మానసవీణ-16 - అచ్చంగా తెలుగు

                                                                      మానసవీణ-16

                                                                                    వెంపరాల శ్రీనివాస్


(జరిగిన కథ: ఎవరూ లేని మానస చిన్నప్పటి నుంచి ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఉంటుంది. సేవాభావానికి మారుపేరులా ఉండే మానస అంటే అందరికీ ఇష్టమే. ఒక బహుమతి ప్రదానోత్సవ సభలో మానసను చూసిన మంత్రి కృషీవలరావు, ఆ పాపలో తనకు తెలిసిన శ్రావణి అనే ఆవిడ పోలికలు ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఆమెతో చనువుగా మెలుగుతూ ఆమెను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రభుత్వ కాలేజిలో చేరి, చదువుతూ ఉన్న మానస అక్కడి విద్యార్ధుల మనసు గెల్చుకుని, క్లాస్సులు సజావుగా జరిగేలా చేస్తుంది. రోడ్డుపైన అనాధలుగా వదిలేసిన కొండలరావు దంపతుల దీనస్థితిని చూసి, వాళ్ళ బిడ్డలకు బుద్ధి చెప్పి, దారిలో పెడుతుంది  మానస. మనసు నలతగా ఉండడంతో గుడికి వెళ్ళిన మానసను శ్రావణి కౌగిలించుకుంటుంది. భూషణం చనిపోతాడు. )అనిరుధ్ మానస గురించి ఆలోచిస్తూ ఉంటాడు.)

ఆకులో ఆకునై, పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై

ఈ అడవి దాటిపోనా...ఎంత సౌందర్యాత్మక భావుకత్వమో కదా కృష్ణశాస్త్రి గారిది.

ఎవ్వరని మెంతురో నన్ను-ఏననంత

శోక భీకర తిమిరలోకైక పతిని - అని నిరాశ భావం వ్యక్తం చేసినా అది ఆయనకే చెల్లింది.

రాసేది ఏ భావమైన మనసునుని పులకింప చేసి  సున్నిత భావాల్ని పలికించడంలో ఆయనకు ఆయనే సాటి అనుకుంది మనసులో.

మానస తలపుల నిండా కృష్ణశాస్త్రి భావాలు తామర తంపర గా పరిగెట్టడం మొదలెట్టాయి.

అయినా మనసులో తన లక్ష్యం చెక్కు చెదరకుండా అలాగే వుంది.

తరాలు మారొచ్చు, రోజులు మారొచ్చు..ఇంకా కాలం కూడా మారిందంటాం. ఇంతకు మారింది కాలమా,జనమా..?

ఓ ఎడ తెగని ప్రశ్న..?

విత్తనం ముందా..? చెట్టు ముందా..?

అసలు వివాహం అంటే ఏమిటి..? దాని పవిత్రత గురించి చిన్నప్పుడు తను విన్న మాటలు గుర్తొచ్చాయి మానసకి..

చెట్టు మీద కాయ, సముద్రం లో ఉప్పు ఒక్కటై కొత్త రుచులను సృష్టించినట్టు-ఎక్కడో పుట్టి,ఎక్కడో పెరిగిన ఇద్దరు యువతీ, యువకులు దాంపత్య బంధం తో ఒక్కటై కొత్త జీవితానికి శ్రీకారం చుడతారు." నాతి చరామి.." అంటూ జరిగే పెళ్ళి వేడుకతో ఒక యువతి, ఒక యువకుని జీవితాలు పెనవేసుకోవడమే కాదు-రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి.

స్వర్గం లో పెళ్ళిళ్ళు నిర్ణయమవుతాయంటారు సంప్రదాయవాదులు. ఏది ఏమయినా వివాహం ఎవరి జీవితంలో నైనా అతి ముఖ్యమైన సందర్భం. కొంగుముడితో కన్న కలలు పదిలం చేసుకుంటూ ఏడడుగులు కలిసి నడిచి ఆకు, వక్కల్లా కలిసిపోవాలి .ఒకరికొకరై ప్రగాఢమైన అనురాగంతో నవ జీవన ప్రస్థానాన్ని ప్రారంభించాలి.

పెళ్ళి రెండు జీవితాలను శాశ్వతం గా ముడివేసే అనుబంధమైనా అయినా దానిలో అనేక కోణాలు పెనవేసుకొని వుంటాయి. సహజీవనం శత వసంతాల పాటు సుఖ, సంతోషాలతో వికసించాలని కోరుకోవాలి. నీరూ, వేరూ వేరుకాదు, వెన్నెలా, జాబిలి వేరుకాదు,నువ్వూ, నేను వేరు వేరు కాదు అన్న మౌన సందేశాన్ని స్వీకరించాలి.

అమ్మ,నాన్నల్ని అందరినీ వదిలి వచ్చిన వధువుకి, నేనున్నానని భుజాన్ని నిమిరేవాడే మగాడు. సంసారపు కొలనులో దాంపత్యపు కలువలను వికసింప చేసుకోవడమే వైవాహిక జీవిత పరమార్థం.

****

ఇవే ప్రశ్నలు అనిరుధ్ మనసుని తొలిచేస్తున్నాయి.

సామాజికత, ధార్మికత, నైతికత లాంటి విషయాలు మాట్లాడే  నేటి సమాజంలో వాటిని ఎంతవరకు పాటిస్తున్నారు.

