జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 38 - అచ్చంగా తెలుగు

                                                     జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 38    

                                                                       చెన్నూరి సుదర్శన్


(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్  తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతాడు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.) 

“సార్.. మేము ముగ్గురన్నదమ్ములం.. ఇద్దరక్కచెల్లెండ్లు. 

మాపెద్దన్న పేరు జనార్ధన్. పదో తరగతిలో ఉండగానే నక్సలిజానికి ఆకర్షితుడై ఇల్లు వదలి వెళ్ళిపోయాడు. నర్సాపూర్ అడవుల్లో అన్నయ్యను ఎన్‍కౌంటర్ చేసారు పోలీసులు.

పోలీసుల మీద ప్రతీకారం తీర్చుకోవాలని మా రెండో అన్నయ్య, సుధాకరన్నయ్య కలలుగానే వాళ్ళు.  ఆసమయంలో మీరు పరిచయమయ్యారు. సుధాకరన్నయ్య  జీవితం గాడిన పడగానే మా రెండో అన్నయ్య మనసు మార్చాడు. వ్యవసాయం పనుల్లో  మా నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ నన్ను, చెల్లెల్ని  చదివిస్తున్నాడు. మా చెల్లెలు ఇదే కాలేజీలో చదువుతోంది. పొద్దున్న వార్త చదువనని ఏడ్చిందే సుశీల .. ఆమె నాచెల్లెలే..” అంటూ బావురుమన్నాడు. 

“సుధాకర్  పాటలో జనార్ధనా..! అని వల్లెవేస్తుంటాడు.. జనార్ధన్ అంటే మీ అన్నయ్యేనా?” అడిగాడు సూర్యప్రకాష్.  

అవునన్నట్లుగా తలూపాడు నరహరి. 

“సుధాకరన్నయ్యే స్వయంగా ఆ పాట రాసాడు”

‘దండాలు.. దండాలు.. జనార్ధనా.. నీకు శతకోటి దండాలు జనార్ధనా..’ పాట గుర్తుకు వచ్చి అప్రయత్నంగా సూర్యప్రకాష్ కళ్ళు చెమ్మగిల్లాయి. 

నిముషంపాటు మౌనం తాండవించింది గదిలో...

మొదటి పీరియడ్ పూర్తయ్యిందన్నట్లుగా కాలేజీ బెల్లు మోగడంతో.. సూర్యప్రకాష్ తేరుకున్నాడు “నరహరీ టీ తీసుకో చల్లారిపోతోంది” అంటూ ఆగమయ్య వంక  చూసాడు. ఆగమయ్య టీ కప్పు నరహరి చేతికందించాడు. 

నరహరి టీ తాగుతూ “సార్.. ఇకముందు వార్తల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. మీ మీద ఈగ వాలకుండా చూసుకునే బాధ్యత నాది..మా ఊరి వారందరిది.. ఈ వార్త వల్ల మీకు మాటరాకుండా చూసుకుంటాను.. ఈసారికి  నన్ను క్షమించండి” అంటూ ఖాళీ కప్పును ఆగమయ్యకిచ్చి లేచి నిల్చున్నాడు. 

వెళ్ళొస్తానన్నట్లుగా రెండు చేతులూ జోడించాడు.

సూర్యప్రకాష్ మర్యాదపూర్వకంగా నిలబడి కరచాలనం చేసాడు.

నరహరి సెలవు తీసుకొని అలా వెళ్ళిపోయాడో.. లేదో..! కాలేజీ ఫోన్ మోగింది.

ఆగమయ్య పరుగెత్తుకుంటూ వచ్చి ఫోనెత్తి మాట్లాడాడు.

“ప్రిన్సిపాల్ సార్. మీకే ఫోన్.. ఆర్. ఐ. ఓ. గారు” అంటూ ఫోన్ సూర్యప్రకాష్ చేతికందించి లెక్చరర్ పిలుపు వినరావడంతో బయటికి వెళ్ళాడు.     

సూర్యప్రకాష్ ఊహించిందే.. తప్పకుండా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (రీజినల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్) నుండి ఫోన్ వస్తుందని..

“గుడ్ మార్నింగ్ సార్..” అంటూ విష్ చేసాడు. 

