కారణ జన్ముడు - గాన గంధర్వుడు బాలు.
-డా. పోడూరి శ్రీనివాస్ రావు, 98494 22239..
అందరూ ముద్దుగా “బాలు” అని పిలుచుకునే శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం) ఇక లేడన్న వార్త ఆశనిపాతంలా సోకింది. చిన్న బాలుడి దగ్గరనుంచి వృద్దులవరకు, స్వంత కుటుంబ సభ్యునిగా ప్రతీఒక్కరు భావించే గాన గంధర్వుడు బాలు అమరుడైనాడన్న వార్త యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ చేదునిజాన్ని ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది.ఎందుకయ్యా మాతో ఇంత అనుబంధాన్ని పెనవేసుకున్నావు ? ... మాలో ఒకడివైపోయావు ?? ..... కేవలం నీ పాటలను ఆస్వాదించడం తప్ప, నీకు మేము ఏం బదులివ్వగలిగాం చెప్పు.
బాలు మేరునగధీరుడు... నేను ఏ గురువు వద్ద శాస్త్రీయసంగీతం నేర్చుకోలేదు అని చెబుతూనే, అద్భుతమైన మాధుర్యభరిత, రాగభరిత, సుమనోహర గీతాలను మనకందించాడు. ఎన్నో భక్తిగీతాలు, ప్రబోధగీతాలు, ప్రణయగీతాలు, యుగళగీతాలు.... ఈటీవీలోసుమారు 22 సంవత్సరాల క్రితం, 1998 లో పురుడుపోసుకున్న సంగీత కార్యక్రమం “”పాడుతా తీయగా””. “ పాడాలని వుంది “, “పాడుతా తీయగా” కార్యక్రమాల ద్వారా ఎందరో నూతన గాయనీ గాయకులను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందించడమే కాదు. తెలుగు సినీ సంగీత సాహిత్యాలకు వారధిగా నిలవడమే కాదు. భాషతో ముడివడిన అపురూప సంగీతంతోపాటు సంస్కారాన్ని, సంస్కృతిని నేర్పించింది. వర్ధమాన గాయనీగాయకులకు తెలుగు భాషపట్ల అవగాహన, ఆసక్తి కలిగించింది. అక్షరదోషాలు పలకకుండా, తెలుగు భాష ప్రాభవాన్ని, గొప్పతనాన్ని ఆ చిన్నారులకు అర్థమయ్యేరీతిలో వివరించావు. తెలుగుభాష అంటే నీకెంత మక్కువయ్యా బాలూ !
ప్రస్తుతం సినీ సంగీతప్రపంచంలో రాణిస్తున్న కారుణ్య, స్మిత, హేమచంద్ర, దామిని, లిప్సిక, రోహిత్, తేజస్విని, ప్రవీణ్ పల్లవి, శ్రీకృష్ణ, పార్థసారథి, రామాచారి, కౌసల్య, సాయి చరణ్ ఈ వేదిక ద్వారా వికసించిన గొంతుకలే. అలాగే గోపికా పూర్ణిమ, మల్లిఖార్జున, ధనంజయ, నిత్య సంతోషిణి, హిమబిందు, శశికళ, బి. సురేఖామూర్తి, మౌనిమ, మనీషా, లక్ష్మీ మేఘన, సాయి రమ్య, శ్రీ లలిత, నాదప్రియ, సుగంధిని తదితర నేపధ్య గాయనీగాయకులంతా ఈ అపురూప సంగీతకార్యక్రమం నుంచి వెలుగులీనిన స్వర కాంతిపుంజాలే.
అదేవిధంగా “స్వరాభిషేకం” కార్యక్రమం ద్వారా గూడా వివిధ సంగీత దర్శకుల, రచయితల పాటలను తీసుకుని, అద్భుత విశ్లేషణతో గొప్ప గొప్ప పాటలను శ్రోతలకు అందించాడు బాలు.
1965 డిసెంబర్ 15 న ప్రారంభమైన బాలు సినీ గాన ప్రస్తానం అప్రతిహతంగా 2020 వరకు, అంటే అయిదున్నర దశాభ్దాలపాటుసాగడమేకాకుండా, నలభై వేల పాటలకు పైగా పాటలు పదహారు భాషల్లో పాడిన అసామాన్య, అనితరసాధ్యమైన ఘనత మన బాలుది.
గాయకుడుగా, నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, సంగీతదర్శకుడిగా బహుముఖ ప్రతిభ కనపరచిన ఘనుడీ బాలు. ఎంతో బిజీ గా వున్నా సమయాల్లో కూడా ఉదయం 7 గంటలనుంచి 9 గంటలవరకు పాటల రికార్డింగ్ లోను, 9 గంటలనుంచి సాయంత్రం 6 గంటలవరకు చిత్రీకరణ లోను పాల్గొనేవారు. మధ్యలో గంట విరామం తీసుకునేవారు. సాయంత్రం 6 గంటలనుంచి రాత్రి 10 గంటలవరకు మళ్ళీ రికార్డింగ్. కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్ర కుమార్ సంగీత దర్శకత్వంలో ఒకేరోజు 21 పాటలు పాడి రికార్డ్ సృష్టించారు. అలాగే తమిళంలో ఒకేరోజు 19 పాటలు, హిందీలో 16 పాటలు ఏకబిగిన పాడి రికార్డ్ సృష్టించారు. హిందీ సంగీత దర్శకుడు ఆనంద్ మిలింద్ కు 15 నుంచి 20 పాటలు ఒకేరోజు పాడి మద్రాస్ తిరిగివచ్చిన సందర్భాలు కూడా వున్నాయి.