ఏ తండ్రైనా తన ఇంటికి కాబోయే కోడలు ఉన్నత కుటుంబానికి చెందినదై వుండాలని అనుకుంటాడు కాని ఓ అనాధాశ్రమం లో పెరిగిన ఊరు, పేరు లేని అమ్మాయి ని కోడలిగా అంగీకరిస్తాడా..?

ఒక వేళ తప్పని పరిస్థితుల్లో అంగీకరించినా గౌరవంగా ఆమెను చూస్తాడా..?

అసలే ఆత్మాభిమానం కల పిల్ల మానస. తేడా వస్తే చాలా చిక్కులొస్తాయి.

అనిరుధ్ మనసు నిండా దావానలం లా ఒకటే ప్రశ్నల వాన కురుస్తోంది.

ప్రతి ఒక్కరికీ వుండేది ఒకటే జీవితం..మళ్ళీ, మళ్ళీ ఈ జన్మలు ఉన్నాయో లేవో ఎవరికీ తెలీదు. ఈ జీవితంలో మానసని కోల్పోతే ఈ జీవితమే వృధా..ఇలా ఒకటా, రెండా మనసు నిండా ఆలోచనలే. ఆ ఆలోచనలకు అంతు, అంతము రెండూ కనిపించడం లేదు.

అలాగని తనని ఇబ్బంది పెట్టి ఆమె సంస్కారం ముందు తన చిన్నతనాన్ని బయటపెట్టలేడు.

తను ప్రేమిస్తున్నది ఆమె బాహ్య సౌందర్యాన్నా లేక అంతః సౌందర్యాన్నా..మరో ప్రశ్న..?

అసలు అందం అంటే ఏమిటి..

అది చూసేవాడి దృష్టిని బట్టి వుంటుంది.

ఇలా ఆలోచిస్తున్న అనిరుధ్ మదిలో ఓ ఆలోచన మెదిలింది. తన మనసులోని భావాలన్నీ ఒక కాయితం మీద పెడితే ఎలా వుంటుందనిపించింది.ఇది ప్రేమలేఖ కాదు కాని, తన మనసులోని భావాల సమాహారం లాంటిది. సమయం, సందర్భం దొరికినప్పుడు మానస కి నెమ్మదిగా చెప్పొచ్చు అనిపించింది.

తన మనసులోని భావాల్ని ఒక కాయితం మీద రాయడం మొదలెట్టాడు.

" ప్రేమంటే అమృతం, అజరామరం, శాశ్వతం.."

ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ

ఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమ

ప్రేమ దివ్య భావము..ప్రేమ దైవ రూపము

రోజు లెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే...

మంచితనానికి ఓ రూపాన్ని గీయాల్సి వస్తే ..ఆ రూపం పేరు ఆమె. అనతికాలంలోనే అంతులేని ప్రేమని పంచి..ఆనందపు అంచుల్లో విహరించేలా చేసిన అమృతమూర్తి ఆమె. నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం ఆమె. ఇప్పుడు ఆమే నా ప్రపంచంలా అనిపిస్తోంది.

ఉప్పెనలే వచ్చినా, ఉధృతాలే జరిగినా, ప్రళయాలే వచ్చినా, ప్రకంపాలే చుట్టుముట్టినా ఒద్దికగా, ధైర్యంగా, నిశ్చలంగా, నిర్భేధ్యంగా ఉండగలిగే మహాధీరత్వం ఆమె సొంతం.

జీవితమనే ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, సుడిగుండాలు, అడుగడుగునా సమ్మెటపోట్లు..జీవితమంటే..జీవితమంటే ఇలా కూడా వుంటుంది అనేంతలా ఓ వైపు,..ఆ ప్రయాణంలో అప్పుడప్పుడు చిన్న,చిన్న ఆనందాలు, మరిచిపోలేని అనుభూతులు, మధురమైన అనుభవాలు మరోవైపు ఆమె సొంతం.

ఈ జీవిత చదరంగంలో ఆమె పరిచయం కూడా అలాంటి మేలిమలుపులాంటిదే నాకు.

అంతులేని అనురాగం ఓ వైపు, గుండెను తట్టిలేపే గాఢత మరో వైపు, నేనెప్పుడూ నీతోనే వున్నాననే భరోసా మరోవైపు కనిపించేలా వుంటుంది.

జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడాలి. సమాజాన్ని ఎదిరించాలి. ఎదురుపడి ప్రశ్నించాలి...ప్రశ్నించలేకపోయినా పోరాడాలి. అదే జీవితం. జీవిత పోరాటంలో ఎదగాలి.కానీ దానికి సమస్య లెన్ని చుట్టుముట్టి మూకుమ్మడిగా దాడిచేసినా ,అంచుల్లేని అదఃపాతాళంలోకి కూరుకుపోయినా, బతుకు బండి ఇరుసుల్లో ఇరుక్కుపోయినా, మొక్కవోని ధైర్యంతో నిలబడాలి.జీవన పోరాటంలో ఆఖరి ఘడియ వరకు ఆస్వాదిస్తూనే వుండాలి. మనం సక్రమ మార్గంలోనే ప్రయాణించాలి. ఇది మానస వేదం క్లుప్తంగా అని చెప్పొచ్చు.

ఇలా తన మనసులోని భావాల్ని రాసుకుంటూ పోతున్నాడు అనిరుద్..

(ఇంకా ఉంది)


No comments:

Post a Comment

Pages