ఎంతెంత దూరం
సింగారావుకి గత కొద్ది కాలంగా..
తెలియని నీరసం ఏదో ఆవహించడం, తల తిరిగినట్లు ఉండడంతో .. వెంటనే డాక్టరు దగ్గరకు పరిగెత్తాడు.
అన్నీ విన్న డాక్టరు చకచకా కొన్ని మందులు వ్రాసి ..
అలాగే, కొన్ని ల్యాబ్ టెస్టులు కూడా వ్రాసాడు.
అవన్నీ బలం మందులే అని తెలియని సింగారావు అంత పెద్ద చీటీని చూసుకుంటూ గాబరా పడుతూ “ ఏమైయ్యింది డాక్టర్ నాకు ” అడిగాడు భయంగా.
కొంపదీసి తన భయమే నిజమవుతుందా! అన్న సంశయం “ ముందు టెస్టులు చేయించండి. అంత భయపడాల్సిన పనేం లేదు. ఈరోజుల్లో ఇలాంటివి మాములే ” అంటూ చిన్నగా నవ్వేసాడు.
ల్యాబ్ రిపోర్టుచేతిలో పెడుతూ అన్నాడు ల్యాబ్ అసిస్టెంటు “ స్వీట్లు అంతగా తినకండి సార్! రోజూ వాకింగ్ చెయ్యండి” అని.
ఆ మాటకే ఖంగుతిన్నాడు సింగారావు.
ఆఫీసులోపని చేసే రోజుల్లో .. ప్రక్కసీటులో ఉండే సీనియర్ అసిస్టెంటు ‘భద్రాచలం’ లాగ రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్లకి అలవాటు పడాలేమో అన్నట్లు. అతను ఆఫీసులో కూడా ఇంజక్షన్ చేసుకుంటూ ఉండేవాడు. తనకి సిరంజిని చూస్తేనే భయం.
“ ఫర్వాలేదు లెండి, మందులు వాడితే కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు నూటికి తొంభై మంది అలానే ఉన్నారు ” చెప్పాడు.
తరువాత డాక్టర్ని కలిసిన సింగారావు భార్యతో చెప్పాడు “ ఇక నుంచీ కాఫీలో నాకు ఒక్క చెంచానే పంచదార వెయ్యి” అని.
అప్పటినుంచీ .. ఇద్దరికీ తగ్గించింది శమంతకమణి. ఇలా ఆయితే, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆదాకి ఆదా. కిలో.. పంచదార నెలరోజులు వస్తుంది అనుకుంటూ.
పనిమనిషి నూకాలమ్మకీ అలాగే ఇస్తే, “ కాఫీలో పంచదార వేసినట్లులేదు. ఓ చంచా వెయ్యండి” అంటూ గ్లాసు ముందు పెట్టేది.
ఇక ఇంట్లోని స్వీట్ల డబ్బా వైపు చూడడం మానేసాడు సింగారావు.
ఇప్పుడు శమంతకమణి మాత్రమే ఆ డబ్బాని తెరుస్తుంది. ఇంతకు ముందులా గబగబా తినకపోతే తనకు మిగలవేమోనన్న బెంగలేదు. వాటిని తనైనా టైముకు తినకపోతే పాడైపోతాయన్నదిగులు తప్ప.
అవే కాదు మామిడి పండ్లూ, పెరట్లో కాసే గింజల చిక్కుడుకాయల్ని సైతం అతడు మానేసాడు. చుట్టుప్రక్కల వారికి పంచేస్తున్నాడు. ‘పరోపకారం మిదం శరీరం’ అన్నట్లు.
***
ఇద్దరూ విశ్రాంత ఉద్యోగులే. వయసు పైబడడంతో ఏవో ఈతిబాధలు.
డాక్టరు దగ్గరకు వెళితే “ షుగరు ఉందా? బీ.పీ ఉందా?” అని అడుగుతున్నారు.
“ సంవత్సరం క్రిందట పరీక్ష చేసి రెండూ .. బోర్డర్స్ ఉన్నట్లు చెప్పారు ఇంటి దగ్గరున్న డాక్టర్. అందుకు వాటికి సంబంధించిన మందులే౦ వాడటం లేదు. నడుంనొప్పికి తప్ప” చెప్పింది శమంతకమణి.
అప్పటికే ఆ రూములోనే ఉన్న నర్సు బీ.పీ ఆపరేటస్ తీసి .. బీ.పీ చూడడం మొదలుపెట్టింది.
పరీక్షగా చూసిన డాక్టరు “ బీ.పీ చాలానే ఉంది. ప్రతిరోజూ ఈ మాత్ర వాడండి. అలాగే, ఉప్పు కాస్త తగ్గించండి” అంటూ అసలు మందులతో పాటు .. అదనంగా బీ.పీ మాత్రలు కూడా వ్రాసాడు.
