తెలుగు భాష పుట్టు పూర్వోత్తరాలు - అచ్చంగా తెలుగు

తెలుగు భాష పుట్టు పూర్వోత్తరాలు

అంబడిపూడి శ్యామసుందర రావు





 

భారతదేశములో ఎక్కువమంది మాట్లాడేభాష నాలుగవ  స్థానములో ఉన్నది తెలుగు  శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడాడు. అలాగే ఇటాలియాన్ వర్తకులు తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కొనియాడారు.

విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ తెలుగు భాష  పట్ల ఆకర్షితుడై "ఇది భాషా  లేక సంగీతమా ?" అని ప్రశ్నించాడు. బ్రిటిష్ వారి పరిపాలనలో  నాణేల పైనా రూపాయి నోట్ల పైన ఇంగ్లిష్ తరువాత తెలుగు లో ముద్రించేవారు శ్రీ కృష్ణ దేవరాయలు.

అష్టదిగ్గజాలు అనే పేరుతొ ప్రముఖ కవులను పోషించి,  తెలుగు భాషాభివృద్ధికి ఏంతో  కృషి చేసాడు కాబట్టే అయన కాలాన్ని తెలుగు భాష స్వర్ణ యుగముగా పేర్కొంటారు.  ఆనాటి రాజులు తెలుగు సాహిత్యానికి వారివంతు కృషి చేశారు.

ఇంగ్లిష్ తర్వాత తెలుగు భాష కే ఎక్కువ పద కోశము ఉంది. తరువాతి కాలములో తెలుగు ఇంగ్లిష్ భాషా ప్రభావము వలన చాలా వెనక బడింది. చివరికి తెలుగులో మాట్లాడటమే అవమానకరమనే భావన తెలుగు వారిలో ఎక్కువ అయింది.

ప్రస్తుతము తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాలు తెలుగు అనే పదము ఎలా ఉత్పత్తి అయింది కాలక్రమేణా తెలుగు భాష చెందిన మార్పులు ఎలా అభివృద్ధి చెందినది తెలుసుకుందాము. భాషాభివృద్ధిలోని ముఖ్యమైన ఆరు దశలు  మొదలైన విషయాలను క్లుప్తముగా తెలుసుకుందాము. 

ముందు తెలుగు అనే పదము యొక్క పుట్టుక గురించి తెలుసుకుందాము. ఈ విషయములో రెండు సిద్ధాంతాలు ప్రచారములో ఉన్నాయి. మొదటిది చాలా మందిచే అంగీకరించబడినది. 'తెలుగు' అనే పదము సంస్కృత పదము త్రీలింగ అనే పదము నుండి పుట్టింది. విశ్వనాథుడు అనే సంస్కృత కవి మొట్ట మొదటిసారిగా త్రిలింగ పదాన్నివాడాడు. త్రీలింగ అంటే మూడు ప్రముఖ శైవ క్షేత్రాలు అయిన శ్రీశైలము ,భీమేశ్వరము కాళేశ్వరము ఈ మూడింటి మధ్య ఉన్న ప్రజలు మాట్లాడే భాష  కాబట్టి తెలుగు అనే పేరు ఉద్బవించింది, లేదా సంస్కృత త్రికళింగ శబ్దమైన తి-ఆలింగ పదము నుండి తెలుగు అనే శబ్దము ఏర్పడి ఉండవచ్చు .

మరొక సిద్ధాంతము ప్రకారము తెలుగు అనే పదము తెనుగు అనే ప్రాచీన ద్రవిడ  పదము నుండి పుట్టింది. "తెన్ "అనే మాటకు అర్ధము దక్షిణము. అంటే ఈ సిద్ధాంతము ప్రకారము తెలుగు అనే పదము ఒక ద్రావిడ పదము  తలైంగు జాతి వారి భాష కాబట్టి తెలుంగు అనే పదము ఏర్పడింది, అని కొందరు భాష పండితుల అభిప్రాయము. తలైంగు అంటే తల స్థానాన్ని ఆక్రమించినవారు అంటే నాయకులు అని అర్ధము.తెలుంగు అంటే తెల్లగా స్పష్టముగా ఉండే భాష అని మరో భావన కూడా ఉంది. తెన్నూ అంటే దారి కాబట్టి తెనుంగు అంటే దారిలో ఉండే వారి భాష. దారి అంటే ఆర్యులు దక్షిణాపదము అని వ్యవహరించే ప్రాంతము.

