పురాణ కధలు – 5
7 సంగమేశ్వర పరీక్ష
- పి.యస్.యమ్. లక్ష్మి
భక్తులని పరీక్షించడానికి భగవంతుడు స్వయంగా వస్తాడని నిరూపించే కధ ఇది.
బసవేశ్వరుడిలా భక్తులేదడిగితే అది ఇస్తున్నాడని సంగమేశ్వరస్వామి ఆయనని పరీక్షించటానికి ఒక రోజు ఒక జంగమ దేవర రూపంలో ఆయన దగ్గరకు వచ్చాడు.
బసవేశ్వరునితో, “నువ్వు భక్త మందారుడవట. నీకు అసాధ్యమేదీ లేదుట. భక్తులేమడిగితే అది ఇస్తావుట. ఎవరు చూసినా నీ గురించే చెప్పుకుంటున్నారు. నీ గురించి విన్నప్పటినుంచీ నిన్ను చూడాలని చాలా కుతూహలంగా వుంది. నేను నిన్నొకటి అర్ధించాలని వచ్చాను. నువ్వు నేనడిగినది ఇస్తే చాలా సంతోషిస్తాను. నీ కీర్తి సమస్త లోకాలకు వ్యాపిస్తుంది” అని అన్నాడు.
బసవేశ్వరుడు ఆ వచ్చినది సాక్షాత్తూ సంగమేశ్వరస్వామేనని గమనించాడు. అందుకే ఆ జంగమ దేవరకి నమస్కరిస్తూ, స్వామీ, “ఇచ్చేవాడెవడు? పుచ్చుకునే వాడెవడు? సమస్తము మహేశ్వర రూపము! ఇచ్చేవాడు ఆయనే! పుచ్చుకునేవాడు ఆయనే!! మహేశ్వరుడు భక్త స్వరూపుడు. అలాంటి భక్తుని రూపంతో వచ్చిన నువ్వే మహేశ్వరుడివి. నిన్ను కనుగొన్నానయ్యా మహాదేవా, ఇదిగో ఒకసారి ఈ అద్దం తిలకించవయ్యా. నీ మూడవ కన్ను స్పష్టముగా అద్దంలో కనబడుతుంది.” అని ఆయన చేతికొక అద్దాన్నిచ్చాడు.
భక్త సులభుడయిన ఆ పరమేశ్వరుడు ఆ అద్దములో వీక్షించగానే తన మూడవ కన్ను కనబడింది. బసవేశ్వరుడు చాలా నేర్పుగా తనను కనుక్కున్నాడని, తాను పట్టుబడ్డానని, నవ్వుకుని లేచి వెళ్ళబోయాడు. బసవేశ్వరుడు ఆయన చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి, “దొంగ జంగమా, సంగమేశ్వరస్వామీ, నన్ను భ్రమలో పడేయబోయి నీవే పట్టుబడ్డావు. ఇప్పుడు జంగమ రూపంలో వచ్చిన నువ్వు ప్రత్యక్ష రుద్రుడవు. సర్వ లోకాలకు పరమేశ్వరుడవయిన నువ్వు నన్ను యాచించటానికి వచ్చావా!! ఈ దొంగ చేష్టలన్నీ ఎక్కడ నేర్చుకున్నావయ్యా!? నీ చేష్టలు గమనించానుగనుకే నీ చేతికి అద్దానిచ్చి నీ కన్ను నీకే చూపించి నిన్ను మాయచేశాను. ఈ విషయంలో నువ్వు ఓడావు, నేను గెలిచాను. నువ్వు నిజమైన భక్తుడవైతే నువ్విలా అడిగేవాడివి కాదు. నువ్వు భగవంతుడివిగనుకనే భక్తులనడగటానికి, వారికివ్వటానికి నువ్వే సమర్ధుడవు.” అని సంగమేశ్వరుణ్ణి నిలదీశాడు. భగవంతుడికి, భక్తుడికి మధ్యనున్న అవ్యాజమైన ప్రేమ అది. ఆ తన్మయత్వంలోనే పరమేశ్వరుడు ఏయే భక్తులకే వరములిచ్చాడో వర్ణిస్తూ స్వామిని సృష్ట్యాదినుంచీ ఆయనే పరమేశ్వరుడనీ తానే పరమ భక్తుడననీ, తన్మయంతో స్వామిని పరి పరి విధముల ప్రార్ధిస్తూ, నేను నిన్నేమీ కోరను స్వామీ, నీపట్ల నాకిప్పటివలెనే నిశ్చల భక్తి ఎప్పుడూ వుండేటట్లు చూడు చాలని వేడుకుంటూవుండగా ఇదే సమయమని జంగమ రూపంలో వున్న సంగమేశ్వరస్వామి అంతర్ధానమయ్యాడు.
లేకపోతే భక్తుని భక్తికి కట్టుబడి అక్కడే వుండిపోతాడుకదా!!
No comments:
Post a Comment