'కార్తీక పౌర్ణమి' విశిష్టత - అచ్చంగా తెలుగు

'కార్తీక పౌర్ణమి' విశిష్టత

Share This
'కార్తిక పౌర్ణమి'..విశిష్టత
పి.వి.ఎల్.సుజాత 



కార్తిక మాసములో శుక్ల పక్షమునాడు వచ్చే తిథిని 'కార్తిక పౌర్ణమి' అంటారు. కార్తిక పౌర్ణమి చాలా పవిత్రమైనది.కార్తిక పౌర్ణమి హరి, హరులకు అత్యంత ప్రీతికరమైనది. అన్ని మాసాల్లోనూ ఈ కార్తిక మాసానికి ప్రత్యేకత ఉందని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం ఇది. మానవాళి వారిద్దరిని కొలిచి తరించినవారికి సకల శుభాలు అనుగ్రహిస్తాయని కార్తిక పౌర్ణమి ప్రాశస్త్యంలో తెలుపబడింది.

కార్తిక పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు కలుగుతాయి. ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించినట్లైతే, కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజున కేదారీశ్వర వ్రతము చేసినట్లయితే అత్యంత శుభం చేకూరుతుంది. సన్నిహితులకు, స్నేహితులకు, బంధువులకు కార్తిక పురాణ పుస్తకాలను పంచడం వలన పుణ్యం లభిస్తుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు,కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తిక పురాణ వైశిష్ట్యాన్ని తెలిపే పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది.

దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వ శుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.

ఏ నది అందుబాటులో ఉంటే ప్రాతః కాలమున లేచి ఆ నదిలో స్నానం చేస్తే శుభం. ఒకవేళ మనం ఉండే ప్రాంతంలో నదులు ఏవీ దగ్గరలో లేనప్పుడు చెరువునందు గానీ, బావి దగ్గర గానీ, తలస్నానం చేయవచ్చు. తలమీద నుంచి నీళ్లు పోసుకుంటూ స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించాలి.

ll శ్లో ll గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ll

కార్తిక పౌర్ణమి నాడు శివ, విష్ణు దేవాలయాలు రెండింటిలో దీపాలు వెలిగిస్తారు. కార్తిక దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది.

విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజ స్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ మట్టి ప్రమిదల్లో, ఆవు నెయ్యి తో తడిపిన వత్తి ఉసిరి కాయల మీద వేసి,బియ్యపు పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను పసుపు, కుంకుమ, పూలతో చక్కగా అలంకరించాలి. శివాలయాల్లో ధ్వజ స్తంభం మీద నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరిణిలలో, కుండలు లోహ పాత్రలలో దీపాన్ని వెలిగించి వేలాడదీయాలి. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలగు జల వనరుల్లో విడిచి పెట్టాలి. ఇలా చేయడం పుణ్యప్రదమే కాక, అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. మూడొందుల అరవై ఐదు వత్తులన్నీ కలిపి కార్తిక పౌర్ణమి నాడు ఆవు నెయ్యితో వెలిగిస్తే సంవత్సర కాల పుణ్యాన్ని ఒకటేసారి పొందవచ్చు. వైజ్ఞానిక పరంగా చూస్తే ఈ కార్తిక దీపాల వల్ల వచ్చే వెలుగు, గాలి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఆవు నెయ్యితో వెలిగే దీపాల వల్ల వాయు శుద్ధి అవుతుంది. తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. అదీకాక, కార్తీక మాసం మొత్తo వాతావరణం చలిగా, తేమగా ఉంటుంది. గాలిలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ దీపాలు వెలిగించడం వల్ల వాటి వేడికి క్రిమి కీటకాలు నశించడమే కాకుండా, చలి విరిగి నులివెచ్చదనంగా వాతావరణం మారుతుంది.

పురాణ గాథ ప్రకారం ఒక భక్తురాలు కోరికను మన్నించి శివుడు వరాలిచ్చాడనే కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.

పాండ్యుడు, కుముద్వతి అనే దంపతులకు సంతానం లేరు. వారిరువురు సంతానార్థం పరమ శివుడ్ని ఆరాధించారు. వారి ఆరాధకు ప్రసన్నుడై శివుడి ప్రత్యక్షమయ్యాడు. ఆ దంపతులు చేసిన పూజలో చిన్న లోపo జరగడం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదుట శివుడు. అందుకు ''అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా?, లేక పూర్ణాయుష్కురాలు విధవ అయినా కుమార్తె కావాలా? ''అని అడిగాడు శివుడు. వారిరువురు ఆలోచించుకుని మాకు కుమారుడే కావాలని కోరుకున్నారు ఆ దంపతులు. ''తథాస్తు'' అని దీవించి కైలాసానికి వెళ్ళిపోయాడు శివుడు.

