వెతికి తెమ్మని డైట్ యితన్ని అభ్యర్ధించాడని నాన్సీకి తెలిసింది.  ఆ పాటల ప్రచురణకర్తకు తాను చేస్తున్న పని చట్టవిరుద్ధమని మొదట్లో తెలియదు.  మార్చ్ ప్రాసాదంలో నాన్సీతో మాట్లాడాక తన క్లయింట్ నిజమైన స్వరకర్త కాదన్న నిజం జెన్నర్ కి తెలిసింది.

"నిజం తెలిశాక వాళ్ళిద్దరూ గొడవపడ్డారు" ట్రాట్ నిజాన్ని బయటపెట్టాడు.  "ఇరుపక్కలా ఒకరినొకరు బెదిరించుకొన్నారు కూడా!  కానీ చివరికి మిస్టర్ జెన్నర్ ఆ పాటల వల్ల తనకు మంచి పేరు, ఆదాయం వస్తున్నాయని ఈ విషయాన్ని రహస్యంగా ఉంచటానికి ఒప్పుకొన్నాడు."

ట్రాట్ కబంధహస్తాల్లో యిరుక్కొన్న హోరేస్ డైట్, అతనికి యితర నేరాల్లో సహకరించటం మొదలెట్టాడు.  అతను తనకు వరుసకి సోదరుడు, అమాయకుడైన లారెన్స్ డైట్ వద్దకు ట్రాట్ ను పంపించాడు.  అతడు తాను దొంగిలించిన పట్టు తయారీ ప్రక్రియను డయానె తండ్రికి అధిక లాభానికి అమ్మి, సహకరించిన హోరేస్ కు పెద్దమొత్తంలో సొమ్మును ముట్టజెప్పాడు.

నాన్సీ, ఆమె తండ్రి చూపిన సూక్ష్మబుద్ధి వల్ల హోరేస్ డైట్, రిగ్గిన్ ట్రాట్ లిద్దరూ కొంతకాలంగా చెలామణీలో లేకుండా పోయారు.  వరుసకు సోదరుడైన హోరేస్ డైట్ నేర చరిత్రను తెలియని డయానె తండ్రి, బుకర్ ప్రక్రియను వాడుకొంటున్నందుకుగాను, అతనికి రాయల్టీని చెల్లించటానికి అంగీకరించాడు.  అంతేగాక తామిద్దరూ సమానంగా లాభపడే రీతిలో తమ కంపెనీలను విలీనం చేసే దిశగా కూడా ఆలోచించటం మొదలెట్టారు.

ఒకరోజు నాన్సీ ఎమర్సన్ కాలేజీలో జరగబోయే నృత్యకార్యక్రమం గురించి తన స్నేహితురాళ్ళయిన బెస్, జార్జ్ లతో చర్చిస్తోంది.  అదే సమయంలో బుకర్ ఫాక్టరీ నుంచి ఆమెకొక పార్సెల్ వచ్చింది.

"ఎమర్సన్ లో నాట్యానికి నేనేమి కట్టుకొని రాబోతున్నానో చూడాలనుకొంటున్నారా?" అడుగుతున్న  నాన్సీ కళ్ళు మెరిశాయి.  "మేడపైన నా గదికి వెళ్ళాక దీన్ని తెరుద్దాం" అంటూ తన స్నేహితురాళ్ళు బెస్, జార్జ్ లను మేడ మీదకు తీసుకెళ్ళింది.

నాన్సీ ఆ పార్సెల్ నుంచి మృదువుగా అందంగా నేయబడ్డ, పొడవైన సొంపులీనే లేత పసుపురంగు దుస్తులను బయటకు తీసింది.

"ఓ!" బెస్ మెచ్చుకోలుగా అరిచింది.  "ఇంత అందమైన దాన్ని ఎప్పుడూ చూడలేదు.  నీకిది ఎక్కడనుంచి వచ్చింది?"

"మిస్టర్ బుకర్ దీన్ని పంపించారు.  ఆయన మా నాన్నగారి క్లయింట్."

నాన్సీ తన స్నేహితురాళ్ళకు యింకా వివరంగా చెప్పాలనుకొంది.  కానీ ఆ పట్టువస్త్రపు తయారీ రహస్యం బయటపెట్టనని ఉత్పాదకుడికి మాట యిచ్చినందువల్ల ఊరుకొంది.

"నువ్వు మీ నాన్నకి ఒక కేసులో సాయపడ్డావు.  అందుకే నీకిది బహుమతిగా వచ్చిందని పందెం" జార్జ్ తెలివిగా చెప్పింది.

"నువ్వన్నది నిజమే!" నాన్సీ అంగీకరించింది.

"నాక్కూడా ఏదైనా మిస్టరీ ఉంటే మీ నాన్నను చెప్పమను.  కాకపోతే దాన్ని పరిష్కరించినందుకు నాకూ యిలాంటి బహుమతే కావాలి" అంటూ బెస్ ముసిముసిగా నవ్వింది.

ఆమె మాటలకు ముగ్గురూ నవ్వుకొన్నారు.  "ఏమైనప్పటికీ, రాబోయే మిస్టరీని మీ యిద్దరితో పంచుకొంటాను" నాన్సీ చెప్పింది.

రెండు రోజుల తరువాత కర్సన్ డ్రూ తన కూతురితో యిలా చెప్పాడు :

"నువ్వు యిద్దరు ఫాక్టరీ యజమానులను స్నేహితులను చేశావు.  ఇప్పుడే నేను మిస్టర్ మార్చ్, సుశాన్ లతో ఫోనులో మాట్లాడాను.  దొంగిలించబడ్డ ఫిప్ పాటలను తాను ముద్రించినందుకు మిస్టర్ జెన్నర్ పరిహారం చెల్లించటానికి ఒప్పుకొన్నాడు.  నా స్నేహితుడు హాకిన్స్, ఫిప్ యొక్క మిగిలిన పాటలను ముద్రించబోతున్నాడు.  మార్చ్ కుటుంబం పట్టలేని ఆనందంలో ఉన్నారు.  ఇకపై వాళ్ళు నీ గురించి చెప్పుకొనే అద్భుతమైన మాటలను వినబోతున్నావు."

"వాళ్ళకు సాయపడినందుకు నాకు ఆనందంగా ఉంది" నాన్సీ నమ్రతతో నవ్వింది.  "ఆ భయానకమైన అటక మీద ఆధారాల కోసం వెతకటం ఉత్తేజకరంగానూ ఉంది."

"ఏమైనప్పటికీ దానికి ధైర్యసాహసాలు కావాలి" న్యాయవాది బదులిచ్చాడు.  "నీకు అవి లేకపోతే అటక మీది మర్మాలను ఎప్పటికీ బయటపెట్టలేవు."

(సమాప్తం)

****

No comments:

Post a Comment

Pages