“ఈ రోజు పేపర్లో వచ్చిన వార్త గురించి నేనేదో వివరణ అడుగుతానని ఫోన్ చెయ్యడం లేదు.. మీ డిసిప్లిన్ గురించి జిల్లాలో తెలియందెవరికి?.. ఏవేవో గాలి వార్తలు వస్తూనే ఉంటాయి.. కాని కాస్తా జాగ్రత్తగా ఉండండి.. ఇలాంటివి పేపర్లో రాకుండా చూసుకుంటే మనకే మంచిది”

“సార్.. ఇప్పుడే పేపర్ విలేకరితో మాట్లాడాను. అతడు పొరబాటయ్యిందని సారీ చెబ్తూ అలా వెళ్ళాడు.. మీరు ఫోన్ చేసారు.. ఇక ముందు ఇలా జరుగకుండా జాగ్రత్త పడ్తాను సార్..”

“ఓ.కే..” అంటూ ఫోన్ పెట్టేసాడు ఆఫీసర్.

ఇంతలో ఆగమయ్య వచ్చి “సార్.. నరహరి వెళ్ళిపోయాడా..? ప్రిన్సిపాల్ సార్ ఏమైనా గొడవ చేసాడా..? 

అంటూ జోగయ్య సార్ అడిగాడు” అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాడు.

“మరి నువ్వేమన్నావ్?”

“నాకెందుకు సార్.. ఇలాంటి  చిక్కులు.. నాకేం తెలియదన్నాను”

“గుడ్.. ప్రిన్సిపాల్ గదిలో జరిగే ఏ విషయాలూ బయటికి పొక్క గూడదు” అన్నాడు పెదవులపై చిరునవ్వు దొర్లిస్తూ..

ఆమరునాడు ఆదివారం..

అలవాటు ప్రకారంకంటే కాస్తా ఆలస్యంగా లేచాడు సూర్యప్రకాష్.. జరిగిన సంఘటనతో రాత్రి సరిగ్గా నిద్రపట్టకపోవడం  మూలాన.  

ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఆలోచనలు తనను తినేస్తాయని ఏదో ఒక  వ్యాపకం పెట్టుకోవాలననుకున్నాడు. 

కాలకృత్యాలు ముగించుకొని టీ తాగుతూ పేపర్ తిరగేస్తుంటే.. బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో ‘స్వల్ప అగ్నిప్రమాదం’ అనే వార్త చదివే సరికి తనకు ‘శ్రీ సాయి సుమేధ ఇండస్ట్రీస్’  గుర్తుకు వచ్చింది.. అంతా సుమేధ ఇండస్ట్రీస్ అంటుంటారు. దాని జనరల్ మేనేజర్ మహీంద్ర తనకు బాగా తెలుసు. ఇంతకు ముందు రఘునాథపురం జూనియర్ కాలేజీలో పనిచేసినప్పుడు అక్కడి ‘భార్గవ పారిశ్రామిక సంస్థ’ కు  అసిస్టెంట్ మేనేజరు.. తన కాలేజీ వీడ్కోలు సమావేశానికి హాజరయ్యాడు కూడా.. 

దాని అనుబంధ సంస్థ అయిన సుమేధ ఇండస్ట్రీస్‍కు మహీంద్ర ఇప్పుడు జనరల్ మేనేజర్. ఓమారు ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు సూర్యప్రకాష్ ప్రిన్సిపాలయ్యాడని తెలుసుకొని చాలా సంతోషించాడు. కాలేజీకి ఏమైనా అవసరమైతే నిర్మోహమాటంగా అడుగమని తనే అభయమిచ్చాడు. 

ఆదివారమైనా షిఫ్ట్ సిస్టంతో నడిచే పరిశ్రమది.. సెలవుండదని తెలుసు.. అయినా ఫోన్ చేసి నిర్థారించు కున్నాడు.   

ఎన్నాళ్ళుగానో తనమదిలలో ఉన్న ఆలోచనలకీరోజు జీవం పోయాలనుకున్నాడు. లేచి ల్యాప్‍టాప్‍లో వినతి పత్రాన్ని రాసాడు. మూడు కాపీలు ప్రింటౌట్ తీసుకొని అఫీసు బ్రీఫ్‍కేసులో సర్దుకుంటుంటే..

“ఈ రోజు ఆదివారం.. మరిచిపోయారా?” అంటూ ముసి, ముసి నవ్వులు కురిపించింది.. అతడి శ్రీమతి విద్యావతి.. వయ్యారంగా చేతులు తిప్పుతూ. 

“తెలుసులేవోయ్.. నాకు వేరే పనుంది.. బొల్లారం వెళ్లి ఒక ఫ్రెండును కలవాలి.. టిఫిన్ అయ్యిందా..?” అంటూ ఎదురు ప్రశ్న వేసాడు సూర్యప్రకాష్.

