పాత పాఠమే కొత్తగా!
- చివుకుల పద్మజ
"ఏమోయ్.. లాక్ డౌన్ పొడిగించారు" టీవీ చూస్తున్న మావారు పెద్దగా అరిచిచెప్పారు వంటింట్లో వున్న నాకు వినపడాలని.
"అవునా.. ఎన్నాళ్లు?" ఆత్రంగా బయటకి వచ్చి అడిగాను.
"మరో రెండు వారాలు. నీకు మంచి ఛాన్స్ దొరికింది. ఇల్లు సర్దుకోవాలీ, ఇల్లు సర్దుకోవాలీ అంటున్నావుగా"
"అవునవును, రేపు మొదలుపెడతా" అంటూ వంట కొనసాగించాను.
ఉద్యోగం చేసే నాలాంటి వాళ్లకి ఇల్లు సర్దటం ఒక గొప్ప పని. అదెప్పుడూ పూర్తిగా కుదరదు ఒక్క శలవులొస్తే తప్ప.
మర్నాడు పొద్దున్న ఎక్కడ నుండి మొదలు పెడదామా ఈ బృహత్తర కార్యక్రమం అని తెగ అలోచించి.. చించి.. పిల్లల రూమ్ లోకి వెళ్లాను. ఇదే కరెక్ట్ అనుకుని ముందు బట్టల గూడు సర్దటం మొదలేసాను. ఇది కొంచెం పర్లేదు, ఎందుకంటే అప్పుడప్పుడు బట్టలు మడతేసి పెట్టేప్పుడు సరి చేస్తుంటా కాబట్టి త్వరగానే అయిపోయింది. పొట్టివి.. పొడుగువి.. చిరుగు పట్టినవి.. ఒక రెండు పెద్ద సంచుల బట్టలు తీసిపెట్టాను వాచ్ మాన్ పిల్లలకి ఇవ్వొచ్చని.
తర్వాత వంతు పుస్తకాల అర. తలుపు తీద్దునా.. తెంపు లేకుండా పుస్తకాలు.. జారి పడిపోతున్నాయి కింద. ఇంత లక్షణంగా పెట్టుకుంటున్నారన్నమాట రోజూ. అన్నీ చూసి వేటికవ్వి సర్దిపెడితే.. ఒక పాతిక దాకా నోట్సులు సగం రాసి వదిలేసినవి వున్నాయ్.
"అవ్వి అక్కర్లేదమ్మా.. పడేసేవే.."మా అమ్మాయి పక్కకి తీసేస్తూ అంది.
"అయ్యో.. అన్నీ ఖాళీ పేపర్లే కదే అందులో" లబలాబలాడాను.
"మేమైతే ఆ ఖాళీ పేపర్లు చించి రఫ్ నోట్సు చేసుకునేవాళ్లం" మా చిన్నప్పటి రోజులు గుర్తుతెచ్చుకుంటూ అన్నాను మళ్ళీ.
"అమ్మా.. ప్లీజ్..ఇది ఆ కాలం కాదు" గట్టిగా అంది.
"ఏమిటో..చెప్పింది వినరు కదా" విసుక్కుంటూ "ఈ పెన్నుల సంగతేంట్రా" అన్నాను మా అబ్బాయితో.
అన్ని పెన్నులు ఒక్క చోట పోగేస్తే రోబో సినిమాలో గన్నుల గుట్టంత అయ్యాయి.. పడేవి..పడనివి..కాప్స్ లేనివి.. విరిగిపోయినవి..ఒక రకం కాదు కదా.
అంత పెద్ద గుట్టలోంచి ఒక పదో ఏమో ఏరాడు వాడు. "మిగిలినవన్నీ పడేయ్"పెద్ద ఉదారంగా పోజ్ పెట్టాడు.
"అదేమిట్రా .. పడనివి రీఫిల్స్ తెచ్చుకుంటే పనికొస్తాయిగా.. షాప్స్ తెరిచాక తెస్తే చాలా పెన్నులు లైన్ లోకి వస్తాయి" అన్నాను.
"అమ్మా.. రీఫిల్స్ యుగం ఎప్పుడో అయిపోయింది. ఒకసారి అయిపోతే పడెయ్యటమే"
"మేమైతే ఒకటి, రెండు పెన్నులుంచుకుని ఐపోయినప్పుడల్లా రీఫిల్స్ కొనుక్కునేవాళ్ళం" నిట్టూర్చాను.
"ఏ వస్తువైనా పాతది అని పడేసి కొత్తవి కొనటమేనా? కాస్త బాగు చేస్తే పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం" అనగానే "అబ్బా.. అమ్మా.. ఆపు నీ పురాణం" చెవులు మూసుకున్నారు పిల్లలు.
