గవ్వల గవర్రాజు - అచ్చంగా తెలుగు

గవ్వల  గవర్రాజు

మా జొన్నవాడ కథలు - 9

-టేకుమళ్ళ వెంకటప్పయ్య 

9490400858


జొన్నవాడ బస్టాండ్ ఆనుకుని ఉన్న మొండిగోడల చిన్న రేకులిల్లు. బయట ఒక పలకమీద "గవ్వల గవర్రాజు - ప్రశ్న చెప్పబడును" అని బోర్డు రాసున్న ఇంటిలోనికి సాధారణంగా కామాక్షమ్మ దర్శనం చేసుకోడానికి వచ్చి, ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉన్న వాళ్ళందరూ ఆ ఇంటి తలుపు తట్టి గవర్రాజు చెప్పే సమాధానం, పరిష్కారం తెలుసుకోవాల్సిందే. లోపలకు వెళ్ళగానే బూజుపట్టి ఉన్న ఆ ఇంట్లో ఒక వైపు చిన్న వంటిల్లు, ప్రక్కన ఒక పెద్ద హాలు మొత్తం ఈతాకుల చాపలు పరిచి ఉంటాయి. గవర్రాజు మాత్రం ఒక పాత బొంత మీద కూర్చుని ఉంటాడు. వెనుక గోడకు గురువుగారి చిత్ర పటం. కింద నిరంతరం వెలిగే ఒక దీపపు సెమ్మె. తాటాకు బుట్టల్లో తాయత్తులు, రాగిరేకులు వాటికి సంబంధించిన వస్తువులు ఉంటాయి. ప్రక్కనే పసుపు గుడ్డతో కట్టిన హుండీ ఉంటుంది. అమ్మణ్ణి దర్శనం అయ్యాక వచ్చి దాన్లో పది రూపాయలు వేసిన తర్వాతే ప్రశ్న అడగాలి. మనిషి ఒకే ప్రశ్న అడగాలన్న నియమం మొదటి నుంచి ఉంది. గవర్రాజు ఏ ప్రాంతం వాడో తెలీదు. ఏ మతం వాడో తెలీదు. ఏ కులం వాడో తెలియదు. కాని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం హింది అన్ని భాషలూ మాట్లాడతాడు. అందువల్ల ప్రశ్నడిగే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వేరే రాష్ట్రాల జనాలు కూడా అప్పుడప్పుడూ వస్తూ ఉంటారు. ప్రశ్న అడిగింతర్వాత డజను గవ్వలను వేసి ఏదో లెక్క పెట్టుకుంటాడు అంతే! ఒక ఐదు నిముషాలు ఏమీ మాట్లాడడు. తర్వాత వారి ప్రశ్నను బట్టి పరిష్కార మార్గం చెబ్తాడు. వాటిలో గొడ్లూ, పశువులు మేకలు తప్పిపోవడం దగ్గర నుంచీ పెళ్ళికాని ఆడపిల్లలు, భార్యా భర్త గొడవలు, చదువుల సమస్యలు, ఆరోగ్య, వ్యాపార, ఉద్యోగ సమస్యలు అన్నీ ఉంటాయి. గవర్రాజిచ్చిన తాయత్తు మెళ్ళొనో, చేతికో, మొలత్రాడులోనో కట్టుకుంటే సమస్య పరిష్కారం అయినట్టే! నూటికి తొంభై శాతం పని జరిగినట్టే అంటారు అక్కడ ప్రశ్న చెప్పించుకుంటున్న భక్తులు.   

