అప్పు
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
రంగమ్మ కూతురు హాసిని పురిటికి వచ్చింది.
కూతురికి మొదటి కానుపు కాబట్టి అందరి దగ్గరా అప్పుచేసి కూతురి కోర్కెలు తీర్చింది.
స్వతహాగా రంగమ్మ దుబారా మనిషి రేపన్నరోజు గురించి ఆలోచించదు. ఇవాళటి రోజు ఎంత సుఖంగా, సంతోషంగా గడిపామన్నదే ఆమెకి ముఖ్యం. తర్వాత తీర్చగలదో లేదోనని, ఆమెకి అప్పు ఇవ్వడానికి అందరూ జంకేవారు. రంగమ్మ ఇంటికి ఆనుకునే సోమిదేవమ్మ ఇల్లు ఉంటుంది. సోమిదేవమ్మ పొదుపరి. అవసరం అనుకున్నది కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొంటుంది. రంగమ్మ చాలా సార్లు అప్పుకోసం సోమిదేవమ్మ గుమ్మం తొక్కింది. సోమిదేవమ్మ అప్పివ్వదు సరికదా 'ఆడంబరాలకు పోకుండా, ఉన్నదాంతో సంతృప్తిగా బతుకుతూ రేపటి అవసరాల కోసం డబ్బు దాచుకోవాలి. అసలు అప్పు చేయకూడదు, ఒకవేళ చేసినా వాళ్ళు కష్టపడి దాచుకున్న సొమ్ము, తమ అవసరాలు కట్టడి చేసుకొని ఆదా చేసిన సొమ్ము మనకు అప్పుగా ఇచ్చారు కాబట్టి అన్నమాట ప్రకారం అప్పు తీర్చేయాలి' అని హితోక్తులు చెప్పేది.
సోమిదేవమ్మ మాటలు రంగమ్మ చెవికి ఇంపుగా తోచేవి కావు.
ఇదిలా ఉండగా హాసినికి నెలలు నిండి కానుపు దగ్గర పడింది.
ఒకరోజు హాసిని నొప్పులతో గిలగిలలాడుతుంటే, మంత్రసాని వచ్చి కానుపు కష్టమయ్యేట్టు ఉంది. పెద్ద ఆసుపత్రికి తీసుకుపోవడం మంచిదని సలహా ఇవ్వడంతో రంగమ్మ అప్పు కోసం చాలామందిని అర్థించింది. ఎవరూ ఇవ్వలేదు. 'కూతురిని సకాలంలో ఆసుపత్రిలో చేర్చకపోతే ప్రమాదమేమో' అన్న ఆలోచన ఆమె మనసును కుదురుగా ఉంచట్లేదు. ఇహ అప్పు అడగడానికి మిగిలింది సోమిదేవమ్మే. ఆమె ఇవ్వదని తెలుసు, అయినా కూతురి పరిస్థితి గుర్తొచ్చి ఆదరబాదరగా వెళ్ళి వాళ్ళింటి తలుపు తట్టింది. సోమిదేవమ్మ ఆమె పరిస్థితి విని వెంటనే లోపలికి వెళ్ళి, డబ్బు తెచ్చి రంగమ్మ చేతిలో పెట్టి, సహాయం చేయడానికి తనూ ఇంటికి తాళం వేసి బయల్దేరింది.
అది ఊహించని రంగమ్మ కళ్ళనీళ్ళ పర్యంతమైంది.
'చూశావా రంగమ్మా, అప్పుడు నేను చెప్పిన మాటలు పెడచెవిన పెట్టావు. నేను కూడా అప్పు ఇవ్వక పోతే నీ కూతురి పరిస్థితి ఏమయ్యేది? హాసిని చిన్నప్పట్నుంచి మా ఇంట్లో పెరిగిన పిల్ల. నా కూతురులాంటిది. అందుకే అప్పు ఇచ్చాను, అన్నమాట ప్రకారం అప్పు తీర్చి నీలో మార్పు వచ్చిందని నిరూపించుకోవాలి." అంది సోమిదేవమ్మ.
హాసినికి పిల్లాడు పుట్టంగానే రంగమ్మ, సోమిదేవి అప్పు తీర్చేయడమే గాక తను అప్పులు చేయకుండా, కనిపించినవాళ్ళకి అప్పులు చేయడం దురలవాటని తన జీవితాన్ని ఉదాహరిస్తూ చెప్పసాగింది రంగమ్మ.
***
No comments:
Post a Comment