“నాకేం తెలుసు.. ఇంత తొందరగా దొరగారు బయటకు వెళ్తారని.. ఇప్పుడే ఇడ్లీ కుక్కర్లో పెట్టా.. మరో పది నిముషాలాగాలి. చట్నీ గ్రైండ్ చేస్తాను..” అంటూ వంటింట్లోకి దారి తీసింది విద్యావతి. 

పది నిముషాలు పది యుగాల్లా తోచాయి.. అయినా తప్పదు. బయట హోటల్లో తినే అలవాటు తనకు లేదు. ముందే చెప్పాల్సింది.. కాని అనుకోలేదుగా.. అని తల సుతారంగా గోక్కుంటూ సోఫాలో కూర్చుండి పోయాడు సూర్యప్రకాష్.     

గబా, గబా టిఫిన్ ముగించుకున్నాడు.  

ఎండలో.. ట్రాఫిక్‍లో టూవీలర్ కంటే  బస్సు సుఖమనుకొని లోకల్ బస్సులో బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాకు బయలు దేరాడు.. దాదాపు గంటన్నర ప్రయాణం. ట్రాఫిక్ ఉంటే రెండు గంటలు.. 

బొల్లారంలో బస్సుదిగి నడుచుకుంటూ సుమేధ ఇండస్ట్రీస్ వెళ్లేసరికి దాదాపు పండెండు కావస్తోంది.

ప్రధాన గేటు వద్ద సెక్యూరిటీకి తన విజిటింగ్ కార్డు చూపించాడు. అతడు రిసిప్షన్ సెంటర్‍కు  ఫోన్ చేసారు

వారు ఇంటర్‍కంలో మహీంద్రకు సమాచారమిచ్చి అనుమతి రాగానే సెక్యూరిటీకి తెలియ పర్చారు.

ఈ తతంగమంతా చూస్తూ విస్తుపోయాడు సూర్యప్రకాష్. తన కాలేజీలో పబ్లిక్  పరీక్షల సమయంలో  తీసుకునే జాగ్రత్తలు జ్ఞప్తికి వచ్చాయి. 

‘హమ్మయ్య’ అని దీర్ఘ శ్వాస తీసుకుంటూ.. అక్కడి అధికారుల  హోదాను తలుచుకుంటూ.. అంచెలంచెలుగా మహీంద్ర గదిలోకి ప్రవేశించే సరికి మరో పావుగంట పట్టింది.

మహీంద్ర ఆహ్వానించిన విధానం సూర్యప్రకాష్‍ను అబ్బుర పర్చింది. తన సీట్లో నుండి లేచి రెండు చేతులా నమస్కరించాడు. అతడి పలుకరింపులతో పులకిరించి పోయాడు.

కబుర్లతో బాటుగా స్నాక్స్ తిని.. కూల్ డ్రింక్ తాగుతూ కూల్‍గా తను వచ్చిన పని చెబుతూ వినతిపత్రం ముందుంచాడు సూర్యప్రకాష్. 

“మహీంద్ర గారూ.. మా ప్రభుత్వ కాలేజీలో చదివే పిల్లల పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. పుస్తకాలు కొని చదువుకునే స్థోమత లేక కేవలం మేమిచ్చే నోట్స్ పైనే ఆధార పడి ఉంటారు. మీకు తెలియందేముంది.. కొందరు లెక్చరర్లు నోట్స్ ఇవ్వడానికీ బద్ధకిస్తుంటారు. 

భారీ బండిని బక్కచిక్కిన ఎడ్లు లాగుతున్నట్లుగా.. ‘మా దయ వారి ప్రాప్తం’ లా.. ఉంటుంది వారి చదువు. దయచేసి మీరు నేను వినతి పత్రంలో నమోదు చేసినట్లు తెలుగు అకాడెమీ పుస్తకాలు మా పిల్లలకు సుమేధ ఇండస్ట్రీస్ పేర దానం చేసి పుణ్యం కట్టుకొండి..” అంటూ వినయంగా నివేదించాడు. 

వినతిపత్రంలో దానికయ్యే ఖర్చు వివరాలు చూసాడు మహీంద్ర. అతడి దృష్టిలో అది చాలా తక్కువ మొత్తమనిపించింది. 

చిరునవ్వు నవ్వుతూ.. “సార్.. ఇంత చిన్న మొత్తానికి మీరంతగా ప్రాధేయ పడడం ఏంబాగూ లేదు.. నేనేనాడో మీకు మాటిచ్చాను.. మరో మాట” అన్నాడు మహీంద్ర. 

విస్మయంగా చూసాడు సూర్యప్రకాష్.

(సశేషం)

No comments:

Post a Comment

Pages