గవర్రాజు ఉదయాన్నే ఐదుగంటలకు లేచి పెన్నానదిలో స్నానం ముగించి, అమ్మణ్ణి దర్శనం, శివయ్య దర్శనం ముగించుకుని, పెద్ద విబూధి పట్టీలు పెట్టుకుని గుళ్ళో ప్రసాదం తిని, చెంచయ్య టీ బంకులో టీ తాగి ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రశ్న చెప్పడానికి కూర్చున్న వాడు మళ్ళీ సాయంత్రం దీపాలు పెట్టే వేళ దాకా లేవడు. చీకటి పడ్డాక చెప్పడు. మరి అన్నం ఎప్పుడు వండుకుంటాడో, ఎప్పుడు తింటాడో ఎవరికి తెలీదు. రోజూ ఎంత మంది వచ్చినా ఓపిగ్గా వారి సమస్యలను విని ఆలోచించి పరిష్కారం చెప్తాడు. కొంత మందికి రాగిరేకులను ఇచ్చి పూజలో ఉంచుకోమంటాడు. రేకిచ్చినా తాయత్తిచ్చినా, హుండీ బుడ్డిలో వేసిన ఆ పది రూపాయలకే! డబ్బు కక్కుర్తి లేదు. అదనంగా ఒక్క పైసా కూడా అడగడు. ఒక్కొక్కరి ప్రశ్న ఐదు-పది నిముషాల్లో అయిపోతే కొంతమందికి అరగంట పైన సమయం తీసుకుంటాడు. అందరిని సమాధాన పరచి, సంతృప్తి పరచి పంపుతాడు. అందువల్లనే గవర్రాజు ప్రశ్నంటే అందరికి అంత నమ్మకం. 

ఆరోజు చతుర్దశి. చీకటిరోజులు. ప్రశ్నల కార్యక్రమం ముగిసాక,  ఫలహారం తిని, పాలు త్రాగి పెందలాడే నడుంవాల్చాడు గవర్రాజు. అర్ధరాత్రి దాటింది సమయం. ఉన్నట్టుండి మెలుకువ వచ్చింది. సాధారణంగా వచ్చే మెలుకువ కాదు. ఎవరో తట్టిలేపినట్టు. మాట్లాడుకుంటున్నట్టు. ఉలిక్కిపడి లేచి బస్టాండుకు తన ఇంటికి మధ్యన నిలబడి ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం గమనించి చెక్క తలుపు ప్రక్కగా నిలుచుని సందుల్లోంచి వినసాగాడు. ఎప్పటినుంచి మాట్లాడుకుంటున్నారో తెలీదు.

"నువ్వు చెప్పే పని అంత సులభం కాదు తంగవేలూ! హుండీకి వాళ్ళు వేసేది చిన్న చితకా తాళమేమీ కాదు. ఆలోచించుకో! రాకపోతే ప్రమాదం. రచ్చ రచ్చ అవుద్ది"

" యోవ్! సామా! ఎంత పెద్ద తాళమైనా తంగవేలుకు లొంగకుండా ఉంటదాంటా! ఆహా ఉంటదాంట!. ఓసోసి! ఒంటి చేత్తో ఎన్నో బ్యాంకు తాళాలు తీసినోణ్ణి.ఎక్కువ ఆలోచించ బాకు! సుబ్బయ్యో."

"సరేలే! అందుకే గామాల 10 సంవత్సరాలు జైలులో చిప్పకూడు తిన్నావు. మొహం జూడు…... నీకంత నమ్మకం ఉంటే నాకు చింతెందుకు? రేపు ఉదయం వెళ్ళి దేవళం వెనకమాలన గాజు పెంకులూ అవీ ఇవీ…అట్టాంటియన్నీ ఏమైనా ఉన్నాయా? గోడ దూకడానికి సు సుళువుగా ఉండాదా? చూసి రంగం సిద్ధం చేస్తా!. తంగయ్యా!  మళ్ళీ మళ్ళీ చెప్తున్నాని అనుకోబాక! నువ్వు మాత్రం ఏదో పని మీద వెళ్ళి తాళం సంగతి చూడు. సీలు వేసుంటే కోసి, లీవర్లూ అదేందో గొడవుంటాది గదా! బాగా జూస్కోని,  మళ్ళీ ప్లాస్టర్ వేసి అలాగే పెట్టై. అనుమానం రాకుండా!" 

