శ్రీ పార్వతీశ్వర శతకము - బ్ర||శ్రీ|| శ్రీరాంభట్ల చంద్రశేఖరశాస్త్రి
పరిచయం:దేవరకొండ సుబ్రహ్మణ్యం
కవి పరిచయం:
పార్వతీశ్వర శతకకర్త బ్రహ్మశ్రీ శ్రీరాంభట్ల చంద్రశేఖరశాస్త్రి గారు. వీరు ఆదిలాబాదు జిల్లా లోని చెన్నూరు ప్రాంతంలో నివసించినవారు. వీరు ఆప్రాంతంలో కొన్ని వందల భాగవత సప్తాహాలను జరిపిన పుణ్యాత్ములుగా వాఆఆసికెక్కినారు. వీరి సిద్ధాంత జ్యోతిశ్శాస్త్ర కోవిదులు. స్రౌతస్మార్త విద్యలందు సమగ్ర పరిజ్ఞానము కలవారు. మహామంత్రోపాసకులు. నిత్యాగ్నిహోత్రులు. వీరికి ఈప్రాంతములో అనేక శిష్యులు ఉండేవారు.
విరు రచించిన ఇతర గ్రంథముల గురించి వివరాలు గానీ ఈపండితుని గురించిన మరే వివరాలు గానీ తెలియటం లేదు.
శతక పరిచయం:
"చెన్నుపురవాసచంద్ర కవిపోష శేషభూష పాపపరిహార సర్వేశ పార్వతీశ" అనే మకుటంతో వ్రాయబడిన ఈ సీసపద్య శతకంలో 110 పద్యాలున్నాయి. ఈశతకము భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలతో నిండి చక్కనిశైలిలో సాగిపోతుంది.
ఇప్పుదు ఈ శతకంలోని కొన్ని పద్యాలను చూద్దాం.
సీ. సత్యస్వరూపతన్ సకలలోకంబులఁ బాలించుచుండెడి పార్తీశ
పంచభూతాకార పంచాస్యములుగల్గి ప్రకృతిఁగల్పించిన ఫాలనేత్ర
ఆర్తజనమ్ముల కాధారమీవని ప్రార్థింపబూనితి భవ్యగాత్ర
ఆపదుద్ధారణ యీయాపదఁబడలేక నీప్రాపుజొచ్చితి నీలకంఠ
తే.గీ. నిన్ను భజియించువారికి నిఖిలనిత్య
భద్రములుగల్గి భయములుబాయుచుండు
చెన్నుపుర చంద్రకవిపోష శేషభూష
పాపపరిహారసర్వేశ పార్వతీశ
సీ. అఖిలభూతములకు నన్నివేళలయందు సుఖమునుగల్గించు సుఖదరూప
యోగులహృదయాన యోగరూపుఁడవయి యోగంబునిచ్చు సద్యోగరూప
జ్ఞానయోగులకెల్ల జ్ఞానరూపుఁడవయి జ్ఞానంబునిచ్చు విజ్ఞానరూప
కర్మయోగులు నిత్యకర్మలుజేయఁగా కుశలాత్ములనొనర్చు విశదరూప
తే.గీ. అఖిలరూపముల్ మీరూపమైనదేవ వికటములబాపి రక్షించి ప్రకటభావ
చెన్నుపుర చంద్రకవిపోష శేషభూష పాపపరిహారసర్వేశ పార్వతీశ
సీ. సర్మంగళరూప శౌరి మీ నామ
సంస్మరణఁ జేయుటే ముక్తిసాధనమ్ము
కామితార్థములిచ్చి యోపు మీ నామ
సంస్మరణఁ జేయుటే ముక్తిసాధనమ్ము
భవరోగములనెల్లఁ బాపు మీ నామ
సంస్మరణఁ జేయుటే ముక్తిసాధనమ్ము
జనులకు జయ మీయజాలు మీ నామ
సంస్మరణఁ జేయుటే ముక్తిసాధనమ్ము
తే.గీ. కలియుగంబున మీనామ కథల కంటే వేరు సాధనలిక లేవు వెదికి చూడ
చెన్నుపుర చంద్రకవిపోష శేషభూష పాపపరిహారసర్వేశ పార్వతీశ
ఇప్పుడు ఈశతకంలోని కొన్ని నీతిపద్యాలను చూద్దాం
సీ. వేముకుఁ జెక్కెర వేయేండ్లు బోసినన్ కోరిన మధురిమల్ గుదురుకొనవు
నీచున కెన్నాళ్లు నీతులం గఱపినన్ మాయా వివర్తనల్ మఱువబోడు
