నెత్తుటి పువ్వు - 27
మహీధర శేషారత్నం
(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన సరోజ అనే అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తాడు రాజు. బట్టల కొట్లో పనిచెయ్యనని చెప్పేస్తుంది సరోజ. ఒకరోజు లక్ష్మి రాజును సరోజ గురించి నిలదీస్తుంది. ఆమెను ఏమార్చి, సరోజ ఇంటికి వెళ్తుంటాడు రాజు. తన గతాన్ని గురించి రాజుకు చెపుతూ ఉంటుంది సరోజ )
తింగరి దానిలా, మొండిదానిలా కనపడే సరోజలో మరో సరోజ కనపడింది నాగరాజుకి.
“మీ అమ్మకూడ డాన్సులు
చేసేదా?” అప్రయత్నంగా అడిగాడు నాగరాజు.
“ఆఁ! చాలామంది ఆడవాళ్ళ
కథే మా అమ్మది కూడా పేద కుటుంబంలో పుట్టింది. చదువు సంధ్యలు లేవు. కాని పుట్టుకతో
వచ్చిన అందం మాత్రం అపారంగా ఉంది. లోకం పోకడ తెలియదు. ఎవడో ప్రేమించానన్నాడు
వాడుకున్నాడు. చద్దామనుకుంది. నేను కడుపులో పడ్డానని తెలిసి చావలేక బ్రతికింది. మా
రికార్డింగు గ్రూపు లీడరు చేరదీసింది. ఇది ఒళ్ళును నమ్ముకుని బ్రతకడమేకాని అమ్ముకు
బతకడం కాదని నచ్చ చెప్పింది. కోట్లు సంపాదించే హీరోయిన్లు కూడా ఒళ్ళు చూపించుకు
బతుకుతారు. కాని మా అంత విచ్చలవిడిగా కాదనుకో. కానీ వాళ్ళకి కొద్దో గొప్పో గౌరవం
ఉంది. కాని నడిరోడ్డుమీద ఆడే మాకు అదీలేదు. తగినంత డబ్బులేదు అని బాధపడేది. నేను
వాళ్ళతో తిరగడం వల్ల నాకు కూడా డాన్సు చాలా తేలికగా వచ్చింది. అమ్మ నన్ను ఎలాగైనా
బళ్ళోవేసి చదివించాలని ప్రయత్నించింది. కాని దురదృష్టం అమ్మని కాన్సరు రూపంలో
కాటువేసింది. నా బ్రతుకు
ఇంక
ఇలాగే స్థిరపడి పోయింది. ఇంతకంటే గొప్ప కథేంలేదు. కాని మా అమ్మ తాను పోతానని
తెలిసాక పదేపదే చెప్పేది. మగవాణ్ణి నమ్మకు. అవసరం అయితే నమ్మినట్టు నటించు. వాళ్ళ
మనసు పాముల పుట్ట అంటూ కసిగా అంటూ ఉండేది. నాకు అప్పటికి పదేళ్ళు. ఆ వయసులో అమ్మ
బాధ అర్ధం అయేదికాదు. కాని ఒంటిమీదకు పరుగులు పెడుతూ వచ్చిన వయసు ఆ మాటలకు అర్థం తెలిపింది.
మా గ్రూపులీడరు అందరూ ఆవిడను అక్క అంటాం. చిన్నప్పటి నుంచి అక్కడే పెరగడం వల్ల
నామీద ప్రేమతో నన్ను తన రెక్కలకింద కాపాడేది. కాని నన్ను నువ్వు డేగలా
తన్నుకొచ్చావు... విషాదం, నువ్వు
మేళవించిన ముఖంతో చెప్పింది.
“అందుకు
నీకు బాధగా ఉందా? మళ్ళీ
అక్కడకు వెళ్ళిపోతావా!” సందేహంగా
అడిగాడు. “నేను పోలీసోణ్ణి కదా! నిన్ను అక్కడికి
చేర్చడం నాకంత కష్టంకాదు” అన్నాడు
మళ్ళీ తనే.
“ఊహూఁ !
మా అమ్మ ఎంత చెప్పినా నా మనసు నా మాటవినలేదు. దాని సంగతి అది చూసుకుంది.” చిన్నగా నవ్వింది.
నాగరాజు గిల్టీగా ఫీలయ్యాడు. అందరి
మగాళ్ళలాగే తానూ ఒక అమాయకురాల్ని వాడుకున్నాడు.
అయినా ఈ డాన్సులు చేసే బ్రతకాలా? నెట్ లో చూస్తే బాధ, అసహ్యం రెండూ కలిగాయి. బ్రతకడానికి ఇంత
అసహ్యమైన మార్గమే ఉందా? ఎలాగైనా
బ్రతకవచ్చుగా అన్నాడు మళ్ళీ.
“అది అంత
తేలికైతే వ్యభిచారం చేస్తూ బ్రతికేవాళ్ళు ప్రపంచంలో అంతమందిఎందుకున్నారంటావు? డాన్సులు చేసే వాళ్ళింతమంది
ఎందుకున్నారంటావు? ఎంతమంది
నాగరాజు లున్నారీ లోకంలో. సరోజ లెంతో మంది ఉన్నారు కాని” బాధగా
అంది సరోజ.
“నువ్వింత
ఆలోచించగలవా?” అయోమయంగా అడిగాడు నాగరాజు. “చీకట్లో బతుకుతున్న వాడికే చీకటంటే ఏమిటో
బాగా తెలుస్తుంది.” బాధగా
అంది సరోజ.
“నేనింతవరకు
సమాజంలోని చీకటి బాగా తెలిసిన వాళ్ళు పోలీసులు, లాయర్లే
అనుకున్నా అర్థం కానట్టు అన్నాడు.
“చీకటి
ఉందని తెలిసిన వాళ్ళు మీరు, చీకట్లోనే
బ్రతికిన వాళ్ళం మేము”..వంగి
నాగరాజు ముఖం మీద ముఖం ఆనిస్తూ అంది. పోతే ఇలాంటి బతుకు బతక్క చావరాదా అనుకుంటారు
చాలా మంది. అదంత తేలికకాదు. మొదట్లో బాధపడతారు. సర్దుకుపోతారు. అలవాటు పడిపోతారు.
నీకు ఇన్ని విషయాలు
తెలుసనుకోలేదు నేను, అమాయకురాలవను
కున్నాను.”
“మొదట్లో
భయపడ్డాను, బాధపడ్డాను, నీ మంచి
తనం అర్థమయ్యాక నాకింత కంటే మంచి చోటు ఇంకెక్కడా దొరకదని అర్థమయ్యేక నేనే....” కిసుక్కున నవ్వింది వాతావరణం మారింది.
“అమ్మో!
నేనే అమాయకుణ్ణి. అనవసరంగా బాధపడిపోయి నెత్తికెత్తుకున్నాను.” లెంపలేసుకున్నాడు నాగరాజు.
“నవ్వులాటకు
కూడా అలా అనమాకు. నువ్వు లేకపోతే నేను లేను. నాకంటూ ఒక జీవితం ఉన్నట్టుంది
ఇప్పుడు. నాకు బ్రతకడానికి మార్గం చూపెట్టు. నీకు బరువుకాను”
“సరే!
సరే! ప్రస్తుతం నీకు నేను మంచి పనిచూపెడతాను.”
నాగరాజు అమాంతం సరోజని కౌగిలిలోకి
తీసుకున్నాడు.
No comments:
Post a Comment