కమల్ హసన్ కు డబ్బింగ్ కళాకారుడిగా ‘మన్మధలీల’ చిత్రం తో తన ప్రస్తానం ప్ర్రారంభించిన బాలు కమల్ హసన్, రజనీకాంత్, భాగ్యరాజ్, నగేష్, కార్తీక్, రఘువరన్, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్ లాంటి నటులకు డబ్బింగ్ చెప్పారు. ’దశావతారం’ చిత్రం లో, కమలహాసన్ నటించిన వివిధ పాత్రలకు వైవిధ్యభరితంగా సంభాషణలు పలికిన తీరు మరో కళాకారునికి అనితరసాధ్యం. ‘అన్నమయ్య’, ‘శ్రీ సాయి మహిమ’ చిత్రాల్లో డబ్బింగ్ చెప్పినందుకు బాలు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది బహుమతులు గెలుచుకున్నారు. రిచర్డ్ అటెన్ బరో నిర్మించిన ‘గాంధీ’ చిత్ర తెలుగు వెర్షన్ లో గాంధీ పాత్రధారి బెన్ కింగ్స్ లే కు గాత్రదానం చేసింది బాలునే.
‘కన్యాకుమారి’ చిత్రానికి తొలుత సంగీత దర్శకత్వం వహించిన బాలు 30 తెలుగు చిత్రాలకు స్వరాలు సమకూర్చారు. హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కలిపి మొత్తం 60 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు మన బాలు.
ఉత్తమ గాయకుడిగా బాలు 6 జాతీయ బహుమతులు అందుకున్నారు.3 సార్లు తెలుగు పాటలకు, ఒక హిందీ పాటకు, ఒక తమిళ పాటకు, ఒక కన్నడ పాటకు, మొత్తం 6 సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు.
బాలు. జాతీయ స్థాయిలో ఉత్తమగాయకుడిగా ‘మైనే ప్యార్ కియా’ చిత్రానికి, దక్షిణ భారతీయ భాషల్లో ఉత్తమ గాయకుడిగా 7 సార్లు ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ గాయకుడిగా 18 సార్లు, ‘మయూరి’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగాను ‘నంది పురస్కారాలు’ అందుకున్నారు. ‘మిథునం’ సినిమాలో నటనకు ప్రత్యేక జ్యూరి బహుమతి లభించింది. తమిళ చిత్రాల్లో ఆలపించిన పాటలకు 4 సార్లు, కన్నడ సినిమాల్లో పాడిన పాటలకు 3 సార్లు బహుమతులు గెలుచుకున్నారు బాలు. రాజలక్ష్మి ఫౌండేషన్, సుర్ సేన్, అక్కినేని, లతామంగేష్కర్ జాతీయ బహుమతులతో సహా లెక్కలేనన్ని పురస్కారాలకు బాలు ఎంపికయ్యారు. భారత ప్రభుత్వం 2001 లో ‘పద్మశ్రీ’, 2011లో ‘పద్మభూషణ్’ పురస్కారాలతో బాలుని గౌరవించుకుంది.
ఏ నటుడుకి ఏ పాట పాడినా, ఏ భాషలో పాడినా వాళ్ళే పాడేరా ! అనిపించేలా మంత్రముగ్దులిని చేసిన స్వరజ్ఞాని. సాధారణంగా తండ్రీ కొడుకులకు ఒకే గాయకుడు పాడడం అరుదైన విషయం. అలాంటిది తాతమనవళ్ళకు పాడిన ఘనత బాలుది. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ లతోపాటు జూనియర్ ఎన్టీఆర్కు పాడారు. ఏఎన్నార్ తోబాటు నాగార్జున కూ పాడారు. అల్లు రామలింగయ్యకు, అల్లు అర్జున్ కీ గూడా పాడారు. ఎన్టీఆర్ కు, ఏఎన్నార్ కు విభిన్న స్వరాలతో పాడి మెప్పించాడు.
5 యూనివర్సిటీలు బాలుకి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసాయి. భారతదేశం లోనే కాదు.. యావత్ ప్రపంచం లో మరో బాలసుబ్రహ్మణ్యం పుట్టడుగాక పుట్టడు.
“కాస్త ప్రయత్నిస్తే బాలు నాలా పాడగలడు....కానీ మరో జన్మ ఎత్తినా, నేను బాలులా పాడలేను”...........ఇది మహానుభావుడు, సంగీత సరస్వతి, విద్వన్మణి శ్రీ మంగళంపల్లి బాలమురళికృష్ణ మన బాలుకి ఇచ్చిన కితాబు. ఈ ఒక్క ప్రశంస చాలు బాలు ప్రతిభను అంచనా వేయడానికి. అటువంటి గొప్ప కళాకారుని ప్రశంసలు, ఎందఱో సంగీత అభిమానుల గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించుకున్న బాలు అదృష్టవంతుడు కాక మరేమిటి ?
అంత గొప్ప కళాకారుడిని కోల్పోయిన మనం దురద్రుష్టవంతులం కాక మరేమిటి.
***
No comments:
Post a Comment