" ఓరి నీయెమ్మ బడవా! జైల్లోబడ్డా…నిజమే! అనుబవం బెరగలా నాకా అంటా! ఇందాకట్నుంచీ కాకిమాదిరి అరస్తా ఉంటే అర్ధంగాదా నీకు. తాళం యవ్వారం మర్చిపొయి నీ గోడల సంగతి తతిమ్మా యవ్వారాలు జూస్కో! ఎన్ని లీవర్ల తాళం కప్పో చూడగానే పసిగట్టగలను. రేపు అమావాస్య రాత్రికి పని కానిచేద్దాం.  పొద్దు పోయింది పోదాం! పోలీసులు గస్తీ తిరిగే సమయం. పద!"

వాళ్ళ మాటలు విన్న గవర్రాజుకు ఒంట్లో వణుకు పుట్టింది. దొంగనాయాళ్ళు. వీళ్ళ బండబడ!సాక్షాత్ అమ్మణ్ణి హుండీకే ఎసరు పెట్టారన్నమాట. తీవ్రంగా ఆలోచించాడు. ఏం చెయ్యాలి! ఎవరికి చెప్పాలి! ఎలా ఆపాలి? ఈ దొంగతనం. పూజారికి చెప్తే నమ్మచ్చు నమ్మకపోవచ్చు. వాళ్ళేమో పేరుమోసిన గజ దొంగల్లాగున్నారు. ఆపకపోతే కచ్చితంగా దొంగతనం జరుగుతుందని ఆలోచించి ఆలోచించి ఒక తీర్మానానికి వచ్చాడు. అంతే! అలాగే చెయ్యాలి. అపుడు తనకూ అంతో ఇంతో పేరూ వస్తుంది. అనుకుని పడుకున్నాడు. తెల్లవారు ఝాముకు హాయిగా నిద్రపట్టింది. లేచేసరికి ఉదయం 6 గంటలయింది.

హడావిడిగా కాలకృత్యాలు తీర్చుకుని అమ్మణ్ణి దర్శనం చేసుకుని ప్రసాదం తింటూ హుండీ ఉన్న ప్రాంతానికి వచ్చాడు. చాలా పెద్ద తాళంకప్ప వేసి పైన సీలు వేసి ఉంది. అంత సులభంకాదు. కానీ వాళ్ళు సామాన్యమైన దొంగల్లా లేరు. ఆఫీసు రూముకు వెళ్ళి ఆలయాధికారి సుబ్బారెడ్డిగారిళ్ళు నెల్లూరులో ఎక్కడ అని అడిగాడు. గవర్రాజంటే అందరికి చాలా అభిమానం కానీ చెప్పొచ్చో చెప్పగుడుదో అనుకుని గుమాస్తా "ఎందుకు గవర్రాజూ!" అని నవ్వుతూ అడిగాడు. "అయ్యా! నాదో విన్నపం ఉంది. వారితోనే జెప్పుకోవాల సామీ! ఏమీ అనుకోబాక! పూర్తిగా సొంత యవ్వారం." అని గవర్రాజు మెల్లిగా అనగానే, "సంతపేట వినాయక సినిమాహాలుళ్ళా.. పక్కన్నే ఒక సందుళ్ళా..ఆసందులో నాలుగో ఇల్లు... పెద్ద మేడది. రెడ్డిగారు బోర్డుంటాదిలే.. గుర్కా వుంటాడాడ! రెడ్డిగారు రమ్మంటేనే వాడు బోనిచ్చేది, సరేనా! నీ ఇష్టం. నేను జెప్పానని మాత్రం రెడ్డికి జెప్పగాక" అని చెప్పగానే దండం పెట్టి బయటకు వచ్చాడు.