ఈ సిద్ధాంతాలు 1600 నాటి అప్పా కవి,అలాగే 1200 నాటి కవి అధర్వణ ఆచార్య వంటి కవుల కవిత్వాలవల్ల తెలుగు ప్రాచుర్యము పొందింది.తెలుగు భాషాభివృద్ధి క్రమము లో దశలను తెలుసుకుందాము క్రి.శ ఒకటవ శతాబ్దము నాటికేతెలుగు ప్రచారములో ఉన్నట్లుగా శాతవాహన రాజైన హాలుని గాదా సప్తశతిలోని తెలుగు పదాల వాడకం వల్ల తెలుస్తుంది. అంటే రెండు వేల సంవత్సరాల చరిత్ర తెలుగు కు ఉంది. నన్నయకు ముందు ఉన్న భాషను నన్నయ సంస్కరించి తెలుగుకు ఒక రూపాన్ని ఇవ్వగలిగాడు కాబట్టి నన్నయను ఆదికవిగా పేర్కొంటారు.

1.మొదటిదశ (క్రీపూ 3000 నుండి 2000):- ఈ కాలములోనే తెలుగు ప్రాచీన ద్రవిడ  భాషల నుండి విడిపోయి దక్షిణాది భాషలలో ముఖ్యమైనదిగా గుర్తించబడింది. ప్రధమ ద్రావిడ భాషల నుండి పుట్టిన తెలుగు సుమారు క్రీపూ 3000 -2000 సంవత్సరాల ప్రాంతములో అంటే ఇంచుమించు 4లేదా 5 వేల  సంవత్సరాల క్రితము గోదావరి నది ప్రాంతములో మాట్లాడేవారు. ఆ విధముగా తెలుగు దక్షిణాది భాషలలోని నాల్గింటిలో  మొదటి ముఖ్యమైన భాష గా చెప్పవచ్చు. కాబట్టి తెలుగు ప్రధమ ద్రవిడియన్ భాషల నుండి  ఆరంభములో ఏర్పడినది. అని స్పష్టముగా చెప్పవచ్చు. తెలుగు ప్రధమ దక్షిణ మధ్య ద్రవిడియన్ కుటుంబములోని భాగము. మిగిలిన మూడు ద్రావిడ భాషలు దక్షిణ ద్రావిడ కుటుంబానికి చెందినవి.

2. రెండవదశ :-(క్రీపూ 700-100):-ఈ దశలో తెలుగు సంస్కృతము ప్రాకృతి భాషల ప్రభావము కలిగి ఉంది. వేదిక్ మహాజనపదాలు ఉనికి ప్రారంభమయినప్పుడు ఈ దశ మొదలవుతుంది. మహాజన పదాలలో  ముఖ్యమైనది ప్రస్తుత తెలంగాణా,ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతాలను పాలించిన అస్సక రాజ్యము. వీరి హయాములో అంటే 700 నుండి 300 B.C E (2700 నుండి 2400 సంవత్సరాల క్రితము) తెలుగు భాషపై సంస్కృతము ప్రాకృతి భాషల ప్రభావము ఉండేది. తరువాతి పెద్ద దశ వైదిక మహాజన పదాల తో మొదలయ్యింది. మహాజన పదాలలో అస్సాక రాజ్యము ప్రస్తుతము తెలంగాణా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతాలలో భాగాన్ని పాలించింది.క్రీస్తు పూర్వము  700- 300 అంటే సుమారు 2700 నుండి 2400 సంవత్సరాల క్రితము అన్నమాట. తెలుగుపై  సంస్కృతము ప్రాకృత భాషల ప్రభావము చూపటం మొదలైయిందో భాషాపండితులైన డిపి అగర్వాల్క్, మరియు దిలీప్ కె చక్రవర్తి లు క్రీస్తుపూర్వము 400 నాటి శిలాశాసనాలు బట్టి వివరించారు. ఈ శిలాశాసనాలు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో గల భట్టిప్రోలు అనే గ్రామములో త్రవ్వకాలలో బయటపడ్డాయి. ఆస్సకా రాజ్య పతనము తరువాత  శాతవాహనులు సంస్కృతాన్ని ప్రాకృత భాషను ఎక్కువగా వాడటం వలన తెలుగుభాషపై వీటి ప్రభావము కనిపిస్తుంది. శాతవాహన పాలకుడు సుమారు 2300సంవత్సరాల క్రితమే ప్రాకృత భాషలో వ్రాసిన గ్రంధములో తెలుగు పదాలు చాలా ఉన్నాయి ఇది ఈ రెండు భాషలకు గల సంబంధాన్ని ఋజువు చేస్తుంది. 

