తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన
రేకు: 258-6 సంపుటము: 3-336
- డా.తాడేపల్లి పతంజలి
ఎన్నడు దెలిసే మెచ్చరికెపుడో
ఇన్నియు గన్నవె యెఱిగీ నెఱగ
01 వ చరణం
నిన్నటియాకలి నేడూ నున్నది
కన్నదినంబే కడచనెను
పన్ని నిదుర మాపటికి నున్నదదె
యెన్నగ రాతిరి యెందో పోయ ॥ఎన్న॥
02 వ చరణం
కాయపు సుఖములు గంపల నున్నవి
పాయమే కైవాలి పండెనదే
యీయెడ సంసార మింటనే వున్నది
చేయును నోరును చెనటై నిలిచె ॥ఎన్న॥
03 వ చరణం
విడువని జన్మములు వెంటనే వచ్చీ
తడవేటి మోక్షము దవ్వాయ
యెడపక శ్రీవేంకటేశ నీ మఱగు
బడి జొచ్చితి నా భారము నీది ॥ఎన్న॥
తాత్పర్యము:
॥పల్లవి॥ వేంకటేశా! మాకు ఎప్పటికి తెలుస్తుంది అయ్యా! మేము జాగ్రత్త పడేది ఎప్పుడు? మేలుకొనేది ఎప్పుడు? ఇన్ని విషయాలు (చరణాలలో చెప్ప బోవు విషయాలు) అన్నీ చూస్తున్నవే!
అన్ని తెలిసిన వాడను నేనే! తెలియని వాడను నేనే!
01 వ చరణం
నిన్న పుట్టిన ఆకలి ఈ రోజు కూడా ఉంది . నేను చూస్తున్న రోజు నా ఎదుటే నశిస్తున్నది.
నువ్వు కల్పించిన నిద్ర రాత్రి అయ్యే సరికి సిద్ధంగా ఉంటుంది .
ఈ రాత్రి ఎక్కడ కలిసిపోతుంది అని ఆలోచిస్తే అంతు పట్టడం లేదు.
02 వ చరణం
ఈ శరీరానికి కావలసిన సుఖాలన్నీ సమకూరాయి.
పండిన పైరు భూమిపై వ్రాలుతున్నట్లుగా నా వయస్సు పండి పోతున్నది. నేలను కరుచుటకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ సంసారమంతా నా శరీరమనే ఇంట్లోనే ఉంది. నా చేయి ,నా నోరు వయసు మీద పడుతున్న కొద్దీ నా వశములో లేక వ్యర్థంగా ఉన్నాయి.
03 వ చరణం
నన్ను విడిచి పెట్టకుండా ఎన్నెన్నో జన్మలు వెంటవెంటనే వచ్చాయి కానీ ఎంత వెతికినా ఆ మోక్షం మాత్రం దూరంగా ఉంది.
శ్రీవేంకటేశ ! ఎప్పుడు తల్లి చాటున పిల్లవాడు రక్షణ కోసం దాగి ఉన్నట్లుగా నీ చాటున నేను నీ శరణు కోరుతూ దాగి ఉన్నాను .నీ పాదముల త్రోవలో నిన్ను ఆశ్రయిస్తూ ప్రవేశించాను .ఇక నా భారం అంతా నీదే.
***
No comments:
Post a Comment