"ప్రశ్నలు ఈరోజు మధ్యాన్నం 3 గంటలకు" అని పలకపై వ్రాసి నెల్లూరుకు బొయ్యే షేర్ ఆటో ఎక్కి, ములుమూడి బస్టాండు కాడ దిగి నడుచుకుంటా మొత్తానికి రెడ్డిగారిల్లు పట్టుకున్నాడు. తన పేరు చెప్పి హాల్లో కూర్చున్న రెడ్డిగారి వద్దకు వెళ్ళాడు. ఆయన ముగ్గురితో మాట్లాడుతున్నాడు. మధ్యలో ఏమిటి విషయం అన్నట్టు గవర్రాజు వైపు చూడగా "నేను మీతో ముఖ్యమైన విషయం ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను" అని చెప్పాడు. ఒక అరగంట తర్వాత వారు వెళ్ళాక రెడ్డి "నువ్వు బస్టాండు పక్కమాల ప్రశ్నలు జెప్పే గవర్రాజు గదా!" అని పలకరించే సరికి అవునని తలూపి ఎలా చెప్పాలో అర్ధం కావడంలేదని రాత్రి జరిగిన సంఘటన చెప్పాడు. రెడ్డిగారు ఆశ్చర్యపొయ్యి "నిజమేనా! నువ్వు సరిగ్గా విన్నావా?" అని అడిగాడు. అమ్మణ్ణి మీద ఒట్టు! అన్నాక "సరే! నువ్వెళ్ళు సామీ! నేను జూచుకుంటా!" అన్నాడు. గవర్రాజు గేటు వరకు నడిచాక వెనకనే వచ్చి "నాకు కూడా కొన్ని ప్రశ్నలున్నాయి. చెబుతావా? అని నవ్వుతూ అడిగాడు. "అలాగే కానీ ఇప్పుడు కాదు! ఇక్కడ కాదు! ఎవరికైనా నా ఇంట్లోనే చెప్తాను. ఎమనుకోబాకండి. వృత్తి ధరమం.” అన్నాడు. రెడ్డి నవ్వుతూ "సరే సామీ! అట్నేలే… నేనాడికొచ్చినప్పుడే అడగతాలే!" అన్నాడు.

రెడ్డిగారు ఈ విషయం డి.ఎస్.పీ తో మాట్లాడగానే మఫ్టీలో 10 మంది పోలీసులను దేవళంలో కాపలా పెట్టిస్తానని ధైర్యం చెప్పాడు. ఆ పోలీసులు నల్ల దుస్తులు ధరించి దేవళంలో అక్కడక్కడా కాపుకాసి దొంగలు తాళం తెరవబోయే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రెడ్డిగారి ఇంటర్వ్యూలతో, టీవీలు న్యూస్పేపర్లు బాగా కవర్ చేశాయి.   అలయాధికారిగా మంచి పేరొచ్చింది జనాల్లో. ఇదంతా గవర్రాజు వల్లనే అని తెలుసుకున్న సుబ్బారెడ్డి  ఆ హడావిడంతా తగ్గింతర్వాత జొన్నవాడకు వచ్చి కారుదిగి నేరుగా గవర్రాజు ఇంట్లోకి పోబోతుండగా డ్రైవర్ మిగతా వాళ్ళు ఆపి "మీరెందుకుసార్! ఈ  కొంపలోకి… వాడినే పిలిపిద్దాం"  అనే సరికి “అందరూ మాట్లాడకుండా ఇక్కణ్ణే నిలబడండి. లోపలికి రామాకండి." అనేసి లోపలికి వెళ్ళాడు.