శివానుగ్రహం వల్ల ఆ దంపతులకు కొడుకు పుట్టాడు. అతడి వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో భయం పెరగసాగింది. ఆ సమయంలో హఠాత్తుగా వారికొక ఆలోచన తట్టింది. అలకాపురి రాజకుమారి పై వారి దృష్టి పడింది. ఆమె శివ భక్తి పరాయణురాలు. ఆమె ఒక్కసారి పిలిస్తే చాలు శివుడు పలికేటంత భక్తి,శక్తి సామర్ధ్యాలు కలదని ఆనోటా ఈనోటా విన్నారు ఆ దంపతులు. ఆ రాకుమారిని తమ కోడలిగా చేసుకుంటే తమ కొడుకుని పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత భార్యగా ఆమె చూసుకుంటుందని ఆలోచించి, ఒక శుభ ముహూర్తాన వారిరువురికి వివాహం చేశారు.

వివాహమయ్యి కొద్దీ రోజులు కూడా గడవనేలేదు, కార్తీక పౌర్ణమి నాడు భర్త కోసం యమ భటులు వచ్చారు. యమభటుల్ని చూడగానే అసలు విషయం అర్థమైపోయింది ఆ మహా సాధ్వికి. తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుడ్ని ప్రార్థించింది. వెంటనే ప్రత్యక్షమైన శివుడు ''ఏమి వరం కావాలో కోరుకో ''మని అన్నాడు. ''తాను నిండు నూరేళ్లు పసుపు, కుంకుమలతో ముత్తైదువుగా ఉండేలా వరాన్ని ప్రసాదించు స్వామీ!'' అని అడిగింది. ' తథాస్తు' అని దీవించాడు శివుడు. తన భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకున్న భక్తురాలు ఆమె. శివానుగ్రహం వల్ల తన భర్త కి పునర్జన్మ భాగ్యం కలిగింది. తన జీవితానికి వెలుగుని ప్రసాదించిన శివుడికి కృతజ్ఞతాభావంగా దీపం వెలిగించి, భక్తితో నమస్కరించింది ఆ ఇల్లాలు. నాటి నుండి పసుపు, కుంకుమలు,ముత్తైదువు భాగ్యం ఇవ్వమని కార్తిక పౌర్ణమి నాడు మహిళలందరూ ఉపవాసం చేసి దీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తుందని పురాణ కథనం.

ఈ కార్తిక పౌర్ణమిని 'త్రిపుర పూర్ణిమ' అనికూడా అంటారు. తారకాసురుడికి ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించారు.వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ దేవుడు ఏంకావాలో కోరుకోమని అన్నాడు. ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు వరాలను కోరారు. ఎవరి వల్లా తమకు మరణం సంభవించకూడదని అడిగారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే ఈ వరమైనా ఇవ్వమని అడిగారు..రథం కాని రథం మీద,విల్లు కాని విల్లుతో, నారి కాని నారితో సారించి, బాణం కాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో మా ముగ్గురినీ ఏక కాలంలో బాణంతో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు.

ఆ వర బలంతో పట్టణాలలో ఉన్న తమ రాక్షస గణంతో సహా సంచరిస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టించ సాగారు. వివిధ లోకవాసులంతా వచ్చి బ్రహ్మ దగ్గర మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది నేనే కాబట్టి మరల తిరిగి తీసుకోలేనని, నేనిప్పుడు ఏమీ చేయలేనని అన్నాడు బ్రహ్మ. చేసేదేమి లేక ఆ వచ్చిన వారు వెనుతిరిగి పోతుండగా వారిని పిలిచి మీరంతా విష్ణువు దగ్గరకి వెళ్ళండి అంటూ సలహా ఇచ్చాడు బ్రహ్మ. వారంతా విష్ణువు దగ్గరకొచ్చి మొరపెట్టుకున్నారు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, బ్రహ్మ వరం ఇచ్చేశాక తానేమీ చేయలేనని చెప్పి, ఒకపని చేద్దాం మీరంతా నాతోరండి అని వారందర్నీ వెంటబెట్టుకుని కైలాసంలో ఉన్న శివుని దగ్గరికి తీసుకెళ్లాడు. మీరంతా సహకరిస్తే ఆ ముగ్గుర్ని సంహరించగలను అని చెప్పాడు శివుడు. ఆ మాటతో అందరూ సరేనని తలూపారు. భూదేవి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా, ఆదిశేషుడు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీ మహా విష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహారశక్తితో శివుడు త్రిపురాసురులను మరియు మూడు పట్టణాల యజమానులైన వారి రాక్షస గణాలను పౌర్ణమి నాడు సంహరించాడు. అందువల్ల ఈ కార్తిక పౌర్ణమికి 'త్రిపుర పౌర్ణమి' అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

శివ, విష్ణువులిద్దరూ కలిసి త్రిపురాసుడిని సంహరించారు కాబట్టి, అటు శివాలయాల్లో ఇటు విష్ణువాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. ఈ రోజు దైవ దర్శనం, దీపారాధన,సాలగ్రామ దానం, దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తే విశేష శుభ ఫలితాలు కలుగుతాయని కార్తిక పురాణంలో స్పష్టంగా పేర్కొనబడినది.

ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరి, హరులను పూజించి వారి కరుణా కటాక్షాలను పొందుతారో వారికి సర్వదా శుభప్రదమే!

*******

No comments:

Post a Comment

Pages