3. మూడవ దశ :-క్రీ శ 500 నుండి 1000 వరకు,ఈ దశలోనే తెలుగు అధికముగా సంస్కృతీకరణ జరిగింది ఫలితముగా తెలుగు నేరుగా సంస్కృతము నుండి వచ్చిన భాషగా అనిపిస్తుంది. రాయలసీమలోని కడప జిల్లాలో పూర్తిగా తెలుగులో వ్రాయబడ్డ పురాతన శిలాశాసనాలు దొరికినాయి ఇవి 575 క్రి.శ రేనాటి చోళుల కాలము నాటివి ఆని తెలుస్తుంది.ఆ కాలములో తెలుగు అధికముగా సంస్కృతికరణ జరగటం వలన పూర్తిగా తెలుగు  సంస్కృతము, ప్రాకృతము నుండి పుట్టినదన్న భావము కలుగుతుంది. ఆదికవి నన్నయ మహాభారతాన్ని తెలుగులో అనువదించేవరకు తెలుగులోకవిత్వము అనేది లేదు అని చెప్పవచ్చు అందుచేతనే నన్నయ ను ఆదికవి అని అంటారు అయన తెలుగును సంసృత వ్యాకరణమునుండి అరువు తెచ్చుకున్న పదాలతో ప్రామాణికము చేసాడు.  సిపి బ్రవున్ బ్రిటిష్ భాష కోవిదుడు ఈ విషయము గురించి చెపుతూ తెలుగు లోని ప్రతి నియమము అతి కష్టముతో సంస్కృతము అనే ఫిరంగి నుండి గ్రహించబడినవే అని అంటాడు.ఈ విధమైన తెలుగు వ్యాకరణము సంస్కృతము నుండి గ్రహించబడినది అవటం వలన తెలుగుకు సంస్కృతము రూపు రేఖలు వచ్చినాయి. అందుచేతనే చాలా మంది అభిప్రాయములో దక్షిణాది భాషలలో తెలుగు సంస్కృతికరణము జరిగిన భాషగా చెపుతారు. అందుచేతనే మేధావులు 80% తెలుగు పదకోశము సంస్కృతము నుండి వచ్చినదే అని అంటారు.

4. నాల్గవ దశ:-(1100.-1550) ఈదశలో తెలుగుకు రాజుల ప్రాపకం ఎక్కవగా లభించి కన్నడ లిపిని వాడటం మాని సొంత లిపి పూర్తిగా ఏర్పడింది. ఈ దశలో అభివృద్ధి అంతా విజయనగర సామ్రాజ్యములోనే జరిగింది. ప్రముఖ ద్రావిడ భాషల పరిశోధకుడు భద్రిరాజు కృష్ణ మూర్తి గారు చెప్పిన దాని ప్రకారము  1100నుడి 1400 మధ్యకాలములో తెలుగు కన్నడము నుండి విడిపోయి స్వంత లిపిని ఏర్పారచుకుంది.ఈ రెండు భాషల లిపిలకు మధ్య దగ్గరపోలికలు కనిపిస్తాయి. అలాగే తెలుగు భాషకు కాకతీయ, ముసునూరి ,రెడ్డి రాజుల నుండి కూడా మంచి ఆదరణ లభించింది. కాకతీయ రాజులు పరిపాలనకు సంస్కృతము బదులుగా తెలుగునే విరివిగావాడేవారు. ముసునూరి నాయక వంశస్తులు వెన్నయ్య వంటి బ్రాహ్మణ పండితులకు అగ్రహారాలు ఇచ్చిభాష అభివృద్ధికి తోడ్పడేవారు. ఈ అగ్రహారాలు తెలుగు భాషాభివృద్ధికి సాహిత్యానికి కేంద్రాలుగా పనిచేసేవి. ఇదేవిధముగా రెడ్డిరాజులు కూడా భాషాభివృద్దికి కృషి చేశారు వీరి ప్రాపకంలోనే  శ్రీనాధకవి సార్వభౌముడు ఉండేవాడు. అందుచేత భాషా పరంగా విజయనగర, ముసునూరి, రెడ్డిరాజులు పాలన తెలుగు భాషకు స్వర్ణ యుగముగా చెప్పవచ్చును విజయనగర ప్రభువు శ్రీ కృష్ణదేవరాయల పాలనలోనే అష్టదిగ్గజాలనే పేరుతొఅల్లసాని పెద్దన తెనాలి రామకృష్ణుడు వంటి  కవి పండితులు ఉండేవారు.