గవర్రాజు ఏమాత్రం ఆశ్చర్యం ప్రకటించకుండా "కూర్చోండి" అన్నాడు. ఒకరిద్దరు జనం ఉంటే వాళ్ళకు చెప్పి పంపించేసి, చెప్పేదాకా మిగతావాళ్ళెవుళ్ళూ ఎవరూ లోనకు రాబాకండి. పెద్దోళ్ళతో యవ్వారం!  అని బయట నిలబడ్డ భక్తులకు చెప్పివచ్చి కూర్చుని "చెప్పండి సార్! నా మీద నమ్మకముంచి పోలీసుల ద్వారా దొంగలను పట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అన్నాడు. " నీవల్లే దొంగలను పట్టుకోవడం వీలయింది లేకపోతే నా హయాంలో దొంగతనం జరిగిందని నాకు చాలా చెడ్డ పేరు వచ్చేది" అని బ్యాగులోంచి ఐదు పది రూపాయల నోట్ల కట్టలు గవర్రాజు చేతిలో పెట్టాడు. గవర్రాజు సున్నితంగా తిరస్కరిస్తూ "నా దృష్టికి వచ్చింది కాబట్టి చెప్పాను. లేకపోతే ఘోరం జరిగేది నాకు అమ్మణ్ణి దయవల్ల కూటికి గుడ్డకు లోటు లేకుండా జరిగిపోతున్నాది. అజ్జాలు సామీ!" అంటూ ఒక కట్టలో 10 నోటు మాత్రం బయటకు తీసి "మీ చేత్తోనో ఆ హుండీలో యెయ్యండి సారూ! నాకదో తృప్తి" అని నన్ను ఇబ్బంది పెట్టకండి అన్నట్టు దండం పెట్టాడు రెడ్డిగారికి. గవర్రాజు మీద గౌరవం ఇంకా పెరిగిపోయింది.  

కొన్ని క్షణాల అనంతరం "గవర్రాజూ! నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అందరి మాదిరి ఒకటే అడగతా!” అని నవ్వాడు.  “ఆరునెలల్లో కార్పోరేషన్ ఎన్నికలోస్తుడాయి గదా!  మా సంతపేట ఏరియాకు కార్పోరేటర్గా నిలబడితే గెలుస్తానా? లేదా?  అజ్జెప్పు జాలు. అర్నెల్లనుండి తనకలాడతా ఉన్నా! దెనెమ్మబడవ! సతమతవతా ఉళ్ళా! " అన్నాడు. గవర్రాజు ఒక్క క్షణం గురువుపటం వైపు చూసి దండం పెట్టుకుని, విబూధి కొంచెం రెడ్డిగారి నుదుటన పెట్టి గవ్వలను ఆడించి విసిరాడు. పడిన గవ్వలను చూసి సంతోషంగా చూస్తూ ఒక్క ఐదు నిముషాలు ఆగండి అని సైగచేసి ఒక చెవి మూసి శ్రద్ధగా ఏదో వింటున్నట్టుగా  తలవూపుతూ ఆలకించాడు.  తర్వాత వెంటనే "వద్దు సార్! నిలబడొద్దు" అన్నాడు. ఆశ్చర్యపోయిన రెడ్డి " ఓరి నీపాసు గూల! కార్పోరేటర్ గా కూడా ఓడిపోతానంటా!  ఆ పేటలో యాల్యూషనే లేదంటా?" అన్నాడు నవ్వుతూ. "కాదు సార్! మీ స్థానం అది కాదు. పై సంవత్సరం అసెంబ్లీ ఎలక్షన్లోస్తున్నాయి. అధికార పార్టీ తరఫున మీకు సీటు వస్తుంది. మీరు ఎం.ఎల్.ఏ అవుతారు" అనగానే రెడ్డి పెద్దగా నవ్వి " ఓరి నీయమ్మ బడవ! బాగనే జెప్పావు గాని, నాకంత సీనులేదులే సామీ..ఇక్కడ నెల్లూరులో అజయ్కుమార్ యాదవ్ ఉండగా నాకు సీటా? నమ్మ బుద్ధవడంలేదు" అన్నాడు. “నన్ను నమ్మండి. రెడ్డిగారూ! అజయ్కుమార్ అవినీతి కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్తాడు. మీకు అధికార పార్టీ సీటిస్తుంది. మీకు రాజయోగం ఉంది."అనగానే "సరే మీరు చెప్పారు కాబట్టి కార్పొరేషన్ ఎన్నికల్లో నిలబడను సరేనా!" అన్నాడు. "ఎంతో వత్తిడి వస్తుంది మీకు నిలబడమని అధికార పార్టీ నుంచి. కానీ సున్నితంగా తిరస్కరిస్తూ నాకు ఎం.ఎల్.ఏ అవాలనుంది అని మాత్రం చెప్పండి. మేయర్ గా  ఆశజూపినా సరే! నిలబడొద్దు. ఆ వంతన పట్టుమీదుండండి చెప్తా!" అన్నాడు. అలాగే అని రెడ్డి నవ్వుతూ సెలవు తీసుకున్నాడు.