"అసలు మిమ్మల్ని అనాలి. అడిగినప్పుడల్లా బాక్సులు బాక్సులు కొనుక్కొస్తారు..వాళ్ళకి విలువ తెలీకుండా పోయింది" మా వారి మీద తిరిగింది నా విసురు.
ఠకీమని పేపర్ లో మొహం దూర్చేశారు అయన.
"పాతకాలం పాతకాలమే. ఎంత కొత్తవి వచ్చినా అది ఎప్పటికి చిరంజీవే" గొణుక్కుంటూ సర్దటం ముగించాను.
"ఇవ్వాళ ఎటు నీ డైరెక్షన్" మర్నాడు పొద్దున్న అడిగారు మావారు కళ్ళెగరేస్తూ. బెడ్ రూమ్ లో అరలకేసి చూపించి "నా చీరలు" అన్నాను.
కాటన్ చీరలు గంజి పెడదామని తీసాను ఆఫీసులు తీసేసరికి రెడీగా వుండచ్చని. పక్కనే పట్టుచీరలు కనబడ్డాయి. చాలారోజులైంది వాటిని తీసి. ఒక్కక్కటే బయటకి తీసి మడతలు మార్చి వేస్తూ చూసాను...నా పెళ్లినాటి చీరలు, తర్వాత ప్రతి సందర్భానికి ఒక్కక్క పట్టు చీర.. నా పాత పెళ్లి పట్టుచీరలతో పోలిస్తే ఈ కాలం చీరలు అంత మన్నికైనవి కావు. అప్పుడు రెండువేలకే మంచి చీర.. అదే క్వాలిటీ ఇప్పుడు రావాలంటే ముప్ఫయ్ వేల పై మాటే.
ఈ మధ్య రెండు సార్లు వాడి డ్రై క్లీనింగ్ కి ఇద్దామని పక్కన పెట్టిన పట్టుచీరలని జాగ్రత్తగా షాంపూ పెట్టి ఝాడించి ఆరేస్తున్నాను.
"కాస్త మంచి టీ పెట్టివ్వవోయ్" మధ్యలో వచ్చి తలుపుకి ఓరగా ఆనుకుని అడుగుతున్నారు మావారు.
"రిక్వెస్టా? డిమాండా?"
భయపడ్డట్టు నటించి "ఆమ్మో.. రిక్వెస్ట్ మాత్రమే.. అయినా నీ పట్టుచీర పాటి చెయ్యనా?" గోముగా అన్నారు.
"పట్టుచీరా..ఇదేం పట్టు చీర.. అసలు పట్టుచీర అంటే మా బామ్మది. మా నాన్నకు వుద్యోగం వచ్చిన కొత్తలో కొనిచ్చాడట యాభై రూపాయలు పెట్టి. ప్యూర్ వెండి జరీ. చీర చినిగిపోయిందని జరీ కరిగిస్తే ఒక కుంకుమ భరిణ, ఒక గంధపు గిన్నె వచ్చాయి తెలుసా!" కళ్ళలో అవి మెదులుతుండగా అన్నాను.
"ఈ మాట వెయ్యిన్నొక్కోసారి నువ్వు చెప్పటం" నీరసంగా మొహం పెట్టారు.
"ఎంతైనా పాతవి పాతవే" లేచాను టీ పెట్టడానికి.
తర్వాత వంతు వంటింటిది. కింద అరలన్నీ పేపర్లు మార్చి సర్ది, అటక మీది గోతాలన్నీ దింపించాను. విప్పితే రకరకాల ఇత్తడి సామాను..రాచిప్పలు..గోకర్ణాలు..గుండు గిన్నెలు, గంగాళాలు..అన్ని సైజుల గరిటలు.
ఇప్పుడు ఇత్తడి సామాను చాలా ఖరీదు. చిన్న గరిటె ఒక్కటే వందల్లో ఉంటుంది. ఆ లెక్కన ఇవ్వన్నీ కనీసం లక్ష రూపాయలుంటాయి. వాటిని తోమే సాహసం మటుకు చెయ్యలేదు పనమ్మాయి లేదని. గోతాలు మాత్రం మార్చి మళ్ళీ కట్టేసాం.
"ఎప్పటికైనా పాత ఇత్తడి పుత్తడి అవుతుంది" నా మార్క్ స్టేట్మెంట్ ఇచ్చేసి లేచాను.
అప్పటికి నా నడ్డి విరిగినట్లయింది.
మరుసటి రోజు "ఇంక సర్దటం అపి రెస్ట్ తీసుకోండి" అన్ని మమ్మల్ని తీసికెళ్ళి టీవీ ముందు కూలేశాడు మా అబ్బాయి.
