పురాణ కధలు
బసవ పురాణం - 4
పి.యస్.యమ్. లక్ష్మి
6. గొడ్డుటావు
ఈ పురాణం సమయం కర్ణాటకలో అడుగంటిపోయిన శైవ మతం పునరుధ్ధరింపబడుతున్న సమయం. సాక్షాత్తూ నందీశ్వరుడి అవతారమైన బసవేశ్వరుడూ తన మహిమలను చూపిస్తూ, శైవ మతోధ్ధరణ చేస్తూ, శివ భక్తులను ఆదరిస్తూ, దానికోసం అనేక మహిమలు చూపించే తరుణం....
అలాంటి సమయంలో....
వెంకటయ్య అనే భక్తుడుండేవాడు. ఆయన ఇంటికి ఒక రోజు రాత్రి ఒక శివ భక్తుడు వచ్చాడు. ఆ భక్తుడు వెంకటయ్యతో ప్రతి రోజూ తన శివ పూజకు ఒక ఆవు ఇచ్చే పాలు పూర్తిగానూ, ఒక బుట్టెడు బిల్వ పత్రి కావాలనీ, అవి లేకపోతే ఆ రోజుకి శివ పూజ లేకపోవటమేగాక తను కూడా భోజనం చెయ్యననీ చెప్తూ, వెంకటయ్యగారూ, మీరు శివ భక్తులని, మీరు నాకు కావలసినవి సమకూర్చగలరని నమ్మకంతో ఈ రాత్రి పూట మీ ఇంటికి వచ్చాను. అర్ధ రాత్రి అయినా సరే నేను శివ పూజ చేసుకోవాలి. మీరు నాకు కావలసిన వస్తువులు సమకూర్చదల్చుకుంటే ఇప్పుడే సమకూర్చండి. రేపు నేను మీకు కనబడను అని చెప్పాడు. వెంకటయ్య అప్పటికప్పుడు ఆ భక్తుడు కోరినవి తానెట్లు సమకూర్చగలనని కొంచెం ఆలోచించి, భారమంతా శివుడిమీద వేసి ఆ భక్తునికి సాష్టాంగ నమస్కారం చేసికూర్చుండబెట్టి, స్వామీ, మీరు శివ పూజ చేసుకొనుటకు తయారవండి. మీ శివ పూజకు కావలసిన పత్రి, పాలు నేను మీ పూజ లోపల సమకూరుస్తాను. అలాగే మీ భోజనానికి కావలసిన వస్తువులన్నీ కూడా సమకూరుస్తాని అని చెప్పాడు.
వెంకటయ్య ఇంట్లో వున్న ఆవు గొడ్డుపోయింది. పాలివ్వదు. కానీ వెంకటయ్య శివుడి మీద నమ్మకంతో, భక్తితో, ఒక పాత్ర శుభ్రంగా కడిగి తీసుకువెళ్ళ ఆ గొడ్డావు పాలు పితకగా ఒక్క నిముషంలోనే వెంకటయ్య తీసుకెళ్ళిన పాత్ర నిండా పాలు వచ్చాయి. ఆ పాలు తీసుకొచ్చి ఇంటికొచ్చిన జంగమయ్య (శివ భక్తుడు) ముందు పెట్టాడు.
పెరట్లో ఒక పందిరి పడిపోతే దానికి ఆలంబనగా ఒక ఎండిపోయిన మద్ది చెట్టు కర్రని చూసి దీనినుంచి పత్రి కోస్తానని శివుణ్ణి తలచుకుని ఆ మొద్దునుంచి పత్రి కోయటం మొదలు పెడితే వెంకటయ్య తెచ్చిన బుట్ట నిండిపోయింది. వెంకటయ్య ఆ చెట్టు దిగంగానే అది మామూలు ఎండిన మొద్దయింది. వెంకటయ్య ఆ పత్రి తీసుకెళ్ళి జంగమయ్యకివ్వగా ఆయన తన పూజ పూర్తి చేసుకుని, భోజనం చేసి, వెంకటయ్య చూస్తుండగానే అక్కడే అంతర్ధానమయ్యాడు.
ఈ కధ విని ఇద్దరు భక్తులు వాళ్ళల్లో వాళ్ళిలా వాదించుకున్నారు....ఇలాంటి పుక్కిట పురాణ కధలు మన పెద్దలు చెప్తుంటే విన్నామేగానీ నిజంగా ఇలా జరుగుతుందా అని ఒకరన్నారు. అది విన్న మరొక భక్తుడు మన బసవన్న మొన్ననేకదా జొన్నల రాశిని ముత్యాల రాశిగా చేసి ఒక జంగమయ్యకు పది పుట్ల ముత్యాలిచ్చాడు. ఆయనను మించిన భక్తులున్నారా!? ఆయనని దర్శిద్దాము. అనేక నిదర్శనాలు చూడవచ్చు. ఒక్కొక్కసారి శివుడే వేరు వేరు రూపాలలో వచ్చి అతన భక్తిని పరీక్షించి పోతాడట. అక్కడకెళ్తే మనం అనేక నిదర్శనాల గురించి వినవచ్చును.. అనుకొని ఇద్దరు బసవేశ్వరుని దగ్గరకెళ్ళారు.
బసవేశ్వరుని దగ్గరకు ఎప్పుడూ లెక్కలేనంతమంది భక్తులు వచ్చి వారు కోరుకున్నది పొంది వెళ్తుంటారు. భక్తులు లేకుండా బసవేశ్వరుడు ఒక్క నిముషం కూడా వుండరు. ఒక్కొక్కసారి జంగమదేవరలు అర్ధ రాత్రి బసవెశ్వరుడు నిద్రపోయే సమయంలో వచ్చినా వారి అలికిడి విని లేచి వారికేమి కావలెనో చూసెడివాడు. కొందరు బసవేశ్వరునికి నిద్రా భంగము చెయ్యకూడదని నిశ్శబ్దంగా ఆయన లెచేవరకూ వేచి వుందామని వున్నా, బసవేశ్వరుడు తననెవరో లేపినట్లు లేచి ఆ అర్ధరాత్రి సమయంలోనే వారికతిధి సత్కారాలు చేసేవాడు.
భగవద్భక్తుల పట్ల బసవేశ్వరుని గౌరవం, ఆదరణ, భక్తి అలాంటిది. వచ్చే వారం ఇంకో కధ చెప్పుకుందాము.
***
No comments:
Post a Comment