గవర్రాజు అన్నట్టుగానే పరిస్థితులన్నీ సుబ్బారెడ్డికి కలిసి వచ్చి అధికార పార్టీ సీటు ఇవ్వడంతో మంచి భారీ మెజారిటీతో గెలిచాడు. రెడ్డిగారికి అందరు ఎం.ఎల్.ఏల్లా కాకుండా కొన్ని పనులు పద్ధతి ప్రకారం చేయాలని నిశ్చయించుకున్నాడు. గెలుపు సంబరాలు ముగిసాక ఇంకో నెలరోజుల్లో మంత్రి వర్గం ప్రకటిస్తారని తెలిసింది. ఒకసారి గవర్రాజును కలిసి వ్యూహ రచన చెయ్యాలనుకుని తన పి.ఎ ని పిలిచి ఇవాళ ముఖ్యమైన కార్యక్రమాలేమైనా ఉన్నాయా? అని అడిగాడు. సాయంత్రం టవున్హాల్లో ఎవరో కవికి సన్మానమని, చీఫ్గెస్టుగా వెళ్ళాలని చెప్పాడు. డ్రైవరును తీసుకుని జొన్నవాడకు బయలుదేరాడు. సమయం 11 దాటింది. అరగంటలో జొన్నవాడ చేరి అమ్మణ్ణి దర్శనానంతరం గవర్రాజు ఇంటికి వచ్చాడు. "సార్! మీరు ఎం.ఎల్.ఎ మా ఇంటికి రావడం బాగుంటుందా?" అనగానే "అదే చెప్పబోతున్నాను. కూర్చో! ఉభయతారకంగా ఒక ప్లాను వేశాను." అని ఈ ఇళ్ళు పడగొట్టి బిల్డింగ్ వేయిస్తానని, పైన తనకు వచ్చినప్పుడు ఉండేదానికి గెస్ట్హవుస్ లాగా వేయిస్తానని గవర్రాజు వద్దని ఎంత బ్రతిమాలినా వినకుండా చివరకు ఒప్పించాడు. "గవర్రాజూ! నాకు ఈ సారి మంత్రి పదవి వస్తుందా!" చెప్పండి అనగానే గవర్రాజు గవ్వలు విసిరి, చూశాడు. ఒక ఐదు నిముషాలు మౌనంగా ఉండి "ఈసారి రాదు. కానీ వచ్చేసారి తప్పకుండా వస్తుంది. ఈ సారి పార్టీలో మంచి పేరు వస్తుంది, త్వరలోనే ఒక పెద్ద కార్పొరేషనుకు అధ్యక్షుడిగా పదవి వస్తుంది. మీ హస్తవాసి మంచిది. తాకిందల్లా బంగారమవుద్ది"  అన్నాడు. "సరే! దైవ నిర్ణయం. నువ్వూ నేనూ ఏం చెయ్యలేం కదా! అని నిట్టూర్చి, ఒక నెల రోజుల్లో నీకు ఈ ఇళ్ళు పడగొట్టించి మంచి ఇళ్ళు నిర్మించే ఏర్పాట్లు చేస్తామని చెప్పి సెలవు తీసుకున్నాడు.