తనకు బీ.పీ ఏమిటీ? ఏమైనా టెన్షను పడుతుంది గానా? ఏ కష్టం లేకుండా నెల తిరిగేసరికి పెన్షను వచ్చిపడుతుంది. పిల్లలా .. పెళ్ళిళ్ళు చేసుకుని ఎక్కడి వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. చెయ్యాల్సిన పనులేం మిగలలేదు. అన్నీ రిటైరుమెంటు లోపే పూర్తి చేసుకున్నారు. అలాంటి తనకు బీ.పీ ఏమిటీ? అనుకున్నా ..
డాక్టరు సలహా పాటి౦చి తీరాలి .. మీద పడే వయసుని గుర్తు చేసుకుంటూ.
ఎంత తిండి తగ్గించినా వొళ్ళు తగ్గడం లేదు.
క్రమం తప్పకుండా కాలనీ చివర ఉన్న గాంధీపార్కులో వాకింగ్ ట్రాక్ మీద రెండు రౌండ్లు వేసినా .. ఓపెన్ ఎయిర్, జిమ్ చేసినా ఫలితం ఒకటే.
అందుకే కూరల్లో ఉప్పుతోపాటు, కాస్త నూనెలూ తగ్గించి వండడం మొదలు పెట్టింది. కమ్మగా పదార్ధానికే విలువ ఇచ్చి వండుతున్నానని అనుకుంది.
అయితే, అదే ఆమె చేసిన నేరం అయిపోయింది.
అలా నాలుగురోజులు గడిచేసరికి ..
సింగారావుకి, నాలుక చప్పబడిపోవడంతో ఇంట్లో గొడవ మొదలైంది.
“ నేనిలాంటి వట్టి గడ్డి తినలేను, నువ్వు వంటల దగ్గరకు రాకు. కూరలు అస్సలు వండకు. వాటిల్లో ఉప్పు ఉండడంలేదు. కారం ఉండడం లేదు. రోగం నీకు గానీ, నాకు కాదు” అంటూ .. పళ్ళు నూరాడు.
అనడమే కాదు .. భార్యని కాఫీల తరువాత .. వంట గదిలోకి రానివ్వలేదు.
***
ఇంకా చెప్పాలంటే ..
పెళ్ళినాటికి సింగారావుకి ‘టీ’ పెట్టుకోవడం కాదుగదా! కనీసం ‘స్టవ్’ వెలిగించడం కూడా రాదు.
అలాంటిది. కాలక్రమంలో పిల్లలు పుట్టుకు రావడంతో .. వాళ్ళు కాలేజీలకు వెళ్ళే క్రమంలో కేరేజీలు కట్టడం కోసమని వంటకు సహాయంగా వచ్చాడు.
సింగారావు వంట చేతిలోకి తీసుకోవడం, మొదట్లో శ్రమ తగ్గి౦దని సంతోషించినా ..
‘కూరలు ఎందుకో పుల్లగా ఉంటున్నాయి’ అనుకోసాగింది.
అది చింతపండు వల్లో, మామిడికాయ వల్లో వచ్చింది కాదనీ, ఆ పుల్లదనం ‘ఉప్పు’ వలన వచ్చిందని నాలుగురోజులు పోయిన తరువాత గానీ తెలిసివచ్చింది గాదు.
“ ఏమిటీ? ఈ ఉప్పులేమిటీ? ఈ నూనెలేమిటీ”?
కూరగిన్నెలో ఎక్కువైన నూనెను .. రంద్రాల గరిటతో క్రిందికి జారిపోయేలా చేసి పైపై నుంచి వంకాయవేపుడు దేవుకు౦టూ ‘అరిచింది’ శమంతకమణి కోపంగా.
ముందు గదిలో టీ.వీ చూసే సింగారావుకి ఆ అరపు వినిపించినా ..
వండి పడేసిన తరువాత తినక చస్తుందా! అన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాడు.
ఆ ఎక్కువగా ఉన్న నూనే గిన్నెను షింకులో పడేసింది.
దీన్ని ఆసరాగా చేసుకుని ఎక్కువ సబ్బు ఉపయెగించేది నూకాలమ్మ.
“ సబ్బులు ఎక్కువ వాడేస్తున్నావ్ నూకాలూ .. ఒక్క సబ్బుతో నెలంతా తోమోచ్చని టీ. వీ లో చూపిస్తుంటారు. నువ్వేమో నాలుగైనా వాడేస్తున్నావ్. అక్కడక్కడా సబ్బు కూడా పాత్రలకి అంటుకుని ఉండిపోతుంది. మళ్ళీ నేను కడుక్కోవలసి వస్తుంది. అలా ఎక్కువ సబ్బు వాడకం మాకూ మంచిది కాదు” అంటూ దుబారను ఎత్తి చూపిస్తూ .. అతి సబ్బు వాడకంలోని అనర్ధాలను వివరించి చెబుతుంది శమంతకమణి.
కోపం తెచ్చుకున్న దాకా ఉంటే, అలిగి పని మానెయ్యవచ్చని.
