కంచె
-పి.వి.సుబ్బారాయుడు
"అమ్మా, మీ చల్లని చేత్తో ఈ పిల్లదాన్ని దీవించి, మంచి పేరు పెట్టండమ్మా"
తన పిల్లని రంగమ్మ చేతిలో పెడుతూ అంది రాజీవి.
"అలాగే లేవే..ఇహనుంచి దీనిపేరు పూర్ణచంద్రిక. నువ్వు చంద్రీ అని పిలుచుకో..అన్నట్టు
నువ్వు సంతోషంగానే ఉన్నావుగా" నవ్వుతూ అంది.
"ఆడోళ్ళకి మీలాంటోళ్ళు కంచె కడితే, మాలాంటోళ్ళ బతుకులు
ప్రశాంతంగా ఉన్న గోదాట్లో పడవ ప్రయాణమే!" అంది సన్నటి కన్నీటి పొరలమాటు నుంచి
రంగమ్మను చూస్తూ.
"నేను చేసిందేమీ లేదే. మనం ఒకరికొకరం బలం. అంతే" అంది రాజీవి చేతులను తన
చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నొక్కుతూ.
అక్కలా
ఆప్యాయతను పంచే రంగమ్మను చూస్తూ, మనసులోని గతం పొరలను ఆలోచనలతో
ఒక్కటొక్కటిగా తొలగించింది.
***
రాజీవి
పద్దాకా చదివింది.
రాంరాజు
ఏం చదవకపోయినా తమ గుండెలమీద కుంపటిని కాణి కర్చు లేకుండా తన గుండెల మీదకు మార్చుకుంటానన్నాడని
మురిసిపోతూ, రాములోరి గుళ్ళో మూడు ముళ్ళేయించారు రాజీవి అమ్మనాన్నలు.
పెళ్ళయిన మొదట్లో వాళ్ళిద్దరు చిలకగోరింకలే. తర్వాతే వాడు
గద్ద ఆమె కోడిపిల్ల అయిపోయారు.
వాడొస్తున్నాడంటే
ఆమె గజగజలాడిపోయేది. వాడు సంపాదించింది రకరకాలుగా తగలేస్తాడు. ఆమె పని చేసుకుంటానంటే
ఒప్పుకోడు. అర్ధాకలి, పస్తులతో రాజీవి చొప్పకట్టెలా అయింది.
వాడికి
తాతలనాటి ఆస్తిగా రెండువాటాల ఇల్లుంది. ఒకదాంట్లో వాడుంటాడు. రెండో దాంట్లో ఉన్నవాళ్ళు
నెలక్రితమే ఖాళీ చేశారు. రాంరాజు పనిచేసి తెచ్చేది తక్కువే, వేణ్నీళ్లకు చన్నీళ్ళుగా అద్దె వచ్చేది కాబట్టి నెట్టుకొచ్చేవాడు. చేతిలో డబ్బాడకపోవడంతో
పిచ్చెక్కినట్టై రాజీవిని చితకబాదేవాడు.
ఇదిలా
ఉండగా ఇల్లు అద్దెకు కావాలంటూ రంగమ్మ వచ్చింది. వాడు అద్దె ఎక్కువ చెప్పినా ఒప్పుకొని
దిగింది. దాంతో వాడికి పండగొచ్చినట్టనిపించింది. అయితే వాడికా ఆనందం ఎక్కువకాలం నిలవలేదు.
ఒకరోజు, రంగమ్మ తనింట్లో మహిళామండలి నిర్వహిస్తోందన్న విషయం తెలిసింది. రోజూ ఎంతో మంది
ఆడవాళ్ళు వస్తూ పోతుంటారు. చర్చలు, గొడవలు, పంచాయతీలు. రాజీవి మీద చెయ్యెత్తడం మాట అటుంచి గట్టిగా అరిస్తే గయ్యిన నలుగురైదుగురు
ఆడాళ్ళు మీదకు వచ్చేస్తున్నారు. మొదట్లో 'తన ఇల్లేమన్నా సత్రమా'
అని గయ్యిన లేచేవాడు. కాని తనది ఒక గొంతు వాళ్ళవెన్నో. దాంతో పూర్తిగా
తగ్గాడు. అది తన సొంతిల్లు కాకపోతే, ఏనాడో ఖాళీ చేసేవాడు.
రంగమ్మ
భరోసాతో రాజీవి పనిచేసుకుంటూ తన కాళ్ళమీద తను నిలబడింది.
***
"చూడు రాజీవీ, నీ మీద వాడి దాష్టీకం చూసి మేమే ఇంతకు ముందున్న
వాళ్ళని ఖాళీ చేయించి, ఇక్కడ దిగాం.
ఆడదాని
ముందు పులనుకున్న రాంరాజును పిల్లిని చేసాం, నీ క్షేమం కోసం!
ఇహ ఆ పిల్లిని పిల్లిగానే ఉంచాల్సిన బాధ్యత నీదే!
మేము
మరో స్త్రీని ఆదుకోడానికెళుతున్నాం. అక్కడో మహిళామండలి ఏర్పాటు చెయ్యాలి. ఈ వాటా మహిళా
మండలిగానే ఉంటుంది, కాకపోతే ఈ మండలికి నువ్వే అద్యక్షురాలివి. మనవాళ్ళు వస్తూ
పోతుంటారు. సమాజమంతా మహిళామండలయితే దిశ కేసులు జరగవు. ఆడాళ్ల మీద మగ దౌర్జన్యాలు సాగవు.
ఓట్లేసి ప్రభుత్వాలను ఏర్పరచిన మనం, మన జీవితం, రక్షణ, భవితవ్యం కోసం ప్రభుత్వాలను దేబురించడం అనవసరం.
ఆడదానికి ఆడది శత్రువు కానేకాదు, తోబుట్టువు. మనకి ఏకైక శత్రువు
మనం బలహీనులమనుకొని మీసం మెలేస్తూ, మన మీదకొచ్చే మగాడే. మన సంఘటిత
శక్తి ముందు సమస్యలన్నీ గడ్డిపోచలే, మరీ ముఖ్యంగా మగాళ్ళ నుంచి
ఎదురయ్యేవి" అంది.
అప్పుడే
పేరు పెట్టించుకున్న పసిది నిద్రలో పకపకానవ్వింది, బహుశా దాని
కళ్ళకు అందమైన భవిష్యత్తు కలగా కనిపించిందనుకుంటా!
***
No comments:
Post a Comment