అల్పబుద్ధి గుణాఢ్యు నధికునింగనుగొని వంచింపఁగా బ్రయత్నించుచుండు
పసరాను కీటమ్ము రసపూర్ణ మకరంద మాధుర్యమునకుఁ దామఱుఁగునెట్లు
తే.గీ. పరమలోభులు మీ పాదపద్మ సేవ నెన్నిబోధ లొనర్చిన నెఱుఁగునెట్లు
చెన్నుపుర చంద్రకవిపోష శేషభూష పాపపరిహారసర్వేశ పార్వతీశ
సీ. పామున కెన్నాళ్లు పాలుబోసినఁగాని విషవర్ధనమ్ముఁ గావించుచుండు
ఖలునకు నుపకార కార్యమ్ము నొనరింప మోసమ్మొనర్చుచు ముంచివేయు
దుష్టజనాలికి దూరమ్ముఁగానుంత శిష్ట జనాలికి క్షేమకరము
దుష్టులు దుష్టులుందుడుకులై యొండ్రుల్ కొట్లాడుకొన హానియెట్లు గల్గు
తే.గీ. పాము పాము పోరిన విషబాధగనునె
దుష్టులకు దుష్టులీరీతి దొరసియుంద్రు
చెన్నుపుర చంద్రకవిపోష శేషభూష
పాపపరిహారసర్వేశ పార్వతీశ
సీ. మాయాత్మకులతోడ మాటలాడుట తప్పు నీచబుద్ధులవద్ద నిలువ తప్పు
గుర్తెరుంగని చోటఁ గొప్పఁజెప్పుట తప్పు గుణవిహీనులతోడఁగూడ తప్పు
పాపభీతియెలేని ప్రజను జేరుట తప్పు చెడుగుల నెయ్యంబు జేయ తప్పు
నయవర్తన విహీనునమ్మియుండుట తప్పు ద్వేషియింటంగూడు దినుట తప్పు
తే.గీ. తప్పొనర్చినఁ దప్పని చెప్పఁదగు
పదుగురాడుమాట కెదురు బలుక తప్పు
చెన్నుపుర చంద్రకవిపోష శేషభూష
పాపపరిహారసర్వేశ పార్వతీశ
భక్తి, జ్ఞాన, కర్మ యోగముల పైన రచించిన అనేక పద్యములు మనకు ఈశతకంలో దొరకుతాయి. అదేవిధంగా శీలలీలలకు సంబంధించిన అనేక పద్యాలు కూడా మనం ఈశతకంలో చూడవచ్చు.
నిందాస్తుతి పద్యాలు కూడా ఈశతకంలో అనేకం ఉన్నాయి.
సీ. కరుణైంచుకలేని కఠినాత్ముఁడనక యా పార్వతి నిన్నుచేఁ బట్టెనెట్లు
కష్టకాలంబున కరుణఁజూడని నిన్ను నందికేశ్వరుఁడెట్లు నమ్మియుండె
ఆపద వేళల నాదరించని నీదు శిరమున గంగతాఁ జేరెనెట్లు
దాసజనంబుల మోసగించెడి నిన్ను ప్రాజ్ఞులు స్తుతియించి పాడిరెట్లు
తే.గీ. ఎక్కువైనట్టి ఈశత్వ మింతగల్గి సిరులనొసఁగుదమన నెంత సేపు మీకు
చెన్నుపుర చంద్రకవిపోష శేషభూష పాపపరిహారసర్వేశ పార్వతీశ
సీ. విషము త్రాగితినని విఱ్ఱవీగుటెకాని భక్తులఁ బ్రోవగాఁ బలములేదు
ఫాలనేత్రుడవని చాల నిక్కుటెకాని దీనుల కష్టముల్ దీర్పలేవు
కైలాసపతినంచు గర్వమందుటెకాని ఆర్తుల దుఃఖములణచలేవు
జగతినేలితినని చాటుకొంటయెకాని సాధురక్షణమును సల్పలేవు
తే.గీ. బాకునెదిరించిరమ్ము నీనాణెమెంతో
బదులుజెప్పెద నాకేమి భయములేదు
చెన్నుపుర చంద్రకవిపోష శేషభూష
పాపపరిహారసర్వేశ పార్వతీశ
ఇటువంటి చక్కని భాషలో వ్రాయబడిన ఈశతకం అందరు తప్పక చదవవలసినది.
మీరూ చదవండి, మీ మిత్రులతో.
***
No comments:
Post a Comment