“ మీ ఇంట్లో నూనె వాడకం ఎక్కువ౦డీ. జిడ్డు పోకపోతే మీరు ఊరుకు౦టారా నన్ను?” అంటూ మరింత నురగలు తెప్పించేది.
ఇక సింగారావు విషయానికి వస్తే ..
కూరలో బంగాళాదుంపలు ముక్కలు ఉడకలేదనో, గోరుచిక్కుడు కాయల నువ్వుల కూర వేపు .. ఎక్కువై మాడిపోయిందని అంటేనో ..
“ తింటే, తిను లేకపోతే లేదు .. కావలిస్తే ఏ మజ్జిగో, పెరుగో వేసుకుని తిను. నన్ను చంపకు’ అంటూ విసుక్కునేవాడు.
తోటకూర వేపుడూ, ఆనపకాయ పాల కూరలు కూడా ఉప్పు కసాలే. ఆకుకూరల్లో సహజసిద్ధంగా కొంత ఉప్పు ఉంటుంది. అయినా అదే పోకడ. వేపుళ్ళు తినాలి అంటే .. నీళ్ళతో కడుక్కుని, ఉప్పు కరిగిపోయిన తరువాత .. చప్పిడి ముద్ద తినాల్సి వచ్చేది. లేకపోతే సింగారావు చెప్పినట్లు మజ్జిగాలూ, పెరుగులే గతి.
అప్పుడప్పుడూ ..
“ ఈ పనసపొట్టు కూర నేనే చేస్తాను. మీకు ‘ఆవ’ పెట్టడం రాదు అనో! మునగాకు తెలగపిండిలో తెలగపిండి పాలు మీకు తెలీదనో ” అడ్డం వెళ్ళేది.
“ ఏం చేసినా ఉప్పు వెయ్యి. ఉప్పు తక్కువ అయితే తినేది లేదు” అంటూ బెదిరించేవాడు.
అలా మసిపూసి మారేడుకాయ చేసి రోజు గడుపుకోవల్సి వచ్చేది.
***
అరా కొరా తిండితో .. నెలరోజులు తిరిగేసరికి శమంతకమణికి ఓపిక తగ్గిపోయింది.
ప్రకృతే, అమ్మలా మనకు అన్నీ సమకూర్చి పెట్టే దేవత అని తెలిసినా .. అందాల్సిన కూరగాయలూ, ఆకుకూరల బలం సమపాళ్ళలో అందక నీరసం ముంచుకొచ్చి తోటకూర కాడలా వ్రేల్లాడి లిపోయింది.
ఇక ఈ శేషజీవితం ఇంతేనా? అన్న విరక్తి కూడా కలిగింది.
ఆ విరక్తిలో .. ఆ నీరసంలో,
మెరుపులా .. ఓ ఆలోచన కూడా వచ్చింది.
వచ్చినదే తడవు కొత్త శక్తీ వచ్చినట్లయ్యి .. నవ్వు ముఖంతో భర్తకు ఎదురెళ్ళి౦ది.
“ చూడండి. ఇప్పుడే చెబుతున్నాను. మళ్ళీ చెప్పలేదు అంటే కుదరదు”
“ మీకు షుగర్ ఉంటే, నాకు బీ.పీ ఉంది. మీరు చెక్కెర తినకూడదు అనుకుంటే, నేను ఉప్పు తినకూడదు. ఇద్దరికీ డాక్టర్లు చెప్పిందే. మీరు చెప్పినప్పటి నుంచీ .. మీకోసం నేను కాఫీలో చెక్కెర తక్కువగా వేసి ఇస్తున్నాను. మీరు మాత్రం నా వంటకు అడ్డం వచ్చి .. మీ ఇష్టం వచ్చినట్లు కూరల్లో ఉప్పులూ, కారాలూ, వేసేస్తున్నారు.
ప్రాణం మీ ఒక్కరికే విలువైనది కాదు. నాక్కూడా విలువైనదే.
మీరు వండిన కూరలో.. అంటే ఈరోజు కూరలో ‘ఉప్పు’ ఎక్కువ అయితే, రేపు .. ‘మీ’ కాఫీలో పంచదార ఎక్కువ అవుతుంది. ఏ పని అయినా చెప్పి చెయ్యాలని అంటారు కదా! అందుకే చెబుతున్నాను. ఆ తరువాత బాధ పడితే ప్రయోజనం ఉండదు” అని.
పొరు నష్టం .. పొందు లాభం. టిట్ ఫర్ టాట్ లాగ.
ఆ మాటలకి ఖంగుతిన్న సింగారావు ముఖం కంద గడ్డలా చేసుకున్నాడు.
ఏమంటాడు? ఇప్పుడు? మా ఇంటికి .. మీ ఇల్లు ఎంత దూరమో, మీ ఇంటికీ .. మా ఇల్లు అంతే దూరం కదా!
***
No comments:
Post a Comment