రాజు తలుచుకుంటే బహుమానాలకు కొదవాన్నట్టు ఇళ్ళు సర్వాంగ సుందరంగా తయారైంది. క్రింద పెద్ద హాలు కిచెన్,  బెడ్రూం,  ఫర్నిచర్ అన్నీ సమకూరాయి. మిద్దె మీద ఎం.ఎల్.ఏ విశ్రాంతి గది. క్రిందా పైనా ఏ.సీలు ఫ్యానులు అన్నీ వచ్చేశాయి. ఎం.ఎల్.ఏ గారు కూడా లాంఛనంగా గృహప్రవేశం చేశాక, గవర్రాజు క్రొత్త ఇంట్లో కాలు పెట్టాడు. ప్రక్కరోజు ప్రశ్నలకు జనం రావడం ప్రారంభించారు.  రెడ్డిగారు ప్రత్యేకంగా గవర్రాజు కోసం ఏర్పాటు చేసిన సహాయకుడు పొట్టిపంతులు ప్రశ్నకు పది రూపాయలకు కాకుండా వంద రూపాయలు హుండీలో వేయాలని, తాయత్తులు, రాగిరేకులకు వేరే రేటని ప్రకటించి భక్తులను హాల్లో కూర్చొండబెట్టాడు. భక్తులు మొహాలు మొహాలు చూసుకున్నారు తప్ప ఏమీ మాట్లాడలేదు. గవర్రాజు వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఎదురుగా టీపాయ్ పై గవ్వలున్నాయి. గురువు గారి ఫొటో పూజరూములోకి మారింది. దీపంసెమ్మె స్థానంలో విద్యుత్ బల్బులు పెట్టారు. ఒక్కసారి అందరికి నమస్కారం చేసి,  ముందు వరసలో కూర్చున్న స్త్రీని “ఏమిటమ్మా! మీ సమస్య” అని అడిగాడు. ఆమె రూ.100/- నోటు హుండీలో వేసి వచ్చి ఇలా చెప్పింది. “అయ్యా! మేము ఈ మధ్యన క్రొత్త ఇల్లు కొనుకున్నాం. కానీ మాకు సుఖం శాంతి కరువయ్యాయి. రోజూ ఇంట్లో పోట్లాటలే! నాకు మా అత్తగారికి, నాకు మా ఆయనకు, నాకూ పిల్లలకు. ఏం చెయ్యాలో అర్ధం కావడంలేదు" అంది. గవర్రాజు గవ్వలు విసిరాడు. పడిన వైనం చూసి కొంచెం సేపు ఆగమని అన్నాడు. పది నిముషాలు గడిచినా నోట మాట రావడంలేదు. గవర్రాజుకు ఏ.సీ రూంలో కూడా చెమటలు పోస్తున్నాయి. పెదాలు నాలుకతో మాటిమాటికి తడి చేసుకుంటున్నాడు. చేతులు నలుపుకుంటున్నాడు. కంగారుగా ఉన్నాడు. ఎవ్వరికి విషయం అర్ధం కాలేదు.  పూజ గదిలోకి వెళ్ళి గురువు గారికి నమస్కరించి వచ్చాడు. చివరకు “అమ్మా! మంచి జరుగుతుంది. తాయత్తులు కట్టుకోండి” అని తాయత్తులు ఇప్పించ్చాడు. అలా ఆరోజు వచ్చిన వాళ్ళందరికి నోటితో ఏ సమాధానము చెప్పలేక పోయాడు. గవర్రాజుకు కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్ళు కారుతున్నాయి.  మొహమంతా చెమటలు పట్టాయి. పంతులిచ్చిన కాస్ట్లీ టర్కీటవల్తో తుడుచుకుంటున్నాడు. ఎవ్వరికీ విషయం అర్ధం కాకపొయినా, గవర్రాజును ఆశ్చర్యంగా చూస్తూ, ఇచ్చిన తాయత్తులు, రాగిరేకులు తీసుకుని బయటకు   వెళ్ళి  పంతులు చెప్పిన అదనపు రేటు చెల్లించి నమ్మకంగా  బయటపడుతున్నారు ఒక్కొక్కరే..