ఏంటంటే.. ఒక వారం బట్టీ వాడు పాత ఆల్బమ్స్ తీసి స్కాన్ చేసి డిజిటల్ ఫొటోస్ తయారు చేసే ప్రయత్నం లో వున్నాడు. ఇవ్వాళ అన్నిటిని స్మార్ట్ టీవీ లో చూపిస్తున్నాడు.
మా చిన్నప్పటివి, పిల్లల చిన్నప్పటివి, ఇంటికొచ్చిన బంధువులవి..భలే బాగుంది ఇప్పుడు చూస్తుంటే.. మా పెళ్లి ఫొటోల్లో ఒక ఫోటో దగ్గర ఆపమన్నారు మావారు. మావారి నాన్నమ్మకి మా పెళ్ళిలో ఇద్దరం దణ్ణం పెడుతున్న ఫోటో అది.
"ఎంతయినా పాత వాళ్ళు పాత వాళ్లే" అప్రయత్నంగా అన్నారు. నా మాట అయన నోట వచ్చేసరికి చటుక్కున తనకేసి చూసాను. కంటినించి బయటకు రాకుండా ఆపేసిన కన్నీళ్లు కనపడ్డాయి నాకు.
తర్వాత అన్ని ఫోటోలు తిప్పుతున్నారు గాని, నా మనసుకు అవ్వేమీ ఎక్కక పదేళ్ల వెనక్కి పరుగు తీసింది.
***
తల్లితండ్రులు చిన్నప్పుడే పోవటంతో మా వారిని, ఆడపడుచు సుధని వాళ్ళ నాన్నమ్మే పెంచి పెద్ద చేసింది. ఉన్నఆస్తి అంతా దానధర్మాలకు హరించుకుపోవటంతో చాలా కష్టాలు పడింది ఆమె. తెలిసిన ఇళ్లలో వంటలు చేస్తూ, మధ్య మధ్య పెళ్లిళ్లు, పేరంటాలకు వంటలకు వెళ్తూ, పిల్లలిద్దరినీ కళ్ళలో పెట్టుకు కాపాడుకొచ్చింది. మా వారికి ఉద్యోగం వచ్చాక ఆవిడని పని మానిపించేసారు. ముందు ఆడపడుచు పెళ్లి అయింది, తర్వాత మా పెళ్లి అయి నేను ఇంటికి వచ్చేనాటికే ఆవిడకి అరవై ఏళ్ళు దాటిపోయాయి. నన్ను వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో చూసి ఇష్టపడి చేసుకుంటానంటే ఆవిడ కాదనలేదుట.
నేను మా పుట్టింట్లో చాల స్వతంత్రంగా పెరిగాను. నా విషయాల్లో ఇతరుల ప్రమేయం అస్సలు ఇష్టపడను. అలాంటిది ఇక్కడికి వచ్చాక ఆవిడ నా వెంటే పడేది. 'అమ్మాయి, జడ వెయ్యనా?'..'ఇదిగో, ఈ పూలు పెట్టుకో'...'ఈ చీర కట్టుకో'..అని.. నాకు చాలా చిరాకుగా ఉండేది.
నేను అప్పట్లో ఆఫీస్ కి రోజూ పంజాబీ డ్రెస్ లే వేసుకొనే దాన్ని. చీరలు చాలా తక్కువ. మా వారితో "అవ్వేం బట్టఁల్రా .. లక్షణం గా చీర కట్టుకోక" అని నసిగేది. "ఈ కాలంలో అంతేలే నాన్నమ్మా" అని సమర్ధించేవారు మా వారు. "మరి సుధ చీరలే కట్టుకుంటుందిగా" అనేది.
నేను వంట చేయబోతే మధ్యలో ఏదో చెప్పి చేయించాలని ప్రయత్నించేది. నేను విసుక్కుంటే "ఏదోలే.. బాగా తిప్పిన చెయ్యి కదా, ఊరుకోలేకపోయాను" అని చిన్నబుచ్చుకునేది.
నా చిరాకుకి, ఆవిడ చాదస్తానికి మధ్య మావారు నలిగిపోయేవారు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవారు నా నుంచి. లాభం లేదని ఒక రోజు బాగా మొండిగా గొడవేసుకున్నాను మావారితో.
"నాకు చాలా చిరాగ్గా వుంది మీ నాన్నమ్మ వ్యవహారం" నాంది పలికాను.
"ఏదోలే పెద్దావిడ .. వదిలేయ్" ఎప్పటిలాగే తప్పించుకోచూసారు.
"ఏం వదలమంటారు? వయసు మీదబడి చాదస్తం ఎక్కువై పోయింది. రోజూ ఆఫీసుకి వెళ్ళవలసిన దాన్ని. ఈవిడ మడి, పూజ, చాదస్తాలతో అవ్వదు నాకు" తేల్చి చెప్పాను.
