పురాణ కధలు - బసవ పురాణం 2
వంగకాయలు లింగకాయలగుట
పి.యస్.యమ్. లక్ష్మి
బసవేశ్వరుని సూచన ప్రకారం శివ భక్తులందరూ లింగధారణ చెయ్యాలి. అంటే మెడలో లింగముండాలి. భోజనానికి ముందు దానికి పూజ చెయ్యాలి. అలా లింగధారణ చేయనివారు చేసినవారితో కలిసి బసవేశ్వరుని ఇంట భోజనానికి రాకూడదు.
ఒక రోజు బసవేశ్వరుడు శివ పూజ పూర్తి చేసుకుని భక్తులనారాధించే సమయంలో ఆ భక్తులతో కలసి కొందరు భక్తులు కానివారు భోజనం చెయ్యదలచారు. వారు శివ భక్తులు కాని కారణంగా వారి శరీరం మీద లింగం లేదు. వారు అప్పటికప్పుడు ఆలోచించి లభ్యమైన వంకాయలను పైపంచె పీలిక చింపి దానిలో వంకాయ కట్టి మెడలో కట్టుకున్నారు. అది లింగంలాగా కనబడటంవల్ల తమ భోజనానికి అభ్యంతరం వుండదనుకున్నారు. వారు కూర్చున్న వెంటనే బసవేశ్వరుడు భక్తులారా, లింగధారణ చేయనివారు శివ భక్తుల ఇళ్ళకు రాకూడదు. మీరు మీ మీ మెడలో లింగాలను తీసి శివ పూజ చేసుకోమని చెప్పగా వాళ్ళు, తమ దొంగతనము బయటపడుతుందని సిగ్గుతోనూ, భయముతోనూ ఒకరి ముఖము ఒకరు చూసుకొనుచుండగా బసవేశ్వరుడు భయపడకండి. మీ మెడలోవి లింగకాయలేగానీ (శివ లింగాలు) వంగకాయలు (వంకాయలు) కావు. విప్పి చూసుకొనుడు అని బలవంతంగా వారిచే మూటలు విప్పించగా అందులో వంగకాయల బదులు శివలింగాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ దొంగ భక్తులు శివ పూజ చేసుకుని, విందారగించి, బసవేశ్వరునినుంచి అనేక బహుమతులు పొంది సంతోషించారు. ఆ రోజునుంచీ వారు శివ భక్తులయ్యారని వేరే చెప్పనవసరం లేదుకదా.
3 – కుంచము శివలింగమూర్తియగుట
పూర్వము మల్లన్న అనే వ్యాపారి వుండేవాడు. ఈయన వ్యాపారం కోసం అనేక ఊళ్ళు తిరిగేవాడు. ఈయనకి ఒక నియమం వున్నది. శివుణ్ణిగానీ, చివరికి శివాలయం శిఖరమైనా దర్శించకుండా భోజనం చేసేవాడుకాదు. ఒకసారి ఈ మల్లన్న ఒక కుగ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామములో శివాలయము లేదు. మల్లన్న చేత భోజనం చేయించటానికి సాటి వ్యాపారస్తులు ఒక ఉపాయం పన్నారు. ఒక కుంచాన్ని (పూర్వం ఎక్కువగా వాడుకలో వున్న కొలతపాత్ర) తీసుకు వచ్చి ఒక చోట బోర్లించి, దాని పక్కన ఒక రావి కొమ్మను పాతించారు. కుంచము మీద అంతా పూలతో కప్పారు పూజ చేసినట్లు. వారు మల్లన్నతో మేము శివాలయాన్ని చూశాము, చూపిస్తాము రమ్మని తీసుకు వెళ్ళి చూపించగా, ఆయన భక్తితో ఆ కుంచాన్నే శివునిగా భావించి నమస్కరించి వెళ్ళి భోజనం చేయసాగాడు.
అప్పుడు వారిలో ఒక వర్తకుడు ఒక నౌకరుని పిలిచి, మా మల్లన్న కుంచమునకు మ్రొక్కిశివునికి మ్రొక్కాననుకుని తన వ్రత భంగం చేసుకున్నాడు. నువ్వెళ్ళి ఆ కుంచమును తీసుకు రమ్మని చెప్పాడు. అప్పుడు మల్లన్న అఖండ విశ్వాసంతో చిరునవ్వు నవ్వి, ఎందుకిట్లా మాట్లాడుతున్నారు అక్కడ ప్రతిష్టించబడిన లింగమూర్తిని తియ్యటం మీ తరమవుతుంతా అని, అందరినీ తీసుకుని, చూద్దాము పదమని ఆ ప్రదేశానికి వెళ్ళారు. అక్కడకెళ్ళి చూడగా అక్కడ ఒక దేవాలయం, దాని ఆవరణలో పెద్ద అశ్వధ్ధ (రావి) వృక్షము, దానికింద లింగముగా మారిన కుంచము, దానిమీద పూజ చేయబడిన కొండగోగు పువ్వులు అన్నీ చూసి, అంతా ఆశ్చర్యపోయారు. మల్లన్న భక్తికి ఆశ్చర్యపోయి ఆయన పేరుతో ఆ శివ లింగాన్ని మల్లేశ్వరుడని, మల్లన్నను మల్లేశ మల్లన్న అని పిలువ సాగారు.
నిశ్చలమైన భక్తితో ఏదైనా సాధించవచ్చని నిరూపించారు మన పూర్వీకులు.
***
No comments:
Post a Comment