ఆరోజు రాత్రి అందరూ వెళ్ళిపోయాక ఎందుకిలా జరిగింది. రోజూ వినిపించే కర్ణ దేవత ఎందుకు మౌనం వహించింది అర్ధం కాలేదు. నిద్ర పట్టలేదు. మాగన్నుగా పడుకున్న గవర్రాజుకు తెల్లవారు ఝామున గురువు గారు కలలో కనిపించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. "నువ్వు నాకు ఇచ్చిన వాగ్ధానం ఏమిటి? చేస్తున్న పనులేమిటి?  చేసిన ప్రమాణము గాలికి వదిలి మేడలలో మిద్దెలలో కులకడమేమిటి? నీకు భోజనం గడవడానికి మాత్రమే సంపాదించుకోమంటే నువ్వు చేసిందేమిటి? నువ్వు చేసినపనేంటొ అర్ధమయిందా నీకన్నా కనీసం! డబ్బు వ్యామోహం పట్టింది నీకు. అందుకే రాత్రి కర్ణదేవత వచ్చి నీ నుంచి సెలవడిగింది. ఇంక నీకు జీవితంలో ఆ దేవత మాటలు వినబడవు. బ్రష్టుడా! అనుభవించు!!!" అన్నాడు. ఉలిక్కిపడి లేచాడు. సమయం 5 గంటలవుతోంది. “బ్రష్టుడా!” అన్నమాట అదేపనిగా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నది.  చెవులు మూసుకున్నాడు గట్టిగా. వెళ్ళి గురువు గారి పటానికి పాదాభివందనం చేశాడు. పది నిముషాలు నేల మీద కూర్చుని ధ్యానం, ప్రాణాయామం చేశాక, ఒక నిశ్చయానికి వచ్చినట్లు  ప్రశాంత చిత్తంతో లేచాడు. పెన్నలో స్నానం చేసి వచ్చి అమ్మణ్ణిని, ఈశ్వరుడిని దర్శించుకొని బయటికి వచ్చాడు. దు:ఖిత వదనుడై తన ఇంటిని ఒక్కసారి బయట నుంచి దర్శించుకున్నాడు. ఆ తర్వాత మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే! మళ్ళీ గవర్రాజు ఆ ఊర్లో ఎవరికీ కనబడలేదు. ఎం.ఎల్.ఎ గారు మనుషులను పెట్టించి, పంతుల్ని పంపించి, జిల్లాలో ఉన్న గుళ్ళూ గోపురాలు, మఠాలు, సత్రాలు మొత్తం వెదికించాడు. కనపడలేదు. ఇంకా జొన్నవాడ జనం మాత్రం గవర్రాజు ఎక్కడికో పనుండి వెళ్ళుంటాడని, తప్పక తిరిగి వస్తాడని, వాళ్ళకు రక్షరేకులు తాయత్తులు ఇస్తాడని గట్టిగా నమ్ముతున్నారు. రావాలని కొంతమంది ముడుపులు కూడా కట్టారు.

విచిత్రమేమిటంటే 10 రోజుల క్రితం కాశీకి వెళ్ళిన పెంచలశెట్టికి హరిశ్చంద్రఘట్టంలో స్నానం చేస్తూ గవర్రాజు కనిపించాడని, పెద్ద గడ్డంతో, గోచీతో మాత్రమే ఉన్నాడని, పలకరించే లోపు, తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ వినిపించుకోకుండా తొందర తొందరగా ఎటో వెళ్ళిపొయ్యాడని, కాశీలో తాను ఉన్న 10 రోజుల్లో మళ్ళీ ఎక్కడా కనబళ్ళేదని, ఊళ్ళో చెప్పిన మాటలు నిజమో కాదో ఆ కామాక్షమ్మకే  తెలియాలి.

-0o0-


No comments:

Post a Comment

Pages