5. ఐదవ దశ (1370-1800ల మధ్యకాలము ) ఈ దశలో తెలంగాణా ఆంధ్ర లలో తెలుగు పై ఉర్దూ భాష ప్రభావము ఎక్కువగా కనిపిస్తుంది ముసునూరి రాజుల పతనము వల్ల ముస్లిం రాజ్య స్థాపన వల్ల ఈ మార్పు కనిపిస్తుంది.ఈ దశలో  బహమనీ సుల్తానులు బలపడటం వలన ముస్లింల ప్రభావంగా బాగా కనిపిస్తుంది.వీరి ప్రభావము విజయనగర రాజుల ఆధీనంలోని తెలంగాణాలో కుతుబ్ షాహి పాలన ఉండటం వల్ల అక్కడ కూడా కనిపిస్తుంది.ఈ ప్రభావము నైజాము పాలన వరకు కనిపిస్తుంది.విజయనగర రాజ్యము బలహీనపడటం ముస్లింల పాలన వల్ల తెలంగాణా మాత్రమే కాకుండా ఆంధ్రప్రాంతములో కూడా తెలుగు పై ఉర్దూ ప్రభావము కనిపిస్తుంది. ఉర్దూలోనుండి చాలా పదాలు తెలుగులోకి వచ్చేసాయి తెలంగాణలోని తెలుగు ఇంచుమించు ఉర్దూలాగానే ఉంటుంది కానీ కోస్తా ఆంధ్ర ప్రాంతములోని తెలుగు ప్రస్తుతము మీడియాలోగాని సినిమాలలోగాని వాడబడేది సంస్కృతము కలిసిన తెలుగు లేదా సంస్కృత మూలాలు ఉన్న తెలుగు కానీ ఈ తెలుగులో కూడా ప్రాంతాలవారీగా ఉచ్చారణ (డైలెక్ట్)మారుతుంటాయి శ్రీకాకుళము నుండి చిత్తూరు  వరకు ఈ తేడాను గమనించవచ్చు కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతము ప్రజలు మాట్లాడే తెలుగు పొరుగున ఉన్న తెలంగాణలోని ఖమ్మంకు జిల్లా ప్రజలు మాట్లాడే తెలుగు ఒకే రకముగా ఉంటుంది.

6. ఆరవ దశ :-1800 నుండి నేటి వరకు - ప్రస్తుతము నడుస్తున్న దశలో తెలుగుపై ఇంగ్లిష్ ప్రభావము ఎక్కువగాఉంది. తెలుగు సాహిత్యము పై మీడియా పై, ఈ ప్రభావము స్పష్టముగాకనిపిస్తుంది.1800 సంవత్సరము ప్రాంతములో ప్రారంభమయిన ఇంగ్లిష్ వలసవాదుల పాలనలో ప్రారంభమైన ఇంగ్లిష్ ప్రభావము నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ గ్లోబలైజేషన్ పుణ్యమా అంటూ తీవ్ర ప్రభావాన్ని కలుగజేసింది.ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఏ ఒక్క ఇంగ్లిష్ పదము లేకుండా తెలుగు మాట్లాడటము అసాధ్యము అనిపించే స్థితికి వచ్చారు తెలుగు వాళ్ళు కొన్ని తెలుగు అక్షరాలూ పదాలు తెరమరుగైనాయి.తెలుగు భాష అస్తిత్వానికే ప్రమాదం తెచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇంగ్లిష్ అంతర్జాతీయ భాషాకాబట్టి నేర్చుకోవాటము తప్పులేదు కానీ మాతృ భాష అభివృద్ధికి సహకరించేలావుండాలి ప్రస్తుతాతము ప్రభుత్వమూ కూడా ప్రాధమిక స్థాయినుండి విద్యాబోధన ఇంగ్లిష్ మాధ్యమములో ఉండాలి అని చట్టాన్నితెచ్చింది దాని మీద కోర్టులలో వాదోపవాదాలు జరుగుతున్నాయి.

****


No comments:

Post a Comment

Pages