"సర్దుకో..ప్లీజ్.. మమ్మల్ని చిన్నప్పటి నుంచి సాకింది".
"అదే నేనూ చెప్పేది. మీతో పాటు సుధనీ పెంచిందిగా. కొన్నాళ్ళు తన దగ్గర కూడా దింపి రండి" గట్టిగా అన్నాను.
సుధ వాళ్ళు ఇక్కడే ఉండేవారు అప్పుడు.
"ష్..నాన్నమ్మ వింటే బాధపడుతుంది" నిస్సహాయంగా అన్నారు.
ఆవిడ వినాలనే కావాలని తలుపు దగ్గరగా వేసిన సంగతి చూడలేదు అయన.
"తప్పించుకునే ప్రయత్నం చేయకండి. మీరు పంపుతారా, నేను పిల్లల్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోనా?" చాలా గట్టిగా అడిగాను.
మర్నాడు ఉదయం టిఫిన్ల దగ్గర ఆవిడే అడిగింది "సుధని చూడాలని ఉందిరా రఘు. నువ్వు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు నన్నక్కడ దింపుతావా?"
నాకేసి సూటిగా చూసి "సరే నాన్నమ్మా" అన్నారు.
ఆ వెళ్ళటం, వెళ్ళటం మళ్ళీ మా ఇంటికి రాలేదు ఆవిడ. ఫోన్లో మాత్రం పలకరిస్తుండేది మమ్మల్ని. ఒక్కసారి మాత్రం మా అమ్మాయి పుట్టినరోజుకి వచ్చి అక్షింతలు వేసి వెళ్ళింది. అప్పుడప్పుడు మేమే వెళ్లి చూసి వస్తుండేవాళ్ళం. తర్వాత సుధ వాళ్ళాయనకి బదిలీ అవటంతో వాళ్ళతోనే వెళ్ళిపోయింది.
ఆవిడ గాని, సుధా వాళ్ళు గాని, మా అయన గాని ఈ విషయమై నన్నుఎప్పుడు ఏమి అనలేదు. ఎప్పటిలాగా ఆప్యాయంగానే వున్నారు. వెనక్కి వస్తానని ఆవిడా అనలేదు, తెచ్చే ప్రయత్నం మేమూ చెయ్యలేదు. నాకు హాయిగానే ఉందని నేనూ ఊరుకున్నాను.
***
ఇప్పుడు పాతవే మంచివని చెప్పే నేను, అదే మాట మా వారి నుంచి వచ్చేసరికి నాకు నేనే ఆత్మావలోకనం చేసుకున్నాను. ఇప్పుడు ఆవిడ వయసు ఎనభై పైగానే. ఇదివరకటి చురుకు తగ్గింది, జాగ్రత్తగా నిదానంగా గోడలు పట్టుకుని నడుస్తున్నారని చెప్పింది సుధ ఈ మధ్య.
నేను అన్ని సామానులు పాతవి ఉంచాలని, అవి ఉండటమే గొప్ప అని జాగ్రత్త చేసే దాన్ని, మనుష్యుల్ని మాత్రం ఎందుకు పక్కన పెట్టేసానో అర్ధం కావట్లేదు. పెద్దవయసొస్తే పనికిరారా? చిన్న వయసు అహంకారమో, హెచ్చుమీరిన ఆర్ధిక స్వాతంత్రమో, పల్లెత్తు మాట అనని శ్రీవారో... లేక ఇవన్నీ కలిసి నా కళ్ళకు పొరలు కమ్మాయో.. కన్నవాళ్ళు పోయిన పసిపిల్లల్ని పెంచటానికి తన జీవితమంతా ధారపోసిన పెద్దావిడని మాత్రం పనికిరాదనేశాను.. నా మొగుడు నామాట వింటాడని మురిసిపోయానే గానీ, నా కోసం, పిల్లల కోసం తన మనసు తలుపులు మూసేసారని అనుకోలేదు..
వేడిగా భోజనం వడ్డిస్తూ "లాక్ డౌన్ అయిపోయాక వెళ్లి అమ్మమ్మ గారిని తెచ్చేసుకుందాం" నిశ్చయంగా చెప్పేసాను మావారితో.
ముందు అయోమయంగా, తర్వాత ఆశ్చర్యంగా చూస్తున్నారాయన.
ఈ కోవిడ్ విశ్వమంతా విధ్వంసం సృష్టించింది గానీ, నాకు మాత్రం 'పాతది బంగారమే'.. అదేనండి.. 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అనే పాత పాఠాన్ని సరికొత్తగా నేర్పింది.
***
No comments:
Post a Comment